గలతీయులు 1:1-24

  • శుభాకాంక్షలు (1-5)

  • ఇంకే మంచివార్త లేదు (6-9)

  • పౌలు ప్రకటించిన మంచివార్త దేవుని నుండి వచ్చింది  (10-12)

  • పౌలు మారడం, అతని తొలి పరిచర్య (13-24)

1  పౌలు అనే నేను ఒక అపొస్తలుణ్ణి. నేను మనుషుల నుండో, ఓ మనిషి ద్వారానో ఈ నియామకాన్ని పొందలేదు. యేసుక్రీస్తు, ఆయనను బ్రతికించిన తండ్రైన దేవుడు నన్ను అపొస్తలునిగా నియమించారు.  నేను, నాతో ఉన్న సోదరులంతా కలిసి గలతీయలోని సంఘాలకు ఈ ఉత్తరం రాస్తున్నాం.  మన తండ్రైన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు మీకు అపారదయను, శాంతిని ప్రసాదించాలి.  మన తండ్రైన దేవుని కోరిక ప్రకారం ఈ చెడ్డ వ్యవస్థ* నుండి మనల్ని కాపాడడానికి యేసుక్రీస్తు మన పాపాల కోసం తనను తాను అర్పించుకున్నాడు.  మన తండ్రైన దేవునికి యుగయుగాలు మహిమ కలగాలి. ఆమేన్‌.  క్రీస్తు చూపించే అపారదయతో మిమ్మల్ని పిలిచిన దేవుణ్ణి మీరు ఇంత త్వరగా వదిలేసి* వేరే మంచివార్త వైపు తిరగడం చూస్తుంటే నాకు ఆశ్చర్యమేస్తోంది.  అంటే, వేరే మంచివార్త ఉందని కాదు; కానీ మిమ్మల్ని తికమకపెట్టేవాళ్లు కొందరు ఉన్నారు, వాళ్లు క్రీస్తు గురించిన మంచివార్తను తప్పుగా చిత్రీకరించాలని చూస్తున్నారు.  అయితే, ఒకవేళ మేమే వచ్చి లేదా పరలోకం నుండి ఒక దేవదూతే వచ్చి మేము మీకు ప్రకటించిన మంచివార్తను కాకుండా ఇంక దేన్నో మంచివార్తలా మీకు ప్రకటిస్తే, అతను శపించబడాలి.  మేము ఇంతకుముందు చెప్పినట్టే, ఇప్పుడు మళ్లీ చెప్తున్నాను. ఎవరైనా వచ్చి, మీరు స్వీకరించిన దాన్ని కాకుండా ఇంక దేన్నో మంచివార్తలా మీకు ప్రకటిస్తే, అతను శపించబడాలి. 10  నిజానికి, నేనిప్పుడు మనుషుల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నానా లేక దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నానా? ఒకవేళ నేనింకా మనుషుల్నే సంతోషపెడుతుంటే, నేను క్రీస్తు దాసుణ్ణి కానట్టే. 11  సోదరులారా, మీరు ఓ విషయం తెలుసుకోవాలని నా కోరిక. నేను మీకు ప్రకటించిన మంచివార్త మనుషుల నుండి వచ్చింది కాదు. 12  దాన్ని నాకు ఏ మనిషీ ఇవ్వలేదు, బోధించలేదు. స్వయంగా యేసుక్రీస్తే దాన్ని నాకు వెల్లడిచేశాడు. 13  నేను అంతకుముందు యూదా మతంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడినో మీరు విన్నారు. అప్పట్లో నేను దేవుని సంఘాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో దాన్ని దారుణంగా* హింసించాను; 14  మా పూర్వీకుల సంప్రదాయాల పట్ల నేను ఎంతో ఉత్సాహం చూపించేవాణ్ణి. అందువల్ల యూదా మతాన్ని అనుసరించే విషయంలో నా వయసు ఉన్న చాలామంది యూదుల కన్నా నేను ముందుండేవాణ్ణి. 15  కానీ నా తల్లి గర్భం నుండి నన్ను బయటికి తెచ్చి, తన అపారదయతో నన్ను పిలిచిన దేవుడు 16  తన కుమారుని గురించిన మంచివార్తను నేను అన్యులకు ప్రకటించేలా నా ద్వారా ఆయనను వెల్లడిచేయడం మంచిదని అనుకున్నప్పుడు, వెంటనే నేను ఏ మనిషినీ* సంప్రదించలేదు; 17  లేదా నాకంటే ముందు అపొస్తలులైన వాళ్లను కలవడానికి యెరూషలేముకు కూడా వెళ్లలేదు. కానీ అరేబియాకు వెళ్లాను, ఆ తర్వాత తిరిగి దమస్కుకు వచ్చాను. 18  అయితే మూడు సంవత్సరాల తర్వాత నేను కేఫాను* కలవడానికి యెరూషలేముకు వెళ్లి అతని దగ్గర 15 రోజులు ఉన్నాను. 19  కానీ ప్రభువు తమ్ముడు యాకోబును తప్ప మిగతా అపొస్తలులెవ్వరినీ నేను చూడలేదు. 20  ఇప్పుడు నేను రాస్తున్నవి అబద్ధాలు కావని దేవుని ముందు మీకు హామీ ఇస్తున్నాను. 21  ఆ తర్వాత నేను సిరియా, కిలికియ ప్రాంతాలకు వెళ్లాను. 22  అయితే యూదయలో ఉన్న క్రైస్తవ సంఘాలవాళ్లు నన్ను ఎప్పుడూ చూడలేదు. 23  కానీ వాళ్లు ఆ నోటా ఈ నోటా ఈ మాట వినేవాళ్లు: “గతంలో మనల్ని హింసించిన వ్యక్తి, సంఘాలను నాశనం చేస్తూ వచ్చిన వ్యక్తి ఇప్పుడు మంచివార్త ప్రకటిస్తున్నాడు.” 24  అలా వాళ్లు నా వల్ల దేవుణ్ణి మహిమపర్చడం మొదలుపెట్టారు.

అధస్సూచీలు

లేదా “చెడ్డ యుగం.” పదకోశం చూడండి.
లేదా “దేవునికి మీరు ఇంత త్వరగా దూరమై.”
అక్ష., “మితిమీరి.”
అక్ష., “రక్తమాంసాల్ని.”
ఇది పేతురుకు మరో పేరు.