మత్తయి 2:1-23

  • జ్యోతిష్యులు రావడం  (1-12)

  • ఐగుప్తుకు పారిపోవడం  (13-15)

  • హేరోదు మగపిల్లల్ని చంపిస్తాడు (16-18)

  • నజరేతుకు తిరిగిరావడం  (19-23)

2  హేరోదు* రాజుగా పరిపాలిస్తున్న రోజుల్లో, యూదయలోని బేత్లెహేములో యేసు పుట్టాడు. ఆ తర్వాత, ఇదిగో! తూర్పు నుండి జ్యోతిష్యులు యెరూషలేముకు వచ్చి,  ఇలా అడిగారు: “యూదుల రాజుగా పుట్టిన బాబు ఎక్కడున్నాడు? మేము తూర్పున ఉన్నప్పుడు ఆయన నక్షత్రాన్ని చూశాం; ఆయనకు సాష్టాంగ నమస్కారం చేయాలని వచ్చాం.”  ఆ మాట విన్నప్పుడు హేరోదు రాజు, అతనితో పాటు యెరూషలేము ప్రజలంతా ఆందోళనపడ్డారు.  అప్పుడు అతను ముఖ్య యాజకుల్ని, శాస్త్రుల్ని అందర్నీ ఒక దగ్గరికి పిలిపించి, క్రీస్తు* ఎక్కడ పుడతాడని వాళ్లను అడిగాడు.  వాళ్లు అతనితో ఇలా అన్నారు: “యూదయలోని బేత్లెహేములో; ఎందుకంటే ఒక ప్రవక్త ఇలా రాశాడు:  ‘యూదా దేశంలోని బేత్లెహేమా, యూదా అధిపతుల దృష్టిలో నువ్వు ఏమాత్రం ప్రాముఖ్యంలేని నగరానివి కావు; ఎందుకంటే నీలో నుండే ఒక పరిపాలకుడు వస్తాడు, ఆయన నా ప్రజలైన ఇశ్రాయేలును నడిపిస్తాడు.’”  అప్పుడు హేరోదు రహస్యంగా ఆ జ్యోతిష్యులను పిలిపించి, ఆ నక్షత్రం కనిపించిన సమయం గురించి వాళ్లను జాగ్రత్తగా అడిగి తెలుసుకున్నాడు.  వాళ్లను బేత్లెహేముకు పంపిస్తూ అతను ఇలా అన్నాడు: “మీరు వెళ్లి, ఆ పిల్లవాడి కోసం జాగ్రత్తగా వెదకండి. ఆయన కనబడినప్పుడు, వచ్చి నాతో చెప్పండి. అప్పుడు నేను కూడా వెళ్లి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తాను.”  వాళ్లు రాజు చెప్పిన మాటలు విని, తమ దారిన తాము వెళ్లారు. అప్పుడు ఇదిగో! వాళ్లు తూర్పున ఉన్నప్పుడు చూసిన ఆ నక్షత్రం వాళ్లకు ముందుగా వెళ్తూ, ఆ పిల్లవాడు ఉన్న చోటికి వచ్చి పైన ఆగింది. 10  ఆ నక్షత్రాన్ని చూడగానే వాళ్లు ఎంతో సంతోషించారు. 11  వాళ్లు ఇంట్లోకి వెళ్లినప్పుడు, ఆ పిల్లవాడు తన తల్లి మరియ దగ్గర ఉండడం చూశారు. వాళ్లు మోకాళ్లమీద వంగి ఆయనకు నమస్కారం చేశారు. అంతేకాదు వాళ్లు తమ పెట్టెలను తెరిచి ఆయనకు బంగారం, సాంబ్రాణి, బోళం బహుమతిగా ఇచ్చారు. 12  అయితే హేరోదు దగ్గరకు తిరిగి వెళ్లవద్దని దేవుడు కలలో వాళ్లను హెచ్చరించడంతో, వాళ్లు ఇంకో దారిలో తమ దేశానికి బయల్దేరారు. 13  వాళ్లు వెళ్లిపోయిన తర్వాత, ఇదిగో! యెహోవా* దూత యోసేపుకు కలలో కనిపించి ఇలా చెప్పాడు: “నువ్వు లేచి పిల్లవాడిని, పిల్లవాడి తల్లిని తీసుకుని ఐగుప్తుకు పారిపో. నేను చెప్పేంతవరకు అక్కడే ఉండు. ఎందుకంటే పిల్లవాడిని చంపాలని హేరోదు ఆయన కోసం వెదకబోతున్నాడు.” 14  కాబట్టి యోసేపు లేచి ఆ రాత్రే పిల్లవాడిని, మరియను తీసుకుని ఐగుప్తుకు వెళ్లిపోయాడు. 15  హేరోదు చనిపోయేవరకు అతను అక్కడే ఉన్నాడు. “నా కుమారుణ్ణి ఐగుప్తులో నుండి పిలిచాను” అని యెహోవా* తన ప్రవక్త ద్వారా చెప్పిన మాట అలా నెరవేరింది. 16  జ్యోతిష్యులు తనను మోసం చేశారని అర్థం చేసుకున్న హేరోదుకు విపరీతమైన కోపం వచ్చింది. అప్పుడు అతను మనుషుల్ని పంపించి బేత్లెహేములో, దాని చుట్టుపక్కల ప్రాంతాలన్నిట్లో రెండు సంవత్సరాలు అంతకన్నా తక్కువ వయసున్న మగపిల్లలందర్నీ చంపించాడు. జ్యోతిష్యుల నుండి తాను జాగ్రత్తగా తెలుసుకున్న సమయాన్ని బట్టి అతను అలా చంపించాడు. 17  దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పిన ఈ మాటలు అప్పుడు నెరవేరాయి: 18  “రామాలో ఏడ్పు, ఎంతో రోదన వినిపించాయి. రాహేలు తన పిల్లలకోసం ఏడుస్తూ ఉంది, వాళ్లు ఇక లేకపోవడంతో ఆమెను ఎవరూ ఓదార్చలేకపోతున్నారు.” 19  హేరోదు చనిపోయినప్పుడు, ఇదిగో! యెహోవా* దూత ఐగుప్తులో ఉన్న యోసేపుకు కలలో కనిపించి, 20  ఇలా చెప్పాడు: “నువ్వు లేచి పిల్లవాడిని, పిల్లవాడి తల్లిని తీసుకుని ఇశ్రాయేలు దేశానికి వెళ్లు. ఎందుకంటే పిల్లవాడి ప్రాణం తీయాలని చూసినవాళ్లు చనిపోయారు.” 21  అప్పుడు అతను లేచి పిల్లవాడిని, మరియను తీసుకుని ఇశ్రాయేలు దేశానికి తిరిగొచ్చాడు. 22  అయితే హేరోదు స్థానంలో అతని కొడుకు అర్కెలాయు యూదయను పరిపాలిస్తున్నాడని విన్నప్పుడు యోసేపు అక్కడికి వెళ్లడానికి భయపడ్డాడు. అంతేకాక, అక్కడికి వెళ్లవద్దని దేవుడు కలలో హెచ్చరించడంతో యోసేపు గలిలయ ప్రాంతానికి వెళ్లాడు. 23  అక్కడ అతను నజరేతు అనే నగరంలో స్థిరపడ్డాడు. “ఆయన ఒక నజరేయుడు* అని పిలవబడతాడు” అని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరడానికి అలా జరిగింది.

అధస్సూచీలు

పదకోశం చూడండి.
లేదా “మెస్సీయ; అభిషిక్తుడు.”
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
“మొలక” అనే హీబ్రూ పదం నుండి వచ్చివుండవచ్చు.