ఫిలిప్పీయులు 3:1-21
3 చివరిగా, నా సోదరులారా, ప్రభువు సేవలో ఆనందిస్తూ ఉండండి. రాసిన విషయాల్నే మళ్లీ రాయడం నాకు కష్టమేమీ కాదు, నేను రాసేది మీ మంచి కోసమే.
2 కుక్కల* విషయంలో జాగ్రత్త; హాని తలపెట్టేవాళ్ల విషయంలో జాగ్రత్త; సున్నతి చేయించుకోవాలని పట్టుబట్టేవాళ్ల* విషయంలో జాగ్రత్త.
3 ఎందుకంటే, మనం చేసుకున్నదే అసలైన సున్నతి. మనం దేవుని పవిత్రశక్తితో పవిత్రసేవ చేస్తున్నాం, క్రీస్తుయేసు శిష్యులుగా ఉన్నందుకు గర్వపడుతున్నాం. మనం శరీరాన్ని నమ్ముకోవట్లేదు.
4 శరీరం విషయంలో గొప్పలు చెప్పుకోవడానికి నాకు కూడా కారణాలు ఉన్నాయి. ఆ మాటకొస్తే, వేరే ఎవ్వరి కన్నా నాకు ఎక్కువ కారణాలు ఉన్నాయి.
5 నేను ఎనిమిదో రోజు సున్నతి పొందాను; నేను ఇశ్రాయేలీయుణ్ణి, బెన్యామీను గోత్రికుణ్ణి, అసలైన హెబ్రీయుణ్ణి, ధర్మశాస్త్రం పాటించే విషయానికొస్తే పరిసయ్యుణ్ణి;
6 ఉత్సాహం మాటకొస్తే సంఘాన్ని హింసించాను; ధర్మశాస్త్రం ఏది సరైనదని చెప్పిందో అదే చేశాను.
7 అయితే, నాకు లాభంగా ఉన్నవాటిని క్రీస్తు కోసం నష్టంగా ఎంచాను.*
8 ఇంకా చెప్పాలంటే, నా ప్రభువు క్రీస్తుయేసు గురించిన సాటిలేని జ్ఞానం కోసం నేను అన్నిటినీ నష్టంగా ఎంచుతున్నాను. క్రీస్తు కోసం నేను అన్నీ వదులుకున్నాను, నేను వాటిని చెత్తగా ఎంచుతున్నాను. ఎందుకంటే ఆయనతో మంచి సంబంధం కలిగివుండాలని,
9 ఆయనతో ఐక్యంగా ఉండాలని అనుకుంటున్నాను. ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల కలిగే నా సొంత నీతిని బట్టి కాదుగానీ, క్రీస్తు మీద విశ్వాసం వల్ల దేవుడు అనుగ్రహించే నీతిని బట్టి అలా ఉండాలనుకుంటున్నాను.
10 నా లక్ష్యం ఏమిటంటే క్రీస్తును, ఆయన పునరుత్థానానికున్న శక్తిని తెలుసుకోవాలి, ఆయనలా బాధలు అనుభవించాలి, ఆయనలా చనిపోవాలి.
11 సాధ్యమైతే నేను మొదటి పునరుత్థానంలో ఉండాలన్నదే నా ఉద్దేశం.
12 నేను ఇప్పటికే ఆ బహుమానాన్ని పొందాననో, పరిపూర్ణుడిని అయ్యాననో కాదుగానీ క్రీస్తుయేసు దేని కోసమైతే నన్ను ఎంచుకున్నాడో* దాన్ని గట్టిగా పట్టుకోవడానికి కృషి చేస్తున్నాను.
13 సోదరులారా, ఇప్పటికే దాన్ని పట్టుకున్నానని నేను అనుకోవట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, వెనక ఉన్నవాటిని మర్చిపోయి, ముందున్న వాటి కోసం పరుగెత్తుతున్నాను.
14 క్రీస్తుయేసు ద్వారా దేవుని నుండి వచ్చే పరలోక పిలుపు అనే బహుమానం పొందాలని నేను లక్ష్యం వైపే పరుగెత్తుతున్నాను.
15 కాబట్టి, మనలో పరిణతి చెందినవాళ్లం ఇదే మనస్తత్వాన్ని కలిగివుందాం. ఒకవేళ ఏ రకంగానైనా మీకు వేరే ఆలోచన ఉంటే, మీరు సరైన ఆలోచనాతీరును పెంపొందించుకోవడానికి దేవుడే మీకు సహాయం చేస్తాడు.
16 ఏదేమైనా, మనం ప్రగతి సాధించినమేరకు ఇదే బాటలో సక్రమంగా నడుచుకుంటూ ఉందాం.
17 సోదరులారా, మీరందరూ నన్ను ఆదర్శంగా తీసుకోండి. మేము ఉంచిన ఆదర్శానికి తగ్గట్టు నడుచుకునే వాళ్లను బాగా గమనించండి.
18 ఎందుకంటే క్రీస్తు హింసాకొయ్యకు* శత్రువుల్లా నడుచుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్ల గురించి నేను తరచూ చెప్పేవాణ్ణి, కానీ ఇప్పుడు కన్నీళ్లతో వాళ్ల గురించి చెప్తున్నాను.
19 నాశనమే వాళ్ల అంతం; వాళ్ల కడుపే వాళ్ల దేవుడు; వాళ్లు సిగ్గుపడాల్సిన విషయాల గురించి గర్వపడుతున్నారు; వాళ్ల మనసంతా లోకసంబంధ విషయాల పైనే ఉంది.
20 కానీ మన పౌరసత్వం పరలోకంలో ఉంది, అక్కడ ఉన్న రక్షకుని కోసం అంటే, ప్రభువైన యేసుక్రీస్తు కోసం మనం ఆతురతతో ఎదురుచూస్తున్నాం.
21 సమస్తాన్ని తన అధికారం కిందికి తెచ్చుకునే గొప్ప శక్తి ఆయనకు ఉంది. ఆయన ఆ శక్తితో మన బలహీనమైన శరీరాన్ని తన మహిమాన్విత శరీరంలా* మారుస్తాడు.
అధస్సూచీలు
^ అంటే, అపవిత్రుల.
^ లేదా “శరీరాన్ని కోసుకునేవాళ్ల.”
^ లేదా “ఇష్టపూర్వకంగా వదులుకున్నాను” అయ్యుంటుంది.
^ అక్ష., “పట్టుకున్నాడో.”
^ పదకోశం చూడండి.
^ అక్ష., “తన శరీరానికి అనుగుణంగా.”