రోమీయులు 10:1-21

  • దేవుని నీతిని ఎలా పొందాలి  (1-15)

    • బహిరంగంగా ప్రకటించడం  (10)

    • యెహోవా పేరు ఉపయోగించి ప్రార్థిస్తే రక్షించబడతారు (13)

    • ప్రకటించేవాళ్ల అందమైన పాదాలు (15)

  • మంచివార్త తిరస్కరించబడింది  (16-21)

10  సోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, దేవుణ్ణి వేడుకుంటున్నాను.  దేవుని సేవ చేయాలనే ఉత్సాహం వాళ్లకు ఉందని నేను చెప్పగలను. అయితే, ఆ ఉత్సాహం సరైన జ్ఞానానికి అనుగుణంగా లేదు.  వాళ్లకు దేవుని నీతి తెలియదు, కానీ వాళ్లు తమ సొంత నీతిని స్థాపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే, వాళ్లు దేవుని నీతికి లోబడలేదు.  విశ్వాసం చూపించే ప్రతీ ఒక్కరు నీతిని పొందగలిగేలా క్రీస్తు ద్వారా ధర్మశాస్త్రం ముగింపుకొచ్చింది.  ధర్మశాస్త్రం ప్రకారం నీతిమంతునిగా ఎంచబడే వ్యక్తి గురించి మోషే ఇలా రాశాడు: “వీటిని పాటించే వ్యక్తి వీటి వల్ల జీవిస్తాడు.”  విశ్వాసం వల్ల కలిగే నీతి గురించి లేఖనాల్లో ఇలా రాసివుంది: “‘ఎవరు పరలోకానికి ఎక్కి వెళ్తారు?’ అంటే, క్రీస్తును కిందికి తీసుకురావడానికి ఎవరు పరలోకానికి ఎక్కి వెళ్తారు? అని మీ హృదయంలో అనుకోవద్దు.  లేదా ‘ఎవరు అగాధంలోకి దిగి వెళ్తారు?’ అంటే, క్రీస్తును మృతుల్లో నుండి పైకి తీసుకొచ్చేందుకు ఎవరు అగాధంలోకి దిగి వెళ్తారు? అని మీ హృదయంలో అనుకోవద్దు.”  అయితే లేఖనం ఏమి చెప్తోంది? “దేవుని సందేశం మీ దగ్గరే ఉంది, మీ నోట్లోనే ఉంది, మీ హృదయంలోనే ఉంది”; ఆ సందేశం, మనం ప్రకటిస్తున్న విశ్వాసం గురించిన “సందేశం.”  యేసు ప్రభువని మీ నోటితో బహిరంగంగా ప్రకటిస్తే, యేసును మృతుల్లో నుండి దేవుడు బ్రతికించాడని మీ హృదయంలో విశ్వసిస్తే మీరు రక్షించబడతారు. 10  ఎందుకంటే ఓ వ్యక్తి దేవుని దృష్టిలో నీతిమంతుడు కావాలంటే హృదయంలో విశ్వసించాలి, రక్షణ పొందాలంటే నోటితో బహిరంగంగా ప్రకటించాలి. 11  లేఖనం ఇలా చెప్తోంది: “ఆయన మీద విశ్వాసం ఉంచేవాళ్లు ఎవ్వరూ నిరాశపడరు.” 12  యూదుడు, గ్రీసు దేశస్థుడు అనే తేడా ఏమీ లేదు. అందరికీ ప్రభువు ఒక్కడే. తనను పిలిచేవాళ్లందర్నీ ఆయన మెండుగా దీవిస్తాడు. 13  ఎందుకంటే, “యెహోవా* పేరు ఉపయోగించి ప్రార్థించే ప్రతీ ఒక్కరు రక్షించబడతారు.” 14  అయితే, ఆయన మీద వాళ్లకు విశ్వాసం లేకపోతే, ఆయన పేరు ఉపయోగించి వాళ్లెలా ప్రార్థిస్తారు? తమకు తెలియని వ్యక్తి* మీద వాళ్లెలా విశ్వాసం ఉంచుతారు? ఎవరైనా ప్రకటించకపోతే వాళ్లెలా వింటారు? 15  ఎవ్వరూ వాళ్లను పంపించకపోతే* వాళ్లెలా ప్రకటిస్తారు? లేఖనాల్లో రాసివున్నట్టే, “మంచి విషయాల గురించిన మంచివార్త ప్రకటించేవాళ్ల పాదాలు ఎంత అందంగా ఉన్నాయి!” 16  అయినా, వాళ్లందరూ మంచివార్తకు లోబడలేదు. యెషయా ఇలా రాశాడు: “యెహోవా,* మేము మాట్లాడిన* విషయాల మీద ఎవరు విశ్వాసం ఉంచారు?” 17  సందేశం విన్న తర్వాతే విశ్వాసం కలుగుతుంది. ఎవరైనా క్రీస్తు గురించి మాట్లాడినప్పుడే సందేశం వినడం అనేది జరుగుతుంది. 18  అయితే నేను అడిగేది ఏమిటంటే, వాళ్లు వినలేదా? విన్నారు కదా. నిజానికి, “వాళ్ల శబ్దం భూమంతటా వినిపించింది; వాళ్ల సందేశం భూమి అంచుల వరకూ వెళ్లింది.” 19  అయితే నేను అడిగేది ఏమిటంటే, ఇశ్రాయేలీయులకు తెలియదా? తెలుసు కదా. ముందుగా మోషే ఇలా అన్నాడు: “నేను అన్యుల ద్వారా మీలో అసూయ పుట్టిస్తాను; మూర్ఖమైన జనం ద్వారా మీకు విపరీతమైన కోపం తెప్పిస్తాను.” 20  దేవుడు చెప్పిన ఈ మాటల్ని యెషయా ధైర్యంగా ప్రకటించాడు: “నా కోసం వెదకనివాళ్లకు నేను దొరికాను; నా గురించి అడగనివాళ్లకు నన్ను నేను కనబర్చుకున్నాను.” 21  కానీ ఇశ్రాయేలీయుల గురించి అతను ఇలా అన్నాడు: “అవిధేయులైన మొండి ప్రజల్ని తిరిగి నా దగ్గరికి రమ్మని రోజంతా నా చేతులు చాపి వేడుకున్నాను.”

అధస్సూచీలు

పదకోశం చూడండి.
అక్ష., “తాము వినని వ్యక్తి.”
బహుశా “దేవుడు వాళ్లను పంపించకపోతే” అని అర్థం.
పదకోశం చూడండి.
అక్ష., “మా నుండి విన్న.”