రోమీయులు 11:1-36
11 అయితే నేను అడిగేది ఏమిటంటే, దేవుడు తన ప్రజల్ని తిరస్కరించాడా? లేనేలేదు! ఎందుకంటే నేను కూడా ఇశ్రాయేలీయుణ్ణే, అబ్రాహాము వంశస్థుణ్ణి,* బెన్యామీను గోత్రీకుణ్ణి.
2 తాను మొట్టమొదట గుర్తించిన తన ప్రజల్ని ఆయన తిరస్కరించలేదు. ఏలీయా ఇశ్రాయేలీయుల మీద దేవునికి ఫిర్యాదు చేసిన సందర్భంలో లేఖనం అతని గురించి ఏమి చెప్తోందో మీకు తెలియదా?
3 “యెహోవా,* వాళ్లు నీ ప్రవక్తల్ని చంపేశారు, నీ బలిపీఠాల్ని ధ్వంసం చేశారు; నేను ఒక్కడినైపోయాను, వాళ్లు ఇప్పుడు నా ప్రాణాలు తీయాలని చూస్తున్నారు.”
4 కానీ అప్పుడు దేవుడు అతనితో ఏమన్నాడు? “బయలుకు మొక్కని నా ప్రజలు ఇంకా 7,000 మంది ఉన్నారు.”
5 అలాగే, ఈ కాలంలో కూడా దేవుడు తన అపారదయతో ఎంచుకున్న ఇశ్రాయేలీయులు కొందరు మిగిలివున్నారు.
6 అంటే, దేవుడు వాళ్లు చేసిన పనుల వల్ల కాకుండా తన అపారదయ వల్ల వాళ్లను ఎంచుకున్నాడు. ఒకవేళ వాళ్లు తమ పనుల వల్ల ఎంపికవ్వగలిగితే, ఇక దేవుని అపారదయ వల్ల ఎంపికవ్వడం అనేది ఉండదు.
7 మరైతే ఏమనాలి? ఇశ్రాయేలీయులు దేనికోసమైతే పట్టుదలగా ప్రయత్నించారో దాన్ని వాళ్లు పొందలేదు; కానీ దేవుడు ఎంచుకున్నవాళ్లు దాన్ని పొందారు. మిగతావాళ్లు తమ హృదయాల్ని కఠినపర్చుకున్నారు.
8 లేఖనాల్లో రాసివున్నట్టే అది జరిగింది: “దేవుడు వాళ్ల హృదయాలకు గాఢ నిద్ర కలుగజేశాడు; చూడలేని కళ్లను, వినలేని చెవులను వాళ్లకు ఇచ్చాడు. ఈరోజు వరకు వాళ్లు అదే స్థితిలో ఉన్నారు.”
9 అంతేకాదు దావీదు ఇలా అన్నాడు: “వాళ్ల భోజన బల్ల వాళ్లకు వలగా, ఉచ్చుగా, అడ్డురాయిగా మారాలి. వాళ్లు శిక్షించబడాలి.
10 కనబడకుండా వాళ్ల కళ్లకు చీకటి కమ్మాలి, వాళ్ల నడుములు ఎప్పుడూ వంగిపోయే ఉండాలి.”
11 కాబట్టి నేను అడిగేది ఏమిటంటే, వాళ్లు తట్టుకొని పూర్తిగా కిందపడ్డారా? అస్సలు అలా జరగలేదు! కానీ వాళ్లు తప్పటడుగు వేయడం వల్ల అన్యులకు రక్షణ కలిగింది. ఇశ్రాయేలీయుల్లో అసూయ పుట్టించడానికే అలా జరిగింది.
12 వాళ్లు వేసిన తప్పటడుగు వల్ల లోకానికి సంపదలు వచ్చాయి, వాళ్ల సంఖ్య తగ్గినందువల్ల అన్యులకు సంపదలు కలిగాయి. అలాంటిది వాళ్ల పూర్తి సంఖ్య వల్ల ఇంకెన్ని సంపదలు కలుగుతాయో కదా!
13 ఇప్పుడు నేను అన్యులైన మీతో మాట్లాడుతున్నాను. నేను అన్యులకు అపొస్తలుణ్ణి కాబట్టి నా పరిచర్యను మహిమపరుస్తున్నాను.
14 నా సొంత ప్రజల్లో ఏదోవిధంగా అసూయ పుట్టించి వాళ్లలో కొందరినైనా రక్షణకు నడిపించగలనేమో చూద్దామన్నదే నా ఉద్దేశం.
15 దేవుడు వాళ్లను వెళ్లగొట్టడం వల్ల లోకానికి ఆయనతో శాంతికరమైన సంబంధం ఏర్పడేందుకు మార్గం తెరుచుకుంది. అలాంటిది, దేవుడు వాళ్లను అంగీకరిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్లు మృతుల్లో నుండి మళ్లీ బ్రతికి జీవం సంపాదించుకున్నట్టు ఉంటుంది.
16 అంతేకాదు, పిండిముద్ద నుండి ప్రథమఫలంగా తీసుకున్న భాగం పవిత్రమైనదైతే, మొత్తం పిండిముద్ద కూడా పవిత్రమైనదే; చెట్టు వేరు పవిత్రమైనదైతే, కొమ్మలు కూడా పవిత్రమైనవే.
17 అయితే, దేవుడు ఒలీవ చెట్టులోని కొన్ని కొమ్మలు విరిచి, అడవి ఒలీవ కొమ్మలైన మిమ్మల్ని ఆ చెట్టుకు అంటుకట్టాడు. అలా మీరు కూడా అసలైన ఒలీవ వేరు సారం నుండి ప్రయోజనం పొందారు.
18 కాబట్టి దేవుడు విరిచిన ఆ చెట్టు కొమ్మల్ని చిన్నచూపు చూడకండి. ఎందుకంటే ఆ చెట్టు వేరుకు పోషణ ఇస్తున్నది మీరు కాదు; ఆ వేరే మీకు పోషణనిస్తోంది.
19 కానీ మీరు, “నన్ను అంటుకట్టడానికే దేవుడు ఆ కొమ్మల్ని విరిచాడు” అని అంటారు.
20 అది నిజమే! వాళ్లకు విశ్వాసం లేకపోవడం వల్లే దేవుడు వాళ్లను విరిచేశాడు; కానీ మీరు విశ్వాసం వల్ల స్థిరంగా ఉన్నారు. అలాగని గర్వించకండి, బదులుగా భయంతో ఉండండి.
21 దేవుడు సహజమైన కొమ్మల్నే విడిచిపెట్టలేదంటే, మిమ్మల్ని విడిచిపెడతాడా?
22 కాబట్టి దేవుని దయ గురించి, కోపం గురించి ఆలోచించండి. పడిపోయిన కొమ్మల విషయంలో దేవుడు కోపంగా వ్యవహరించాడు, కానీ మీమీద దయ చూపించాడు. కాకపోతే తాను మీమీద చూపించే దయకు తగినట్టు మీరు నడుచుకుంటూ ఉండాలి. లేదంటే మీరు కూడా విరిచివేయబడతారు.
23 అలాగే వాళ్లు మళ్లీ విశ్వాసం చూపిస్తే వాళ్లు కూడా అంటుకట్టబడతారు, ఎందుకంటే దేవుడు వాళ్లను మళ్లీ అంటుకట్టగలడు.
24 అడవి ఒలీవ కొమ్మలైన మిమ్మల్ని విరిచి ప్రకృతి విరుద్ధంగా అసలైన ఒలీవ చెట్టుకు దేవుడు అంటుకట్టాడంటే, అసలైన ఒలీవ కొమ్మలైన వాళ్లను తిరిగి దాని చెట్టుకు అంటుకట్టడం ఆయనకు ఇంకెంత సులువో కదా!
25 మీ దృష్టిలో మీరు తెలివిగలవాళ్లు కాకుండా ఉండేలా, మీరు ఈ పవిత్ర రహస్యం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను: అన్యుల సంఖ్య పూర్తిగా సమకూర్చబడేంత వరకు కొందరు ఇశ్రాయేలీయుల హృదయాలు కఠినపర్చబడ్డాయి.
26 ఈ విధంగా ఇశ్రాయేలీయులందరూ రక్షించబడతారు. అది లేఖనాల్లో రాసివున్నట్టే జరుగుతుంది: “సీయోను నుండి విమోచకుడు* వచ్చి, యాకోబు వంశస్థులతో చెడ్డ* పనుల్ని మాన్పిస్తాడు.
27 వాళ్ల పాపాల్ని తీసివేసేటప్పుడు నేను వాళ్లతో చేసే ఒప్పందం* ఇదే.”
28 నిజమే, మంచివార్తను తిరస్కరించినందువల్ల వాళ్లు దేవునికి శత్రువులుగా ఉన్నారు, దానివల్ల మీరు ప్రయోజనం పొందారు; అయితే దేవుడు వాళ్ల పూర్వీకులతో చేసిన వాగ్దానం వల్ల వాళ్లలో కొందరిని తన స్నేహితులుగా ఎంచుకున్నాడు.
29 వరాలిచ్చే విషయంలో, కొందరిని ఎంచుకునే విషయంలో దేవుడు తన మనసు మార్చుకోడు.
30 మీరు ఒకప్పుడు దేవునికి అవిధేయులుగా ఉన్నారు, కానీ ఇప్పుడు వాళ్ల అవిధేయత వల్ల దేవుడు మీమీద తన కరుణను చూపించాడు.
31 అలాగే వాళ్లు కూడా ఒకప్పుడు అవిధేయులుగా ఉన్నారు. దానివల్ల మీమీద ఎలాగైతే దేవుడు కరుణ చూపించాడో, వాళ్ల మీద కూడా అలాగే కరుణ చూపించవచ్చు.
32 ఎందుకంటే దేవుడు వాళ్లందరి మీద కరుణ చూపించేలా వాళ్లందర్నీ అవిధేయతకు బానిసలు కానిచ్చాడు.
33 ఆహా! దేవుని ఆశీర్వాదాలు ఎంత గొప్పవి! ఆయన తెలివి, జ్ఞానం ఎంత లోతైనవి! ఆయన తీర్పుల్ని శోధించడం అసాధ్యం, ఆయన మార్గాల్ని అర్థంచేసుకోవడం అసంభవం!
34 ఎందుకంటే లేఖనాల్లో ఇలా రాసివుంది: “యెహోవా* మనసును ఎవరు తెలుసుకోగలరు? లేదా ఎవరు ఆయనకు సలహాదారులుగా ఉండగలరు?”
35 లేదా “తిరిగి చెల్లించేలా ముందు ఆయనకు ఇచ్చింది ఎవరు?”
36 ఎందుకంటే, అన్నీ ఆయన నుండే, ఆయన వల్లే ఉనికిలోకి వచ్చాయి, ఆయన కోసమే ఉనికిలో ఉన్నాయి. నిరంతరం ఆయనకు మహిమ కలగాలి. ఆమేన్.
అధస్సూచీలు
^ అక్ష., “విత్తనం నుండి వచ్చినవాణ్ణి.”
^ పదకోశం చూడండి.
^ లేదా “రక్షకుడు.”
^ లేదా “భక్తిహీన.”
^ లేదా “నిబంధన.”
^ పదకోశం చూడండి.