మార్కు 12:1-44
12 తర్వాత ఆయన వాళ్లకు ఉదాహరణలతో బోధించడం మొదలుపెట్టాడు: “ఒకతను ద్రాక్షతోట నాటించి, చుట్టూ కంచె వేయించాడు. ద్రాక్షపండ్లు తొక్కించడానికి ఓ తొట్టి తొలిపించాడు, కాపలాకు ఓ బురుజు కట్టించాడు; ఆ తర్వాత దాన్ని రైతులకు కౌలుకిచ్చి వేరే దేశానికి వెళ్లిపోయాడు.
2 సమయం వచ్చినప్పుడు పంటలో తనకు రావాల్సిన భాగాన్ని తీసుకురావడానికి అతను ఓ దాసుడిని ఆ రైతుల దగ్గరికి పంపించాడు.
3 కానీ వాళ్లు అతన్ని పట్టుకొని కొట్టి, వట్టి చేతులతో వెనక్కి పంపించేశారు.
4 తర్వాత అతను ఇంకో దాసుడిని పంపించాడు. వాళ్లు ఆ దాసుడి తల మీద కొట్టి అతన్ని అవమానించారు.
5 యజమాని మళ్లీ ఓ దాసుణ్ణి పంపాడు, వాళ్లు అతన్ని చంపేశారు. అలా ఆ యజమాని చాలామంది దాసులను పంపించాడు. వాళ్లు కొంతమందిని కొట్టారు, కొంతమందిని చంపారు.
6 ఆ యజమాని దగ్గర ఇంకో వ్యక్తి ఉన్నాడు, అతను ఆ యజమానికి ఇష్టమైన కొడుకు. ఆ యజమాని, ‘వాళ్లు నా కొడుకును గౌరవిస్తారు’ అని అనుకొని చివరికి కొడుకును వాళ్ల దగ్గరికి పంపించాడు.
7 కానీ ఆ రైతులు తమలో తాము ఇలా అనుకున్నారు: ‘ఇతను వారసుడు. ఇతన్ని చంపేద్దాం రండి, అప్పుడు ఆస్తి మనదైపోతుంది.’
8 అందుకే వాళ్లు అతన్ని పట్టుకొని చంపి, ద్రాక్షతోట బయట పడేశారు.
9 అప్పుడు ద్రాక్షతోట యజమాని ఏమి చేస్తాడు? అతను వచ్చి ఆ రైతుల్ని చంపి, ద్రాక్షతోటను వేరేవాళ్లకు ఇస్తాడు.
10 మీరు ఈ లేఖనాన్ని ఎప్పుడూ చదవలేదా: ‘కట్టేవాళ్లు వద్దనుకున్న రాయి ముఖ్యమైన మూలరాయి* అయ్యింది.
11 ఇది యెహోవా* వల్ల జరిగింది, ఇది మన కళ్లకు ఆశ్చర్యంగా ఉంది.’”
12 ఆయన తమను మనసులో పెట్టుకునే ఆ ఉదాహరణ చెప్పాడని వాళ్లకు అర్థమవ్వడంతో వెంటనే ఆయన్ని బంధించాలనుకున్నారు, కానీ ప్రజలకు భయపడ్డారు. అందుకే వాళ్లు ఆయన దగ్గర నుండి వెళ్లిపోయారు.
13 తర్వాత వాళ్లు ఆయన మాటల్లో తప్పు పట్టుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది పరిసయ్యులను, హేరోదు అనుచరులను ఆయన దగ్గరికి పంపారు.
14 వాళ్లు ఆయన దగ్గరికి వచ్చి ఇలా అన్నారు: “బోధకుడా, నువ్వు ఎప్పుడూ సత్యమే మాట్లాడతావని, ఎవరి మెప్పునూ కోరవని మాకు తెలుసు. ఎందుకంటే నువ్వు మనుషుల హోదా పట్టించుకోకుండా దేవుని మార్గం గురించిన సత్యాన్ని బోధిస్తావు. అయితే మాకు ఓ విషయం చెప్పు, కైసరుకు పన్ను* కట్టడం న్యాయమా, కాదా?*
15 మేము పన్ను కట్టాలా, వద్దా?” వాళ్ల వేషధారణను ఆయన పసిగట్టి వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు నన్ను ఎందుకు పరీక్షిస్తున్నారు? ఒక దేనారాన్ని* తీసుకొచ్చి నాకు చూపించండి.”
16 వాళ్లు ఒక దేనారాన్ని తీసుకొచ్చారు, ఆయన వాళ్లతో “దీని మీదున్న బొమ్మ, బిరుదు ఎవరివి?” అని అడిగాడు. దానికి వాళ్లు, “కైసరువి” అన్నారు.
17 అప్పుడు యేసు ఇలా అన్నాడు: “కైసరువి కైసరుకు చెల్లించండి, కానీ దేవునివి దేవునికి చెల్లించండి.” ఆయన మాటలకు వాళ్లు ఆశ్చర్యపోయారు.
18 ఆ తర్వాత, పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు ఆయన దగ్గరికి వచ్చి ఇలా అడిగారు:
19 “బోధకుడా, ఓ వ్యక్తి సంతానం లేకుండా చనిపోతే, అతని సోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని అతని కోసం పిల్లల్ని కనాలని మోషే రాశాడు.
20 అయితే ఓ కుటుంబంలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవాళ్లు. పెద్దవాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, కానీ పిల్లలు లేకుండానే చనిపోయాడు.
21 రెండోవాడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు, కానీ అతను కూడా పిల్లలు లేకుండానే చనిపోయాడు. మూడోవాడి విషయంలో కూడా అదే జరిగింది.
22 అలా ఆ ఏడుగురూ పిల్లలు లేకుండానే చనిపోయారు, చివరికి ఆమె కూడా చనిపోయింది.
23 ఆ ఏడుగురూ ఆమెను పెళ్లి చేసుకున్నారు కదా, మరి పునరుత్థానమైనప్పుడు ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది?”
24 అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మీకు లేఖనాలూ తెలియవు, దేవుని శక్తీ తెలియదు. అందుకే మీరు పొరబడుతున్నారు.
25 చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతికినప్పుడు స్త్రీలు గానీ పురుషులు గానీ పెళ్లి చేసుకోరు, వాళ్లు పరలోకంలోని దేవదూతల్లా ఉంటారు.
26 అయితే చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతకడం విషయానికొస్తే, ముళ్లపొద దగ్గర దేవుడు మోషేతో అన్న మాటలు అతను రాసిన పుస్తకంలో మీరు చదవలేదా? ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాకుకు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’ అని దేవుడు అన్నాడు.
27 ఆయన చనిపోయినవాళ్లకు కాదు, బ్రతికివున్నవాళ్లకే దేవుడు. మీరు చాలా పొరబడ్డారు.”
28 అక్కడికి వచ్చిన శాస్త్రి ఒకాయన వాళ్ల వాదన విని, యేసు వాళ్లకు చక్కగా జవాబివ్వడం చూసి, ఆయన్ని ఇలా అడిగాడు: “అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది?”
29 దానికి యేసు ఇలా జవాబిచ్చాడు: “మొట్టమొదటి ఆజ్ఞ ఏదంటే, ‘ఓ ఇశ్రాయేలూ, విను. మన దేవుడైన యెహోవా* ఒకేఒక్క యెహోవా.*
30 నువ్వు నీ దేవుడైన యెహోవాను* నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో, నీ నిండు మనసుతో, నీ పూర్తి బలంతో ప్రేమించాలి.’
31 రెండో ఆజ్ఞ ఏదంటే, ‘నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి.’ వీటికి మించిన గొప్ప ఆజ్ఞ ఇంకేదీ లేదు.”
32 అప్పుడు ఆ శాస్త్రి ఇలా అన్నాడు: “బోధకుడా బాగుంది, నువ్వు చెప్పింది నిజం. ‘దేవుడు ఒక్కడే, ఆయన తప్ప వేరే దేవుడు లేడు’;
33 నిండు హృదయంతో, పూర్తి అవగాహనతో, పూర్తి బలంతో ఆయన్ని ప్రేమించడం, మనల్ని మనం ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించడం దహనబలులన్నిటి కన్నా, అర్పణలన్నిటి కన్నా ఎంతో విలువైనది.”
34 అతను తెలివిగా జవాబిచ్చాడని గ్రహించి, యేసు అతనితో “నువ్వు దేవుని రాజ్యానికి ఎంతో దూరంలో లేవు” అన్నాడు. కానీ, యేసును ప్రశ్నలు అడగడానికి ఇంకెవ్వరూ ధైర్యం చేయలేదు.
35 అయితే యేసు ఆలయంలో ఇంకా బోధిస్తూనే ఉన్నాడు. ఆయన ఇలా అన్నాడు: “క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు ఎలా అంటున్నారు?
36 ‘యెహోవా* నా ప్రభువుతో, “నీ శత్రువుల్ని నీ పాదాల కింద ఉంచేవరకు నువ్వు నా కుడి పక్కన కూర్చో” అన్నాడు’ అని పవిత్రశక్తి ప్రేరణతో దావీదే స్వయంగా చెప్పాడు.
37 దావీదే క్రీస్తును ప్రభువు అంటున్నాడు కదా, అలాంటప్పుడు క్రీస్తు దావీదు కుమారుడు ఎలా అవుతాడు?”
యేసు మాట్లాడుతుంటే చాలామంది జనం సంతోషంగా వింటూ ఉండిపోయారు.
38 ఆయన బోధిస్తూ ఇంకా ఇలా అన్నాడు: “శాస్త్రుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పొడవాటి అంగీలు వేసుకొని తిరగడం, సంతల్లో ప్రజల చేత నమస్కారాలు పెట్టించుకోవడం వాళ్లకు ఇష్టం.
39 సభామందిరాల్లో ముందువరుస* కుర్చీలు, విందుల్లో ప్రత్యేక స్థానాలు వాళ్లకు కావాలి.
40 వాళ్లు విధవరాళ్ల ఇళ్లను* మింగేస్తారు, అందరికీ కనిపించాలని పెద్దపెద్ద ప్రార్థనలు చేస్తారు. వాళ్లు ఇంకా కఠినమైన* తీర్పు పొందుతారు.”
41 ఆలయంలో కానుక పెట్టెలు కనబడేంత దూరంలో ఆయన కూర్చొని జనం వాటిలో డబ్బులు ఎలా వేస్తున్నారో గమనిస్తూవున్నాడు. చాలామంది ధనవంతులు ఎన్నో నాణేలు వేస్తున్నారు.
42 అప్పుడు ఓ పేద విధవరాలు వచ్చి చాలా తక్కువ విలువగల రెండు చిన్న నాణేలు* వేసింది.
43 ఆయన తన శిష్యుల్ని పిలిచి ఇలా అన్నాడు: “నేను నిజంగా చెప్తున్నాను, కానుక పెట్టెల్లో డబ్బులు వేసిన వాళ్లందరి కన్నా ఈ పేద విధవరాలే ఎక్కువ వేసింది.
44 ఎందుకంటే వాళ్లందరూ తమ సంపదల్లో నుండి కొంచెం వేశారు, కానీ ఈమె ఎంతో అవసరంలో* ఉన్నా, తన దగ్గర ఉన్నదంతా వేసేసింది.”
అధస్సూచీలు
^ అక్ష., “మూలకు తల.”
^ పదకోశం చూడండి.
^ ఇది ప్రతీ మనిషి మీద విధించే పన్నును సూచిస్తుండవచ్చు.
^ లేదా “సరైనదా, కాదా?”
^ పదకోశం చూడండి.
^ పదకోశం చూడండి.
^ పదకోశం చూడండి.
^ పదకోశం చూడండి.
^ పదకోశం చూడండి.
^ లేదా “శ్రేష్ఠమైన.”
^ లేదా “ఆస్తుల్ని.”
^ లేదా “తీవ్రమైన.”
^ అక్ష., “రెండు లెప్టాన్లు, అంటే ఓ క్వాడ్రన్స్.”
^ లేదా “పేదరికంలో.”