మత్తయి 6:1-34

  • కొండమీది ప్రసంగం  (1-34)

    • వేరేవాళ్లకు కనిపించేలా నీతికార్యాలు చేయొద్దు (1-4)

    • ఎలా ప్రార్థించాలి  (5-15)

      • మాదిరి ప్రార్థన  (9-13)

    • ఉపవాసం  (16-18)

    • భూమ్మీద, పరలోకంలో సంపదలు (19-24)

    • ఆందోళనపడడం మానేయండి  (25-34)

      • రాజ్యానికి మొదటిస్థానం ఇస్తూ ఉండండి  (33)

6  “మనుషులకు కనిపించాలని వాళ్ల ముందు మీ నీతికార్యాలు చేయకుండా జాగ్రత్తపడండి; లేకపోతే పరలోకంలో ఉన్న మీ తండ్రి నుండి మీకు ఏ ప్రతిఫలమూ దక్కదు.  కాబట్టి నువ్వు దానధర్మాలు* చేస్తున్నప్పుడు నీ ముందు బాకా ఊదించుకోవద్దు, వేషధారులు మనుషులచేత మహిమ పొందడం కోసం సభామందిరాల్లో, వీధుల్లో అలా చేస్తుంటారు. వాళ్లు తమ ప్రతిఫలాన్ని పూర్తిగా పొందారని నేను నిజంగా మీతో చెప్తున్నాను.  కానీ నువ్వు మాత్రం దానధర్మాలు చేస్తున్నప్పుడు, నీ కుడిచేయి చేసేది నీ ఎడమచేతికి తెలియనివ్వకు.  అలా చేస్తే నీ దానధర్మాలు రహస్యంగా ఉంటాయి. అప్పుడు రహస్యంగా చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు.  “అంతేకాదు, మీరు ప్రార్థించేటప్పుడు వేషధారుల్లా ప్రవర్తించకండి; మనుషులకు కనిపించేలా సభామందిరాల్లో, ప్రధాన వీధుల మూలల్లో నిలబడి ప్రార్థన చేయడం వాళ్లకు ఇష్టం. వాళ్లు తమ ప్రతిఫలాన్ని పూర్తిగా పొందారని నేను నిజంగా మీతో చెప్తున్నాను.  అయితే నువ్వు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు, ఇంట్లో నీ గదిలోకి వెళ్లి, తలుపులు వేసుకుని, ఎవ్వరూ చూడలేని* నీ తండ్రికి ప్రార్థించు. అప్పుడు రహస్యంగా చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు.  నువ్వు ప్రార్థించేటప్పుడు, అన్యజనుల్లా చెప్పిన మాటల్నే మళ్లీమళ్లీ చెప్పకు; ఎక్కువ మాటలు ఉపయోగిస్తే దేవుడు తమ ప్రార్థన వింటాడని వాళ్లు అనుకుంటారు.  కాబట్టి మీరు వాళ్లలా ఉండకండి; ఎందుకంటే మీరు అడగకముందే మీకేమి అవసరమో మీ తండ్రికి తెలుసు.  “కాబట్టి మీరు ఈ విధంగా ప్రార్థించాలి: “‘పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు పవిత్రపర్చబడాలి.* 10  నీ రాజ్యం రావాలి. నీ ఇష్టం పరలోకంలో నెరవేరుతున్నట్టు భూమ్మీద కూడా నెరవేరాలి. 11  మాకు ఈ రోజుకు అవసరమైన ఆహారం ఇవ్వు; 12  మాకు అప్పుపడిన* వాళ్లను మేము క్షమించినట్టే, మా అప్పులు* కూడా క్షమించు. 13  మమ్మల్ని ప్రలోభాలకు లొంగిపోనివ్వకు, కానీ దుష్టుని నుండి మమ్మల్ని కాపాడు.’ 14  “మనుషులు మీ విషయంలో చేసిన పాపాల్ని మీరు క్షమిస్తే, మీ పరలోక తండ్రి కూడా మిమ్మల్ని క్షమిస్తాడు; 15  మనుషులు మీ విషయంలో చేసిన పాపాల్ని మీరు క్షమించకపోతే, మీ పరలోక తండ్రి కూడా మీ పాపాల్ని క్షమించడు. 16  “మీరు ఉపవాసం ఉంటున్నప్పుడు, వేషధారుల్లా బాధగా ముఖం పెట్టకండి;* తాము ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడాలని వాళ్లు తమ ముఖాన్ని వికారంగా పెట్టుకుంటారు.* వాళ్లు తమ ప్రతిఫలాన్ని పూర్తిగా పొందారని నేను నిజంగా మీతో చెప్తున్నాను. 17  అయితే నువ్వు ఉపవాసం ఉంటున్నప్పుడు నీ తలకు నూనె రాసుకో, నీ ముఖం కడుక్కో. 18  అలా చేస్తే నువ్వు ఉపవాసం ఉంటున్నట్టు మనుషులకు కాదుగానీ, ఎవరూ చూడలేని* నీ తండ్రికి మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు రహస్యంగా చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. 19  “భూమ్మీద నీ కోసం సంపదలు కూడబెట్టుకోవడం ఆపు; ఇక్కడ చిమ్మెట, తుప్పు వాటిని తినేస్తాయి; దొంగలు చొరబడి దొంగతనం చేస్తారు. 20  దానికి బదులు, పరలోకంలో నీ కోసం సంపదలు కూడబెట్టుకో; అక్కడ చిమ్మెటగానీ, తుప్పుగానీ వాటిని తినవు; దొంగలు చొరబడి దొంగతనం చేయరు. 21  ఎందుకంటే నీ సంపద ఎక్కడ ఉంటే నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. 22  “శరీరానికి దీపం కన్నే కాబట్టి, నీ కన్ను ఒకే దానిపై దృష్టి నిలిపితే* నీ శరీరమంతా ప్రకాశవంతంగా* ఉంటుంది. 23  అయితే నీ కన్ను అసూయతో నిండిపోతే* నీ శరీరమంతా చీకటిగా ఉంటుంది. నీలోని వెలుగు చీకటిగా మారితే, నీ శరీరం ఎంత చీకటిమయం అవుతుందో! 24  “ఏ వ్యక్తీ ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు. అతను ఒక యజమానిని ద్వేషించి ఇంకో యజమానిని ప్రేమిస్తాడు, లేదా ఒక యజమానికి నమ్మకంగా ఉండి ఇంకో యజమానిని చిన్నచూపు చూస్తాడు. మీరు ఒకే సమయంలో దేవునికీ డబ్బుకూ దాసులుగా ఉండలేరు. 25  “అందుకే నేను మీతో చెప్తున్నాను. ఏమి తినాలా, ఏమి తాగాలా అని మీ ప్రాణం గురించి గానీ, ఏమి ధరించాలా అని మీ శరీరం గురించి గానీ ఆందోళన పడడం మానేయండి. ఆహారంకన్నా ప్రాణం, బట్టలకన్నా శరీరం గొప్పవి కావా? 26  ఆకాశంలో పక్షుల్ని బాగా గమనించండి; అవి విత్తవు, కోయవు, గోదాముల్లో సమకూర్చుకోవు, అయినా మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికన్నా విలువైనవాళ్లు కారా? 27  మీలో ఎవరైనా ఆందోళన పడడం వల్ల మీ ఆయుష్షును కాస్తయినా* పెంచుకోగలరా? 28  అంతేకాదు, బట్టల గురించి మీరు ఎందుకు ఆందోళన పడుతున్నారు? అడవి పూలు ఎలా పెరుగుతాయో జాగ్రత్తగా గమనించండి; అవి కష్టపడవు, వడకవు; 29  కానీ నేను మీతో చెప్తున్నాను, తన పూర్తి వైభవంతో అలంకరించుకున్న సొలొమోను కూడా ఈ పూలలో ఒకదానంత అందంగా అలంకరించబడలేదు. 30  ఇవాళ ఉండి రేపు పొయ్యిలో వేయబడే గడ్డిమొక్కలనే దేవుడు అలా అలంకరిస్తున్నాడంటే, అల్పవిశ్వాసులారా ఆయన మీకు తప్పకుండా బట్టలు ఇస్తాడు కదా? 31  కాబట్టి ఎప్పుడూ ఆందోళన పడకండి; ‘ఏమి తినాలి?’ ‘ఏమి తాగాలి?’ ‘ఏమి వేసుకోవాలి?’ అనకండి. 32  అన్యజనులు వీటి వెనకే ఆత్రంగా పరుగెత్తుతున్నారు. ఇవన్నీ మీకు అవసరమని మీ పరలోక తండ్రికి తెలుసు. 33  “కాబట్టి మీరు ఆయన రాజ్యానికి, నీతికి మొదటిస్థానం ఇస్తూ ఉండండి; అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు ఇస్తాడు. 34  అందుకే రేపటి గురించి ఎప్పుడూ ఆందోళన పడకండి, ఎందుకంటే రేపుండే ఆందోళనలు రేపు ఉంటాయి. ఈరోజు ఉన్న సమస్యల గురించి మాత్రమే ఆలోచించండి.

అధస్సూచీలు

లేదా “పేదవాళ్లకు ధర్మాలు.” పదకోశం చూడండి.
లేదా “రహస్యంలో ఉన్న.”
లేదా “పవిత్రంగా ఎంచబడాలి; పవిత్రంగా చూడబడాలి.”
లేదా “మా విషయంలో పాపం చేసిన.”
లేదా “మా పాపాలు.”
లేదా “ముఖం పెట్టడం మానేయండి.”
లేదా “తాము చూడ్డానికి ఎలా ఉన్నారో పట్టించుకోరు.”
లేదా “రహస్యంలో ఉన్న.”
లేదా “నీ కన్ను స్పష్టంగా ఉంటే.” అక్ష., “సరళంగా ఉంటే.”
లేదా “వెలుగుమయంగా.”
అంటే, చాలా విషయాల కోసం చూస్తుంటే. అక్ష., “చెడ్డదైతే, దుష్టమైనదైతే.”
అక్ష., “ఒక మూరైనా.”