మార్కు 9:1-50

  • యేసు రూపం మారిపోవడం  (1-13)

  • చెడ్డదూత పట్టిన అబ్బాయి బాగవ్వడం  (14-29)

    • విశ్వాసం ఉన్న వ్యక్తికి అన్నీ సాధ్యమే (23)

  • యేసు మరణం గురించి ఇంకోసారి ముందే చెప్పబడింది  (30-32)

  • శిష్యులు తమలో ఎవరు గొప్ప అని వాదించుకున్నారు (33-37)

  • మనల్ని వ్యతిరేకించని ప్రతీవాడు మనవాడే  (38-41)

  • విశ్వాసం కోల్పోవడానికి కారణమయ్యేవాళ్లు (42-48)

  • ‘మీ జీవితాల్లో ఉప్పు కలిగివుండండి’ (49, 50)

9  యేసు వాళ్లతో ఇంకా ఇలా అన్నాడు: “నేను నిజంగా చెప్తున్నాను, ఇక్కడ ఉన్నవాళ్లలో కొంతమంది దేవుని రాజ్యం అధికారంతో రావడం చూసేవరకు చనిపోరు.”  ఆరు రోజుల తర్వాత పేతురు, యాకోబు, యోహానులను మాత్రమే తీసుకొని యేసు ఎత్తయిన ఓ కొండ మీదికి వెళ్లాడు. అక్కడ వాళ్లు చూస్తుండగా యేసు రూపం మారిపోయింది;  ఆయన బట్టలు భూమ్మీద ఏ చాకలీ ఉతకలేనంత తెల్లగా అయ్యి తళతళ మెరుస్తున్నాయి.  వాళ్లకు మోషే, ఏలీయా కూడా కనిపించారు, ఆ ఇద్దరు యేసుతో మాట్లాడుతున్నారు.  అప్పుడు పేతురు యేసుతో ఇలా అన్నాడు: “బోధకుడా,* మనం ఇక్కడ ఉంటే బాగుంటుంది. కాబట్టి మమ్మల్ని మూడు డేరాలు వేయనివ్వు. ఒకటి నీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలీయాకు.”  నిజానికి పేతురుకు ఏమి మాట్లాడాలో తోచలేదు, ఎందుకంటే వాళ్లకు చాలా భయమేసింది.  అప్పుడు ఓ మేఘం వచ్చి వాళ్లను కమ్మేసింది, అందులో నుండి ఈ స్వరం వినిపించింది: “ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన మాట వినండి.”  వెంటనే వాళ్లు చుట్టూ చూశారు, యేసు తప్ప ఇంకెవ్వరూ వాళ్లకు కనిపించలేదు.  వాళ్లు కొండ దిగి వస్తుండగా, మానవ కుమారుడు మృతుల్లో నుండి బ్రతికేంత వరకు తాము చూసినదాని గురించి ఎవ్వరికీ చెప్పొద్దని యేసు వాళ్లకు గట్టిగా ఆజ్ఞాపించాడు. 10  వాళ్లు ఆయన మాటను మనసులో ఉంచుకున్నారు,* కానీ ఈ మృతుల్లో నుండి బ్రతకడమంటే ఏమిటా అని వాళ్లలోవాళ్లు మాట్లాడుకున్నారు. 11  తర్వాత వాళ్లు, “ముందు ఏలీయా రావాలని శాస్త్రులు ఎందుకు అంటారు?” అని ఆయన్ని అడిగారు. 12  అందుకు ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “ముందు ఏలీయా వచ్చి అన్నిటినీ చక్కబెడతాడు; అయితే మానవ కుమారుడు ఎన్నో బాధలు పడతాడని, ఆయన తిరస్కారానికి గురౌతాడని రాసివుంది కదా, మరి దాని సంగతేమిటి? 13  నేను చెప్పేదేమిటంటే, నిజానికి ఏలీయా వచ్చాడు. అతని గురించి రాయబడినట్టుగానే వాళ్లు అతనితో ఇష్టమొచ్చినట్టు వ్యవహరించారు.” 14  యేసు, ఆ ముగ్గురు శిష్యులు కలిసి మిగతా శిష్యుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ల చుట్టూ జనం ఉన్నారు, శాస్త్రులు వాళ్లతో వాదిస్తున్నారు. 15  కానీ యేసు కనబడగానే జనమంతా ఆశ్చర్యంతో ఆయన్ని పలకరించడానికి ఆయన దగ్గరికి పరుగులు తీశారు. 16  యేసు, “మీరు దేని గురించి వాళ్లతో వాదిస్తున్నారు?” అని ఆ జనాన్ని అడిగాడు. 17  అప్పుడు వాళ్లలో ఒకతను ఇలా అన్నాడు: “బోధకుడా, మా అబ్బాయిని ఓ చెడ్డదూత పట్టి, మూగవాణ్ణి చేశాడు. అందుకని అతన్ని నీ దగ్గరికి తీసుకొచ్చాను. 18  చెడ్డదూత పట్టినప్పుడల్లా అతను కింద పడిపోతాడు, అతని నోట్లో నుండి నురుగు వస్తుంది, పళ్లు కొరుక్కుంటాడు, నీరసించిపోతాడు. ఆ చెడ్డదూతను వెళ్లగొట్టమని నీ శిష్యుల్ని అడిగాను కానీ వాళ్లవల్ల కాలేదు.” 19  అప్పుడు యేసు వాళ్లతో, “ఓ విశ్వాసంలేని తరమా, ఎంతకాలం నేను మీతో ఉండాలి? ఎంతకాలం మిమ్మల్ని సహించాలి? ఆ అబ్బాయిని నా దగ్గరికి తీసుకురండి” అన్నాడు. 20  వాళ్లు ఆ అబ్బాయిని యేసు దగ్గరికి తీసుకొచ్చారు, కానీ యేసును చూడగానే చెడ్డదూత ఆ అబ్బాయిని గిలగిల కొట్టుకునేలా చేశాడు. అతను కిందపడి అటు ఇటు దొర్లుతూనే ఉన్నాడు, నోట్లో నుండి నురుగు వస్తూనే ఉంది. 21  అప్పుడు యేసు, “మీ అబ్బాయికి ఎంతకాలంగా ఇలా జరుగుతోంది?” అని వాళ్ల నాన్నను అడిగాడు. అందుకతను ఇలా చెప్పాడు: “చిన్నప్పటి నుండి. 22  చెడ్డదూత అతన్ని చంపేయాలని తరచూ మంటల్లోకి, నీళ్లలోకి తోసేస్తాడు. నువ్వు ఏమైనా చేయగలిగితే, మామీద దయవుంచి సహాయం చెయ్యి.” 23  అప్పుడు యేసు అతనితో, “‘చేయగలిగితే’ అనే మాట ఎందుకు? విశ్వాసం ఉన్న వ్యక్తికి అన్నీ సాధ్యమే” అని చెప్పాడు. 24  వెంటనే అతను గట్టిగా, “నాకు విశ్వాసం ఉంది! ఒకవేళ విశ్వాసం తక్కువగా ఉంటే సహాయం చెయ్యి” అన్నాడు. 25  జనం తమవైపు పరుగెత్తుకురావడం గమనించి, యేసు ఆ అపవిత్ర దూతను గద్దిస్తూ ఇలా అన్నాడు: “చెవుడున్న మూగ దూతా, నేను ఆజ్ఞాపిస్తున్నాను, బయటికి రా. ఇంకెప్పుడూ ఇతనిలోకి ప్రవేశించకు!” 26  ఆ అపవిత్ర దూత గట్టిగా అరిచి, ఆ అబ్బాయిని గిలగిల కొట్టుకునేలా చేసి అతనిలో నుండి బయటికి వచ్చేశాడు. ఆ అబ్బాయి శవంలా పడివున్నాడు. దాంతో చాలామంది, “చచ్చిపోయాడు!” అన్నారు. 27  అయితే యేసు ఆ అబ్బాయి చేయి పట్టుకొని పైకి లేపగానే అతను లేచి నిలబడ్డాడు. 28  ఆ తర్వాత యేసు ఓ ఇంట్లోకి వెళ్లాడు. శిష్యులు యేసును విడిగా ఇలా అడిగారు: “ఆ చెడ్డదూతను మేము ఎందుకు వెళ్లగొట్టలేకపోయాం?” 29  అందుకు యేసు వాళ్లతో, “ప్రార్థన వల్ల మాత్రమే ఇలాంటి చెడ్డదూతలు బయటికి వస్తారు” అని చెప్పాడు. 30  వాళ్లు అక్కడి నుండి బయల్దేరి గలిలయ గుండా ప్రయాణం చేశారు. కానీ దీనిగురించి ఎవ్వరికీ తెలియకూడదని ఆయన అనుకున్నాడు. 31  ఆయన శిష్యులకు బోధిస్తూ ఇలా చెప్పాడు: “మానవ కుమారుడు శత్రువుల చేతికి అప్పగించబడబోతున్నాడు, వాళ్లు ఆయన్ని చంపేస్తారు. అయితే ఆయన చనిపోయినా మూడు రోజుల తర్వాత మళ్లీ బ్రతుకుతాడు.” 32  కానీ ఆయన మాటలు వాళ్లకు అర్థంకాలేదు, పైగా ఆయన్ని అడగడానికి భయపడ్డారు. 33  వాళ్లు కపెర్నహూము చేరుకున్నారు. ఇంటికి వచ్చాక, “దారిలో మీరు దేని గురించి వాదించుకుంటున్నారు?” అని ఆయన వాళ్లను అడిగాడు. 34  వాళ్లు మౌనంగా ఉండిపోయారు, ఎందుకంటే దారిలో వాళ్లు తమలో ఎవరు గొప్ప అని వాదించుకున్నారు. 35  అప్పుడు ఆయన కూర్చొని ఆ పన్నెండుమందిని పిలిచి వాళ్లకు ఇలా చెప్పాడు: “అందరికంటే ముందు ఉండాలని అనుకునే వ్యక్తి అందరికంటే చివర్లో ఉండాలి, అందరికీ సేవ చేయాలి.” 36  తర్వాత ఆయన ఓ చిన్న బాబును తీసుకొని వాళ్ల మధ్య నిలబెట్టాడు. ఆ బాబు భుజాల మీద చేతులేసి ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: 37  “నా పేరున ఇలాంటి పిల్లల్ని దగ్గరికి తీసుకునేవాళ్లు నన్ను కూడా చేర్చుకుంటారు. నన్ను చేర్చుకునేవాళ్లు, నన్నే కాదు నన్ను పంపిన దేవుణ్ణి కూడా చేర్చుకుంటారు.” 38  యోహాను యేసుతో ఇలా అన్నాడు: “బోధకుడా, ఒకతను నీ పేరున చెడ్డదూతల్ని వెళ్లగొడుతుండడం మేము చూశాం; అతను మనవాడు కాదు కాబట్టి మేము అతన్ని ఆపడానికి ప్రయత్నించాం.” 39  కానీ యేసు ఇలా అన్నాడు: “అతన్ని ఆపడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే నా పేరు ఉపయోగించి అద్భుతాలు చేసేవాళ్లెవ్వరూ అంత త్వరగా నా గురించి చెడుగా చెప్పలేరు. 40  మనకు వ్యతిరేకంగా లేని వ్యక్తి మన వైపే ఉన్నాడు. 41  నేను నిజంగా చెప్తున్నాను, మీరు క్రీస్తు శిష్యులని మీకు గిన్నెడు నీళ్లు ఇచ్చేవాళ్లెవరైనా సరే తప్పకుండా ప్రతిఫలం పొందుతారు. 42  విశ్వాసంగల ఈ చిన్నవాళ్లలో ఒకరు విశ్వాసం కోల్పోవడానికి* ఎవరైతే కారణమౌతారో, అతని మెడకు ఒక పెద్ద తిరుగలి రాయిని* కట్టి అతన్ని సముద్రంలో పడేయడమే అతనికి మంచిది. 43  “ఒకవేళ నీ చెయ్యి నువ్వు పాపం చేయడానికి కారణమౌతుంటే* దాన్ని నరికివేయి. రెండు చేతులతో ఆర్పలేని మంటలు గల గెహెన్నాలోకి* వెళ్లడంకంటే వికలాంగునిగా జీవాన్ని దక్కించుకోవడం నీకు మంచిది. 44  *—— 45  నువ్వు పాపం చేయడానికి ఒకవేళ నీ కాలు కారణమైతే దాన్ని నరికివేయి. రెండు కాళ్లతో గెహెన్నాలో* పడేకంటే కుంటివాడిగా జీవాన్ని దక్కించుకోవడం నీకు మంచిది. 46  *—— 47  ఒకవేళ నీ కన్ను నువ్వు పాపం చేయడానికి కారణమౌతుంటే, దాన్ని తీసిపారేయి. రెండు కళ్లతో గెహెన్నాలో* పడేకంటే ఒక్క కన్నుతో దేవుని రాజ్యంలో ప్రవేశించడం నీకు మంచిది. 48  ఆ గెహెన్నాలో* పురుగు చావదు, అగ్ని ఆరదు. 49  “మనుషులు ఆహారం మీద ఉప్పు చల్లినట్టు దేవుడు అలాంటివాళ్ల మీద అగ్ని కురిపించాలి. 50  ఉప్పు చాలా మంచిది, కానీ ఉప్పే ఉప్పదనం కోల్పోతే, దానికి ఉప్పదనం ఎక్కడ నుండి తీసుకొస్తారు? మీ జీవితాల్లో ఉప్పు కలిగివుండి, ఒకరితో ఒకరు శాంతియుతంగా మెలగండి.”

అధస్సూచీలు

అక్ష., “రబ్బీ.”
లేదా “ఆ విషయాన్ని తమ దగ్గరే ఉంచుకున్నారు.”
అక్ష., “తడబడడానికి.”
లేదా “గాడిదకు కట్టి తిప్పే తిరుగలి రాయిని.”
అక్ష., “నిన్ను తడబడేలా చేస్తుంటే.”
పదకోశం చూడండి.
మత్తయి 17:21కి ఉన్న పాదసూచిక చూడండి.
పదకోశం చూడండి.
మత్తయి 17:21కి ఉన్న పాదసూచిక చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.