మత్తయి 24:1-51
24 యేసు ఆలయం నుండి వెళ్లిపోతుండగా, ఆయన శిష్యులు ఆలయ కట్టడాలు చూపించడానికి ఆయన దగ్గరికి వచ్చారు.
2 అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా? నేను నిజంగా మీతో చెప్తున్నాను, రాయి మీద రాయి ఒక్కటి కూడా ఉండకుండా ఇవి పడద్రోయబడతాయి.”
3 ఆయన ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఏకాంతంగా ఆయన దగ్గరికి వచ్చి, “ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నీ ప్రత్యక్షతకు,* ఈ వ్యవస్థ* ముగింపుకు సూచన ఏమిటి? మాతో చెప్పు” అని అడిగారు.
4 అప్పుడు యేసు వాళ్లకు ఇలా చెప్పాడు: “ఎవరూ మిమ్మల్ని తప్పుదారి పట్టించకుండా చూసుకోండి.
5 ఎందుకంటే చాలామంది నా పేరుతో వచ్చి, ‘నేనే క్రీస్తును’ అని చెప్పుకుంటూ ఎంతోమందిని తప్పుదారి పట్టిస్తారు.
6 మీరు యుద్ధాల గురించి, యుద్ధ వార్తల గురించి వింటారు. అప్పుడు మీరు కంగారుపడకుండా చూసుకోండి. ఎందుకంటే ఇవన్నీ జరగాలి, కానీ అంతం అప్పుడే రాదు.
7 “ఒక దేశం మీద మరో దేశం, ఒక రాజ్యం మీద మరో రాజ్యం దాడిచేస్తాయి. ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో ఆహారకొరతలు, భూకంపాలు వస్తాయి.
8 ఇవన్నీ పురిటి నొప్పుల లాంటి వేదనలకు ఆరంభం.
9 “అప్పుడు ప్రజలు మిమ్మల్ని హింసించి, చంపుతారు. నా శిష్యులుగా ఉన్నందుకు మీరు అన్ని దేశాల ప్రజల చేత ద్వేషించబడతారు.
10 అంతేకాదు చాలామంది దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోతారు; ఒకరినొకరు అప్పగించుకుంటారు, ద్వేషించుకుంటారు.
11 చాలామంది అబద్ధ ప్రవక్తలు పుట్టుకొచ్చి, ఎంతోమందిని తప్పుదారి పట్టిస్తారు;
12 చెడుతనం పెరిగిపోవడం వల్ల చాలామంది ప్రేమ చల్లారిపోతుంది.
13 కానీ అంతం వరకు సహించిన* వాళ్లే రక్షించబడతారు.
14 అన్ని దేశాల ప్రజలకు సాక్ష్యంగా ఉండేలా, రాజ్యం గురించిన మంచివార్త భూమంతటా ప్రకటించబడుతుంది. ఆ తర్వాత అంతం వస్తుంది.
15 “కాబట్టి దానియేలు ప్రవక్త చెప్పినట్టు, నాశనాన్ని కలుగజేసే అసహ్యమైన వస్తువు పవిత్ర స్థలంలో ఉండడం మీరు చూసినప్పుడు (చదివే వ్యక్తి వివేచన ఉపయోగించాలి),
16 యూదయలో ఉన్నవాళ్లు కొండలకు పారిపోవడం మొదలుపెట్టాలి.
17 డాబా మీదున్న వ్యక్తి ఇంట్లో నుండి వస్తువులు తెచ్చుకోవడానికి కిందికి దిగకూడదు.
18 పొలంలో ఉన్న వ్యక్తి తన పైవస్త్రం తెచ్చుకోవడానికి వెనక్కి రాకూడదు.
19 ఆ రోజుల్లో గర్భిణులకు, పాలిచ్చే స్త్రీలకు శ్రమ!
20 మీరు చలికాలంలోనో, విశ్రాంతి రోజునో పారిపోవాల్సి రాకూడదని ప్రార్థిస్తూ ఉండండి;
21 ఎందుకంటే, అప్పుడు మహాశ్రమ వస్తుంది. లోకం పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు అలాంటి శ్రమ రాలేదు, ఆ తర్వాత మళ్లీ రాదు.
22 నిజానికి, ఆ రోజులు తగ్గించబడకపోతే ఒక్కరు కూడా తప్పించుకోలేరు; అయితే, ఎంచుకోబడిన వాళ్ల కోసం ఆ రోజులు తగ్గించబడతాయి.
23 “ఎవరైనా మీతో, ‘ఇదిగో! క్రీస్తు ఇక్కడ ఉన్నాడు,’ ‘అదిగో! అక్కడ ఉన్నాడు’ అని అంటే నమ్మకండి.
24 ఎందుకంటే అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు పుట్టుకొచ్చి సాధ్యమైతే ఎంచుకోబడిన వాళ్లను కూడా మోసం చేయడానికి గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకరమైన పనులు చేస్తారు.
25 ఇదిగో! నేను మిమ్మల్ని ముందే హెచ్చరిస్తున్నాను.
26 కాబట్టి ప్రజలు మీతో, ‘ఇదిగో! ఆయన అరణ్యంలో ఉన్నాడు’ అని అంటే అక్కడికి వెళ్లకండి; ‘ఇదిగో! ఆయన రహస్య స్థలంలో ఉన్నాడు’ అంటే నమ్మకండి.
27 ఆకాశంలో మెరుపు తూర్పు దిక్కున మొదలై పడమటి దిక్కు వరకు మెరిసినట్టే మానవ కుమారుడి ప్రత్యక్షత* కూడా ఉంటుంది.
28 శవం ఎక్కడ ఉంటే గద్దలు అక్కడ పోగౌతాయి.
29 “ఆ రోజుల శ్రమ ముగిసిన వెంటనే సూర్యుడు చీకటిమయమౌతాడు, చంద్రుడు తన వెలుగు ఇవ్వడు, నక్షత్రాలు ఆకాశం నుండి రాలిపోతాయి, ఆకాశంలోని శక్తులు కదిలించబడతాయి.
30 అప్పుడు మానవ కుమారుడి సూచన ఆకాశంలో కనిపిస్తుంది. భూమ్మీదున్న అన్ని దేశాల* ప్రజలు దుఃఖంతో గుండెలు బాదుకుంటారు; మానవ కుమారుడు శక్తితో, గొప్ప మహిమతో ఆకాశ మేఘాల మీద రావడం వాళ్లు చూస్తారు.
31 ఆయన గొప్ప బాకా* శబ్దంతో తన దూతల్ని పంపిస్తాడు. ఆ దూతలు ఆయన ఎంచుకున్నవాళ్లను ఆకాశం ఈ చివర నుండి ఆ చివర వరకు నాలుగు దిక్కుల నుండి సమకూరుస్తారు.
32 “అంజూర చెట్టు ఉదాహరణను గమనించండి: ఆ చెట్టు కొమ్మలు పచ్చగా, మృదువుగా మారి చిగురించిన వెంటనే ఎండాకాలం దగ్గర పడిందని మీకు తెలుస్తుంది.
33 అదే విధంగా, ఇవన్నీ జరుగుతుండడం మీరు చూసినప్పుడు ఆయన దగ్గర్లోనే అంటే గుమ్మం దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి.
34 నేను నిజంగా మీతో చెప్తున్నాను, ఇవన్నీ జరిగే వరకు ఈ తరం అస్సలు అంతరించిపోదు.
35 ఆకాశం, భూమి అంతరించిపోతాయి కానీ నా మాటలు ఎప్పటికీ నిలిచివుంటాయి.
36 “ఆ రోజు గురించి, ఆ గంట గురించి ఎవ్వరికీ తెలియదు. పరలోకంలోని దేవదూతలకు గానీ, కుమారుడికి గానీ తెలియదు; తండ్రికి మాత్రమే తెలుసు.
37 మానవ కుమారుడి ప్రత్యక్షత* నోవహు రోజుల్లాగే ఉంటుంది.
38 జలప్రళయానికి ముందున్న కాలంలో ప్రజలు తింటూ, తాగుతూ, పెళ్లిళ్లు చేసుకుంటూ ఉన్నారు; నోవహు ఓడలోకి వెళ్లే రోజు వరకు వాళ్లు అలాగే చేశారు.
39 జలప్రళయం వచ్చి వాళ్లందర్నీ కొట్టుకొనిపోయే వరకు వాళ్లు ఏమీ పట్టించుకోలేదు. మానవ కుమారుడి ప్రత్యక్షత కూడా అలాగే ఉంటుంది.
40 అప్పుడు ఇద్దరు మనుషులు పొలంలో ఉంటారు; ఒకరు తీసుకుపోబడతారు, ఇంకొకరు వదిలేయబడతారు.
41 ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతూ ఉంటారు; ఒకామె తీసుకుపోబడుతుంది, ఇంకొకామె వదిలేయబడుతుంది.
42 కాబట్టి అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే మీ ప్రభువు ఏ రోజు వస్తున్నాడో మీకు తెలీదు.
43 “అయితే ఈ విషయం గుర్తుపెట్టుకోండి, రాత్రి ఏ సమయంలో దొంగ వస్తున్నాడో ఇంటి యజమానికి ముందే తెలిస్తే, అతను మెలకువగా ఉండి ఆ దొంగను ఇంట్లో జొరబడనివ్వడు.
44 కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఎందుకంటే, మీరు అనుకోని సమయంలో* మానవ కుమారుడు వస్తున్నాడు.
45 “తన ఇంట్లోని సేవకులకు తగిన సమయంలో ఆహారం పెట్టేలా యజమాని తన ఇంటివాళ్లమీద నియమించిన నమ్మకమైన, బుద్ధిగల* దాసుడు నిజంగా ఎవరు?
46 యజమాని వచ్చి ఆ దాసుడు అలా చేస్తూ ఉండడం చూస్తే, ఆ దాసుడు సంతోషంగా ఉంటాడు!
47 నేను నిజంగా మీతో చెప్తున్నాను, ఆయన ఆ దాసున్ని తన ఆస్తి అంతటి మీద నియమిస్తాడు.
48 “కానీ ఒకవేళ ఆ దాసుడు చెడ్డవాడై, ‘నా యజమాని ఆలస్యం చేస్తున్నాడు’ అని తన హృదయంలో అనుకొని,
49 తన తోటి దాసుల్ని కొడుతూ, తాగుబోతులతో కలిసి తింటూ, తాగుతూ ఉంటే,
50 ఆ దాసుడు ఎదురుచూడని రోజున, అతనికి తెలియని సమయంలో* యజమాని వచ్చి,
51 అతన్ని అతి కఠినంగా శిక్షిస్తాడు, వేషధారుల మధ్య అతన్ని ఉంచుతాడు. అక్కడే అతను ఏడుస్తూ, పళ్లు కొరుక్కుంటూ ఉంటాడు.
అధస్సూచీలు
^ పదకోశం చూడండి.
^ లేదా “యుగం.” పదకోశం చూడండి.
^ లేదా “సహించే.”
^ పదకోశం చూడండి.
^ అక్ష., “గోత్రాల.”
^ ఇది ఊదే పరికరం.
^ పదకోశం చూడండి.
^ అక్ష., “గంటలో.”
^ లేదా “తెలివిగల.”
^ అక్ష., “గంటలో.”