మత్తయి 27:1-66

  • యేసును పిలాతుకు అప్పగించడం  (1, 2)

  • యూదా ఉరి వేసుకోవడం  (3-10)

  • పిలాతు ముందు యేసు (11-26)

  • అందరిముందు ఎగతాళి చేయడం  (27-31)

  • గొల్గొతాలో కొయ్యకు దిగగొట్టడం  (32-44)

  • యేసు చనిపోవడం  (45-56)

  • యేసును సమాధి చేయడం  (57-61)

  • సమాధికి కట్టుదిట్టంగా కాపలా పెట్టడం  (62-66)

27  తెల్లవారినప్పుడు ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలు అందరూ కలుసుకొని యేసును చంపడం గురించి చర్చించుకున్నారు.  వాళ్లు ఆయన చేతులు కట్టేసి, తీసుకెళ్లి అధిపతైన పిలాతుకు అప్పగించారు.  యేసును అప్పగించిన యూదా, ఆయనకు మరణశిక్ష పడిందని తెలుసుకొని, తీవ్రమైన వేదనకు గురై, ఆ 30 వెండి నాణేలు తీసుకొచ్చి ముఖ్య యాజకులకు, పెద్దలకు తిరిగి ఇచ్చేస్తూ  “నేను ఒక నిర్దోషిని* అప్పగించి పాపం చేశాను” అన్నాడు. అందుకు వాళ్లు, “అయితే మాకేంటి? అది నీ సమస్య!” అన్నారు.  అప్పుడు అతను ఆ వెండి నాణేలను ఆలయంలోకి విసిరేసి, అక్కడి నుండి వెళ్లిపోయి, ఉరి వేసుకున్నాడు.  కానీ ముఖ్య యాజకులు ఆ వెండి నాణేలు తీసుకొని ఇలా అన్నారు: “వీటిని పవిత్రమైన కానుక పెట్టెలో వేయడం సరైనది కాదు. ఎందుకంటే ఇది రక్తపు సొమ్ము.”  వాళ్లు మాట్లాడుకున్న తర్వాత, పరాయి దేశస్థుల్ని పాతిపెట్టడానికి ఆ సొమ్ముతో కుమ్మరి పొలాన్ని కొన్నారు.  అందుకే ఈరోజు వరకు ఆ పొలానికి రక్తపు పొలం అనే పేరుంది.  అప్పుడు యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పబడిన ఈ మాటలు నెరవేరాయి: “ఆ మనిషి కోసం నిర్ణయించిన ఖరీదును, అంటే ఆయన కోసం కొందరు ఇశ్రాయేలీయులు నిర్ణయించిన ఖరీదైన ఆ 30 వెండి నాణేలను తీసుకొని, 10  వాటితో వాళ్లు యెహోవా* నాకు ఆజ్ఞాపించిన ప్రకారం కుమ్మరి పొలాన్ని కొన్నారు.” 11  యేసు ఇప్పుడు పిలాతు ముందు నిలబడ్డాడు. అతను యేసును, “నువ్వు యూదుల రాజువా?” అని అడిగాడు. అందుకు యేసు, “నువ్వే స్వయంగా ఆ మాట అంటున్నావు కదా” అన్నాడు. 12  అయితే ముఖ్య యాజకులు, పెద్దలు తన మీద నిందలు వేస్తున్నప్పుడు యేసు ఏమీ మాట్లాడలేదు. 13  అప్పుడు పిలాతు, “నీ మీద వాళ్లు ఎన్నెన్ని నిందలు వేస్తున్నారో నీకు వినబడట్లేదా?” అన్నాడు. 14  అప్పుడు కూడా యేసు ఒక్క మాటైనా మాట్లాడలేదు, దాంతో పిలాతు చాలా ఆశ్చర్యపోయాడు. 15  ప్రతీ సంవత్సరం ఆ పండుగ సమయంలో ప్రజలు కోరిన ఒక ఖైదీని అధిపతి విడుదల చేసేవాడు. 16  అదే సమయంలో బరబ్బ అనే పేరుమోసిన నేరస్తుడు చెరసాలలో ఉన్నాడు. 17  వాళ్లు ఒకచోట గుమికూడినప్పుడు పిలాతు వాళ్లను, “ఎవరిని విడుదల చేయమంటారు? బరబ్బనా? క్రీస్తు అని పిలువబడే యేసునా?” అని అడిగాడు. 18  ఎందుకంటే, వాళ్లు అసూయతోనే యేసును తనకు అప్పగించారని పిలాతుకు తెలుసు. 19  పైగా పిలాతు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య, “ఆ నీతిమంతుని విషయంలో జోక్యం చేసుకోకు. అతని వల్ల ఇవాళ నా కలలో నేను చాలా ఆందోళనపడ్డాను” అంటూ కబురు పంపించింది. 20  అయితే బరబ్బను విడుదల చేసి యేసుకు మరణశిక్ష విధించమని అడిగేలా ముఖ్య యాజకులు, పెద్దలు జనాల్ని ఉసిగొల్పారు. 21  అందుకు పిలాతు వాళ్లను, “ఈ ఇద్దరిలో ఎవరిని విడుదల చేయమంటారు?” అని అడిగాడు. వాళ్లు “బరబ్బాను విడుదల చేయి” అన్నారు. 22  అప్పుడు పిలాతు, “మరి క్రీస్తు అని పిలువబడే ఈ యేసును ఏమి చేయాలి?” అని అడిగాడు. వాళ్లందరూ, “అతనికి కొయ్యపై శిక్ష వేయండి!” అన్నారు. 23  అందుకు పిలాతు, “ఎందుకు? ఇతను ఏం తప్పు చేశాడు?” అని అడిగాడు. అయినా వాళ్లు మళ్లీ అదేపనిగా, “అతనికి కొయ్యపై శిక్ష వేయండి!” అని కేకలు వేశారు. 24  తన ప్రయత్నాల వల్ల ఏ మంచీ జరగకపోగా, జనాలు ఇంకా పెద్దపెద్దగా కేకలు వేస్తున్నారని చూసి పిలాతు నీళ్లు తీసుకొని వాళ్ల ముందు చేతులు కడుక్కుంటూ ఇలా అన్నాడు: “ఇతని రక్తం విషయంలో నేను నిర్దోషిని. దీనికి మీరే బాధ్యత వహించాలి.” 25  దానికి ప్రజలందరూ, “అతని రక్తం మా మీదికి, మా పిల్లల మీదికి రానివ్వు” అని జవాబిచ్చారు. 26  తర్వాత పిలాతు బరబ్బను విడుదల చేశాడు; కానీ యేసును కొరడాలతో కొట్టించి, కొయ్య మీద మరణశిక్ష వేయడానికి వాళ్లకు అప్పగించాడు. 27  తర్వాత, అధిపతి కింద ఉన్న సైనికులు యేసును ఆ అధిపతి ఇంట్లోకి తీసుకొచ్చి, సైనికులందర్నీ యేసు చుట్టూ నిలబెట్టారు. 28  తర్వాత వాళ్లు యేసు బట్టలు తీసేసి, ఎర్రని వస్త్రాన్ని ఆయనకు తొడిగారు. 29  వాళ్లు ఓ ముళ్ల కిరీటం అల్లి ఆయన తల మీద పెట్టారు. తర్వాత ఆయన కుడిచేతిలో ఓ కర్రను ఉంచి, ఆయన ముందు మోకాళ్లూని, “యూదుల రాజా, నమస్కారం!”* అంటూ ఎగతాళి చేశారు. 30  ఆయన మీద ఉమ్మి వేసి, ఆయన చేతిలో ఉన్న కర్ర తీసుకొని ఆయన తలమీద కొట్టడం మొదలుపెట్టారు. 31  చివరకు ఆయన్ని ఎగతాళి చేశాక, ఆయన ఒంటిమీదున్న ఎర్రని వస్త్రాన్ని తీసేసి, ఆయన పైవస్త్రాలు ఆయనకు వేసి, మేకులతో కొయ్యకు దిగగొట్టడానికి ఆయన్ని తీసుకెళ్లారు. 32  వాళ్లు బయటికి వెళ్తుండగా, కురేనేకు చెందిన సీమోను అనే ఒకతను వాళ్లకు కనిపించాడు. వాళ్లు యేసు హింసాకొయ్యను* మోయమని అతన్ని బలవంతపెట్టారు. 33  వాళ్లు గొల్గొతా అనే చోటుకు వచ్చారు. గొల్గొతా అంటే “కపాల స్థలం” అని అర్థం. 34  అక్కడ వాళ్లు ఆయనకు చేదు మొక్కలు కలిపిన ద్రాక్షారసాన్ని ఇచ్చారు; కానీ ఆయన దాన్ని రుచి చూశాక, దాన్ని తాగడానికి నిరాకరించాడు. 35  వాళ్లు ఆయన్ని మేకులతో కొయ్యకు దిగగొట్టాక, చీట్లు* వేసి ఆయన పైవస్త్రాల్ని పంచుకున్నారు. 36  తర్వాత వాళ్లు ఆయనకు కాపలా కాస్తూ అక్కడే కూర్చున్నారు. 37  అంతేకాదు, ఆయన మీద మోపిన నేరాన్ని అంటే “ఇతను యూదుల రాజైన యేసు” అనే మాటల్ని పలకమీద రాసి దాన్ని ఆయన తలకు పైన కొయ్యకు బిగించారు. 38  తర్వాత ఇద్దరు బందిపోటు దొంగల్ని యేసు పక్కన కొయ్యలకు వేలాడదీశారు. ఒకతన్ని యేసు కుడివైపున, ఇంకొకతన్ని యేసు ఎడమవైపున వేలాడదీశారు. 39  ఆ దారిలో వెళ్తున్నవాళ్లు తలలాడిస్తూ, ఆయన్ని దూషిస్తూ 40  ఇలా అన్నారు: “నువ్వు దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో కడతావా? నిన్ను నువ్వు రక్షించుకో! నువ్వు దేవుని కుమారుడివైతే హింసాకొయ్య* మీద నుండి దిగిరా!” 41  అలాగే ముఖ్య యాజకులు, శాస్త్రులు, పెద్దలు కూడా ఆయన్ని ఎగతాళి చేస్తూ ఇలా అన్నారు: 42  “ఇతను వేరేవాళ్లను రక్షించాడు; కానీ తనను తాను రక్షించుకోలేడు! ఇతను ఇశ్రాయేలు రాజైతే, ఇప్పుడు హింసాకొయ్య* మీద నుండి దిగి రమ్మనండి, అప్పుడు మేము నమ్ముతాం. 43  ఇతను దేవుని మీద నమ్మకం ఉంచాడు; ‘నేను దేవుని కుమారుణ్ణి’ అని చెప్పుకున్నాడు కదా, ఇతను దేవునికి ఇష్టమైన వ్యక్తయితే దేవుణ్ణే ఇతన్ని కాపాడనివ్వండి.” 44  యేసు పక్కన కొయ్యల మీద వేలాడుతున్న బందిపోటు దొంగలు కూడా ఆయన్ని నిందిస్తూ ఉన్నారు. 45  దాదాపు మధ్యాహ్నం 12 గంటల* నుండి మూడింటి* వరకు ఆ దేశమంతటా చీకటి కమ్ముకుంది. 46  దాదాపు మూడింటికి యేసు బిగ్గరగా “ఏలీ, ఏలీ, లామా సబక్తానీ?” అని అన్నాడు. ఆ మాటలకు “నా దేవా, నా దేవా, నన్నెందుకు వదిలేశావు?” అని అర్థం. 47  అక్కడ నిలబడి ఉన్నవాళ్లలో కొందరు అది విని, “ఇతను ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు. 48  వెంటనే వాళ్లలో ఒకరు పరుగెత్తుకెళ్లి, ఒక స్పాంజీని తీసుకొని పుల్లటి ద్రాక్షారసంలో ముంచి, ఆ స్పాంజీని ఒక కర్రకు తగిలించి తాగడానికి ఆయనకు ఇచ్చారు. 49  కానీ మిగతావాళ్లు ఇలా అన్నారు: “ఉండండి! అతన్ని రక్షించడానికి ఏలీయా వస్తాడేమో చూద్దాం.” 50  యేసు మళ్లీ బిగ్గరగా అరిచి, చనిపోయాడు. 51  అప్పుడు ఇదిగో! దేవాలయంలోని తెర* పైనుండి కింది వరకు రెండుగా చిరిగిపోయింది, భూమి కంపించింది, బండలు పగిలిపోయాయి. 52  సమాధులు* తెరుచుకొని, మరణంలో నిద్రపోయిన చాలామంది పవిత్రుల శవాలు బయటపడడంతో, 53  వాటిని ఎంతోమంది చూశారు. (యేసు పునరుత్థానం చేయబడ్డాక, సమాధుల దగ్గర నుండి వస్తున్నవాళ్లు పవిత్ర నగరంలోకి అడుగుపెట్టారు.) 54  అయితే, అక్కడ ఉన్న సైనికాధికారి, అలాగే యేసును కాపలా కాస్తున్నవాళ్లు భూకంపాన్ని, జరుగుతున్న సంఘటనల్ని చూసి, చాలా భయపడిపోయి ఇలా అన్నారు: “ఖచ్చితంగా ఈయన దేవుని కుమారుడే.” 55  యేసుకు సేవలు చేయడానికి గలిలయ నుండి ఆయనతో పాటు వచ్చిన చాలామంది స్త్రీలు కాస్త దూరంలో నిలబడి చూస్తున్నారు. 56  వాళ్లలో మగ్దలేనే మరియ; యాకోబు, యోసే అనేవాళ్ల తల్లి మరియ; జెబెదయి కొడుకుల తల్లి ఉన్నారు. 57  సాయంకాలం కావస్తోంది కాబట్టి, అరిమతయియ నగరంవాడైన యోసేపు అనే ధనవంతుడు అక్కడికి వచ్చాడు. అతను కూడా యేసు శిష్యుడే. 58  అతను పిలాతు దగ్గరికి వెళ్లి, యేసును సమాధి చేయడానికి అనుమతి ఇవ్వమని అడిగాడు. అప్పుడు పిలాతు దాన్ని అతనికి ఇవ్వమని ఆజ్ఞాపించాడు. 59  యోసేపు ఆయన శరీరాన్ని తీసుకొని, శుభ్రమైన-నాణ్యమైన నారవస్త్రంలో చుట్టి, 60  తాను రాతిలో తొలిపించిన కొత్త సమాధిలో* పెట్టాడు. తర్వాత ఆ సమాధి* ద్వారానికి అడ్డుగా పెద్ద రాయిని దొర్లించి, అక్కడి నుండి వెళ్లిపోయాడు. 61  కానీ మగ్దలేనే మరియ, ఇంకో మరియ అక్కడే సమాధి దగ్గర కూర్చుండిపోయారు. 62  మరుసటి రోజున అంటే విశ్రాంతి రోజున* ముఖ్య యాజకులు, పరిసయ్యులు పిలాతు ముందు సమావేశమై 63  ఇలా అన్నారు: “అయ్యా, ఆ మోసగాడు బ్రతికి ఉన్నప్పుడు, ‘నేను మూడు రోజుల తర్వాత మళ్లీ బ్రతికించబడతాను’ అని అన్నట్టు గుర్తు. 64  కాబట్టి మూడో రోజు వరకు సమాధికి కాపలా ఉంచమని ఆజ్ఞాపించు. లేదంటే అతని శిష్యులు వచ్చి దొంగతనంగా అతన్ని తీసుకెళ్లిపోయి, ‘ఆయన మృతుల్లో నుండి బ్రతికించబడ్డాడు!’ అని ప్రజలకు చెప్తారు. అప్పుడు మొదటి మోసం కన్నా చివరి మోసం ఘోరంగా ఉంటుంది.” 65  అందుకు పిలాతు వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు భటుల్ని తీసుకెళ్లి, మీకు వీలైనంత కట్టుదిట్టంగా ఆ సమాధికి కాపలా పెట్టుకోండి.” 66  అప్పుడు వాళ్లు వెళ్లి, సమాధికి ఉన్న రాయిని గట్టిగా మూసేసి,* భటుల్ని కాపలా పెట్టారు.

అధస్సూచీలు

అక్ష., “నిర్దోషి రక్తాన్ని.”
పదకోశం చూడండి.
లేదా “జయం!”
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
అక్ష., “ఆరో గంట.”
అక్ష., “తొమ్మిదో గంట.”
ఇది పవిత్ర స్థలాన్ని, అతి పవిత్ర స్థలాన్ని వేరుచేసే తెర.
లేదా “స్మారక సమాధులు.”
లేదా “స్మారక సమాధిలో.”
లేదా “స్మారక సమాధి.”
అక్ష., “సిద్ధపడే రోజు తర్వాతి రోజున.”
అక్ష., “రాయికి ముద్రవేసి.”