మత్తయి 17:1-27
17 ఆరు రోజుల తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సోదరుడు యోహానును మాత్రమే తీసుకొని ఎత్తయిన ఓ కొండ మీదికి వెళ్లాడు.
2 అక్కడ వాళ్ల ముందు యేసు రూపం మారిపోయింది; ఆయన ముఖం సూర్యునిలా ప్రకాశించింది, ఆయన పైవస్త్రాలు వెలుగులా తెల్లగా అయ్యాయి.
3 ఇదిగో! మోషే, ఏలీయా ఆయనతో మాట్లాడడం వాళ్లకు కనిపించింది.
4 అప్పుడు పేతురు యేసుతో ఇలా అన్నాడు: “ప్రభువా, మనం ఇక్కడ ఉంటే బాగుంటుంది. నీకు ఇష్టమైతే నేను ఇక్కడ మూడు డేరాలు వేస్తాను. ఒకటి నీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలీయాకు.”
5 అతను ఇంకా మాట్లాడుతుండగా, ఇదిగో! ఒక ప్రకాశవంతమైన మేఘం వాళ్లను కమ్మేసింది; అప్పుడు ఇదిగో! అందులో నుండి ఈ స్వరం వినిపించింది: “ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను.* ఈయన మాట వినండి.”
6 అది విన్నప్పుడు శిష్యులు ఎంతో భయపడి నేలమీద సాష్టాంగ పడ్డారు.
7 అప్పుడు యేసు వాళ్ల దగ్గరికి వచ్చి వాళ్లను ముట్టుకొని, “లేవండి, భయపడకండి” అన్నాడు.
8 వాళ్లు తలెత్తి చూసినప్పుడు, యేసు తప్ప ఇంకెవ్వరూ వాళ్లకు కనిపించలేదు.
9 వాళ్లు కొండ దిగి వస్తుండగా యేసు వాళ్లకు ఇలా ఆజ్ఞాపించాడు: “మానవ కుమారుడు మృతుల్లో నుండి బ్రతికించబడేంత వరకు ఈ దర్శనం గురించి ఎవ్వరికీ చెప్పొద్దు.”
10 అయితే శిష్యులు ఆయన్ని ఇలా అడిగారు: “అలాగైతే, ముందు ఏలీయా రావాలని శాస్త్రులు ఎందుకు అంటారు?”
11 అందుకు ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “ఏలీయా నిజంగానే ముందు వచ్చి అన్నిటినీ చక్కబెడతాడు.
12 అయితే నేను మీతో చెప్తున్నాను, ఏలీయా ఇదివరకే వచ్చాడు; కానీ వాళ్లు అతన్ని గుర్తించకుండా తమకు ఇష్టమొచ్చినట్టు అతనితో ప్రవర్తించారు. మానవ కుమారుడు కూడా అదేవిధంగా వాళ్ల చేతుల్లో బాధలుపడతాడు.”
13 యేసు బాప్తిస్మమిచ్చే యోహాను గురించి తమతో మాట్లాడాడని శిష్యులకు అప్పుడు అర్థమైంది.
14 వాళ్లు ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు, ఒకతను యేసు దగ్గరికి వచ్చి మోకరించి ఇలా అన్నాడు:
15 “ప్రభువా, మా అబ్బాయి మీద కరుణ చూపించు; మూర్ఛరోగం వల్ల వాడి ఆరోగ్యం బాలేదు. వాడు తరచూ మంటల్లో, నీళ్లలో పడుతున్నాడు.
16 వాడిని నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను కానీ వాళ్లు బాగుచేయలేకపోయారు.”
17 అప్పుడు యేసు, “ఓ విశ్వాసంలేని చెడ్డ తరమా, ఎంతకాలం నేను మీతో ఉండాలి? ఎంతకాలం నేను మిమ్మల్ని సహించాలి? ఆ అబ్బాయిని నా దగ్గరికి తీసుకురండి” అన్నాడు.
18 అప్పుడు యేసు ఆ చెడ్డదూతను గద్దించాడు, దాంతో దూత ఆ అబ్బాయిలో నుండి బయటికి వచ్చాడు. ఆ అబ్బాయి వెంటనే బాగయ్యాడు.
19 అప్పుడు శిష్యులు ఒంటరిగా యేసు దగ్గరికి వచ్చి, “ఆ చెడ్డదూతను మేము ఎందుకు వెళ్లగొట్టలేకపోయాం?” అని అడిగారు.
20 దానికి యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మీ అల్పవిశ్వాసం వల్లే. నేను మీతో నిజంగా చెప్తున్నాను, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండి, ఈ కొండతో, ‘ఇక్కడి నుండి అక్కడికి వెళ్లు’ అని చెప్తే, అది వెళ్తుంది; మీకు ఏదీ అసాధ్యంగా ఉండదు.”
21 *——
22 వాళ్లు గలిలయలో కలుసుకున్నప్పుడు యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు: “మానవ కుమారుడు శత్రువుల చేతికి అప్పగించబడబోతున్నాడు,
23 వాళ్లు ఆయన్ని చంపుతారు, కానీ మూడో రోజున ఆయన బ్రతికించబడతాడు.” అది విని వాళ్లు చాలా దుఃఖపడ్డారు.
24 వాళ్లు కపెర్నహూముకు వచ్చాక, ఆలయ పన్ను* వసూలు చేసేవాళ్లు వచ్చి, “మీ బోధకుడు ఆలయ పన్ను కట్టడా?” అని పేతురును అడిగారు.
25 దానికి పేతురు, “కడతాడు” అని జవాబిచ్చాడు. అయితే పేతురు ఇంట్లోకి వెళ్లగానే యేసు అతన్ని ఇలా అడిగాడు: “సీమోనూ, నీకేమనిపిస్తుంది? భూరాజులు సుంకాలు, పన్నులు* ఎవరి దగ్గర వసూలు చేస్తారు? తమ పిల్లల దగ్గరా? బయటివాళ్ల దగ్గరా?”
26 పేతురు, “బయటివాళ్ల దగ్గరే” అన్నాడు. అప్పుడు యేసు అతనితో ఇలా అన్నాడు: “అలాగైతే పిల్లలు పన్ను కట్టాల్సిన అవసరం లేదు.
27 కానీ మనం వాళ్లకు కోపం తెప్పించం కాబట్టి, నువ్వు సముద్రం దగ్గరికి వెళ్లి గాలం వేసి, మొదట చిక్కే చేపను తీసుకో. దాని నోరు తెరిస్తే, ఒక వెండి నాణెం* నీకు కనిపిస్తుంది. దాన్ని తీసుకెళ్లి నా కోసం, నీ కోసం పన్ను కట్టు.”
అధస్సూచీలు
^ అక్ష., “ఈయన్ని నేను ఆమోదించాను.”
^ ఈ లేఖనం కొన్ని ప్రాచీన రాతప్రతుల్లో లేదు కాబట్టి ఇది ప్రేరేపిత లేఖనాల్లో భాగం కాదని తెలుస్తోంది.
^ అక్ష., “రెండు డ్రక్మాల నాణెం,” అది రెండు రోజుల జీతంతో సమానం.
^ ఇది ప్రతీ మనిషి మీద విధించే పన్నును సూచిస్తుండవచ్చు.
^ అక్ష., “ఒక స్టేటర్ నాణెం.” నాలుగు డ్రక్మాలతో సమానం.