యాకోబు 2:1-26

  • పక్షపాతం చూపించడం పాపం  (1-13)

    • సర్వోన్నతమైన ఆజ్ఞ ప్రేమ  (8)

  • చేతలు లేని విశ్వాసం నిర్జీవం  (14-26)

    • చెడ్డదూతలు నమ్ముతున్నారు, భయంతో వణుకుతున్నారు  (19)

    • అబ్రాహాము యెహోవా స్నేహితుడని పిలువబడ్డాడు  (23)

2  నా సోదరులారా, మీరు పక్షపాతం చూపిస్తే మహిమగల మన ప్రభువైన యేసుక్రీస్తు మీద మీకు విశ్వాసం ఉన్నట్టేనా?  బంగారు ఉంగరాలు పెట్టుకొని, ఖరీదైన బట్టలు వేసుకున్న ఓ వ్యక్తి మీ కూటాలకు వచ్చాడనుకోండి, మురికి బట్టలు వేసుకున్న ఓ పేదవాడు కూడా వచ్చాడు.  మీరు ఆ ఖరీదైన బట్టలు వేసుకున్న వ్యక్తి మీద ప్రత్యేక అభిమానం చూపిస్తూ “ఇది మంచి చోటు, ఇక్కడ కూర్చోండి” అని చెప్పి, పేదవాడితోనేమో “నువ్వు నిలబడే ఉండు” అనో, “కింద కూర్చో” అనో చెప్తారా?  అలాచేస్తే, మీ మధ్య వర్గభేదాలు ఉన్నట్టు కాదా? మీరు తప్పుడు తీర్పులు తీర్చే న్యాయమూర్తులు అవ్వరా?  ప్రియ సోదరులారా, నా మాట వినండి. లోకం దృష్టిలో పేదలైన వాళ్లను విశ్వాసంలో ధనవంతులుగా, రాజ్యానికి వారసులుగా చేసేందుకు దేవుడు ఎంచుకోలేదా? తనను ప్రేమించేవాళ్లకు ఆ రాజ్యం ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు.  అయితే మీరు పేదల్ని అవమానించారు. నిజానికి మిమ్మల్ని అణచివేసి, న్యాయస్థానాలకు ఈడ్చేది ధనవంతులు కాదా?  మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మహోన్నతమైన పేరును వాళ్లు అవమానించడం లేదా?  అయితే, లేఖనాలు చెప్తున్నట్టు “నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి” అనే సర్వోన్నతమైన ఆజ్ఞను* మీరిప్పుడు పాటిస్తుంటే మీరు చాలా చక్కగా ప్రవర్తిస్తున్నట్టే.  కానీ, మీరు పక్షపాతం చూపిస్తూ ఉంటే పాపం చేస్తున్నట్టే; ధర్మశాస్త్రం మిమ్మల్ని దోషులని తీర్పు తీరుస్తుంది.* 10  ఎవరైనా ధర్మశాస్త్రంలోని నియమాలన్నీ పాటించి, ఒక్క విషయంలో తప్పటడుగు వేసినా మొత్తం ధర్మశాస్త్రాన్ని మీరినట్టే. 11  ఎందుకంటే, “మీరు వ్యభిచారం చేయకూడదు” అని చెప్పిన దేవుడే “మీరు హత్య చేయకూడదు” అని కూడా చెప్పాడు. ఒకవేళ మీరు వ్యభిచారం చేయకపోయినా హత్య చేశారనుకోండి. అప్పుడు కూడా మీరు ధర్మశాస్త్రాన్ని మీరినట్టే. 12  మీరెప్పుడూ స్వేచ్ఛను ఇచ్చే శాసనం ప్రకారం తీర్పు పొందబోయే ప్రజల్లా మాట్లాడండి, ప్రవర్తించండి. 13  కరుణ చూపించని వ్యక్తి కరుణలేని తీర్పే పొందుతాడు. కరుణ తీర్పుపై విజయం సాధిస్తుంది. 14  నా సోదరులారా, ఎవరైనా విశ్వాసం ఉందని చెప్పుకుంటూ దాన్ని చేతల్లో చూపించకపోతే ఏమి లాభం? అలాంటి విశ్వాసం అతన్ని రక్షించగలదా? రక్షించలేదు. 15  ఒక సోదరుడు లేదా సోదరి వేసుకోవడానికి బట్టలు లేకుండా,* ఆ రోజు తినడానికి సరిపడా తిండి లేకుండా ఉంటే 16  మీలో ఒకరు, వాళ్ల శరీరానికి అవసరమైనవేవీ ఇవ్వకుండా, “మనశ్శాంతితో వెళ్లండి; చలి కాచుకోండి, కడుపునిండా తినండి” అని అంటే ఏమి లాభం? 17  అలాగే విశ్వాసాన్ని చేతల్లో చూపించకపోతే అది చచ్చినట్టే లెక్క. 18  అయితే ఒకతను ఇలా అంటాడు: “నీకు విశ్వాసం ఉంది, నా దగ్గర చేతలు ఉన్నాయి. చేతలు లేకుండా నీ విశ్వాసాన్ని నాకు చూపించు, నా చేతలతో నా విశ్వాసాన్ని నీకు చూపిస్తాను.” 19  ఒక్కడే దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావు, అవునా? మంచిది. చెడ్డదూతలు కూడా నమ్ముతున్నారు, భయంతో వణుకుతున్నారు. 20  ఓ మూర్ఖుడా, చేతల్లో చూపించని విశ్వాసం వ్యర్థమని తెలుసుకోవాలన్న ఆలోచన ఉందా నీకు? 21  మన తండ్రి అబ్రాహాము తన కొడుకు ఇస్సాకును బలిపీఠం మీద అర్పించి, చేతల ద్వారా నీతిమంతుడని తీర్పు పొందలేదా? 22  అతని విశ్వాసం చేతల్లో కనిపించింది కాబట్టి అది సజీవమైనదని, చేతల వల్ల అది సంపూర్ణమైందని నీకు తెలుసు కదా. 23  “అబ్రాహాము యెహోవా* మీద విశ్వాసం ఉంచాడు, దానివల్ల దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచాడు” అనే లేఖనం నెరవేరింది. అతనికి యెహోవా* స్నేహితుడు అనే పేరు వచ్చింది. 24  ఒక విషయం తెలుసుకో. విశ్వాసం ఉంటేనే సరిపోదు, అది చేతల్లో కనబడాలి. అప్పుడే ఓ వ్యక్తి నీతిమంతుడని తీర్పు పొందుతాడు. 25  రాహాబు అనే వేశ్య తన ఇంట్లో గూఢచారులకు* చోటిచ్చి, ఆతిథ్యమిచ్చి, వాళ్లను మరో దారిన పంపించేసింది. అలా ఆమె కూడా చేతల వల్ల నీతిమంతురాలని తీర్పు పొందలేదా? 26  నిజానికి, ప్రాణం* లేని శరీరంలా చేతలు లేని విశ్వాసం కూడా నిర్జీవమే.

అధస్సూచీలు

లేదా “రాజ శాసనాన్ని.”
లేదా “మందలిస్తుంది.”
అక్ష., “దిగంబరంగా.”
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
అక్ష., “సందేశకులకు.”
లేదా “ఊపిరి.” గ్రీకులో న్యూమా. పదకోశంలో “న్యూమా” చూడండి.