యోహాను 5:1-47
5 ఆ తర్వాత, యూదుల పండుగ ఒకటి వచ్చింది, దాంతో యేసు యెరూషలేముకు వెళ్లాడు.
2 యెరూషలేములోని గొర్రెల ద్వారం దగ్గర ఒక కోనేరు ఉంది, హీబ్రూ భాషలో దాని పేరు బేతెస్ద. దానికి ఐదు మంటపాలు ఉన్నాయి.
3 ఆ మంటపాల్లో రోగులు, గుడ్డివాళ్లు, కుంటివాళ్లు, కాళ్లూచేతులు చచ్చుబడినవాళ్లు* గుంపులుగుంపులుగా పడివున్నారు.
4 *——
5 అయితే, 38 సంవత్సరాలుగా జబ్బుతో బాధపడుతున్న ఒక వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడు.
6 అతను అక్కడ పడుకొని ఉండడం యేసు చూశాడు. అతను చాలాకాలంగా జబ్బుతో బాధపడుతున్నాడని యేసుకు తెలుసు కాబట్టి, “నీకు బాగవ్వాలని ఉందా?” అని అతన్ని అడిగాడు.
7 అందుకు అతను, “అయ్యా, నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించేవాళ్లు ఎవరూ లేరు, నేను వెళ్లేలోపు నాకన్నా ముందే ఎవరో ఒకరు అందులోకి దిగుతున్నారు” అన్నాడు.
8 యేసు అతనితో, “లేచి, నీ పరుపు* తీసుకొని నడువు” అన్నాడు.
9 అతను వెంటనే బాగయ్యి, తన పరుపు* తీసుకొని నడవడం మొదలుపెట్టాడు.
అది విశ్రాంతి రోజు.
10 కాబట్టి కొంతమంది యూదులు అతనితో, “ఇవాళ విశ్రాంతి రోజు, నువ్వు పరుపు* మోయడం తప్పు” అని అంటూ ఉన్నారు.
11 దానికి అతను, “నన్ను బాగుచేసిన వ్యక్తే, ‘నీ పరుపు* తీసుకొని నడువు’ అని నాతో చెప్పాడు” అన్నాడు.
12 అప్పుడు వాళ్లు, “‘దీన్ని తీసుకొని నడువు’ అని నీతో చెప్పింది ఎవరు?” అని అడిగారు.
13 అయితే బాగైన ఆ వ్యక్తికి తనను బాగుచేసింది ఎవరో తెలీదు, ఎందుకంటే యేసు ఆ చోటు నుండి వెళ్లిపోయి అక్కడున్న ప్రజల గుంపులో కలిసిపోయాడు.
14 తర్వాత యేసు అతన్ని ఆలయంలో చూసి, “ఇప్పుడు నువ్వు బాగయ్యావు. నీకు మరింత చెడు జరగకుండా ఇక మీదట పాపం చేయకు” అని అతనితో అన్నాడు.
15 అప్పుడు అతను వెళ్లి, తనను బాగుచేసింది యేసు అని యూదులతో చెప్పాడు.
16 కాబట్టి యూదులు యేసును హింసించడం మొదలుపెట్టారు. ఎందుకంటే యేసు విశ్రాంతి రోజున ఈ పనులు చేస్తున్నాడు.
17 అయితే యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నా తండ్రి ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాడు, కాబట్టి నేను కూడా పనిచేస్తూ ఉన్నాను.”
18 అప్పటినుండి యూదులు యేసును చంపాలని ఇంకా ఎక్కువగా ప్రయత్నించారు. ఎందుకంటే యేసు విశ్రాంతి రోజును ఆచరించకపోగా, దేవుణ్ణి తన సొంత తండ్రి అని పిలుస్తూ తనను దేవునితో సమానంగా చేసుకుంటున్నాడని వాళ్లు అనుకున్నారు.
19 కాబట్టి యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను నిజంగా మీతో చెప్తున్నాను. కుమారుడు తనంతట తానే ఏ పనీ చేయలేడు, తండ్రి ఏ పనులు చేయడం చూస్తాడో వాటినే కుమారుడు చేస్తాడు. తండ్రి చేసే పనులే కుమారుడు కూడా చేస్తాడు, ఆయనలాగే చేస్తాడు.
20 తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు, తాను చేసే వాటన్నిటినీ కుమారుడికి చూపిస్తాడు; అంతేకాదు మీరు ఆశ్చర్యంలో మునిగిపోయేలా, వీటికన్నా గొప్పవాటిని కూడా ఆయనకు చూపిస్తాడు.
21 తండ్రి ఎలాగైతే చనిపోయినవాళ్లను లేపి వాళ్లకు జీవాన్ని ఇస్తాడో, అలాగే కుమారుడు కూడా తనకు ఇష్టమైనవాళ్లకు జీవాన్ని ఇస్తాడు.
22 తండ్రి ఏ ఒక్కరికీ తీర్పుతీర్చడు, అయితే అందరికీ తీర్పుతీర్చే పనిని ఆయన కుమారుడికి అప్పగించాడు.
23 తనను ఘనపర్చినట్లే అందరూ కుమారుణ్ణి కూడా ఘనపర్చాలని తండ్రి అలా చేశాడు. కుమారుణ్ణి ఘనపర్చనివాళ్లు ఆయన్ని పంపించిన తండ్రిని కూడా ఘనపర్చడం లేదు.
24 నేను నిజంగా మీతో చెప్తున్నాను. నా మాటలు విని నన్ను పంపించిన తండ్రి మీద విశ్వాసం ఉంచే ప్రతీ వ్యక్తి శాశ్వత జీవితం పొందుతాడు. అతనికి తీర్పు తీర్చబడదు; అతను మరణాన్ని దాటి జీవంలోకి వచ్చాడు.
25 “నేను నిజంగా మీతో చెప్తున్నాను. చనిపోయినవాళ్లు దేవుని కుమారుడి స్వరం వినే ఒక సమయం రాబోతుంది, అది ఇప్పటికే వచ్చేసింది. ఆయన చెప్పేది శ్రద్ధగా విని, పాటించేవాళ్లు బ్రతుకుతారు.
26 జీవాన్ని ఇచ్చే శక్తి తండ్రికి ఉంది; అలాగే జీవాన్ని ఇచ్చే శక్తిని ఆయన కుమారుడికి కూడా ఇచ్చాడు.
27 అంతేకాదు ఆ కుమారుడు మానవ కుమారుడు కాబట్టి, తీర్పుతీర్చే అధికారాన్ని తండ్రి ఆయనకు ఇచ్చాడు.
28 దీనికి ఆశ్చర్యపోకండి. ఒక సమయం రాబోతుంది, అప్పుడు సమాధుల్లో* ఉన్న వాళ్లందరూ ఆయన స్వరం విని
29 బయటికి వస్తారు; మంచి పనులు చేసినవాళ్లు జీవించడానికి పునరుత్థానం అవుతారు, అలవాటుగా నీచమైన పనులు చేసినవాళ్లు తీర్పు పొందడానికి పునరుత్థానం అవుతారు.
30 నా అంతట నేను ఏ పనీ చేయలేను. తండ్రి ఎలా చెప్తే అలా తీర్పు తీరుస్తాను; నా తీర్పు సరైనది, ఎందుకంటే నేను నా ఇష్టాన్ని కాదుగానీ నన్ను పంపించిన తండ్రి ఇష్టాన్నే చేయాలని కోరుకుంటాను.
31 “నా గురించి నేను ఒక్కడినే సాక్ష్యమిస్తే, నా సాక్ష్యం చెల్లదు.
32 అయితే నా గురించి సాక్ష్యమిచ్చే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన నా గురించి ఇచ్చే సాక్ష్యం నిజమని నాకు తెలుసు.
33 మీరు యోహాను దగ్గరకు మనుషుల్ని పంపించారు, అతను సత్యం గురించి సాక్ష్యమిచ్చాడు.
34 అయినా నేను మనుషులు ఇచ్చే సాక్ష్యాన్ని అంగీకరించను. అయితే మీరు రక్షించబడాలనే ఉద్దేశంతో మీకు ఈ విషయాలు చెప్తున్నాను.
35 ఆ యోహాను మండుతూ, ప్రకాశించే దీపంలా ఉన్నాడు; కొంతకాలం మీరు అతని వెలుగులో సంతోషించడానికి ఇష్టపడ్డారు.
36 కానీ యోహాను ఇచ్చిన సాక్ష్యంకన్నా గొప్ప సాక్ష్యం నాకు ఉంది. తండ్రి నాకు నియమించిన పనులే అంటే నేను చేస్తున్న ఈ పనులే నన్ను తండ్రి పంపించాడని సాక్ష్యం ఇస్తున్నాయి.
37 నన్ను పంపించిన తండ్రే స్వయంగా నా గురించి సాక్ష్యమిచ్చాడు. మీరు ఆయన స్వరాన్ని ఎప్పుడూ వినలేదు, ఆయన రూపాన్ని చూడలేదు.
38 అంతేకాదు, ఆయన వాక్యం మీ హృదయాల్లో లేదు, ఎందుకంటే మీరు ఆయన పంపించిన వ్యక్తిని నమ్మట్లేదు.
39 “లేఖనాల వల్ల మీకు శాశ్వత జీవితం వస్తుందనే ఉద్దేశంతో మీరు వాటిని పరిశోధిస్తున్నారు. అయితే ఆ లేఖనాలే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి.
40 అయినా జీవం పొందేలా నా దగ్గరికి రావడం మీకు ఇష్టంలేదు.
41 మనుషులు ఇచ్చే మహిమ నాకు అవసరంలేదు.
42 మీకు దేవుని మీద ప్రేమ లేదని నాకు బాగా తెలుసు.
43 నేను నా తండ్రి పేరున వచ్చాను, కానీ మీరు నన్ను అంగీకరించరు. ఇంకెవరైనా తనంతట తానే వస్తే మీరు అతన్ని అంగీకరిస్తారు.
44 మీరు ఏకైక దేవుడిచ్చే మహిమను కోరుకోకుండా ఒకరినుండి ఒకరు మహిమను కోరుకుంటున్నారు; అలాంటప్పుడు మీరు నన్నెలా నమ్ముతారు?
45 తండ్రి దగ్గర నేను మిమ్మల్ని తప్పుపడతానని అనుకోకండి; మీరు ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకున్నారో ఆ మోషేనే మిమ్మల్ని తప్పుపడతాడు.
46 నిజానికి మీరు మోషేని నమ్మి ఉంటే, నన్నూ నమ్మేవాళ్లు; ఎందుకంటే అతను నా గురించి రాశాడు.
47 కానీ మీరు అతను రాసినవాటినే నమ్మనప్పుడు, నేను చెప్పేవి ఎలా నమ్ముతారు?”
అధస్సూచీలు
^ అక్ష., “ఎండిపోయినవాళ్లు.”
^ మత్తయి 17:21కి ఉన్న పాదసూచిక చూడండి.
^ లేదా “చాప.”
^ లేదా “చాప.”
^ లేదా “చాప.”
^ లేదా “చాప.”
^ లేదా “స్మారక సమాధుల్లో.”