మత్తయి 5:1-48

  • కొండమీది ప్రసంగం  (1-48)

    • యేసు కొండమీద బోధించడం మొదలుపెట్టాడు (1, 2)

    • తొమ్మిది సంతోషాలు (3-12)

    • ఉప్పు, వెలుగు (13-16)

    • ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి యేసు వచ్చాడు (17-20)

    • కోపం  (21-26), వ్యభిచారం  (27-30), విడాకులు  (31, 32), ఒట్టు వేయడం  (33-37), ప్రతీకారం  (38-42), శత్రువుల్ని ప్రేమించడం గురించి సలహా  (43-48)

5  యేసు ఆ ప్రజల్ని చూసినప్పుడు ఒక కొండ మీదకు వెళ్లి కూర్చున్నాడు; ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు.  అప్పుడు యేసు వాళ్లకు ఇలా బోధించడం మొదలుపెట్టాడు:  “దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు* సంతోషంగా ఉంటారు, ఎందుకంటే పరలోక రాజ్యం వాళ్లది.  “దుఃఖించేవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లు ఓదార్చబడతారు.  “సౌమ్యంగా* ఉండేవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లు భూమికి వారసులౌతారు.  “నీతిని బలంగా కోరుకునేవాళ్లు* సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లు తృప్తిపర్చబడతారు.  “కరుణ చూపించేవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లమీద ఇతరులు కరుణ చూపిస్తారు.  “స్వచ్ఛమైన హృదయం గలవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లు దేవుణ్ణి చూస్తారు.  “శాంతిని నెలకొల్పేవాళ్లు* సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లు దేవుని పిల్లలు* అనబడతారు. 10  “నీతి కోసం హింసించబడేవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే పరలోక రాజ్యం వాళ్లది. 11  “మీరు నా శిష్యులనే కారణంతో ప్రజలు మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు, మీ గురించి అబద్ధాలు చెప్తూ మీకు వ్యతిరేకంగా అన్నిరకాల చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. 12  పరలోకంలో మీకోసం గొప్ప బహుమానం వేచివుంది కాబట్టి సంతోషించండి, ఎంతో ఆనందించండి; ఎందుకంటే వాళ్లు అంతకుముందు ప్రవక్తలను కూడా ఇలాగే హింసించారు. 13  “మీరు లోకానికి ఉప్పులాంటి వాళ్లు, కానీ ఉప్పు దాని సారాన్ని కోల్పోతే దానికి మళ్లీ ఉప్పదనం ఎలా వస్తుంది? అది మనుషుల కాళ్లకింద తొక్కబడేలా బయట పారవేయడానికి తప్ప ఇక దేనికీ పనికిరాదు. 14  “మీరు లోకానికి వెలుగులాంటి వాళ్లు. కొండమీద ఉన్న నగరం అందరికీ ఖచ్చితంగా కనిపిస్తుంది. 15  ప్రజలు దీపాన్ని వెలిగించి గంప* కింద పెట్టరు గానీ దీపస్తంభం మీద పెడతారు, అప్పుడు అది ఇంట్లో ఉన్న వాళ్లందరికీ వెలుగు ఇస్తుంది. 16  అలాగే, మనుషుల ముందు మీ వెలుగు ప్రకాశింపనివ్వండి, అప్పుడు వాళ్లు మీ మంచిపనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని మహిమపరుస్తారు. 17  “నేను ధర్మశాస్త్రాన్ని గానీ, ప్రవక్తల మాటల్ని గానీ రద్దు చేయడానికి వచ్చానని అనుకోకండి. నేను వాటిని రద్దు చేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను. 18  నేను నిజంగా మీతో చెప్తున్నాను. ఒకవేళ ఆకాశం, భూమి నాశనమైనా, ధర్మశాస్త్రమంతా పూర్తిగా నెరవేరేవరకు దానిలోని ఒక చిన్న అక్షరంగానీ, పొల్లుగానీ తప్పిపోదు. 19  కాబట్టి, ఎవరైనా దీనిలోని అల్పమైన ఆజ్ఞల్లో ఒకదాన్ని మీరి, అలా చేయమని ఇతరులకు బోధిస్తే ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో తక్కువవాడిగా ఎంచబడతాడు. అయితే ఎవరైనా ఈ ఆజ్ఞలు పాటిస్తూ, వాటిని ఇతరులకు బోధిస్తే ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఎంచబడతాడు. 20  మీరు శాస్త్రుల కన్నా, పరిసయ్యుల కన్నా ఎక్కువ నీతిమంతులుగా ఉండకపోతే, మీరు పరలోక రాజ్యంలోకి అస్సలు ప్రవేశించరని నేను మీతో చెప్తున్నాను. 21  “‘మీరు హత్య చేయకూడదు, ఎవరైనా హత్య చేస్తే అతను న్యాయస్థానం ముందు హాజరు అవ్వాల్సి ఉంటుంది’ అని పూర్వీకులకు చెప్పబడిందని మీరు విన్నారు కదా. 22  అయితే నేను మీతో చెప్తున్నాను, ఎవరైనా తన సోదరుని మీద కోపాన్ని ఉంచుకుంటే అతను న్యాయస్థానం ముందు హాజరు అవ్వాల్సి ఉంటుంది; ఎవరైనా తన సోదరుణ్ణి ఘోరంగా అవమానిస్తూ మాట్లాడితే అతను అత్యున్నత న్యాయస్థానం ముందు హాజరు అవ్వాల్సి ఉంటుంది; అయితే, ‘పనికిమాలిన మూర్ఖుడా’ అని తిట్టేవాడు మండే గెహెన్నాలో* పడవేయబడే ప్రమాదం ఉంది. 23  “కాబట్టి, నువ్వు బలిపీఠం దగ్గరకు నీ అర్పణను తెస్తున్నప్పుడు, నీ సోదరుడు నీవల్ల నొచ్చుకున్నాడని అక్కడ నీకు గుర్తొస్తే, 24  బలిపీఠం ఎదుటే నీ అర్పణను విడిచిపెట్టి వెళ్లి, ముందు నీ సోదరునితో సఖ్యత కుదుర్చుకో;* తర్వాత తిరిగొచ్చి నీ అర్పణను అర్పించు. 25  “నువ్వు నీ ప్రతివాదితో న్యాయస్థానానికి వెళ్లే దారిలోనే, త్వరగా అతనితో రాజీపడు. లేకపోతే అతను నిన్ను న్యాయమూర్తికి అప్పగిస్తాడు, న్యాయమూర్తి భటుడికి అప్పగిస్తాడు; అప్పుడు నువ్వు చెరసాలలో వేయబడతావు. 26  నువ్వు చివరి కాసు* చెల్లించేంత వరకు నువ్వు అక్కడి నుండి బయటికి రానేరావని నేను నిజంగా నీతో చెప్తున్నాను. 27  “‘మీరు వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పబడిందని మీరు విన్నారు కదా. 28  కానీ నేను మీతో చెప్తున్నాను, ఒక స్త్రీ మీద మోహంతో అదేపనిగా ఆమెను చూస్తుండేవాడు తన హృదయంలో అప్పటికే ఆమెతో వ్యభిచారం చేశాడు. 29  కాబట్టి నీ కుడి కన్ను నువ్వు పాపం చేయడానికి కారణమౌతుంటే,* దాన్ని పీకేసి నీ నుండి దూరంగా పడేయి. నీ శరీరం మొత్తం గెహెన్నాలో* పడవేయబడడం కన్నా నీ అవయవాల్లో ఒకదాన్ని పోగొట్టుకోవడం నీకు మేలు. 30  అలాగే, నీ కుడి చేయి నువ్వు పాపం చేయడానికి కారణమౌతుంటే,* దాన్ని నరికేసి నీ నుండి దూరంగా పడేయి. నీ శరీరం మొత్తం గెహెన్నాలో* పడవేయబడడం కన్నా నీ అవయవాల్లో ఒకదాన్ని పోగొట్టుకోవడం నీకు మేలు. 31  “అంతేకాదు, ‘తన భార్యకు విడాకులు ఇచ్చే ప్రతీ వ్యక్తి, ఆమెకు విడాకుల పత్రం ఇవ్వాలి’ అని చెప్పబడింది కదా. 32  అయితే నేను మీతో చెప్తున్నాను, లైంగిక పాపాలు* అనే కారణాన్ని బట్టి కాకుండా తన భార్యకు విడాకులు ఇచ్చే ప్రతీ వ్యక్తి, వ్యభిచారం చేసే ప్రమాదంలోకి ఆమెను నెడుతున్నాడు. ఈ విధంగా విడాకులు ఇవ్వబడిన స్త్రీని పెళ్లి చేసుకునే ఏ వ్యక్తయినా వ్యభిచారం చేస్తున్నాడు. 33  “అంతేకాదు, ‘మీరు ఒట్టు పెట్టుకుని దాన్ని తప్పకూడదు, కానీ మీరు యెహోవాకు* చేసుకున్న మొక్కుబళ్లను చెల్లించాలి’ అని పూర్వీకులతో చెప్పబడిందని మీరు విన్నారు కదా. 34  అయితే నేను మీతో చెప్తున్నాను, అసలు ఒట్టే వేయవద్దు; పరలోకం తోడు అని ఒట్టు వేయవద్దు, ఎందుకంటే అది దేవుని సింహాసనం; 35  అలాగే, భూమి తోడు అని ఒట్టు వేయవద్దు, ఎందుకంటే అది ఆయన పాదపీఠం; యెరూషలేము తోడు అని ఒట్టు వేయవద్దు, ఎందుకంటే అది మహారాజు నగరం. 36  మీ ప్రాణం తోడు* అని ఒట్టుపెట్టుకోవద్దు, ఎందుకంటే మీరు ఒక్క వెంట్రుకను కూడా తెల్లగానైనా నల్లగానైనా చేయలేరు. 37  మీ మాట “అవును” అంటే అవును, “కాదు” అంటే కాదు అన్నట్టే ఉండాలి. ఇవి కాకుండా మరేదైనా దుష్టుని నుండి వచ్చేదే. 38  “‘కంటికి కన్ను, పంటికి పన్ను’ అని చెప్పబడిందని మీరు విన్నారు కదా. 39  అయితే నేను మీతో చెప్తున్నాను, దుష్టుడైన వ్యక్తిని ఎదిరించకండి; కానీ మిమ్మల్ని కుడి చెంప మీద కొట్టే వ్యక్తికి ఎడమ చెంప కూడా చూపించండి. 40  ఎవరైనా మిమ్మల్ని న్యాయస్థానానికి తీసుకెళ్లి, మీ లోపలి వస్త్రాన్ని తీసుకోవాలని అనుకుంటుంటే అతనికి మీ పైవస్త్రాన్ని కూడా ఇచ్చేయండి. 41  అధికారంలో ఉన్న ఒకతను ఒక మైలు* రమ్మని మిమ్మల్ని బలవంతం చేస్తే అతనితో పాటు రెండు మైళ్లు వెళ్లండి. 42  ఒక వ్యక్తి మిమ్మల్ని ఏదైనా అడిగితే ఇవ్వండి, మిమ్మల్ని అప్పు అడగాలనుకునే* వాళ్లనుండి మీ ముఖం తిప్పుకోకండి. 43  “‘నువ్వు నీ సాటిమనిషిని ప్రేమించాలి, నీ శత్రువును ద్వేషించాలి’ అని చెప్పబడిందని మీరు విన్నారు కదా. 44  అయితే నేను మీతో చెప్తున్నాను, మీ శత్రువుల్ని ప్రేమిస్తూ ఉండండి, మిమ్మల్ని హింసించేవాళ్ల కోసం ప్రార్థిస్తూ ఉండండి, 45  అప్పుడు మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి పిల్లలుగా* ఉంటారు. ఎందుకంటే ఆయన అందరి మీద అంటే దుష్టుల మీద, మంచివాళ్ల మీద తన సూర్యుణ్ణి ఉదయింపజేస్తున్నాడు; నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు. 46  మిమ్మల్ని ప్రేమిస్తున్నవాళ్లనే మీరు ప్రేమిస్తే మీకేం ప్రతిఫలం దొరుకుతుంది? సుంకరులు కూడా అలాగే చేస్తున్నారు కదా? 47  మీరు మీ సోదరులకు మాత్రమే నమస్కారం చేస్తే, మీరేం గొప్ప పని చేస్తున్నారు? అన్యజనులు కూడా అలాగే చేస్తున్నారు కదా? 48  మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు* కాబట్టి మీరు కూడా ఆయనలా పరిపూర్ణులు అవ్వాలి.

అధస్సూచీలు

లేదా “పవిత్రశక్తి కోసం యాచించేవాళ్లు.”
లేదా “వినయంగా.”
లేదా “నీతి కోసం ఆకలిదప్పులు గలవాళ్లు.”
లేదా “శాంత స్వభావం గలవాళ్లు.”
అక్ష., “కొడుకులు.”
లేదా “కుంచం.”
యెరూషలేము బయట వ్యర్థ పదార్థాలను కాల్చేసే స్థలం. పదకోశం చూడండి.
లేదా “సమాధానపడు.”
అక్ష., “చివరి క్వాడ్రన్స్‌.” అంటే దేనారంలో 64వ భాగం. పదకోశంలో “దేనారం” చూడండి.
అక్ష., “నిన్ను తడబడేలా చేస్తుంటే.”
పదకోశం చూడండి.
అక్ష., “నిన్ను తడబడేలా చేస్తుంటే.”
పదకోశం చూడండి.
గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
అక్ష., “తల తోడు.”
పదకోశం చూడండి.
అంటే, వడ్డీ లేకుండా అప్పు అడిగే.
అక్ష., “కొడుకులుగా.”
లేదా “సంపూర్ణుడు.”