కొలొస్సయులు 4:1-18

  • యజమానులకు సలహాలు (1)

  • “పట్టుదలతో ప్రార్థించండి” (2-4)

  • బయటివాళ్లతో తెలివిగా మసలుకోండి  (5, 6)

  • చివర్లో శుభాకాంక్షలు (7-18)

4  యజమానులారా, మీ దాసులతో నీతిగా, న్యాయంగా వ్యవహరించండి. మీకు కూడా పరలోకంలో ఓ యజమాని ఉన్నాడని మీకు తెలుసు.  పట్టుదలతో ప్రార్థించండి, ప్రార్థించడం మర్చిపోకండి,* కృతజ్ఞతలు తెలపండి.  అలాగే మా కోసం కూడా ప్రార్థించండి. మేము వాక్యం ప్రకటించడానికి, క్రీస్తు గురించిన పవిత్ర రహస్యం గురించి మాట్లాడడానికి దేవుడు మార్గం తెరవాలని ప్రార్థించండి. ఆ పవిత్ర రహస్యం వల్లే ఇప్పుడు నేను చెరసాలలో ఉన్నాను.  నేను దాని గురించి మాట్లాడాల్సినంత స్పష్టంగా మాట్లాడడానికి సహాయం చేయమని దేవునికి ప్రార్థించండి.  మీ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకుంటూ,* బయటివాళ్లతో తెలివిగా మసలుకోండి.  ఎప్పుడూ మంచితనం ఉట్టిపడేలా మాట్లాడండి. ఉప్పుతో ఆహారానికి రుచి వచ్చినట్టు, మంచితనంతో మీ మాటలకు రుచి వస్తుంది. మీరు అలా మాట్లాడినప్పుడే, ప్రతీ ఒక్కరికి ఎలా జవాబివ్వాలో మీకు తెలుస్తుంది.  నా ప్రియ సోదరుడు, ప్రభువు సేవలో నమ్మకమైన పరిచారకుడు, నా తోటి దాసుడు అయిన తుకికు నా గురించిన సంగతులన్నీ మీకు తెలియజేస్తాడు.  మేము ఎలా ఉన్నామో తెలియజేయడానికి, మీ మనసుకు ఊరటను ఇవ్వడానికి అతన్ని మీ దగ్గరికి పంపిస్తున్నాను.  అతను ఒనేసిముతో కలిసి వస్తున్నాడు. మీ ఊరివాడైన ఒనేసిము నమ్మకమైన నా ప్రియ సోదరుడు; వాళ్లిద్దరు ఇక్కడి సంగతులన్నీ మీకు చెప్తారు. 10  నా తోటి ఖైదీ అరిస్తార్కు, బర్నబావాళ్ల దగ్గరి బంధువు మార్కు (మీ దగ్గరికి వస్తే సాదరంగా ఆహ్వానించమని చెప్పింది ఈయన గురించే) కూడా మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 11  యూస్తు అనే పేరున్న యేసు కూడా తన శుభాకాంక్షలు తెలుపుతున్నాడు. వీళ్లంతా సున్నతి చేయించుకున్న ప్రజల్లోనివాళ్లు. దేవుని రాజ్యం కోసం పాటుపడే విషయంలో కేవలం వీళ్లు మాత్రమే నా తోటి పనివాళ్లు, వీళ్లు నాకు ఎంతో ఊరటను ఇచ్చారు.* 12  మీ ప్రాంతంవాడూ, క్రీస్తుయేసు దాసుడూ అయిన ఎపఫ్రా మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాడు. మీరు పరిణతిగల వాళ్లలా స్థిరంగా ఉండాలని, దేవుడు చేయబోయే ప్రతీదాని మీద మీకు గట్టి నమ్మకం ఉండాలని మీ కోసం అతను ఎప్పుడూ పట్టుదలతో ప్రార్థిస్తున్నాడు. 13  అతను మీ కోసం, అలాగే లవొదికయ, హియెరాపొలి ప్రాంతాలవాళ్ల కోసం ఎంతో కష్టపడుతున్నాడని అనడానికి నేనే సాక్ష్యం. 14  ప్రియమైన వైద్యుడు లూకా, దేమా తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 15  లవొదికయలోని సోదరులకు, సోదరి నుంఫాకు, ఆమె ఇంట్లో ఉన్న సంఘానికి నా శుభాకాంక్షలు తెలపండి. 16  ఈ ఉత్తరం మీ దగ్గర చదివి వినిపించాక, లవొదికయవాళ్ల సంఘంలో కూడా చదివే ఏర్పాటు చేయండి. అలాగే లవొదికయవాళ్లకు నేను పంపిన ఉత్తరాన్ని మీ దగ్గర కూడా చదివే ఏర్పాటు చేయండి. 17  అంతేకాదు, ప్రభువు శిష్యునిగా తాను స్వీకరించిన పరిచర్యను పూర్తిచేసేలా చూసుకోమని అర్ఖిప్పుకు చెప్పండి. 18  నా శుభాకాంక్షల్ని స్వహస్తాలతో రాస్తున్నాను. నా సంకెళ్లను మనసులో ఉంచుకోండి. దేవుని అపారదయ మీకు తోడుండాలి.

అధస్సూచీలు

అక్ష., “ప్రార్థించే విషయంలో మెలకువగా ఉండండి.”
అక్ష., “నియమిత సమయాన్ని కొనుక్కుంటూ.”
లేదా “నాకు సహాయం చేశారు, నన్ను బలపర్చారు.”