అపొస్తలుల కార్యాలు 4:1-37
4 పేతురు, యోహాను ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు యాజకులు, ఆలయ పర్యవేక్షకుడు, సద్దూకయ్యులు వాళ్ల దగ్గరికి వచ్చారు.
2 అపొస్తలులు ప్రజలకు బోధిస్తుండడం, మృతుల్లో నుండి యేసు పునరుత్థానం గురించి* అందరిముందు ప్రకటిస్తుండడం చూసి వాళ్లకు చిరాకొచ్చింది.
3 కాబట్టి వాళ్లు ఆ ఇద్దర్నీ పట్టుకొని తర్వాతి రోజు వరకు బంధించి ఉంచారు. ఎందుకంటే అప్పటికే సాయంత్రమైంది.
4 అయితే, వాళ్ల మాటలు విన్నవాళ్లలో చాలామంది విశ్వాసముంచారు, దాంతో శిష్యుల్లో పురుషుల సంఖ్య దాదాపు 5,000కు చేరుకుంది.
5 తర్వాతి రోజు యూదుల పాలకులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో సమావేశమయ్యారు.
6 వాళ్లతో పాటు ముఖ్య యాజకుడు అన్న, కయప, యోహాను, అలెక్సంద్రు, అలాగే ముఖ్య యాజకుడి బంధువులందరు కూడా వచ్చారు.
7 వాళ్లు పేతురును, యోహానును తమ మధ్య నిలబెట్టి, “ఏ అధికారంతో, ఎవరి పేరున మీరు దీన్ని చేశారు?” అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు.
8 అప్పుడు పేతురు పవిత్రశక్తితో నిండిపోయి, వాళ్లతో ఇలా అన్నాడు:
“ప్రజల పాలకులారా, పెద్దలారా,
9 ఈ కుంటివాడి విషయంలో జరిగిన మంచిపని గురించి ఈ రోజు మమ్మల్ని విచారణ చేస్తున్నారా? అతనెలా బాగయ్యాడో మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా?
10 అలాగైతే మీరంతా, అలాగే ఇశ్రాయేలు ప్రజలందరూ ఈ విషయం తెలుసుకోవాలి: నజరేయుడైన యేసుక్రీస్తు పేరున, ఆయన ద్వారా ఈ వ్యక్తి మీ ముందు ఆరోగ్యంగా నిలబడ్డాడు. ఆ యేసుక్రీస్తునే మీరు కొయ్యమీద శిక్ష వేసి చంపారు, కానీ దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపాడు.
11 ‘కట్టేవాళ్లయిన మీరు వద్దనుకున్న రాయి, ముఖ్యమైన మూలరాయి* అయింది,’ ఆ రాయి యేసే.
12 అంతేకాదు, ఇంకెవ్వరి ద్వారా రక్షణ రాదు. ఎందుకంటే, మనల్ని రక్షించడానికి ప్రజల్లో నుండి దేవుడు ఎంచుకున్న వేరే ఏ పేరూ భూమ్మీద లేదు.”
13 వాళ్లు పేతురు, యోహానుల ధైర్యం చూసి, వాళ్లు చదువులేని* సామాన్యులని గ్రహించినప్పుడు చాలా ఆశ్చర్యపోయారు. ఆ ఇద్దరు యేసుతోపాటు ఉండేవాళ్లని వాళ్లు గ్రహించడం మొదలుపెట్టారు.
14 అయితే, బాగైన వ్యక్తి వాళ్లిద్దరితో పాటు నిలబడి ఉండడం వాళ్లు చూసినప్పుడు, ఏమీ బదులు చెప్పలేకపోయారు.
15 కాబట్టి ఆ ముగ్గుర్ని మహాసభ నుండి బయటికి వెళ్లమని ఆజ్ఞాపించి, వాళ్లు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు:
16 “వీళ్లను మనం ఏమి చేయాలి? నిజంగానే వీళ్లు ఒక అసాధారణమైన సూచన చేశారు, ఇది యెరూషలేములోని వాళ్లందరికీ కనిపిస్తుంది, దీన్ని మనం కాదనలేం.
17 ఇది ప్రజల్లో ఇంకా వ్యాప్తిచెందకుండా ఉండేలా, ఈ పేరు* మీద ఇక ఎవరితోనూ మాట్లాడొద్దని మనం వాళ్లను బెదిరిద్దాం.”
18 కాబట్టి వాళ్లు ఆ ఇద్దరు శిష్యుల్ని పిలిచి, యేసు పేరున ఏమీ మాట్లాడవద్దని, బోధించవద్దని ఆజ్ఞాపించారు.
19 అందుకు పేతురు, యోహాను వాళ్లతో ఇలా అన్నారు: “దేవుని మాట కాకుండా మీ మాట వినడం దేవుని దృష్టిలో సరైనదేనా? మీరే ఆలోచించండి.
20 మేమైతే చూసినవాటి గురించి, విన్నవాటి గురించి మాట్లాడకుండా ఉండలేం.”
21 దాంతో వాళ్లు ఆ ఇద్దర్ని ఇంకోసారి బెదిరించి, విడుదల చేశారు. ఎందుకంటే వాళ్లను శిక్షించడానికి వాళ్లకు ఏ కారణం దొరకలేదు, పైగా వాళ్లు ప్రజలకు భయపడ్డారు. ఎందుకంటే ప్రజలందరూ జరిగినదాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు.
22 అంతేకాదు, ఈ అద్భుతం* ద్వారా బాగైన వ్యక్తి వయసు 40 ఏళ్ల పైనే ఉంటుంది.
23 విడుదలైన తర్వాత పేతురు, యోహాను తమ సొంత ప్రజల దగ్గరికి వెళ్లి, ముఖ్య యాజకులు, పెద్దలు తమతో అన్న మాటల్ని వాళ్లకు చెప్పారు.
24 అది విన్నాక, వాళ్లంతా కలిసి దేవునికి ఇలా ప్రార్థించారు:
“సర్వోన్నత ప్రభువా, ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉన్న వాటినన్నిటినీ నువ్వే చేశావు.
25 నీ సేవకుడు, మా పూర్వీకుడు అయిన దావీదు నోట పవిత్రశక్తి ద్వారా నువ్వే ఈ మాటలు అన్నావు: ‘దేశాలు ఎందుకు అల్లకల్లోలంగా మారాయి? ప్రజలు ఎందుకు పనికిరాని వాటి గురించి ఆలోచిస్తున్నారు?
26 భూమ్మీదున్న రాజులు యెహోవాకు,* ఆయన అభిషిక్తునికి* వ్యతిరేకంగా నిలబడ్డారు, పరిపాలకులు ఏకమై వాళ్లిద్దరికి వ్యతిరేకంగా గుమికూడారు.’
27 నిజంగానే హేరోదు, పొంతి పిలాతు అన్యులతో ఇశ్రాయేలీయులతో కలిసి, నువ్వు అభిషేకించిన నీ పవిత్ర సేవకుడైన యేసుకు వ్యతిరేకంగా ఈ నగరంలో గుమికూడారు.
28 నువ్వు ముందే చెప్పినవి జరగాలని వాళ్లు అలా గుమికూడారు. నీ ఇష్టప్రకారం, నీ శక్తితో నువ్వే అలా జరిగేలా చేశావు.
29 అయితే ఇప్పుడు, యెహోవా* దయచేసి వాళ్ల బెదిరింపుల్ని విని, నీ దాసులు నీ వాక్యాన్ని పూర్తి ధైర్యంతో ప్రకటిస్తూ ఉండేలా సహాయం చేయి.
30 అదే సమయంలో, నువ్వు నీ శక్తితో రోగుల్ని బాగుచేస్తూ ఉండు. నీ పవిత్ర సేవకుడైన యేసు పేరు ద్వారా సూచనలు, అద్భుతాలు జరుగుతూ ఉండేలా చేయి.”
31 వాళ్లు పట్టుదలగా ప్రార్థన చేసినప్పుడు, వాళ్లు సమావేశమైన స్థలం కంపించింది; వాళ్లలో ప్రతీ ఒక్కరు పవిత్రశక్తితో నిండిపోయి దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నారు.
32 అంతేకాదు విశ్వసించినవాళ్లు చాలామంది ఉన్నారు, వాళ్లందరికీ ఒకే అభిప్రాయం ఉంది. వాళ్లలో ఏ ఒక్కరూ తమకున్నవి తమవని అనుకునేవాళ్లు కాదు. బదులుగా, తమకు ఉన్నవన్నీ ఇతరులతో పంచుకునేవాళ్లు.
33 అపొస్తలులు గొప్ప శక్తితో ప్రభువైన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యమిస్తూ ఉన్నారు, దేవుడు వాళ్లందరి మీద తన అపారదయ చూపించాడు.
34 నిజానికి వాళ్లలో ఎవరికీ లోటు ఉండేది కాదు. ఎందుకంటే పొలాలు, ఇళ్లు ఉన్నవాళ్లందరూ వాటిని అమ్మి, వచ్చిన డబ్బును
35 అపొస్తలుల పాదాల దగ్గర పెట్టేవాళ్లు. అపొస్తలులు ఆ డబ్బును ప్రతీ ఒక్కరికి వాళ్లవాళ్ల అవసరాన్ని బట్టి పంచేవాళ్లు.
36 కుప్రకు చెందిన ఒక లేవీయుడు ఉండేవాడు. అతని పేరు యోసేపు. అపొస్తలులు అతనికి బర్నబా (అంటే “ఇతరుల్ని ప్రోత్సహించేవాడు”* అని అర్థం) అనే పేరు పెట్టారు.
37 అతనికి కొంత భూమి ఉంది. అతను దాన్ని అమ్మి, వచ్చిన డబ్బును అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.
అధస్సూచీలు
^ లేదా “యేసు ఉదాహరణతో మృతుల పునరుత్థానం గురించి.”
^ అక్ష., “మూలకు తల.”
^ అంటే, నిరక్షరాస్యులని కాదు, రబ్బీల పాఠశాలల్లో చదువుకోనివాళ్లని అర్థం.
^ ఇది యేసు పేరును సూచిస్తోంది.
^ లేదా “సూచన.”
^ పదకోశం చూడండి.
^ లేదా “ఆయన క్రీస్తుకు.”
^ పదకోశం చూడండి.
^ అక్ష., “ఓదార్పు పుత్రుడు.”