యాకోబు 3:1-18
3 నా సోదరులారా, మీలో అందరూ బోధకులు అవ్వకూడదు. ఎందుకంటే బోధకులైన మనం మరింత కఠినమైన తీర్పు పొందుతామని మీకు తెలుసు.
2 మనమందరం ఎన్నోసార్లు పొరపాట్లు చేస్తాం.* పొరపాటు లేకుండా మాట్లాడేవాడు పరిపూర్ణుడు, అలాంటివాడు మొత్తం శరీరాన్ని అదుపులో ఉంచుకోగలడు.
3 గుర్రం మన మాట వినడానికి దాని నోటికి కళ్లెం వేస్తాం, ఆ కళ్లెంతో మొత్తం గుర్రాన్నే నియంత్రిస్తాం.
4 అంతేకాదు, ఓడల విషయమే తీసుకోండి. అవి చాలా భారీగా ఉంటాయి, బలమైన గాలులతోనే ముందుకు కదులుతాయి. కానీ ఓడ నడిపే వ్యక్తి ఎటు వెళ్లాలనుకుంటే అటు తిప్పడానికి ఓ చిన్న చుక్కాని సరిపోతుంది.
5 అలాగే నాలుక కూడా శరీరంలో ఓ చిన్న అవయవమే, కానీ చాలా గొప్పలు చెప్పుకుంటుంది. చూడండి, ఓ పెద్ద అడవిని తగలబెట్టడానికి చిన్న నిప్పురవ్వ చాలు కదా!
6 నాలుక కూడా నిప్పులాంటిదే. అవయవాలన్నిటిలో నాలుకే మొత్తం అవినీతికి నిలయం. ఎందుకంటే అది శరీరమంతటినీ కలుషితం చేస్తుంది, మొత్తం జీవితాన్నే తగలబెడుతుంది, గెహెన్నాలా* నాశనం చేస్తుంది.
7 అన్నిరకాల క్రూర జంతువుల్ని, పక్షుల్ని, నేలమీద పాకే జంతువుల్ని,* సముద్ర జీవుల్ని మచ్చిక చేసుకోవచ్చు, మనిషి అలా మచ్చిక చేసుకున్నాడు కూడా.
8 కానీ నాలుకను మచ్చిక చేసుకోవడం ఎవ్వరి తరం కాదు, అది లొంగే రకం కాదు. నాలుక హానికరమైనది, ప్రాణాంతక విషంతో నిండినది.
9 దానితోనే మనం తండ్రైన యెహోవాను* స్తుతిస్తాం; దానితోనే, “దేవుని పోలికతో” సృష్టించబడిన మనుషుల్ని శపిస్తాం.
10 అదే నోటితో దీవిస్తాం, అదే నోటితో శపిస్తాం.
నా సోదరులారా, ఇది మంచిది కాదు.
11 ఒకే ఊట నుండి మంచి* నీళ్లు, చేదు నీళ్లు వస్తాయా? రావు కదా!
12 సోదరులారా, అంజూర చెట్టుకు ఒలీవ పండ్లు, ద్రాక్షతీగకు అంజూర పండ్లు కాస్తాయా? కాయవు కదా! అలాగే ఉప్పు నీటిలో నుండి మంచి నీళ్లు రాలేవు.
13 మీలో తెలివి, గ్రహించే సామర్థ్యం ఎవరికి ఉన్నాయి? అతను ఆ లక్షణాల్ని తన మంచి ప్రవర్తన ద్వారా, సౌమ్యతతో చేసే పనుల ద్వారా చూపించాలి. ఈ సౌమ్యత తెలివి వల్ల కలుగుతుంది.
14 కానీ మీ హృదయాల్లో మితిమీరిన అసూయ ఉంటే, గొడవలకు దిగే స్వభావం* ఉంటే మీ తెలివి గురించి గొప్పలు చెప్పుకోకండి. అలా చెప్పుకుంటే, అది అబద్ధమే అవుతుంది.
15 ఈ తెలివి పరలోకం నుండి వచ్చింది కాదు; లోక సంబంధమైనది, జంతు సంబంధమైనది, చెడ్డదూతలకు సంబంధించినది.
16 ఎందుకంటే అసూయ, గొడవలకు దిగే మనస్తత్వం* ఉన్నచోట గందరగోళం, నీచమైన ప్రతీది ఉంటాయి.
17 కానీ పరలోకం నుండి వచ్చే తెలివి అన్నిటికన్నా ముందు స్వచ్ఛమైనది; ఆ తర్వాత శాంతికరమైనది; తన మాటే నెగ్గాలనే స్వభావం లేనిది; లోబడడానికి సిద్ధంగా ఉండేది; కరుణతో, మంచి ఫలాలతో నిండివున్నది; పక్షపాతం లేనిది; వేషధారణ లేనిది.
18 అందరితో శాంతిగా ఉండేవాళ్లు శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పుతారు. ఫలితంగా, వాళ్ల పనులు నీతిగా ఉంటాయి.
అధస్సూచీలు
^ అక్ష., “పడిపోతాం.”
^ పదకోశం చూడండి.
^ లేదా “సరీసృపాల్ని.”
^ పదకోశం చూడండి.
^ అక్ష., “తియ్యని.”
^ లేదా “నేనే నెగ్గాలనే గుణం” అయ్యుంటుంది.
^ లేదా “నేనే నెగ్గాలనే గుణం” అయ్యుంటుంది.