యోహాను 21:1-25

  • శిష్యులకు యేసు కనిపించడం  (1-14)

  • యేసుమీద తనకున్న ప్రేమను పేతురు నొక్కిచెప్పడం  (15-19)

    • “నా చిన్న గొర్రెల్ని మేపు” (17)

  • యేసు ప్రేమించిన శిష్యుని భవిష్యత్తు (20-23)

  • ముగింపు (24, 25)

21  ఆ తర్వాత యేసు, తిబెరియ సముద్రం దగ్గర శిష్యులకు మళ్లీ కనిపించాడు. ఆయన ఈ విధంగా కనిపించాడు:  సీమోను పేతురు, తోమా (ఇతనికి దిదుమ అనే పేరు కూడా ఉంది), గలిలయలోని కానాకు చెందిన నతనయేలు, జెబెదయి కొడుకులు, యేసు శిష్యుల్లో ఇంకో ఇద్దరు అంతా ఒక చోట ఉన్నారు.  అప్పుడు సీమోను పేతురు వాళ్లతో, “నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను” అన్నాడు. వాళ్లు, “మేము కూడా నీతో వస్తాం” అన్నారు. దాంతో వాళ్లు పడవలో బయల్దేరారు. కానీ ఆ రాత్రి వాళ్లకు అసలు చేపలే దొరకలేదు.  తెల్లవారుతున్నప్పుడు యేసు సముద్రం ఒడ్డున నిలబడ్డాడు. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు.  అప్పుడు యేసు వాళ్లతో, “పిల్లలారా, తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా?” అని అడిగాడు. వాళ్లు, “లేదు” అన్నారు.  అప్పుడు ఆయన, “పడవ కుడిపక్క వల వేయండి, మీకు కొన్ని చేపలు దొరుకుతాయి” అని వాళ్లకు చెప్పాడు. దాంతో వాళ్లు వల వేశారు, అయితే చాలా చేపలు పడడంతో వాళ్లు వలను లాగలేకపోయారు.  అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, “ఆయన ప్రభువే!” అని చెప్పాడు. ఆయన ప్రభువని విన్నప్పుడు, సీమోను పేతురు తన పైవస్త్రం వేసుకుని సముద్రంలోకి దూకాడు.  కానీ మిగతా శిష్యులు చేపలతో నిండిన వలను లాక్కుంటూ పడవలో వచ్చారు, ఎందుకంటే వాళ్లు ఒడ్డుకు దాదాపు 90 మీటర్ల* దూరంలోనే ఉన్నారు.  వాళ్లు ఒడ్డుకు చేరుకున్నప్పుడు, కాలుతున్న బొగ్గుల మీద ఉన్న చేపల్ని, రొట్టెను చూశారు. 10  యేసు వాళ్లతో, “మీరు పట్టిన చేపల్లో కొన్ని తీసుకురండి” అన్నాడు. 11  కాబట్టి సీమోను పేతురు పడవ ఎక్కి, పెద్ద చేపలతో నిండిపోయిన ఆ వలను ఒడ్డుకు లాగాడు. అందులో 153 చేపలు ఉన్నాయి. అన్ని చేపలున్నా ఆ వల పిగిలిపోలేదు. 12  యేసు, “వచ్చి భోంచేయండి” అని వాళ్లతో అన్నాడు. అయితే శిష్యుల్లో ఎవరూ ఆయన్ని, “నువ్వు ఎవరు?” అని అడిగే ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఆయన ప్రభువని వాళ్లకు తెలుసు. 13  యేసు రొట్టెను తీసుకుని వాళ్లకు ఇచ్చాడు, అలాగే చేపల్ని కూడా ఇచ్చాడు. 14  యేసు చనిపోయినవాళ్లలో నుండి లేపబడిన తర్వాత శిష్యులకు కనబడడం ఇది మూడోసారి. 15  వాళ్లు భోజనం చేశాక యేసు సీమోను పేతురును, “యోహాను కొడుకువైన సీమోనూ, నువ్వు వీటికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. అందుకు పేతురు, “అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు” అని ఆయనతో అన్నాడు. అప్పుడు యేసు పేతురుతో, “నా గొర్రెపిల్లల్ని మేపు” అని చెప్పాడు. 16  యేసు మళ్లీ రెండోసారి, “యోహాను కొడుకువైన సీమోనూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. అందుకు పేతురు, “అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు” అన్నాడు. అప్పుడు యేసు పేతురుతో, “నా చిన్న గొర్రెల్ని కాయి” అన్నాడు. 17  యేసు మూడోసారి పేతురును, “యోహాను కొడుకువైన సీమోనూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. యేసు మూడోసారి, “నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగేసరికి పేతురు చాలా బాధపడి, “ప్రభువా, నీకు అన్నీ తెలుసు; నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. అప్పుడు యేసు పేతురుతో ఇలా అన్నాడు: “నా చిన్న గొర్రెల్ని మేపు. 18  నేను నిజంగా నీతో చెప్తున్నాను, నువ్వు యువకుడిగా ఉన్నప్పుడు నీ అంతట నువ్వే బట్టలు వేసుకుని నీకు నచ్చిన చోటికి వెళ్లేవాడివి. కానీ నువ్వు ముసలివాడివి అయినప్పుడు నువ్వు చేతులు చాపుతావు, ఇంకెవరో నీకు బట్టలు వేసి నీకు నచ్చని చోటికి నిన్ను తీసుకెళ్తారు.” 19  పేతురు ఎలాంటి మరణం ద్వారా దేవునికి మహిమ తెస్తాడో సూచించడానికి యేసు ఆ మాట అన్నాడు. ఆ మాట అన్నాక యేసు పేతురుతో, “నన్ను అనుసరిస్తూ ఉండు” అని చెప్పాడు. 20  పేతురు వెనక్కి తిరిగి, యేసు ప్రేమించిన శిష్యుడు తమ వెనక రావడం చూశాడు. రాత్రి భోజనమప్పుడు యేసు రొమ్మును ఆనుకొని, “ప్రభువా, నిన్ను అప్పగించబోతున్నది ఎవరు?” అని అడిగింది అతనే. 21  అతన్ని చూసినప్పుడు పేతురు యేసును, “ప్రభువా, మరి ఇతని సంగతేంటి?” అని అడిగాడు. 22  అప్పుడు యేసు, “నేను వచ్చేంతవరకు అతను ఉండడం నాకిష్టమైతే నీకేంటి? నువ్వైతే నన్ను అనుసరిస్తూ ఉండు” అని పేతురుతో అన్నాడు. 23  కాబట్టి ఆ శిష్యుడు చావడు అనే మాట సోదరుల్లో వ్యాపించింది. అయితే అతను చావడని యేసు అతనితో అనలేదు కానీ, “నేను వచ్చేంతవరకు అతను ఉండడం నాకిష్టమైతే నీకేంటి?” అని మాత్రమే అన్నాడు. 24  వీటి గురించి ఈ సాక్ష్యం ఇస్తున్నది, వీటిని రాసింది ఆ శిష్యుడే. అతని సాక్ష్యం సత్యమని మనకు తెలుసు. 25  నిజానికి యేసు చేసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో ఒక్కోదాని గురించి వివరంగా రాస్తే, అలా రాసిన గ్రంథపు చుట్టల్ని పెట్టడానికి ఈ భూమి కూడా సరిపోదని నాకు అనిపిస్తుంది.

అధస్సూచీలు

అక్ష., “దాదాపు 200 మూరల.”