మార్కు 16:1-8
-
యేసు పునరుత్థానం చేయబడతాడు (1-8)
16 విశ్రాంతి రోజు ముగిశాక మగ్దలేనే మరియ, యాకోబువాళ్ల అమ్మ మరియ, సలోమే ఆయన సమాధి దగ్గరికెళ్లి ఆయన శరీరానికి పూద్దామని సుగంధ ద్రవ్యాలు కొన్నారు.
2 వారం మొదటి రోజున* పొద్దుపొద్దున్నే వాళ్లు సమాధి* దగ్గరికి వచ్చారు.
3 “సమాధి ద్వారానికి ఉన్న రాయిని మనకోసం ఎవరు దొర్లిస్తారు?” అని వాళ్లు ఒకరితో ఒకరు అనుకున్నారు.
4 కానీ వాళ్లు చూసేసరికి, ఆ పెద్ద రాయి అప్పటికే పక్కకు దొర్లించి ఉంది.
5 వాళ్లు సమాధి లోపలికి వెళ్లారు; అక్కడ తెల్ల బట్టలు వేసుకున్న ఓ యువకుడు కుడివైపున కూర్చొని ఉండడం చూసి అవాక్కయ్యారు.
6 అతను వాళ్లతో ఇలా అన్నాడు: “ఆశ్చర్యపోకండి. కొయ్యపై మరణశిక్ష వేయబడిన నజరేయుడైన యేసు కోసం మీరు చూస్తున్నారని నాకు తెలుసు. ఆయన బ్రతికించబడ్డాడు, ఆయన ఇక్కడ లేడు. చూడండి, ఆయన్ని ఉంచిన చోటు ఇదే.
7 అయితే మీరు వెళ్లి ఆయన శిష్యులకు, పేతురుకు ఇలా చెప్పండి: ‘ఆయన మీకన్నా ముందు గలిలయకు వెళ్తున్నాడు. ఆయన మీకు చెప్పినట్టే మీరు ఆయన్ని అక్కడ చూస్తారు.’”
8 వాళ్లు బయటికి వచ్చాక భయంతో వణికిపోతూ, ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ సమాధి దగ్గర నుండి పారిపోయారు. వాళ్లు భయపడి ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు.*
అధస్సూచీలు
^ మత్తయి 17:21కి ఉన్న పాదసూచిక చూడండి.
^ లేదా “స్మారక సమాధి.”
^ నమ్మదగ్గ తొలి రాతప్రతుల ప్రకారం, 8వ వచనంలోని మాటలతో మార్కు సువార్త ముగుస్తుంది.