అపొస్తలుల కార్యాలు 8:1-40

  • సౌలు హింసించడం  (1-3)

  • సమరయలో ఫిలిప్పు పరిచర్యకు మంచి ఫలితాలు రావడం  (4-13)

  • పేతురును, యోహానును సమరయకు పంపించడం  (14-17)

  • పవిత్రశక్తిని కొనాలని సీమోను ప్రయత్నించడం  (18-25)

  • ఇతియోపీయుడైన ఒక అధికారి  (26-40)

8  స్తెఫను హత్యను సౌలు ఆమోదించాడు. ఆ రోజు నుండి యెరూషలేములో ఉన్న సంఘం మీదికి తీవ్రమైన హింస రావడం మొదలైంది. అపొస్తలులు తప్ప మిగతా శిష్యులందరూ యూదయ, సమరయ అంతటా చెదిరిపోయారు.  అయితే దైవభక్తిగల పురుషులు స్తెఫనును మోసుకెళ్లి సమాధి చేశారు. వాళ్లు అతని గురించి చాలా ఏడ్చారు.  సౌలు మాత్రం సంఘం మీద క్రూరంగా దాడిచేయడం మొదలుపెట్టాడు. అతను ఒక ఇంటి తర్వాత ఇంకో ఇంట్లోకి చొరబడి పురుషుల్ని, స్త్రీలను బయటికి ఈడ్చుకొచ్చి చెరసాలలో వేయించేవాడు.  అయితే చెదిరిపోయినవాళ్లు తాము వెళ్లిన ప్రాంతాల్లో వాక్యం గురించిన మంచివార్తను ప్రకటిస్తూ ఉన్నారు.  ఫిలిప్పు సమరయ నగరానికి* వెళ్లి అక్కడి ప్రజలకు క్రీస్తు గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు.  ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి ఫిలిప్పు మాటల్ని మనసుపెట్టి విన్నారు, అతను చేస్తూ ఉన్న సూచనల్ని గమనించారు.  వాళ్లలో అపవిత్ర దూతలు పట్టినవాళ్లు చాలామంది ఉన్నారు. ఆ అపవిత్ర దూతలు పెద్దగా కేకలు వేస్తూ వాళ్లలో నుండి బయటికి వచ్చేవాళ్లు. అంతేకాదు చాలామంది పక్షవాతం ఉన్నవాళ్లు, కుంటివాళ్లు కూడా బాగయ్యారు.  దాంతో ఆ నగరమంతా సంతోషంతో నిండిపోయింది.  ఆ నగరంలో సీమోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను తాను గొప్పవాడినని చెప్పుకుంటూ తన ఇంద్రజాలంతో సమరయ వాసుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తేవాడు. 10  సామాన్యుల దగ్గరనుండి గొప్పవాళ్ల వరకు అందరూ అతను చెప్పేది శ్రద్ధగా వింటూ, “ఇతను దేవుని శక్తి, గొప్ప శక్తి” అనేవాళ్లు. 11  అతను చాలాకాలంపాటు వాళ్లను తన ఇంద్రజాలంతో ఆశ్చర్యపర్చాడు కాబట్టి అతను చెప్పేది వాళ్లు శ్రద్ధగా వినేవాళ్లు. 12  అయితే ఫిలిప్పు వాళ్లకు దేవుని రాజ్యం గురించిన, యేసుక్రీస్తు పేరు గురించిన మంచివార్త ప్రకటించిన తర్వాత వాళ్లు అతన్ని నమ్మి పురుషులు, స్త్రీలు అందరూ బాప్తిస్మం తీసుకోవడం మొదలుపెట్టారు. 13  సీమోను కూడా విశ్వాసి అయ్యాడు. బాప్తిస్మం తీసుకున్నాక సీమోను ఫిలిప్పుతోనే ఉన్నాడు; జరుగుతున్న సూచనల్ని, శక్తివంతమైన గొప్ప పనుల్ని చూసి అతను ఎంతో ఆశ్చర్యపోయాడు. 14  సమరయలోని ప్రజలు దేవుని వాక్యాన్ని అంగీకరించారని యెరూషలేములో ఉన్న అపొస్తలులు విన్నప్పుడు పేతురును, యోహానును వాళ్ల దగ్గరికి పంపించారు. 15  వీళ్లు సమరయకు వెళ్లి, అక్కడి విశ్వాసులు పవిత్రశక్తి పొందేలా వాళ్లకోసం ప్రార్థించారు. 16  ఎందుకంటే, వాళ్లు యేసు ప్రభువు పేరున బాప్తిస్మం తీసుకున్నారు కానీ అప్పటివరకు వాళ్లలో ఎవ్వరూ పవిత్రశక్తి పొందలేదు. 17  పేతురు, యోహాను వాళ్ల మీద చేతులు ఉంచినప్పుడు వాళ్లు పవిత్రశక్తి పొందడం మొదలైంది. 18  అపొస్తలులు ఎవరి మీదైనా చేతులు ఉంచితే వాళ్లు పవిత్రశక్తి పొందుతున్నారని సీమోను చూసినప్పుడు వాళ్లకు డబ్బు ఇస్తూ, 19  “నేను ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్లు పవిత్రశక్తి పొందేలా, ఈ అధికారం నాకు కూడా ఇవ్వండి” అన్నాడు. 20  అయితే పేతురు అతనితో ఇలా అన్నాడు: “నీ వెండి నీతోపాటు నాశనమైపోవాలి. ఎందుకంటే, దేవుడు ఉచితంగా ఇచ్చే బహుమతిని నువ్వు డబ్బుతో కొనుక్కోగలనని అనుకున్నావు. 21  ఈ విషయంతో నీకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే దేవుని ముందు నీ హృదయం సరిగ్గా లేదు. 22  కాబట్టి నీ చెడుతనం విషయంలో పశ్చాత్తాపపడు. యెహోవాను* పట్టుదలగా వేడుకో. బహుశా ఆయన నీ హృదయంలోని చెడ్డ ఆలోచనను క్షమిస్తాడేమో. 23  ఎందుకంటే నువ్వు నాకు చేదైన విషంలా,* అవినీతికి దాసుడిలా కనిపిస్తున్నావు.” 24  అప్పుడు సీమోను వాళ్లతో, “మీరు చెప్పిన వాటిలో ఏదీ నా మీదికి రాకుండా దయచేసి నా కోసం యెహోవాను* వేడుకోండి”* అన్నాడు. 25  వాళ్లు పూర్తిస్థాయిలో సాక్ష్యమిచ్చి, యెహోవా* వాక్యం గురించి మాట్లాడిన తర్వాత యెరూషలేముకు తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. వాళ్లు వెళ్తున్నప్పుడు, సమరయుల చాలా గ్రామాల్లో మంచివార్త ప్రకటిస్తూ వెళ్లారు. 26  అయితే, యెహోవా* దూత ఫిలిప్పుతో మాట్లాడుతూ ఇలా చెప్పాడు: “నువ్వు లేచి దక్షిణం వైపు యెరూషలేము నుండి గాజాకు వెళ్లే దారి వెంబడి వెళ్లు.” (ఈ దారి ఎడారిలో ఉంది.) 27  దాంతో అతను లేచి వెళ్లాడు. అప్పుడు ఇదిగో! ఇతియోపీయుడైన ఒక అధికారి* అతనికి కనిపించాడు. అతను ఇతియోపీయుల రాణియైన కందాకే కింద పనిచేసేవాడు. అతను రాణి ఖజానా అంతటినీ చూసుకునేవాడు. దేవుణ్ణి ఆరాధించడం కోసం అతను యెరూషలేముకు వెళ్లి 28  తిరిగి వస్తున్నాడు. అతను తన రథంలో కూర్చొని యెషయా ప్రవక్త గ్రంథాన్ని బిగ్గరగా చదువుతున్నాడు. 29  కాబట్టి దేవుడు తన పవిత్రశక్తి ద్వారా ఫిలిప్పుకు ఇలా చెప్పాడు: “ఆ రథం దగ్గరికి వెళ్లు.” 30  అప్పుడు ఫిలిప్పు రథం పక్కనే పరుగెత్తుతూ, అతను యెషయా ప్రవక్త గ్రంథాన్ని బిగ్గరగా చదువుతుండడం విని, “నువ్వు చదువుతున్నదంతా నీకు అర్థమౌతోందా?” అని అడిగాడు. 31  అందుకు అతను, “ఎవరో ఒకరు విడమర్చి చెప్పకపోతే నాకెలా అర్థమౌతుంది?” అన్నాడు. కాబట్టి అతను, రథం ఎక్కి తనతోపాటు కూర్చోమని ఫిలిప్పుతో అన్నాడు. 32  అతను లేఖనాల్లోని ఈ భాగాన్ని చదువుతున్నాడు: “ఒక గొర్రెలా ఆయన వధించబడడానికి తీసుకురాబడ్డాడు. బొచ్చు కత్తిరించేవాళ్ల ముందు గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టు ఆయన తన నోరు తెరవలేదు. 33  ఆయన అవమానించబడినప్పుడు ఆయనకు న్యాయం జరగలేదు. ఆయన భూమ్మీద లేకుండా పోతాడు కాబట్టి ఆయన తరం గురించిన వివరాలు ఎవరు చెప్తారు?” 34  ఆ అధికారి ఫిలిప్పును, “ప్రవక్త ఎవరి గురించి ఈ మాటలు అన్నాడు? తన గురించా, వేరే వ్యక్తి గురించా? దయచేసి నాకు చెప్పు” అని అడిగాడు. 35  అప్పుడు ఫిలిప్పు ఆ లేఖనంతో మొదలుపెట్టి యేసు గురించిన మంచివార్తను అతనికి ప్రకటించాడు. 36  వాళ్లు ఆ దారిలో వెళ్తుండగా వాళ్లకు నీళ్లు కనిపించాయి. దాంతో ఆ అధికారి, “ఇదిగో! ఇక్కడ నీళ్లు ఉన్నాయి; నేను బాప్తిస్మం తీసుకోవడానికి ఆటంకం ఏముంది?” అని అడిగాడు. 37  *—— 38  వెంటనే అతను రథాన్ని ఆపమని ఆదేశించాడు. అప్పుడు ఫిలిప్పు, ఆ అధికారి నీళ్లలోకి దిగారు; ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాడు. 39  వాళ్లు నీళ్లలో నుండి బయటికి వచ్చినప్పుడు, యెహోవా* పవిత్రశక్తి వెంటనే ఫిలిప్పును అక్కడినుండి వేరే చోటికి తీసుకెళ్లింది. ఆ అధికారి అతన్ని ఇక చూడలేదు. అయితే ఆ అధికారి సంతోషంగా తన దారిన వెళ్లిపోయాడు. 40  ఫిలిప్పు అష్డోదుకు వెళ్లి, కైసరయకు వచ్చేవరకు ఆ నగరాలన్నిటిలో మంచివార్త ప్రకటిస్తూ ఉన్నాడు.

అధస్సూచీలు

లేదా “సమరయలోని ఒక నగరానికి” అయ్యుంటుంది.
పదకోశం చూడండి.
లేదా “పైత్యరసంలా చేదుగా.”
పదకోశం చూడండి.
లేదా “పట్టుదలగా ప్రార్థించండి.”
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
అక్ష., “నపుంసకుడు.” పదకోశంలో “నపుంసకుడు” చూడండి.
మత్తయి 17:21కి ఉన్న పాదసూచిక చూడండి.
పదకోశం చూడండి.