యోహాను 3:1-36

  • యేసు, నీకొదేము (1-21)

    • మళ్లీ పుట్టడం  (3-8)

    • దేవుడు లోకాన్ని ప్రేమించాడు (16)

  • యేసు గురించి యోహాను ఇచ్చిన చివరి సాక్ష్యం  (22-30)

  • పైనుండి వచ్చే వ్యక్తి  (31-36)

3  నీకొదేము అనే ఒక పరిసయ్యుడు ఉన్నాడు, అతను యూదుల అధికారి.  అతను రాత్రివేళ యేసు దగ్గరికి వచ్చి, “రబ్బీ, నువ్వు దేవుని దగ్గరి నుండి వచ్చిన బోధకుడివని మాకు తెలుసు. దేవుడు తోడుగా ఉంటే తప్ప ఎవరూ నువ్వు చేస్తున్న ఈ అద్భుతాలు చేయలేరు” అన్నాడు.  అప్పుడు యేసు ఇలా అన్నాడు: “నేను నిజంగా నీతో చెప్తున్నాను, ఒక వ్యక్తి మళ్లీ పుడితేనే* తప్ప అతను దేవుని రాజ్యాన్ని చూడలేడు.”  కాబట్టి నీకొదేము, “ఒక వ్యక్తి ముసలివాడైన తర్వాత మళ్లీ ఎలా పుట్టగలడు? అతను మళ్లీ తన తల్లి గర్భంలోకి ప్రవేశించి పుట్టగలడా?” అని అడిగాడు.  యేసు ఇలా జవాబిచ్చాడు: “నేను నిజంగా నీతో చెప్తున్నాను, ఒక వ్యక్తి నీళ్లవల్ల, పవిత్రశక్తివల్ల పుడితేనే తప్ప దేవుని రాజ్యంలోకి వెళ్లలేడు.  మానవ తల్లిదండ్రుల వల్ల పుట్టేవాళ్లు మనుషుల పిల్లలు, పవిత్రశక్తి వల్ల పుట్టేవాళ్లు దేవుని పిల్లలు.  మీరు మళ్లీ పుట్టాలి అని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపోవద్దు.  గాలి ఎటు వీచాలనుకుంటే అటు వీస్తుంది, దాని శబ్దం నీకు వినిపిస్తుంది కానీ అది ఎక్కడి నుండి వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో నీకు తెలీదు. పవిత్రశక్తి వల్ల పుట్టిన ప్రతీ ఒక్కరి విషయం కూడా అంతే.”  అప్పుడు నీకొదేము, “ఇవి ఎలా సాధ్యం?” అని యేసును అడిగాడు. 10  యేసు ఇలా జవాబిచ్చాడు: “నువ్వు ఇశ్రాయేలీయులకు బోధకుడివి, అయినా ఈ విషయాలు నీకు ఎందుకు తెలీదు? 11  నేను నిజంగా నీతో చెప్తున్నాను, మాకు తెలిసినవాటినే మేము మాట్లాడుతున్నాం, మేము చూసినవాటి గురించే సాక్ష్యమిస్తున్నాం, అయితే మేమిచ్చే సాక్ష్యాన్ని మీరు అంగీకరించరు. 12  నేను భూసంబంధమైన విషయాలు మీకు చెప్పాను, అయినా మీరు నమ్మట్లేదు. మరి నేను పరలోక సంబంధమైన విషయాలు చెప్తే ఎలా నమ్ముతారు? 13  అంతేకాదు, పరలోకం నుండి దిగివచ్చిన మానవ కుమారుడు తప్ప ఏ మనిషీ పరలోకానికి ఎక్కిపోలేదు. 14  మోషే అరణ్యంలో సర్పాన్ని పైకెత్తినట్లే మానవ కుమారుడు కూడా ఎత్తబడాలి. 15  దానివల్ల, ఆయన్ని నమ్మే ప్రతీ ఒక్కరు శాశ్వత జీవితం పొందగలుగుతారు. 16  “దేవుడు లోకంలోని ప్రజల్ని ఎంతో ప్రేమించాడు, ఎంతగా అంటే వాళ్లకోసం తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయన మీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవితం పొందాలని అలా చేశాడు. 17  లోకానికి తీర్పు తీర్చడానికి దేవుడు తన కుమారుణ్ణి పంపించలేదు గానీ, లోకం తన కుమారుడి ద్వారా రక్షించబడేందుకే పంపించాడు. 18  ఆయనమీద విశ్వాసం ఉంచే వాళ్లెవ్వరికీ తీర్పు తీర్చబడదు. ఆయనమీద విశ్వాసం ఉంచనివాళ్లకు అప్పటికే తీర్పు తీర్చబడింది, ఎందుకంటే దేవుని ఒక్కగానొక్క కుమారుడి పేరుమీద వాళ్లు విశ్వాసం ఉంచలేదు. 19  నిజంగానే వెలుగు లోకంలోకి వచ్చింది. అయితే మనుషులు చెడ్డ పనులు చేస్తున్నారు కాబట్టి వెలుగును కాకుండా చీకటిని ప్రేమించారు. అందుకే వాళ్లకు తీర్పు తీర్చబడుతుంది. 20  నీచమైన పనులు చేస్తూ ఉండే ప్రతీ ఒక్కరు వెలుగును ద్వేషిస్తారు; తమ పనులు బయటపడతాయని వాళ్లు వెలుగు దగ్గరికి రారు. 21  అయితే సరైన పనులు చేసే ప్రతీ ఒక్కరు, తమ పనులు దేవుని ఇష్టప్రకారం ఉన్నాయని అందరికీ తెలిసేలా వెలుగు దగ్గరికి వస్తారు.” 22  ఆ తర్వాత యేసు, ఆయన శిష్యులు యూదయలోని పల్లె ప్రాంతా లకు వెళ్లారు. అక్కడ ఆయన వాళ్లతో కొంత సమయం గడిపాడు; బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. 23  అయితే యోహాను కూడా సలీము దగ్గర ఉన్న ఐనోనులో బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు, ఎందుకంటే అక్కడ ఒక పెద్ద నీటిమడుగు ఉంది. ప్రజలు ఆయన దగ్గరికి వస్తూ బాప్తిస్మం తీసుకుంటూ ఉన్నారు. 24  అప్పటికి యోహాను ఇంకా చెరసాలలో వేయబడలేదు. 25  యోహాను శిష్యులు శుద్ధీకరణ కట్టుబాట్ల విషయంలో ఒక యూదునితో వాదన పెట్టుకున్నారు. 26  తర్వాత వాళ్లు యోహాను దగ్గరికి వచ్చి ఇలా చెప్పారు: “రబ్బీ, యొర్దాను నది అవతల నీ దగ్గరికి వచ్చిన వ్యక్తి, నువ్వు సాక్ష్యమిచ్చిన వ్యక్తి నీకు తెలుసు కదా. ఇదిగో ఆయన బాప్తిస్మం ఇస్తున్నాడు, అందరూ ఆయన దగ్గరికి వెళ్తున్నారు.” 27  అప్పుడు యోహాను వాళ్లతో ఇలా అన్నాడు: “పరలోకం నుండి ఇవ్వబడితేనే తప్ప ఒక వ్యక్తి ఏదీ పొందలేడు. 28  ‘నేను క్రీస్తును కాదుగానీ ఆయనకు ముందుగా పంపబడ్డాను’ అని నేను చెప్పిన మాట మీరే స్వయంగా విన్నారు. 29  పెళ్లికూతురు పెళ్లికొడుకుకు సొంతం. అయితే పెళ్లికొడుకు స్నేహితుడు పెళ్లికొడుకు దగ్గర నిలబడి అతను మాట్లాడడం విన్నప్పుడు ఎంతో సంతోషిస్తాడు. కాబట్టి ఇప్పుడు నా సంతోషం సంపూర్ణమైంది. 30  ఆయన ఎక్కువౌతూ ఉండాలి, నేను తగ్గిపోతూ ఉండాలి.” 31  పైనుండి వచ్చే వ్యక్తి అందరికన్నా పైన ఉన్నాడు. భూమి నుండి వచ్చే వ్యక్తి భూసంబంధమైన వ్యక్తి, అతను భూమ్మీది విషయాల గురించే మాట్లాడతాడు. పరలోకం నుండి వచ్చే వ్యక్తి అందరికన్నా పైన ఉన్నాడు. 32  ఆయన తాను చూసినవాటి గురించి, విన్నవాటి గురించి సాక్ష్యమిస్తాడు. కానీ ఆయన సాక్ష్యాన్ని ఎవరూ అంగీకరించరు. 33  అయితే ఆయన సాక్ష్యాన్ని అంగీకరించిన ప్రతీ ఒక్కరు దేవుడు సత్యవంతుడని ధృవీకరించారు.* 34  దేవుడు పంపించిన వ్యక్తి దేవుని మాటలు మాట్లాడతాడు, ఎందుకంటే దేవుడు పవిత్రశక్తిని కొద్దికొద్దిగా* ఇవ్వడు. 35  తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు, అన్నిటినీ ఆయన చేతికి అప్పగించాడు. 36  కుమారుడి మీద విశ్వాసం చూపించే వ్యక్తి శాశ్వత జీవితం పొందుతాడు. కుమారుడికి విధేయత చూపించని వ్యక్తి శాశ్వత జీవితం పొందడు; కానీ దేవుని ఆగ్రహం అతని మీదికి వస్తుంది.

అధస్సూచీలు

లేదా “పైనుండి పుడితేనే” అయ్యుంటుంది.
అక్ష., “తమ ముద్ర వేశారు.”
లేదా “కొలిచి.”