అపొస్తలుల కార్యాలు 24:1-27
24 ఐదు రోజుల తర్వాత, ప్రధానయాజకుడు అననీయ కొంతమంది పెద్దలతో, తెర్తుల్లు అనే న్యాయవాదితో కలిసి అధిపతి దగ్గరకు వచ్చాడు. పౌలు మీద ఆరోపణలు చేయడానికి వాళ్లు అక్కడికి వచ్చారు.
2 తెర్తుల్లును మాట్లాడమని అన్నప్పుడు అతను పౌలును నిందించడం మొదలుపెట్టి అధిపతి ముందు ఇలా అన్నాడు:
“నీ వల్ల మేము ఎంతో శాంతిని అనుభవిస్తున్నామని, నీ ముందుచూపు వల్ల ఈ ప్రజల్లో ఎన్నో సంస్కరణలు జరుగుతున్నాయని మాకు తెలుసు.
3 గౌరవనీయుడివైన ఫేలిక్సూ, ఈ విషయాల్ని మేము అన్ని సమయాల్లో ప్రతీ చోట ఎంతో కృతజ్ఞతా భావంతో ఒప్పుకుంటున్నాం.
4 అయితే నీ సమయాన్ని ఇంక వృథా చేయకుండా మా సంగతి గురించి క్లుప్తంగా చెప్తాను, దయతో వినమని వేడుకుంటున్నాను.
5 ఈ మనిషి ఒక చీడ పురుగని,* భూమ్మీదున్న యూదులందరి మధ్య తిరుగుబాటు లేవదీస్తున్నాడని మేము గమనించాం. ఇతను నజరేయులు అనే తెగకు నాయకుడు.
6 అంతేకాదు ఇతను ఆలయాన్ని అపవిత్రం చేయడానికి కూడా ప్రయత్నించాడు, కాబట్టి మేము ఇతన్ని పట్టుకున్నాం.
7 *——
8 నువ్వే స్వయంగా ఇతన్ని విచారిస్తే, మేము ఇతని మీద చేసిన ఆరోపణలన్నీ నిజమని నీకు తెలుస్తుంది.”
9 అప్పుడు, యూదులు కూడా ఆ మాటలు నిజమని పదేపదే చెబుతూ పౌలును నిందించడం మొదలుపెట్టారు.
10 అధిపతి పౌలును మాట్లాడమన్నట్టు సైగ చేయడంతో పౌలు ఇలా జవాబిచ్చాడు:
“నువ్వు ఎన్నో సంవత్సరాల నుండి ఈ ప్రజలకు న్యాయమూర్తిగా ఉన్నావని నాకు తెలుసు. కాబట్టి నా వాదనను నీకు సంతోషంగా వినిపిస్తాను.
11 నేను ఆరాధించడానికి యెరూషలేముకు వెళ్లి 12 రోజులు కూడా దాటలేదు. కావాలంటే ఈ విషయం గురించి నువ్వు అడిగి తెలుసుకోవచ్చు.
12 నేను ఆలయంలో ఎవరితోనైనా వాదిస్తున్నట్టు లేదా సభామందిరాల్లో గానీ, ఆ నగరంలో గానీ అల్లరిమూకను రేపుతున్నట్టు వాళ్లు చూడలేదు.
13 అంతేకాదు, ఇప్పుడు వాళ్లు నా మీద చేస్తున్న ఆరోపణల్ని నీ ముందు రుజువు చేయలేరు.
14 అయితే ఒక విషయాన్ని నీ దగ్గర ఒప్పుకుంటున్నాను. వీళ్లు తెగ అని దేన్నైతే పిలుస్తున్నారో ఆ మార్గంలో నడుస్తూ నేను నా పూర్వీకుల దేవునికి పవిత్రసేవ చేస్తున్నాను. ధర్మశాస్త్రంలో, ప్రవక్తల పుస్తకాల్లో రాసివున్న వాటన్నిటినీ నేను నమ్ముతాను.
15 అంతేకాదు నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని దేవుడు పునరుత్థానం చేస్తాడని వాళ్లలాగే నేనూ నమ్మకంతో ఎదురుచూస్తున్నాను.
16 దానివల్లే నేను దేవుని ముందు, మనుషుల ముందు మంచి* మనస్సాక్షిని కాపాడుకోవడానికి ఎప్పుడూ కృషి చేస్తున్నాను.
17 చాలా సంవత్సరాల తర్వాత నా ప్రజల్లో కొంతమందికి దానధర్మాలు చేయడానికి, దేవునికి అర్పణలు ఇవ్వడానికి యెరూషలేముకు వెళ్లాను.
18 అలా చేస్తున్నప్పుడు, నేను ఆచారబద్ధంగా శుద్ధీకరణ చేసుకొని ఆలయంలో ఉండగా వాళ్లు నన్ను చూశారు. అంతేగానీ, నా దగ్గర గుంపులు గుంపులుగా ప్రజలు ఉండడం గానీ, నేను అలజడి సృష్టించడం గానీ వాళ్లు చూడలేదు. అయితే ఆసియా ప్రాంతం నుండి వచ్చిన కొంతమంది యూదులు అక్కడ ఉన్నారు.
19 వాళ్లు నిజంగా నా మీద ఏవైనా ఆరోపణలు చేయాలనుకుంటే, నీ ముందుకు వచ్చి చేయాలి.
20 లేదా ఇక్కడున్న వాళ్లయినా సరే, నేను మహాసభ ముందు నిలబడి ఉన్నప్పుడు నాలో ఏ తప్పు కనిపించిందో చెప్పొచ్చు.
21 నేను వాళ్ల మధ్య నిలబడి ఉన్నప్పుడు, ‘నేను మృతుల పునరుత్థానాన్ని నమ్ముతాను, అందుకే ఇప్పుడు నాకు తీర్పు జరుగుతోంది’ అని బిగ్గరగా అన్నాను. అది కాకుండా నేను ఏ తప్పయినా చేసుంటే వాళ్లు చెప్పొచ్చు.”
22 అయితే, ప్రభువు మార్గం గురించిన వాస్తవాలు బాగా తెలిసిన ఫేలిక్సు తీర్పు వాయిదా వేస్తూ, “సహస్రాధిపతి లూసియ రాగానే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటాను” అన్నాడు.
23 తర్వాత, పౌలును కాపలాలో ఉంచమని, అయితే అతనికి కొంత స్వేచ్ఛ ఇవ్వమని, అతనివాళ్లు ఎవరైనా అతని అవసరాలు చూసుకోవాలనుకుంటే అనుమతించమని సైనికాధికారికి ఆదేశాలు ఇచ్చాడు.
24 కొన్ని రోజుల తర్వాత ఫేలిక్సు తన భార్య ద్రుసిల్లతో కలిసి వచ్చాడు, ఆమె యూదురాలు. అప్పుడు ఫేలిక్సు పౌలును పిలిపించుకొని, క్రీస్తుయేసు మీద విశ్వాసం గురించి పౌలు మాట్లాడుతుంటే విన్నాడు.
25 అయితే పౌలు నీతి గురించి, ఆత్మనిగ్రహం గురించి, రాబోయే తీర్పు గురించి మాట్లాడినప్పుడు ఫేలిక్సు భయపడిపోయి, “ఇప్పటికైతే వెళ్లు, నాకు అవకాశం దొరికినప్పుడు మళ్లీ నిన్ను పిలిపిస్తాను” అన్నాడు.
26 అదే సమయంలో, పౌలు తనకు డబ్బు ఇస్తాడని ఫేలిక్సు ఆశించాడు. అందుకే అతన్ని పదేపదే పిలిపించుకొని మాట్లాడేవాడు.
27 రెండు సంవత్సరాలు గడిచాక ఫేలిక్సు స్థానంలోకి పోర్కియు ఫేస్తు వచ్చాడు. అయితే ఫేలిక్సు యూదుల దగ్గర మంచిపేరు సంపాదించుకోవాలనే కోరికతో పౌలును చెరసాలలోనే ఉంచి వెళ్లిపోయాడు.
అధస్సూచీలు
^ లేదా “సమస్యలు సృష్టిస్తున్నాడని.” అక్ష., “తెగులని.”
^ మత్తయి 17:21కి ఉన్న పాదసూచిక చూడండి.
^ లేదా “మచ్చలేని.”