ఫిలిప్పీయులు 4:1-23
4 కాబట్టి నా ప్రియ సోదరులారా, మీరు ఇలాగే క్రీస్తుతో ఐక్యంగా ఉంటూ స్థిరంగా ఉండండి. నా సోదరులారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని చూడాలని ఎంతో కోరుకుంటున్నాను; మీరే నా సంతోషం, నా కిరీటం.
2 ప్రభువు సేవలో ఒకే ఆలోచనతో ఉండమని యువొదియ, సుంటుకేలను బ్రతిమాలుతున్నాను.
3 ఆ స్త్రీలకు సహాయం చేస్తూ ఉండమని నా నిజమైన తోటి పనివాడివైన* నిన్ను కూడా కోరుతున్నాను. ఆ ఇద్దరు నాతో, క్లెమెంతుతో, నా తోటి పనివాళ్లయిన మిగతావాళ్లతో కలిసి మంచివార్త కోసం ఎంతో ప్రయాసపడ్డారు.* వాళ్లందరి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి.
4 ఎప్పుడూ ప్రభువు విషయంలో సంతోషించండి. మళ్లీ చెప్తున్నాను, సంతోషించండి!
5 మీరు మొండిపట్టు పట్టే ప్రజలు కాదని అందరికీ తెలియనివ్వండి. ప్రభువు దగ్గరగా ఉన్నాడు.
6 ఏ విషయంలోనూ ఆందోళన పడకండి. కానీ ప్రతీ విషయంలో కృతజ్ఞతలు తెలుపుతూ ప్రార్థనల ద్వారా, అభ్యర్థనల ద్వారా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి;
7 అప్పుడు, మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతి క్రీస్తుయేసు ద్వారా మీ హృదయాలకు, మీ మనసులకు* కాపలా ఉంటుంది.
8 చివరిగా సోదరులారా, ఏవి నిజమైనవో, ఏవి ప్రాముఖ్యమైనవో, ఏవి నీతిగలవో, ఏవి పవిత్రమైనవో,* ఏవి ప్రేమించదగినవో, ఏవి గౌరవప్రదమైనవో, ఏవి మంచివో, ఏవి పొగడదగినవో వాటి గురించి ఆలోచిస్తూ* ఉండండి.
9 మీరు నా దగ్గర నేర్చుకున్నవాటిని, అంగీకరించినవాటిని, విన్నవాటిని, చూసినవాటిని పాటించండి. అప్పుడు శాంతికి మూలమైన దేవుడు మీకు తోడుగా ఉంటాడు.
10 ఇప్పుడు మీరు మళ్లీ నా గురించి ఆలోచిస్తున్నందుకు ప్రభువు సేవకుడినైన నేను ఎంతో సంతోషిస్తున్నాను. నా బాగోగుల విషయంలో మీకు ఎప్పుడూ శ్రద్ధ ఉంది, కానీ దాన్ని చూపించే అవకాశం కొంతకాలం మీకు దొరకలేదు.
11 ఇప్పుడు నాకు ఏదో అవసరం పడి అలా అనట్లేదు, ఎందుకంటే నా పరిస్థితులు ఎలా ఉన్నా సర్దుకుపోవడం* నేర్చుకున్నాను.
12 తక్కువగా ఉన్నప్పుడు ఎలా సర్దుకుపోవాలో నాకు తెలుసు, ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు. అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో తృప్తిగా జీవించడానికిగల రహస్యం ఏమిటో తెలుసుకున్నాను. కడుపు నిండా తిన్నా, ఆకలితో ఉన్నా, ఎక్కువ ఉన్నా, అసలేమీ లేకున్నా ఎలా జీవించాలో నాకు తెలుసు.
13 ఎందుకంటే, నాలో శక్తిని నింపే దేవుని వల్ల దేన్నైనా ఎదుర్కొనే బలం నాకుంది.
14 అయినా, నా కష్టాల్లో మీరు నాకు సహాయం చేసినందుకు మీకు కృతజ్ఞుణ్ణి.
15 నిజానికి, ఫిలిప్పీయులారా, మీరు మొదటిసారి మంచివార్తను తెలుసుకున్న తర్వాత, నేను మాసిదోనియ నుండి వెళ్లిపోతున్న సమయంలో, మీరు తప్ప ఒక్క సంఘం కూడా నాకు సహాయం చేయలేదు, నా సహాయం తీసుకోలేదు. ఈ విషయం మీకూ తెలుసు.
16 నేను థెస్సలొనీకలో ఉన్నప్పుడు మీ నుండి నాకు కావాల్సిన సహాయం అందింది. ఒక్కసారి కాదు, రెండుసార్లు మీరు నాకు సహాయం చేశారు.
17 నేను మీ నుండి ఏ బహుమానం ఆశించట్లేదు కానీ, మీ సంపదను* ఇంకా పెంచే ఆశీర్వాదాలు మీరు పొందాలని కోరుకుంటున్నాను.
18 నాకు కావాల్సిన ప్రతీది నా దగ్గర ఉంది, చెప్పాలంటే అంతకన్నా ఎక్కువే ఉంది. నాకు ఏ లోటూ లేదు, ఎపఫ్రొదితు ద్వారా మీరు పంపించింది నాకు అందింది. అది దేవుడు అంగీకరించే, ఇష్టపడే, సువాసనగల బలి.
19 మీరు చేసినదానికి ఫలితంగా, మహిమాన్విత సంపదలు ఉన్న దేవుడు మీకు కావాల్సినవన్నీ క్రీస్తుయేసు ద్వారా పూర్తిగా దయచేస్తాడు.
20 మన తండ్రైన దేవునికి యుగయుగాలు మహిమ కలగాలి. ఆమేన్.
21 క్రీస్తుయేసు శిష్యులుగా ఉన్న పవిత్రుల్లో ప్రతీ ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలపండి. నాతో ఉన్న సోదరులు కూడా మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
22 పవిత్రులంతా, ముఖ్యంగా కైసరు* ఇంటివాళ్లు మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
23 ప్రభువైన యేసుక్రీస్తు అపారదయ మీరు చూపించే స్ఫూర్తికి తోడుండాలి.
అధస్సూచీలు
^ అక్ష., “ఒకే కాడికింద ఉన్న నిష్కపటమైన వ్యక్తివైన.”
^ లేదా “చాలా కష్టపడ్డారు.”
^ అక్ష., “మానసిక సామర్థ్యాలకు.”
^ లేదా “స్వచ్ఛమైనవో.”
^ లేదా “ధ్యానిస్తూ.”
^ లేదా “తృప్తిపడడం.”
^ ఇది ఆధ్యాత్మిక సంపదను సూచిస్తోంది.
^ లేదా “రోమా చక్రవర్తి.”