మత్తయి 22:1-46
22 యేసు మళ్లీ ఉదాహరణలు ఉపయోగిస్తూ ఇలా అన్నాడు:
2 “పరలోక రాజ్యాన్ని, తన కొడుకు పెళ్లి విందు ఏర్పాటు చేసిన రాజుతో పోల్చవచ్చు.
3 పెళ్లి విందుకు ఆహ్వానించబడిన వాళ్లను పిలవడానికి రాజు తన దాసుల్ని పంపించాడు, కానీ వాళ్లు రావడానికి ఇష్టపడలేదు.
4 మళ్లీ అతను వేరే దాసుల్ని పంపిస్తూ ఇలా అన్నాడు: ‘“ఇదిగో! నేను విందు సిద్ధం చేశాను. ఎడ్లు, కొవ్విన జంతువులు వధించబడ్డాయి, అంతా సిద్ధంగా ఉంది. పెళ్లి విందుకు రండి” అని వాళ్లకు చెప్పండి.’
5 కానీ ఆహ్వానితులు దాన్ని లెక్కచేయకుండా ఒకరు తన పొలానికి, ఇంకొకరు తన వ్యాపారం చూసుకోవడానికి వెళ్లిపోయారు;
6 మిగతావాళ్లు ఆ దాసుల్ని పట్టుకొని కొట్టి, చంపేశారు.
7 “దాంతో రాజుకు చాలా కోపమొచ్చి, తన సైన్యాల్ని పంపి ఆ హంతకుల్ని చంపించి, వాళ్ల నగరాన్ని తగులబెట్టించాడు.
8 తర్వాత రాజు తన దాసులకు ఇలా చెప్పాడు: ‘పెళ్లి విందు సిద్ధంగా ఉంది, కానీ ఆహ్వానితులు అందుకు అర్హులు కారు.
9 కాబట్టి, మీరు నగరం బయట దారుల్లోకి వెళ్లి, ఎవరు కనిపిస్తే వాళ్లను ఈ విందుకు పిలవండి.’
10 ఆ దాసులు రాజు చెప్పినట్టే వెళ్లి, మంచివాళ్లు చెడ్డవాళ్లు అనే తేడా లేకుండా కనిపించిన వాళ్లందర్నీ సమకూర్చారు; దాంతో పెళ్లి జరుగుతున్న ఇల్లంతా భోజనం చేసేవాళ్లతో నిండిపోయింది.
11 “రాజు తన అతిథుల్ని చూడడానికి వచ్చినప్పుడు, పెళ్లి వస్త్రం వేసుకోకుండా వచ్చిన ఒక వ్యక్తి కనిపించాడు.
12 కాబట్టి, రాజు అతన్ని ‘నువ్వు పెళ్లి వస్త్రం వేసుకోకుండా లోపలికి ఎలా వచ్చావు?’ అని అడిగాడు. కానీ అతని దగ్గర జవాబు లేదు.
13 అప్పుడు రాజు తన సేవకులకు ఇలా చెప్పాడు: ‘ఇతని కాళ్లూచేతులు కట్టేసి బయట చీకట్లో పారేయండి. అక్కడే అతను ఏడుస్తూ, పళ్లు కొరుక్కుంటూ ఉంటాడు.’
14 “ఆహ్వానితులు చాలామంది ఉన్నారు కానీ ఎంచుకోబడినవాళ్లు కొంతమందే.”
15 తర్వాత పరిసయ్యులు వెళ్లి, ఆయన మాటల్లో తప్పు పట్టుకోవడానికి కుట్రపన్నారు.
16 కాబట్టి వాళ్లు తమ శిష్యుల్ని, అలాగే హేరోదు అనుచరుల్ని ఆయన దగ్గరికి పంపించి, ఇలా అడిగించారు: “బోధకుడా, నువ్వు ఎప్పుడూ సత్యమే మాట్లాడతావనీ, దేవుని మార్గం గురించిన సత్యాన్ని బోధిస్తావనీ మాకు తెలుసు. అలాగే నువ్వు ఎవరి మెప్పూ కోరవని కూడా మాకు తెలుసు, ఎందుకంటే నువ్వు మనుషుల హోదా పట్టించుకోవు.
17 అయితే మాకు ఓ విషయం చెప్పు, కైసరుకు పన్ను* కట్టడం న్యాయమా, కాదా?”*
18 కానీ యేసు వాళ్ల దుష్టత్వాన్ని పసిగట్టి ఇలా అన్నాడు: “వేషధారులారా, మీరు ఎందుకు నన్ను పరీక్షిస్తున్నారు?
19 మీరు పన్ను కట్టడానికి ఉపయోగించే ఒక నాణేన్ని తీసుకొచ్చి నాకు చూపించండి.” అప్పుడు వాళ్లు ఒక దేనారాన్ని* తీసుకొచ్చి చూపించారు.
20 ఆయన, “దీని మీదున్న బొమ్మ, బిరుదు ఎవరివి?” అని వాళ్లను అడిగాడు.
21 దానికి వాళ్లు, “కైసరువి” అన్నారు. అప్పుడు ఆయన వాళ్లతో, “అయితే కైసరువి కైసరుకు చెల్లించండి, కానీ దేవునివి దేవునికి చెల్లించండి” అని చెప్పాడు.
22 అది విన్నప్పుడు వాళ్లు ఎంతో ఆశ్చర్యపోయి, ఆయన్ని వదిలేసి వెళ్లిపోయారు.
23 తర్వాత అదే రోజున, పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు ఆయన దగ్గరికి వచ్చి ఇలా అడిగారు:
24 “బోధకుడా, ‘ఒక వ్యక్తి పిల్లలు లేకుండా చనిపోతే, అతని సోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని అతని కోసం పిల్లల్ని కనాలి’ అని మోషే చెప్పాడు.
25 మా మధ్య ఏడుగురు అన్నదమ్ములు ఉండేవాళ్లు. వాళ్లలో మొదటివాడు ఒకామెను పెళ్లి చేసుకొని, పిల్లలు లేకుండానే చనిపోయాడు. తర్వాత అతని తమ్ముడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
26 రెండోవాడు, మూడోవాడు అలా ఏడోవాడి వరకు అలాగే జరిగింది.
27 చివరికి ఆమె కూడా చనిపోయింది.
28 ఆ ఏడుగురూ ఆమెను పెళ్లి చేసుకున్నారు కదా, మరి పునరుత్థానమైనప్పుడు ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది?”
29 అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మీకు లేఖనాలూ తెలియవు, దేవుని శక్తీ తెలియదు. అందుకే మీరు పొరబడుతున్నారు;
30 పునరుత్థానమైనప్పుడు స్త్రీలు గానీ పురుషులు గానీ పెళ్లి చేసుకోరు, వాళ్లు పరలోకంలోని దేవదూతల్లా ఉంటారు.
31 మృతుల పునరుత్థానం విషయానికొస్తే, దేవుడు మీతో అన్న మాటల్ని మీరు చదవలేదా?
32 ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాకుకు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’ అని ఆయన అన్నాడు. ఆయన చనిపోయినవాళ్లకు కాదు, బ్రతికున్నవాళ్లకే దేవుడు.”
33 అది విన్నప్పుడు ప్రజలు ఆయన బోధకు ఎంతో ఆశ్చర్యపోయారు.
34 ఆయన సద్దూకయ్యుల నోళ్లు మూయించాడని తెలుసుకొని, పరిసయ్యులందరూ కలిసి ఒక గుంపుగా ఆయన దగ్గరికి వచ్చారు.
35 వాళ్లలో ధర్మశాస్త్రంలో ఆరితేరిన ఒకతను ఆయన్ని పరీక్షిస్తూ ఇలా అడిగాడు:
36 “బోధకుడా, ధర్మశాస్త్రంలో అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ ఏది?”
37 ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “‘నువ్వు నీ దేవుడైన యెహోవాను* నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో, నీ నిండు మనసుతో ప్రేమించాలి.’
38 ఇదే అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ, మొదటిది కూడా.
39 రెండో ఆజ్ఞ కూడా దాని లాంటిదే. అదేమిటంటే, ‘నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి.’
40 ఈ రెండు ఆజ్ఞలే మొత్తం ధర్మశాస్త్రానికి, ప్రవక్తల పుస్తకాలకు ఆధారం.”
41 పరిసయ్యులు ఇంకా అక్కడే ఉన్నప్పుడు యేసు వాళ్లను ఇలా అడిగాడు:
42 “క్రీస్తు గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆయన ఎవరి కుమారుడు?” అందుకు వాళ్లు, “దావీదు కుమారుడు” అన్నారు.
43 ఆయన వాళ్లను ఇలా అడిగాడు: “మరైతే పవిత్రశక్తి ప్రేరణతో ఈ మాటలు రాస్తున్నప్పుడు దావీదు ఆయన్ని ప్రభువు అని ఎందుకు అన్నాడు:
44 ‘యెహోవా* నా ప్రభువుతో ఇలా చెప్పాడు: “నేను నీ శత్రువుల్ని నీ పాదాల కింద ఉంచేవరకు నువ్వు నా కుడి పక్కన కూర్చో.”’
45 దావీదు క్రీస్తును ప్రభువు అని అంటున్నాడు కదా, అలాంటప్పుడు క్రీస్తు దావీదు కుమారుడు ఎలా అవుతాడు?”
46 యేసు అడిగిన ప్రశ్నకు ఒక్కరు కూడా జవాబు చెప్పలేకపోయారు. ఇక ఆ రోజు నుండి ఎవ్వరూ ఆయన్ని ప్రశ్నించే సాహసం చేయలేదు.
అధస్సూచీలు
^ ఇది ప్రతీ మనిషి మీద విధించే పన్నును సూచిస్తుండవచ్చు.
^ లేదా “సరైనదా, కాదా?”
^ పదకోశం చూడండి.
^ పదకోశం చూడండి.
^ పదకోశం చూడండి.