యోహాను 14:1-31

  • తండ్రి దగ్గరికి వెళ్లడానికి యేసు ఒక్కడే మార్గం  (1-14)

    • “నేనే దారిని, సత్యాన్ని, జీవాన్ని”  (6)

  • పవిత్రశక్తి గురించి యేసు మాటివ్వడం  (15-31)

    • “తండ్రి నాకన్నా గొప్పవాడు”  (28)

14  “ఆందోళన పడకండి. దేవుని మీద విశ్వాసం చూపించండి; నా మీద కూడా విశ్వాసం చూపించండి.  నా తండ్రి ఇంట్లో ఉండడానికి చాలా స్థలం ఉంది. లేకపోతే నేను మీకు ఈ మాట చెప్పేవాణ్ణి కాదు. ఎందుకంటే మీ కోసం స్థలం సిద్ధం చేయడానికి నేను వెళ్తున్నాను.  నేను వెళ్లి మీ కోసం స్థలం సిద్ధం చేయగానే, మళ్లీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. అప్పుడు నేను ఉన్న చోట మీరు కూడా ఉండగలుగుతారు.  నేను వెళ్లే చోటికి మీకు దారి తెలుసు.”  అప్పుడు తోమా ఆయన్ని ఇలా అడిగాడు: “ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలీదు. మేము ఆ దారి ఎలా తెలుసుకోగలం?”  అందుకు యేసు ఇలా అన్నాడు: “నేనే దారిని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారానే తప్ప ఎవరూ తండ్రి దగ్గరికి రాలేరు.  మీరు నన్ను తెలుసుకుంటే, నా తండ్రిని కూడా తెలుసుకుంటారు; ఈ క్షణం నుండి మీరు ఆయన్ని తెలుసుకుంటారు, నిజానికి ఇప్పటికే మీరు ఆయన్ని చూశారు.”  అప్పుడు ఫిలిప్పు ఆయనతో, “ప్రభువా, మాకు తండ్రిని చూపించు. మాకది చాలు” అన్నాడు.  యేసు అతనితో ఇలా అన్నాడు: “ఫిలిప్పు, నేను మీతో ఇంతకాలం ఉన్నా నువ్వు నన్ను తెలుసుకోలేదా? నన్ను చూసిన వ్యక్తి తండ్రిని కూడా చూశాడు. అయినా ‘మాకు తండ్రిని చూపించు’ అని ఎందుకు అడుగుతున్నావు? 10  నేను తండ్రితో ఐక్యంగా ఉన్నానని, తండ్రి నాతో ఐక్యంగా ఉన్నాడని నువ్వు నమ్మట్లేదా? నేను మీతో చెప్పే విషయాలు నా అంతట నేను చెప్పట్లేదు. కానీ నాతో ఐక్యంగా ఉన్న తండ్రే నా ద్వారా తన పనులు చేస్తున్నాడు. 11  నేను తండ్రితో ఐక్యంగా ఉన్నానని, తండ్రి నాతో ఐక్యంగా ఉన్నాడని నేను చెప్పిన మాట నమ్మండి; లేదా నేను చేసిన పనుల్ని చూసైనా నమ్మండి. 12  నేను మీతో నిజంగా చెప్తున్నాను, నామీద విశ్వాసం చూపించే వ్యక్తి కూడా నేను చేసే పనులు చేస్తాడు; ఇంకా గొప్ప పనులు కూడా చేస్తాడు, ఎందుకంటే నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. 13  అంతేకాదు, నా పేరుమీద మీరు ఏది అడిగినా నేను అది చేస్తాను. కుమారుడి ద్వారా తండ్రికి మహిమ వచ్చేలా నేను అలా చేస్తాను. 14  మీరు నా పేరుమీద ఏమి అడిగినా నేను చేస్తాను. 15  “మీకు నా మీద ప్రేమ ఉంటే నా ఆజ్ఞలు పాటిస్తారు. 16  నేను తండ్రిని అడుగుతాను, మీతో ఎప్పటికీ ఉండేలా ఆయన మీకు ఇంకో సహాయకుణ్ణి* ఇస్తాడు. 17  అంటే సత్యాన్ని వెల్లడిచేసే పవిత్రశక్తిని మీకు ఇస్తాడు. లోకం దాన్ని పొందలేదు, ఎందుకంటే లోకం దాన్ని చూడలేదు, లోకానికి అది తెలీదు. కానీ మీకు అది తెలుసు, ఎందుకంటే అది మీలో ఉంది, మీతోనే ఉండిపోతుంది. 18  నేను మిమ్మల్ని అనాథలుగా వదిలేయను, మళ్లీ మీ దగ్గరికి వస్తాను. 19  కొంత సమయం తర్వాత లోకం ఇక ఎప్పుడూ నన్ను చూడదు. కానీ మీరు నన్ను చూస్తారు; ఎందుకంటే నేను జీవిస్తున్నాను, మీరు జీవిస్తారు. 20  నేను తండ్రితో ఐక్యంగా ఉన్నానని, మీరు నాతో ఐక్యంగా ఉన్నారని, నేను మీతో ఐక్యంగా ఉన్నానని ఆ రోజు మీరు తెలుసుకుంటారు. 21  నా ఆజ్ఞల్ని స్వీకరించి, వాటిని పాటించే వ్యక్తే నన్ను ప్రేమించే వ్యక్తి. నన్ను ప్రేమించే వ్యక్తిని నా తండ్రి ప్రేమిస్తాడు. నేను కూడా అతన్ని ప్రేమించి, నన్ను నేను అతనికి స్పష్టంగా చూపించుకుంటాను.” 22  ఇస్కరియోతు యూదా కాని ఇంకో యూదా యేసును ఇలా అడిగాడు: “ప్రభువా, నిన్ను నువ్వు లోకానికి కాకుండా మాకే ఎందుకు స్పష్టంగా చూపించుకోవాలని అనుకుంటున్నావు?” 23  అప్పుడు యేసు ఇలా అన్నాడు: “ఎవరైనా నన్ను ప్రేమిస్తే, అతను నా మాట ప్రకారం నడుచుకుంటాడు, నా తండ్రి అతన్ని ప్రేమిస్తాడు. మేము అతని దగ్గరికి వస్తాం, అతను మాతోపాటు ఉంటాడు. 24  నా మీద ప్రేమ లేనివాళ్లు నా మాటల్ని పాటించరు. మీరు వింటున్న మాట నాది కాదు నన్ను పంపించిన తండ్రిదే. 25  “నేను మీతో ఉన్నప్పుడే మీకు ఈ విషయాలు చెప్పాను. 26  అయితే తండ్రి నా పేరుమీద పంపించే సహాయకుడు అంటే పవిత్రశక్తి అన్ని విషయాల్ని మీకు బోధిస్తాడు, నేను మీకు చెప్పిన విషయాలన్నిటినీ మీకు గుర్తుచేస్తాడు. 27  నేను మీకు శాంతిని ఇచ్చి వెళ్తున్నాను; నా శాంతినే మీకు ఇస్తున్నాను. నేను ఇచ్చే శాంతి, లోకం మీకు ఇచ్చే శాంతి లాంటిది కాదు. మీరు ఆందోళన పడకండి, భయపడకండి. 28  ‘నేను వెళ్తున్నాను, మళ్లీ మీ దగ్గరికి వస్తాను’ అని నేను మీతో చెప్పిన మాట విన్నారు కదా. మీకు నా మీద ప్రేమ ఉంటే, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నానని మీరు సంతోషిస్తారు. ఎందుకంటే తండ్రి నాకన్నా గొప్పవాడు. 29  కాబట్టి, అది జరిగినప్పుడు మీరు నమ్మేలా అది జరగకముందే ఇప్పుడు మీకు చెప్పాను. 30  నేను మీతో ఇంక ఎక్కువగా మాట్లాడను; ఎందుకంటే ఈ లోక పరిపాలకుడు వస్తున్నాడు, నా మీద అతనికి ఎలాంటి పట్టూ లేదు. 31  అయితే నాకు తండ్రి మీద ప్రేమ ఉందని లోకం తెలుసుకోవడం కోసం, తండ్రి నాకు ఆజ్ఞాపించినట్లే నేను చేస్తున్నాను. లేవండి, ఇక్కడి నుండి వెళ్దాం.

అధస్సూచీలు

లేదా “ఓదార్పునిచ్చేవాణ్ణి.”