మత్తయి 3:1-17

  • బాప్తిస్మమిచ్చే యోహాను ప్రకటించడం  (1-12)

  • యేసు బాప్తిస్మం  (13-17)

3  ఆ రోజుల్లో, బాప్తిస్మమిచ్చే యోహాను యూదయ అరణ్యానికి* వచ్చి ప్రకటిస్తున్నాడు;  అతను ఇలా చెప్తున్నాడు: “పరలోక రాజ్యం దగ్గరపడింది కాబట్టి పశ్చాత్తాపపడండి.”  నిజానికి, “‘యెహోవా* మార్గాన్ని సిద్ధం చేయండి! ఆయన దారుల్ని ఖాళీగా ఉంచండి’ అని అరణ్యంలో ఒక స్వరం పిలుస్తోంది” అని యెషయా ప్రవక్త చెప్పింది ఇతని గురించే.  యోహాను ఒంటె వెంట్రుకలతో నేసిన వస్త్రాన్ని వేసుకునేవాడు, నడుముకు తోలుదట్టి కట్టుకునేవాడు. అతను మిడతల్ని, అడవి తేనెను తినేవాడు.  యెరూషలేము నుండి, యూదయ అంతటి నుండి, అలాగే యొర్దాను చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటి నుండి ప్రజలు అతని దగ్గరికి వెళ్తూ ఉన్నారు.  వాళ్లు తమ పాపాల్ని అందరిముందు ఒప్పుకుంటూ, యొర్దాను నదిలో అతని దగ్గర బాప్తిస్మం తీసుకున్నారు.*  బాప్తిస్మమిచ్చే స్థలం దగ్గరికి చాలామంది పరిసయ్యులు, సద్దూకయ్యులు రావడం చూసి అతను వాళ్లతో ఇలా అన్నాడు: “సర్పసంతానమా, దేవుని ఆగ్రహాన్ని మీరు తప్పించుకోగలరని మీకు ఎవరు చెప్పారు?  కాబట్టి ముందు మీరు పశ్చాత్తాపపడ్డారని చూపించే పనులు చేయండి.  ‘అబ్రాహాము మాకు తండ్రిగా ఉన్నాడు’ అని అనుకోకండి. ఎందుకంటే నేను మీతో చెప్తున్నాను, దేవుడు ఈ రాళ్ల నుండి అబ్రాహాముకు పిల్లల్ని పుట్టించగలడు. 10  చెట్లను వేళ్ల దగ్గర నుండి నరకడానికి గొడ్డలి సిద్ధంగా ఉంది. కాబట్టి మంచి ఫలాలు ఫలించని ప్రతీ చెట్టు నరకబడి, అగ్నిలో వేయబడుతుంది. 11  నేనైతే మీ పశ్చాత్తాపాన్ని బట్టి మీకు నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను. కానీ నా తర్వాత వస్తున్న వ్యక్తి నాకన్నా బలవంతుడు; ఆయన చెప్పుల తాడు విప్పే అర్హత కూడా నాకు లేదు. ఆయన మీకు పవిత్రశక్తితో, అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు. 12  తూర్పారబట్టే పార ఆయన చేతిలో ఉంది, ఆయన తన కళ్లాన్ని పూర్తిగా శుభ్రం చేసి, తన గోధుమల్ని గిడ్డంగిలో* సమకూరుస్తాడు. అయితే పొట్టును మాత్రం ఆరని మంటల్లో కాల్చేస్తాడు.” 13  అప్పుడు యేసు, యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకోవడానికి గలిలయ నుండి యొర్దానుకు వచ్చాడు. 14  అయితే యోహాను యేసును ఆపడానికి ప్రయత్నిస్తూ ఇలా అన్నాడు: “నేను నీ దగ్గర బాప్తిస్మం తీసుకోవాల్సిన వాణ్ణి, కానీ నువ్వు నా దగ్గర బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చావా?” 15  అప్పుడు యేసు అతనితో ఇలా అన్నాడు: “ఇప్పటికి ఇలా కానివ్వు, మనం ఈ విధంగా దేవుడు కోరే వాటన్నిటినీ చేయడం మనకు సరైనది.” దాంతో యోహాను ఆయనకు అడ్డు చెప్పలేదు. 16  యేసు బాప్తిస్మం తీసుకున్న వెంటనే నీళ్లలో నుండి బయటికి వచ్చాడు; అప్పుడు ఇదిగో! ఆకాశం తెరుచుకుంది. దేవుని పవిత్రశక్తి పావురం రూపంలో ఆయన మీదకు దిగిరావడం యోహాను చూశాడు. 17  అంతేకాదు, ఇదిగో! ఆకాశం నుండి ఒక స్వరం ఇలా చెప్పింది: “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను.”*

అధస్సూచీలు

లేదా “ఎడారికి.” పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
లేదా “అతని చేత నీళ్లలో ముంచబడ్డారు.”
లేదా “గోదాంలో.”
అక్ష., “ఈయన్ని నేను ఆమోదించాను.”