యోహాను 10:1-42

  • గొర్రెల కాపరి, గొర్రెల దొడ్లు (1-21)

    • యేసు మంచి కాపరి  (11-15)

    • “వేరే గొర్రెలు నాకు ఉన్నాయి”  (16)

  • సమర్పణ పండుగలో యూదులు యేసును చుట్టుముడతారు (22-39)

    • చాలామంది యూదులు నమ్మలేదు (24-26)

    • “నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి”  (27)

    • కొడుకు, తండ్రి ఐక్యంగా ఉన్నారు (30, 38)

  • యొర్దాను అవతల చాలామంది విశ్వసిస్తారు (40-42)

10  “నేను మీతో నిజంగా చెప్తున్నాను. గొర్రెల దొడ్డిలోకి ద్వారం నుండి రాకుండా వేరే మార్గంలో ఎక్కి వచ్చేవాడు దొంగ, దోచుకునేవాడు.  అయితే ద్వారం నుండి వచ్చేవాడు గొర్రెల కాపరి.  ద్వారపాలకుడు ఆయన కోసం తలుపు తెరుస్తాడు. గొర్రెలు ఆయన స్వరం వింటాయి. ఆయన తన సొంత గొర్రెల్ని పేరు పెట్టి పిలిచి, వాటిని బయటికి నడిపిస్తాడు.  తన గొర్రెలన్నిటినీ బయటికి తీసుకొచ్చాక, ఆయన వాటి ముందు నడుస్తాడు. అవి ఆయన స్వరాన్ని గుర్తుపడతాయి కాబట్టి ఆయన వెనక వెళ్తాయి.  అవి పరాయి వ్యక్తి వెనక అస్సలు వెళ్లవు, అతని దగ్గరి నుండి పారిపోతాయి. ఎందుకంటే పరాయివాళ్ల స్వరాన్ని అవి గుర్తుపట్టవు.”  యేసు ఈ పోలికను వాళ్లతో చెప్పాడు, కానీ ఆయన ఏం చెప్తున్నాడో వాళ్లకు అర్థం కాలేదు.  కాబట్టి యేసు మళ్లీ ఇలా చెప్పాడు: “నేను మీతో నిజంగా చెప్తున్నాను. గొర్రెలు వెళ్లే ద్వారాన్ని నేనే.  నా స్థానంలో వచ్చిన వాళ్లందరూ దొంగలు, దోచుకునేవాళ్లు; అయితే గొర్రెలు వాళ్ల మాట వినలేదు.  నేనే ద్వారాన్ని; నా ద్వారా ప్రవేశించేవాళ్లు రక్షించబడతారు. వాళ్లు లోపలికి వస్తూ, బయటికి వెళ్తూ పచ్చికబయళ్లు కనుగొంటారు. 10  దొంగ దొంగతనం చేయడానికి, చంపడానికి, నాశనం చేయడానికే వస్తాడు. అయితే గొర్రెలు జీవం పొందేందుకు, శాశ్వత జీవితం పొందేందుకు నేను వచ్చాను. 11  నేను మంచి కాపరిని; మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం పెడతాడు. 12  గొర్రెల్ని చూసుకునే జీతగాడు కాపరి కాదు, గొర్రెలు అతనివి కావు. కాబట్టి తోడేలు రావడం చూసినప్పుడు అతను గొర్రెల్ని విడిచిపెట్టి పారిపోతాడు. (అప్పుడు తోడేలు వాటిని పట్టుకుంటుంది, చెదరగొడుతుంది.) 13  అతను జీతగాడు కాబట్టి గొర్రెల గురించి శ్రద్ధ తీసుకోడు. 14  నేను మంచి కాపరిని. తండ్రికి నేను తెలుసు, నాకు తండ్రి తెలుసు, 15  అలాగే నా గొర్రెలు నాకు తెలుసు, నా గొర్రెలకు నేను తెలుసు; నేను గొర్రెల కోసం నా ప్రాణం పెడతాను. 16  “అలాగే, ఈ దొడ్డివికాని వేరే గొర్రెలు నాకు ఉన్నాయి; వాటిని కూడా నేను తీసుకొని రావాలి, అవి నా స్వరాన్ని వింటాయి. అప్పుడు గొర్రెలన్నీ ఒకే మందగా తయారవుతాయి, ఒకే కాపరి ఉంటాడు. 17  నేను మళ్లీ పొందేలా నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను, అందుకే తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. 18  నా ప్రాణాన్ని నా నుండి ఎవరూ తీసుకోలేరు, నా అంతట నేనే దాన్ని అర్పిస్తున్నాను. దాన్ని అర్పించే అధికారం నాకు ఉంది, మళ్లీ తీసుకునే అధికారం కూడా నాకు ఉంది. ఈ ఆజ్ఞను నేను నా తండ్రి నుండి పొందాను.” 19  ఈ మాటలవల్ల యూదుల్లో మళ్లీ విభజన వచ్చింది. 20  వాళ్లలో చాలామంది ఇలా అన్నారు: “ఇతనికి చెడ్డదూత పట్టాడు, ఇతను పిచ్చివాడు. ఇతని మాటలు ఎందుకు వింటున్నారు?” 21  ఇంకొంతమంది ఇలా అన్నారు: “ఇవి చెడ్డదూత పట్టిన మనిషి మాటలు కావు. చెడ్డదూత ఒక గుడ్డివాడికి చూపును ఇవ్వలేడు కదా?” 22  ఆ సమయంలో యెరూషలేములో సమర్పణ పండుగ జరుగుతోంది. అది చలికాలం. 23  యేసు, ఆలయంలోని సొలొమోను మంటపంలో నడుస్తున్నాడు. 24  అప్పుడు యూదులు ఆయన్ని చుట్టుముట్టి, “నువ్వు ఎంతకాలం మమ్మల్ని ఇలా సందేహాల మధ్య ఉంచుతావు? నువ్వే క్రీస్తువైతే, ఆ మాట మాతో స్పష్టంగా చెప్పు” అని అడగడం మొదలుపెట్టారు. 25  అందుకు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను మీకు చెప్పాను, కానీ మీరు నమ్మట్లేదు. నా తండ్రి పేరుమీద నేను చేస్తున్న పనులే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. 26  అయితే మీరు నా గొర్రెలు కాదు కాబట్టి నమ్మట్లేదు. 27  నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నాకు తెలుసు. అవి నన్ను అనుసరిస్తాయి. 28  వాటికి నేను శాశ్వత జీవితం ఇస్తాను, అవి ఏ విధంగానూ ఎప్పటికీ నాశనం కావు. వాటిని నా చేతిలో నుండి ఎవ్వరూ లాక్కోరు. 29  నా తండ్రి నాకు ఇచ్చిన ఆ గొర్రెలు మిగతా అన్నిటికంటే గొప్పవి. వాటిని తండ్రి చేతిలో నుండి ఎవ్వరూ లాక్కోలేరు. 30  నేను, తండ్రి ఐక్యంగా ఉన్నాం.” 31  అప్పుడు యూదులు ఆయన్ని కొట్టడానికి మళ్లీ రాళ్లు తీసుకున్నారు. 32  కాబట్టి యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “తండ్రి నాకు చెప్పిన ఎన్నో మంచి పనుల్ని నేను మీకు చూపించాను. వాటిలో ఏ పనిని బట్టి మీరు నన్ను కొట్టాలనుకుంటున్నారు?” 33  అప్పుడు యూదులు, “మంచి పనుల్ని బట్టి కాదుగానీ, నువ్వు దేవుణ్ణి దూషించినందుకే నిన్ను రాళ్లతో కొట్టాలనుకుంటున్నాం; నువ్వు మనిషివైనా ఒక దేవుణ్ణి అని చెప్పుకుంటున్నావు” అన్నారు. 34  దానికి యేసు ఇలా జవాబిచ్చాడు: “‘“మీరు దేవుళ్లు”* అని దేవుడు అన్నాడు’ అని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా? 35  దేవుని వాక్యం ఖండించేవాళ్లనే ఆయన ‘దేవుళ్లు’ అని పిలిచినప్పుడు, (అంతేకాదు దేవుని వాక్యం ఎప్పుడూ తప్పు కాదు) 36  తండ్రి పవిత్రపర్చి ఈ లోకంలోకి పంపించిన నేను, దేవుని కుమారుణ్ణి అని చెప్పుకున్నందుకు ‘నువ్వు దేవుణ్ణి దూషిస్తున్నావు’ అని అంటారా? 37  నేను నా తండ్రి పనుల్ని చేయకపోతుంటే నన్ను నమ్మకండి. 38  కానీ నేను వాటిని చేస్తుంటే, మీరు నన్ను నమ్మకపోయినా ఆ పనుల్ని నమ్మండి. అప్పుడు తండ్రి నాతో ఐక్యంగా ఉన్నాడని, నేను తండ్రితో ఐక్యంగా ఉన్నానని మీరు తెలుసుకుంటారు, నమ్ముతూ ఉంటారు.” 39  దాంతో వాళ్లు మళ్లీ ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు, కానీ ఆయన వాళ్లకు దొరకకుండా వెళ్లిపోయాడు. 40  యేసు మళ్లీ, యొర్దాను అవతల యోహాను మొదట్లో బాప్తిస్మం ఇచ్చిన ప్రాంతానికి వెళ్లి, అక్కడ ఉండిపోయాడు. 41  చాలామంది ఆయన దగ్గరికి వచ్చారు, వాళ్లిలా చెప్పుకున్నారు: “యోహాను ఒక్క అద్భుతం కూడా చేయలేదు, అయితే యోహాను ఈయన గురించి చెప్పినవన్నీ నిజం.” 42  అక్కడ చాలామంది ఆయనమీద విశ్వాసం ఉంచారు.

అధస్సూచీలు

లేదా “దేవుళ్ల లాంటివాళ్లు.”