మత్తయి 10:1-42

  • 12 మంది అపొస్తలులు (1-4)

  • పరిచర్య విషయంలో నిర్దేశాలు (5-15)

  • శిష్యులు హింసించబడతారు (16-25)

  • మనుషులకు కాదు దేవునికి భయపడండి  (26-31)

  • శాంతిని కాదు, కత్తిని తీసుకురావడం  (32-39)

  • యేసు శిష్యుల్ని చేర్చుకోవడం  (40-42)

10  కాబట్టి యేసు తన 12 మంది శిష్యుల్ని పిలిచి, అపవిత్ర దూతల్ని* వెళ్లగొట్టేలా వాళ్లమీద అధికారం ఇచ్చాడు. అలాగే అన్నిరకాల జబ్బుల్ని, అనారోగ్యాల్ని బాగుచేసే శక్తిని కూడా వాళ్లకు ఇచ్చాడు.  ఆ 12 మంది అపొస్తలులు ఎవరంటే: పేతురు అని పిలవబడిన సీమోను, అతని సోదరుడు అంద్రెయ; జెబెదయి కొడుకు యాకోబు, అతని సోదరుడు యోహాను;  ఫిలిప్పు, బర్తొలొమయి; తోమా, పన్ను వసూలుచేసే మత్తయి; అల్ఫయి కొడుకు యాకోబు; తద్దయి;  కననేయుడైన* సీమోను; ఇస్కరియోతు యూదా, ఇతనే ఆ తర్వాత యేసుకు నమ్మకద్రోహం చేశాడు.  యేసు ఆ 12 మందికి ఈ నిర్దేశాలు ఇచ్చి పంపించాడు: “అన్యుల దగ్గరికి వెళ్లొద్దు, సమరయులకు చెందిన ఏ నగరంలోకీ ప్రవేశించొద్దు.  కానీ ఇశ్రాయేలు ఇంట్లో నశించిన గొర్రెల దగ్గరకే వెళ్తూ ఉండండి.  మీరు వెళ్తూ, ‘పరలోక రాజ్యం దగ్గరపడింది’ అని ప్రకటించండి.  రోగుల్ని బాగుచేయండి, చనిపోయినవాళ్లను బ్రతికించండి, కుష్ఠురోగుల్ని శుద్ధులుగా చేయండి, చెడ్డదూతల్ని వెళ్లగొట్టండి. మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి.  మీ డబ్బు సంచుల్లో బంగారం గానీ, వెండి గానీ, రాగి గానీ తీసుకెళ్లకండి. 10  ప్రయాణం కోసం ఆహారం మూటను తీసుకెళ్లకండి, ఎందుకంటే పనివాడు భోజనానికి అర్హుడు. అలాగే రెండు వస్త్రాల్ని* గానీ, చెప్పుల్ని గానీ, చేతికర్రను గానీ తీసుకెళ్లకండి. 11  “మీరు ఏదైనా నగరంలో గానీ గ్రామంలో గానీ అడుగుపెట్టినప్పుడు, అందులో ఎవరు మీ సందేశానికి అర్హులో వెదకండి. మీరు అక్కడి నుండి వెళ్లిపోయేవరకు అతని దగ్గరే ఉండండి. 12  మీరు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లోవాళ్లను పలకరించి, వాళ్లకు శాంతి ఉండాలని చెప్పండి. 13  వాళ్లు మిమ్మల్ని లోపలికి ఆహ్వానిస్తే, వాళ్లకు ఆ శాంతి ఉంటుంది; కానీ వాళ్లు మిమ్మల్ని లోపలికి ఆహ్వానించకపోతే, మీ శాంతి మీ దగ్గరే ఉంటుంది. 14  ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే లేదా మీరు చెప్పేది వినకపోతే, మీరు ఆ ఇంటిని గానీ ఆ నగరాన్ని గానీ విడిచి వెళ్లిపోయేటప్పుడు మీ పాదాలకు అంటుకున్న దుమ్ము దులిపేయండి. 15  నేను నిజంగా మీతో చెప్తున్నాను, తీర్పు రోజున ఆ నగర పరిస్థితి, సొదొమ గొమొర్రాల పరిస్థితి కన్నా ఘోరంగా ఉంటుంది. 16  “ఇదిగో! తోడేళ్ల మధ్యకు గొర్రెల్ని పంపినట్టు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. కాబట్టి పాముల్లా అప్రమత్తంగా, పావురాల్లా కపటం లేకుండా ఉండండి. 17  జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని న్యాయస్థానాలకు అప్పగిస్తారు, తమ సభామందిరాల్లో మిమ్మల్ని కొరడాలతో కొడతారు. 18  నా కారణంగా మీరు అధిపతుల ముందుకు, రాజుల ముందుకు తీసుకురాబడతారు. అప్పుడు వాళ్లకు, అలాగే అన్యులకు సాక్ష్యం ఇచ్చే అవకాశం మీకు దొరుకుతుంది. 19  అయితే వాళ్లు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలా మాట్లాడాలా, ఏమి మాట్లాడాలా అని ఆందోళన పడకండి; మీరు ఏమి మాట్లాడాలో ఆ సమయంలోనే మీకు తెలుస్తుంది. 20  ఎందుకంటే అప్పుడు మీ అంతట మీరే మాట్లాడరు కానీ, మీ తండ్రి నుండి వచ్చే పవిత్రశక్తి సహాయంతో మీరు మాట్లాడతారు. 21  అంతేకాదు, సోదరుడు సోదరుణ్ణి, తండ్రి తన సొంత బిడ్డని మరణానికి అప్పగిస్తారు. పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడి, వాళ్లను చంపిస్తారు. 22  మీరు నా శిష్యులుగా ఉన్నందువల్ల ప్రజలందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు, కానీ అంతం వరకు సహించిన* వాళ్లే రక్షించబడతారు. 23  వాళ్లు మిమ్మల్ని ఒక నగరంలో హింసించినప్పుడు, ఇంకో నగరానికి పారిపోండి; మీరు ఇశ్రాయేలు నగరాల్లో, గ్రామాల్లో మీ పని పూర్తి చేసేలోపే మానవ కుమారుడు వస్తాడని మీతో నిజంగా చెప్తున్నాను. 24  “శిష్యుడు తన బోధకుడి కన్నా గొప్పవాడు కాదు, అలాగే దాసుడు తన యజమాని కన్నా గొప్పవాడు కాదు. 25  శిష్యుడు తన బోధకుడిలా, దాసుడు తన యజమానిలా అయితే చాలు. ప్రజలు యజమానిని బయెల్జెబూలు* అని పిలిచారంటే, అతని ఇంటివాళ్లను ఇంకెంతగా అలా పిలుస్తారో కదా? 26  కాబట్టి వాళ్లకు భయపడకండి. ఎందుకంటే కప్పిపెట్టిన ప్రతీది బయటపడుతుంది; రహస్యంగా ఉంచిన ప్రతీది తెలిసిపోతుంది. 27  నేను మీకు చీకట్లో చెప్పేవాటిని మీరు వెలుగులో చెప్పండి, నేను మీకు చెవిలో చెప్పేవాటిని ఇంటి పైకప్పుల మీద నుండి ప్రకటించండి. 28  శరీరాన్ని చంపినా ప్రాణాన్ని చంపలేనివాళ్లకు* భయపడకండి. కానీ ప్రాణాన్ని, శరీరాన్ని గెహెన్నాలో* నాశనం చేయగలిగే వ్యక్తికే భయపడండి. 29  తక్కువ విలువగల ఒక నాణేనికి* రెండు పిచ్చుకలు వస్తాయి కదా? అయితే మీ తండ్రికి తెలియకుండా వాటిలో ఒక్కటి కూడా నేలమీద పడదు. 30  మీ తలమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా ఆయనకు తెలుసు. 31  కాబట్టి భయపడకండి; మీరు చాలా పిచ్చుకల కన్నా విలువైనవాళ్లు. 32  “కాబట్టి మనుషుల ముందు నన్ను ఒప్పుకునే ప్రతీ ఒక్కర్ని, నేను కూడా పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు ఒప్పుకుంటాను. 33  అయితే మనుషుల ముందు ఎవరైనా నన్ను తిరస్కరిస్తే, నేను కూడా పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు అతన్ని తిరస్కరిస్తాను. 34  నేను భూమ్మీదికి శాంతిని తీసుకురావడం కోసం వచ్చానని అనుకోకండి; శాంతిని కాదు, కత్తిని తీసుకురావడం కోసమే నేను వచ్చాను. 35  ఎందుకంటే కొడుకుకు తండ్రికి, కూతురికి తల్లికి, కోడలికి అత్తకి మధ్య విరోధం పెట్టడానికే నేను వచ్చాను. 36  నిజానికి, ఒక మనిషి ఇంటివాళ్లే అతనికి శత్రువులు అవుతారు. 37  తండ్రిని గానీ, తల్లిని గానీ నాకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తికి నా శిష్యుడిగా ఉండే అర్హత లేదు. కొడుకును గానీ, కూతుర్ని గానీ నాకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తికి నా శిష్యుడిగా ఉండే అర్హత లేదు. 38  అలాగే తన హింసాకొయ్యను* మోసుకుంటూ నన్ను అనుసరించని వ్యక్తికి నా శిష్యుడిగా ఉండే అర్హత లేదు. 39  తన ప్రాణాన్ని కాపాడుకునే వ్యక్తి దాన్ని పోగొట్టుకుంటాడు, అయితే నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకునే వ్యక్తి దాన్ని కాపాడుకుంటాడు. 40  “మిమ్మల్ని చేర్చుకునే వ్యక్తి నన్ను కూడా చేర్చుకుంటాడు, నన్ను చేర్చుకునే వ్యక్తి నన్ను పంపించిన దేవుణ్ణి కూడా చేర్చుకుంటాడు. 41  ప్రవక్త అనే కారణంతో ప్రవక్తను చేర్చుకునే వ్యక్తి ప్రవక్త పొందే ప్రతిఫలం పొందుతాడు. అలాగే నీతిమంతుడు అనే కారణంతో నీతిమంతుణ్ణి చేర్చుకునే వ్యక్తి నీతిమంతుడు పొందే ప్రతిఫలం పొందుతాడు. 42  నేను మీతో నిజంగా చెప్తున్నాను, నా శిష్యుడనే కారణంతో వీళ్లలో* ఒకరికి తాగడానికి కేవలం కొన్ని చన్నీళ్లు ఇచ్చే వ్యక్తి ఖచ్చితంగా తన ప్రతిఫలం పొందుతాడు.”

అధస్సూచీలు

పదకోశంలో “చెడ్డదూతలు” చూడండి.
లేదా “ఉత్సాహవంతుడైన.”
లేదా “అదనపు వస్త్రాన్ని.”
లేదా “సహించే.”
చెడ్డదూతల రాజు లేదా నాయకుడు అయిన సాతానుకు ఉన్న ఓ బిరుదు.
లేదా “దేవుడు పునరుత్థానంలో మళ్లీ జీవాన్ని ఇవ్వకుండా ఆపలేనివాళ్లకు.”
పదకోశం చూడండి.
అక్ష., “ఒక అస్సారియోన్‌కు.” అది 45 నిమిషాలు పనిచేస్తే వచ్చే కూలి.
పదకోశం చూడండి.
లేదా “ఈ తక్కువ వాళ్లలో.”