మత్తయి 19:1-30

  • పెళ్లి, విడాకులు (1-9)

  • పెళ్లిచేసుకోకుండా ఉండడమనే బహుమానం  (10-12)

  • పిల్లల్ని యేసు ఆశీర్వదించడం  (13-15)

  • బాగా డబ్బున్న ఒక యువకుడి ప్రశ్న (16-24)

  • రాజ్యం కోసం త్యాగాలు (25-30)

19  యేసు ఈ విషయాలు మాట్లాడడం ముగించాక, గలిలయ నుండి బయల్దేరి యొర్దాను అవతల ఉన్న యూదయ సరిహద్దులకు* వచ్చాడు.  చాలామంది ప్రజలు ఆయన వెనక వెళ్లారు, అక్కడ ఆయన రోగుల్ని బాగుచేశాడు.  అప్పుడు పరిసయ్యులు యేసును పరీక్షించాలనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వచ్చి, “ఒక వ్యక్తి ఎలాంటి కారణాన్ని బట్టి అయినా తన భార్యకు విడాకులు ఇవ్వడం న్యాయమేనా?” అని అడిగారు.  అందుకు యేసు ఇలా చెప్పాడు: “దేవుడు ఆరంభంలో పురుషుణ్ణి, స్త్రీని సృష్టించాడని మీరు చదవలేదా?  ‘అందుకే, పురుషుడు అమ్మానాన్నలను విడిచిపెట్టి తన భార్యను అంటిపెట్టుకొని ఉంటాడు, వాళ్లిద్దరూ ఒక్క శరీరంగా ఉంటారు’ అని ఆయన అన్నాడు.  కాబట్టి వాళ్లు ఇక రెండు శరీరాలుగా కాదుగానీ ఒక్క శరీరంగా ఉంటారు. అందుకే దేవుడు ఒకటి చేసినవాళ్లను* ఏ మనిషీ విడదీయకూడదు.”  అప్పుడు వాళ్లు, “మరైతే విడాకుల పత్రం ఇచ్చి, ఆమెను వదిలేయమని మోషే ఎందుకు చెప్పాడు?” అని ఆయనతో అన్నారు.  అందుకు యేసు వాళ్లతో ఇలా చెప్పాడు: “మీ మొండి వైఖరిని బట్టే మీ భార్యలకు విడాకులు ఇవ్వడానికి మోషే అనుమతించాడు. అయితే దేవుడు మొదటి పురుషుణ్ణి, స్త్రీని సృష్టించినప్పుడు అలా లేదు.  నేను మీతో చెప్తున్నాను, లైంగిక పాపాలు* అనే కారణాన్ని బట్టి కాకుండా తన భార్యకు విడాకులు ఇచ్చి ఇంకో స్త్రీని పెళ్లి చేసుకునే ప్రతీ వ్యక్తి వ్యభిచారం చేస్తున్నాడు.” 10  శిష్యులు యేసుతో ఇలా అన్నారు: “భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం ఇలాంటిదైతే, పెళ్లి చేసుకోకపోవడమే మంచిది.” 11  అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను చెప్తున్నదాన్ని అందరూ పాటించరు,* కానీ బహుమానం* ఉన్నవాళ్లే పాటిస్తారు. 12  ఎందుకంటే పుట్టడమే నపుంసకులుగా పుట్టినవాళ్లు ఉన్నారు, మనుషుల చేత నపుంసకులుగా చేయబడినవాళ్లు ఉన్నారు, పరలోక రాజ్యం కోసం తమను తామే నపుంసకులుగా చేసుకున్నవాళ్లు కూడా ఉన్నారు. ఎవరైతే పెళ్లి చేసుకోకుండా ఉండగలరో వాళ్లను అలాగే ఉండనివ్వండి.” 13  అప్పుడు, చిన్నపిల్లల మీద యేసు తన చేతులు ఉంచి ప్రార్థించాలనే ఉద్దేశంతో ప్రజలు పిల్లల్ని ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. కానీ శిష్యులు వాళ్లను గద్దించారు. 14  అయితే యేసు ఇలా అన్నాడు: “చిన్నపిల్లల్ని నా దగ్గరికి రానివ్వండి, వాళ్లను ఆపకండి. ఎందుకంటే పరలోక రాజ్యం ఇలాంటివాళ్లదే.” 15  అప్పుడు ఆయన వాళ్లమీద చేతులు ఉంచాడు, ఆ తర్వాత అక్కడ నుండి వెళ్లిపోయాడు. 16  అప్పుడు ఇదిగో! ఒక యువకుడు యేసు దగ్గరికి వచ్చి, “బోధకుడా, శాశ్వత జీవితం పొందాలంటే నేను ఏ మంచి పనులు చేయాలి?” అని అడిగాడు. 17  అందుకు యేసు అతనితో ఇలా అన్నాడు: “ఏది మంచిదో నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు? దేవుడు తప్ప మంచివాళ్లు ఎవ్వరూ లేరు. అయితే, నువ్వు శాశ్వత జీవితం పొందాలనుకుంటే దేవుని ఆజ్ఞల్ని పాటిస్తూ ఉండు.” 18  అప్పుడు అతను, “ఏ ఆజ్ఞలు?” అని అడిగాడు. యేసు ఇలా చెప్పాడు: “హత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు, 19  మీ అమ్మానాన్నల్ని గౌరవించాలి, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి.” 20  అప్పుడు ఆ యువకుడు, “నేను ఇవన్నీ పాటిస్తున్నాను, నేను ఇంకా ఏమి చేయాలి?” అని ఆయన్ని అడిగాడు. 21  అప్పుడు యేసు అతనికి ఇలా చెప్పాడు: “నువ్వు పరిపూర్ణుడివి కావాలనుకుంటే, వెళ్లి నీ దగ్గర ఉన్నవన్నీ అమ్మేసి, వచ్చిన డబ్బును పేదవాళ్లకు ఇవ్వు. అప్పుడు నీకు పరలోకంలో ఐశ్వర్యం కలుగుతుంది. ఆ తర్వాత వచ్చి నా శిష్యుడివి అవ్వు.” 22  ఆ యువకుడు ఈ మాటలు విన్నప్పుడు ఎంతో దుఃఖపడుతూ వెళ్లిపోయాడు, ఎందుకంటే అతనికి చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి. 23  అప్పుడు యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “నేను మీతో నిజంగా చెప్తున్నాను, ధనవంతుడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించడం కష్టం. 24  నేను మళ్లీ మీతో చెప్తున్నాను, ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం కన్నా సూది రంధ్రం గుండా ఒంటె దూరడం తేలిక.” 25  శిష్యులు అది విన్నప్పుడు ఎంతో ఆశ్చర్యపోయి, “నిజంగా ఎవరైనా రక్షణ పొందగలరా?” అని అడిగారు. 26  యేసు వాళ్లను సూటిగా చూస్తూ, “మనుషులకు ఇది అసాధ్యమే, కానీ దేవునికి అన్నీ సాధ్యం” అన్నాడు. 27  అప్పుడు పేతురు ఇలా అడిగాడు: “ఇదిగో! మేము అన్నీ వదిలేసి నిన్ను అనుసరించాం. మరి మేము ఏమి పొందుతాం?” 28  అందుకు యేసు వాళ్లకు ఇలా చెప్పాడు: “నేను నిజంగా మీతో చెప్తున్నాను, అన్నిటినీ కొత్తవిగా చేసినప్పుడు,* మానవ కుమారుడు తన మహిమగల సింహాసనం మీద కూర్చున్నప్పుడు, నన్ను అనుసరించిన మీరు 12 సింహాసనాల మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రాలకు తీర్పు తీరుస్తారు. 29  నా శిష్యులుగా ఉన్నందుకు ఇళ్లను గానీ, అన్నదమ్ముల్ని గానీ, అక్కచెల్లెళ్లని గానీ, అమ్మను గానీ, నాన్నను గానీ, పిల్లల్ని గానీ, భూముల్ని గానీ వదులుకున్న ప్రతీ ఒక్కరు 100 రెట్లు ఎక్కువ పొందుతారు; అంతేకాదు శాశ్వత జీవితాన్ని పొందుతారు.* 30  “కానీ ముందున్న చాలామంది వెనక్కి వెళ్తారు, వెనక ఉన్నవాళ్లు ముందుకు వస్తారు.

అధస్సూచీలు

లేదా “పొలిమేర్లకు.”
అక్ష., “దేవుడు ఒక కాడి కిందకు తెచ్చినవాళ్లను.”
గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.
అక్ష., “చెప్తున్నదానికి అందరూ చోటివ్వరు.”
అంటే, పెళ్లి చేసుకోకుండా ఉండడమనే బహుమానం.
లేదా “పునఃసృష్టి చేసేటప్పుడు.”
అక్ష., “వారసత్వంగా పొందుతారు.”