మత్తయి 7:1-29
7 “తీర్పు తీర్చడం ఆపేయండి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు;
2 ఎందుకంటే ఇతరులకు మీరు ఏ విధంగా తీర్పు తీరుస్తారో, మీకు కూడా ఆ విధంగానే తీర్పు తీర్చబడుతుంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో, వాళ్లూ మీకు అదే కొలతతో కొలుస్తారు.
3 మరైతే నీ కంట్లో ఉన్న దూలాన్ని గమనించుకోకుండా నీ సోదరుని కంట్లో ఉన్న నలుసును ఎందుకు చూస్తున్నావు?
4 లేదా నీ కంట్లోనే దూలాన్ని పెట్టుకుని, నీ సోదరునితో, ‘నీ కంట్లో ఉన్న నలుసును నన్ను తీయనివ్వు’ అని ఎలా అంటావు?
5 వేషధారీ! ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకో, అప్పుడు నీ సోదరుని కంట్లో ఉన్న నలుసును ఎలా తీసేయాలో నీకు స్పష్టంగా కనిపిస్తుంది.
6 “పవిత్రమైన వాటిని కుక్కలకు పెట్టకండి లేదా మీ ముత్యాలను పందుల ముందు పడేయకండి; మీరు అలా చేస్తే వాటిని అవి కాళ్లతో తొక్కేసి, మీ వైపు తిరిగి మిమ్మల్ని చీల్చేస్తాయి.
7 “అడుగుతూ ఉండండి, మీకు ఇవ్వబడుతుంది; వెతుకుతూ ఉండండి, మీకు దొరుకుతుంది; తడుతూ ఉండండి, మీ కోసం తెరవబడుతుంది;
8 ఎందుకంటే అడిగే ప్రతీ వ్యక్తి పొందుతాడు, వెతికే ప్రతీ వ్యక్తికి దొరుకుతుంది, తట్టే ప్రతీ వ్యక్తి కోసం తెరవబడుతుంది.
9 మీలో ఎవరైనా, మీ కొడుకు రొట్టె కావాలని అడిగితే రాయిని ఇస్తారా?
10 లేదా చేప కావాలని అడిగితే పామును ఇవ్వరు కదా?
11 మీరు చెడ్డవాళ్లయినా మీ పిల్లలకు మంచి బహుమతులు ఎలా ఇవ్వాలో మీకు తెలుసు, అలాంటిది పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగేవాళ్లకు ఇంకెంతగా మంచి బహుమతుల్ని ఇస్తాడో కదా!
12 “కాబట్టి ఇతరులు మీతో ఎలా వ్యవహరించాలని మీరు కోరుకుంటారో మీరూ వాళ్లతో అలాగే వ్యవహరించాలి. నిజానికి ధర్మశాస్త్రం, ప్రవక్తలు బోధించేది ఇదే.
13 “ఇరుకు ద్వారం గుండా వెళ్లండి; ఎందుకంటే నాశనానికి నడిపించే ద్వారం వెడల్పుగా, ఆ దారి విశాలంగా ఉంది; చాలామంది దాని గుండా వెళ్తున్నారు.
14 అయితే జీవానికి నడిపించే ద్వారం ఇరుకుగా, ఆ దారి కష్టంగా ఉంది; కొంతమందే దాన్ని కనుక్కుంటున్నారు.
15 “గొర్రె తోలు వేసుకుని మీ దగ్గరికి వచ్చే అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి, నిజానికి వాళ్లు విపరీతమైన ఆకలితో ఉన్న తోడేళ్లు.
16 మీరు వాళ్ల ఫలాల్ని బట్టి వాళ్లను గుర్తుపడతారు. ప్రజలు ఎప్పుడూ ముళ్లపొదల్లో ద్రాక్షపండ్లను గానీ అంజూర పండ్లను గానీ ఏరుకోరు కదా?
17 అదేవిధంగా ప్రతీ మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది, కానీ ప్రతీ చెడ్డ చెట్టు పనికిరాని ఫలాలు ఇస్తుంది.
18 మంచి చెట్టు పనికిరాని ఫలాలు ఇవ్వలేదు, అలాగే చెడ్డ చెట్టు మంచి ఫలాలు ఇవ్వలేదు.
19 మంచి ఫలాలు ఇవ్వని ప్రతీ చెట్టు నరకబడి, అగ్నిలో పడవేయబడుతుంది.
20 కాబట్టి నిజంగా, వాళ్ల ఫలాల్ని బట్టి మీరు వాళ్లను గుర్తుపడతారు.
21 “‘ప్రభువా, ప్రభువా’ అని నన్ను పిలిచే ప్రతీ ఒక్కరు పరలోక రాజ్యంలోకి వెళ్లరు, కానీ పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్టాన్ని చేస్తున్నవాళ్లే వెళ్తారు.
22 ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభువా, ప్రభువా, మేము నీ పేరున ప్రవచించలేదా? నీ పేరున చెడ్డదూతల్ని వెళ్లగొట్టలేదా? నీ పేరున చాలా అద్భుతాలు కూడా చేయలేదా?’ అని అంటారు.
23 అయితే అప్పుడు నేను వాళ్లతో, ‘అక్రమంగా నడుచుకుంటున్న మనుషులారా, మీరు ఎవరో నాకు అస్సలు తెలీదు, నా దగ్గరి నుండి వెళ్లిపోండి!’ అని చెప్తాను.
24 “కాబట్టి, నేను చెప్పిన ఈ మాటలు వింటూ వాటి ప్రకారం నడుచుకునే ప్రతీ వ్యక్తి, బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడిలా ఉంటాడు.
25 పెద్ద వర్షం కురిసింది, వరదలు వచ్చాయి, గాలులు భయంకరంగా వీచాయి; కానీ ఆ ఇల్లు కూలిపోలేదు, ఎందుకంటే దాని పునాది బండ మీద వేయబడింది.
26 అయితే, నేను చెప్పిన ఈ మాటలు వింటూ వాటి ప్రకారం నడుచుకోని ప్రతీ వ్యక్తి, ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న తెలివితక్కువ వ్యక్తి లాంటివాడు.
27 పెద్ద వర్షం కురిసింది, వరదలు వచ్చాయి, గాలులు భయంకరంగా వీచాయి; దాంతో ఆ ఇల్లు కూలిపోయి పూర్తిగా ధ్వంసమైంది.”
28 యేసు ఈ మాటలు చెప్పడం ముగించినప్పుడు, ప్రజలు ఆయన బోధించిన తీరు చూసి చాలా ఆశ్చర్యపోయారు,
29 ఎందుకంటే ఆయన వాళ్ల శాస్త్రుల్లా కాకుండా అధికారంగల వ్యక్తిలా బోధించాడు.