మత్తయి 13:1-58

  • రాజ్యం గురించి ఉదాహరణలు (1-52)

    • విత్తేవాడు (1-9)

    • యేసు ఉదాహరణలు ఎందుకు ఉపయోగించాడు (10-17)

    • విత్తేవాడి ఉదాహరణను వివరించడం  (18-23)

    • గోధుమలు, గురుగులు  (24-30)

    • ఆవగింజ, పులిసిన పిండి  (31-33)

    • ఉదాహరణలు ఉపయోగించడం ద్వారా ప్రవచనాన్ని నెరవేర్చాడు (34, 35)

    • గోధుమలు, గురుగుల ఉదాహరణను వివరించడం  (36-43)

    • దాచబడిన నిధి, మంచి ముత్యం  (44-46)

    • పెద్ద వల  (47-50)

    • ఖజానాలో ఉన్న కొత్తవి, పాతవి  (51, 52)

  • యేసు సొంత ప్రాంతంవాళ్లు ఆయన్ని తిరస్కరించారు (53-58)

13  యేసు ఆ రోజు ఆ ఇంటి నుండి వెళ్లి, సముద్రం ఒడ్డున కూర్చొని ఉన్నాడు.  అప్పుడు చాలామంది ప్రజలు ఆయన దగ్గరికి రావడంతో ఆయన ఒక పడవ ఎక్కి అందులో కూర్చున్నాడు. ప్రజలందరూ ఒడ్డున నిలబడివున్నారు.  అప్పుడు యేసు ఉదాహరణలతో వాళ్లకు చాలా విషయాలు బోధించాడు. ఆయనిలా చెప్పాడు: “ఇదిగో! విత్తేవాడు విత్తడానికి బయల్దేరాడు.  అతను విత్తుతుండగా, కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి; పక్షులు వచ్చి వాటిని తినేశాయి.  ఇంకొన్ని విత్తనాలు అంతగా మట్టి లేని రాతినేల మీద పడ్డాయి, మట్టి ఎక్కువ లోతు లేనందువల్ల అవి వెంటనే మొలకెత్తాయి.  కానీ సూర్యుడు ఉదయించగానే అవి ఎండిపోయాయి, వేరు లేనందువల్ల వాడిపోయాయి.  మరికొన్ని విత్తనాలు ముళ్లపొదల్లో పడ్డాయి, ముళ్లపొదలు పెరిగి వాటి ఎదుగుదలను అడ్డుకున్నాయి.  అయితే ఇంకొన్ని మంచినేల మీద పడ్డాయి. వాటిలో కొన్ని విత్తనాలు 100 రెట్లు, ఇంకొన్ని 60 రెట్లు, మరికొన్ని 30 రెట్లు ఎక్కువగా ఫలించడం మొదలుపెట్టాయి.  చెవులు ఉన్నవాడు వినాలి.” 10  కాబట్టి శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “నువ్వు వాళ్లకు ఉదాహరణలతో ఎందుకు బోధిస్తున్నావు?” అని అడిగారు. 11  అప్పుడు యేసు ఇలా చెప్పాడు: “పరలోక రాజ్యం గురించిన పవిత్ర రహస్యాల్ని అర్థం చేసుకునే అవకాశాన్ని దేవుడు మీకు ఇచ్చాడు కానీ వాళ్లకు ఇవ్వలేదు. 12  ఎందుకంటే ఎవరి దగ్గర ఉందో, వాళ్లు ఇంకా ఎక్కువ పొందుతారు. అలా వాళ్ల దగ్గర సమృద్ధిగా ఉంటుంది. అయితే ఎవరి దగ్గరైతే లేదో, వాళ్ల దగ్గర ఉన్నది కూడా వాళ్ల నుండి తీసివేయబడుతుంది. 13  అందుకే నేను వాళ్లకు ఉదాహరణలతో బోధిస్తున్నాను; ఎందుకంటే వాళ్లు చూస్తారు గానీ వాళ్లకేమీ కనిపించదు, వింటారు గానీ ఏమీ వినిపించదు, విన్న విషయాన్ని అర్థం చేసుకోరు. 14  యెషయా చెప్పిన ఈ ప్రవచనం వాళ్ల విషయంలో నెరవేరుతోంది: ‘మీరు వినడం వరకు వింటారు కానీ మీకు ఏమాత్రం అర్థంకాదు, మీరు చూడడం వరకు చూస్తారు కానీ మీకు అస్సలు ఏమీ కనిపించదు. 15  ఈ ప్రజల హృదయాలు మొద్దుబారిపోయాయి. వాళ్లు చెవులతో వింటారు కానీ స్పందించరు. వాళ్లు తమ కళ్లు మూసుకున్నారు. వాళ్లు తమ కళ్లతో చూడడానికి, చెవులతో వినడానికి ఇష్టపడట్లేదు; తమ హృదయాలతో అర్థంచేసుకొని నా వైపుకు తిరగడానికి నిరాకరిస్తున్నారు. నేను వాళ్లను బాగుచేయకుండా ఉండాలని అలా చేస్తున్నారు.’ 16  “అయితే మీరు ఈ విషయాల్ని చూస్తున్నారు, వింటున్నారు కాబట్టి మీరు సంతోషంగా ఉన్నారు. 17  ఎందుకంటే నేను మీతో నిజంగా చెప్తున్నాను, చాలామంది ప్రవక్తలు, నీతిమంతులు మీరు చూస్తున్నవాటిని చూడాలని కోరుకున్నారు కానీ చూడలేకపోయారు; మీరు వింటున్నవాటిని వినాలని కోరుకున్నారు కానీ వినలేకపోయారు. 18  “ఇప్పుడు విత్తేవాడి ఉదాహరణ అర్థమేంటో వినండి. 19  ఎవరైనా రాజ్యం గురించిన వాక్యం విని, దాన్ని అర్థం చేసుకోకపోతే వాళ్ల హృదయంలో నాటబడినదాన్ని దుష్టుడు వచ్చి ఎత్తుకెళ్లిపోతాడు. దారిపక్కన నేల లాంటివాళ్లు వీళ్లే. 20  రాతినేల లాంటివాళ్లు, వాక్యాన్ని విన్న వెంటనే సంతోషంగా దాన్ని అంగీకరిస్తారు. 21  అయితే వాక్యం వాళ్లలో వేళ్లూనుకోదు, అయినా కొంతకాలం కొనసాగుతారు. తర్వాత వాక్యం కారణంగా శ్రమలు లేదా హింసలు వచ్చినప్పుడు వాళ్లు వెంటనే విశ్వాసాన్ని వదిలేస్తారు. 22  ముళ్లపొదలు ఉన్న నేల లాంటివాళ్లు, వాక్యాన్ని వింటారు కానీ ఈ వ్యవస్థలో* ఉన్న ఆందోళనలు, సిరిసంపదలకున్న మోసకరమైన శక్తి వాక్యాన్ని ఎదగనివ్వవు. దాంతో వాక్యం ఫలించకుండా పోతుంది. 23  మంచినేల లాంటివాళ్లు, వాక్యాన్ని విని దాన్ని అర్థం చేసుకుంటారు. వాళ్లు నిజంగా ఫలిస్తారు, వాళ్లలో కొంతమంది 100 రెట్లు, ఇంకొంతమంది 60 రెట్లు, మరికొంతమంది 30 రెట్లు ఎక్కువగా ఫలిస్తారు.” 24  యేసు ప్రజలకు ఇంకో ఉదాహరణ చెప్పాడు: “పరలోక రాజ్యాన్ని, తన పొలంలో మంచి విత్తనాన్ని విత్తిన మనిషితో పోల్చవచ్చు. 25  అందరూ నిద్రపోతున్నప్పుడు అతని శత్రువు వచ్చి, గోధుమల మధ్య గురుగుల్ని* నాటి వెళ్లిపోయాడు. 26  మొక్కలు పెరిగి వాటికి గింజలు వచ్చినప్పుడు గురుగులు కూడా కనిపించాయి. 27  కాబట్టి అతని దాసులు వచ్చి అతన్ని ఇలా అడిగారు: ‘అయ్యా, నువ్వు నీ పొలంలో మంచి విత్తనం విత్తావు కదా? మరి గురుగులు ఎక్కడినుండి వచ్చాయి?’ 28  అతను వాళ్లతో, ‘ఇది శత్రువు చేసిన పని’ అన్నాడు. అప్పుడు ఆ దాసులు అతనితో, ‘మరి మమ్మల్ని వెళ్లి వాటిని పీకేయమంటావా?’ అని అడిగారు. 29  అందుకు అతను ఇలా చెప్పాడు: ‘వద్దు, మీరు గురుగుల్ని పీకేసేటప్పుడు పొరపాటున గోధుమ మొక్కల్ని కూడా పీకేస్తారేమో. 30  కోతకాలం వరకు రెండిటినీ కలిసి పెరగనివ్వండి; కోతకాలంలో కోత కోసేవాళ్లతో, “ముందు గురుగుల్ని పీకేసి, వాటిని కాల్చడానికి కట్టగట్టండి, తర్వాత గోధుమల్ని నా గోదాములోకి సమకూర్చండి”’ అని చెప్తాను.” 31  ఆయన ప్రజలకు ఇంకో ఉదాహరణ చెప్పాడు: “పరలోక రాజ్యం, ఒక మనిషి తన పొలంలో విత్తిన ఆవగింజ లాంటిది. 32  నిజానికి అది విత్తనాలన్నిట్లో చాలా చిన్నది, కానీ అది పెరిగినప్పుడు కూరమొక్కలన్నిట్లో పెద్దదై, ఒక చెట్టులా తయారౌతుంది. అప్పుడు ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మల్లో ఆశ్రయం పొందుతాయి.” 33  ఆయన ప్రజలకు ఇంకో ఉదాహరణ చెప్పాడు: “పరలోక రాజ్యం, పులిసిన పిండి లాంటిది. ఒక స్త్రీ దాన్ని తీసుకుని, పది కిలోల పిండిలో కలిపింది, దాంతో పిండి ముద్దంతా పులిసిపోయింది.” 34  యేసు ఈ విషయాలన్నిటినీ ఉదాహరణలతో ప్రజలకు బోధించాడు. నిజానికి, ఆయన ఉదాహరణలు ఉపయోగించకుండా వాళ్లతో ఏమీ మాట్లాడలేదు. 35  ఆ విధంగా, దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిన ఈ మాటలు నెరవేరాయి: “నేను ఉదాహరణలతో బోధిస్తాను; ప్రారంభం* నుండి దాచబడిన విషయాల్ని ప్రకటిస్తాను.” 36  యేసు ప్రజల్ని పంపించేశాక ఇంట్లోకి వెళ్లాడు. శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “పొలంలోని గురుగుల ఉదాహరణ గురించి మాకు వివరంగా చెప్పు” అని అడిగారు. 37  అప్పుడు యేసు ఇలా చెప్పాడు: “మంచి విత్తనం విత్తిన వ్యక్తి మానవ కుమారుడు; 38  పొలం ఈ లోకం. మంచి విత్తనం రాజ్య కుమారులు; కానీ గురుగులు దుష్టుని కుమారులు. 39  వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత లోక వ్యవస్థ* ముగింపు; కోత కోసేవాళ్లు దేవదూతలు. 40  గురుగుల్ని ఎలాగైతే ఏరి, అగ్నిలో కాల్చేస్తారో, వ్యవస్థ* ముగింపులో కూడా అలాగే జరుగుతుంది. 41  మానవ కుమారుడు తన దూతల్ని పంపిస్తాడు. ఆ దూతలు ఇతరులు పాపం చేయడానికి కారణమయ్యేవాళ్లను, చెడు పనులు చేసేవాళ్లను ఆయన రాజ్యంలో నుండి ఏరి, 42  మండే కొలిమిలో పడేస్తారు. అక్కడే వాళ్లు ఏడుస్తూ, పళ్లు కొరుక్కుంటూ ఉంటారు. 43  ఆ కాలంలో నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుడిలా తేజోవంతంగా ప్రకాశిస్తారు. చెవులు ఉన్నవాడు వినాలి. 44  “పరలోక రాజ్యం, పొలంలో దాచబడిన నిధి లాంటిది; ఒకతను దాన్ని కనుగొని, మళ్లీ దాచిపెడతాడు. అతను సంతోషంగా వెళ్లి తనకు ఉన్నదంతా అమ్మేసి ఆ పొలాన్ని కొంటాడు. 45  “అంతేకాదు పరలోక రాజ్యం, మంచి ముత్యాల కోసం వెదుకుతున్న ఒక వ్యాపారస్థుని* లాంటిది. 46  అతను ఎంతో విలువైన ఒక ముత్యాన్ని కనుక్కున్నాక, వెళ్లి వెంటనే తన దగ్గర ఉన్నవన్నీ అమ్మేసి దాన్ని కొన్నాడు. 47  “అంతేకాదు పరలోక రాజ్యం, సముద్రంలోకి వేయబడి అన్నిరకాల చేపల్ని పడుతున్న పెద్ద వల లాంటిది. 48  వల నిండినప్పుడు జాలర్లు దాన్ని ఒడ్డుకు లాగారు; అప్పుడు వాళ్లు కూర్చొని మంచి చేపల్ని గంపల్లో వేశారు, కానీ పనికిరాని చేపల్ని పడేశారు. 49  ఈ వ్యవస్థ* ముగింపులో కూడా అలాగే జరుగుతుంది. దేవదూతలు వచ్చి, నీతిమంతుల్లో నుండి దుష్టుల్ని వేరు చేసి, 50  వాళ్లను మండే కొలిమిలో పడేస్తారు. అక్కడే వాళ్లు ఏడుస్తూ, పళ్లు కొరుక్కుంటూ ఉంటారు. 51  “ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకున్నారా?” అని ఆయన అడిగాడు. వాళ్లు, “అవును” అని జవాబిచ్చారు. 52  అప్పుడు ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “ఈ విషయాల్ని మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి, ‘పరలోక రాజ్యం గురించి నేర్చుకునే ప్రతీ బోధకుడు, తన ఖజానాలో నుండి కొత్తవాటినీ, పాతవాటినీ బయటికి తీసుకొచ్చే ఇంటి యజమాని లాంటివాడు’ అని తెలుసుకోండి.” 53  యేసు ఈ ఉదాహరణలు చెప్పడం అయిపోయాక అక్కడి నుండి బయల్దేరాడు. 54  ఆయన తన సొంత ప్రాంతానికి వచ్చిన తర్వాత, ఊరి సభామందిరంలో వాళ్లకు బోధించడం మొదలుపెట్టాడు. అప్పుడు వాళ్లు ఎంతో ఆశ్చర్యపోయి ఇలా అన్నారు: “ఈయనకు ఈ తెలివి, అద్భుతాలు చేసే శక్తి ఎక్కడి నుండి వచ్చాయి? 55  ఈయన వడ్రంగి కొడుకే కదా? ఈయన తల్లి పేరు మరియే కదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా ఈయన తమ్ముళ్లే కదా? 56  ఈయన చెల్లెళ్లంతా మనతోనే ఉన్నారు కదా? మరి ఈయనకు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి?” 57  కాబట్టి వాళ్లు ఆయనమీద విశ్వాసం ఉంచలేదు. అయితే యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “ఒక ప్రవక్తను సొంత ఊరివాళ్లు, ఇంట్లోవాళ్లు తప్ప అందరూ గౌరవిస్తారు.” 58  వాళ్లు విశ్వాసం ఉంచలేదు కాబట్టి, యేసు అక్కడ శక్తివంతమైన పనుల్ని ఎక్కువగా చేయలేదు.

అధస్సూచీలు

లేదా “ఈ యుగంలో.” పదకోశం చూడండి.
గోధుమ మొక్కలా కనిపించే ఒక రకమైన విషపూరిత మొక్క.
లేదా “ప్రపంచం పుట్టినప్పటి” అయ్యుంటుంది.
లేదా “యుగం.” పదకోశం చూడండి.
లేదా “యుగం.” పదకోశం చూడండి.
అక్ష., “ప్రయాణించే వ్యాపారి.”
లేదా “యుగం.” పదకోశం చూడండి.