రోమీయులు 13:1-14
13 ప్రతీ ఒక్కరు పై అధికారాలకు లోబడి ఉండాలి. ఎందుకంటే దేవుని అనుమతితోనే ప్రతీ అధికారం ఉనికిలో ఉంది; ఇప్పుడున్న అధికారాల్ని దేవుడు వాటివాటి స్థానాల్లో ఉంచాడు.
2 కాబట్టి, ఎవరైనా అధికారాన్ని ఎదిరిస్తే, దేవుని ఏర్పాటును వ్యతిరేకించినట్టే; ఆ ఏర్పాటును వ్యతిరేకించేవాళ్లు తమ మీదికి తాము శిక్ష తెచ్చుకుంటారు.
3 మంచిపనులు చేసేవాళ్లు పరిపాలకులకు భయపడరు, చెడ్డ పనులు చేసేవాళ్లే పరిపాలకులకు భయపడతారు. మీరు అధికారానికి భయపడకుండా ఉండాలనుకుంటున్నారా? అలాగైతే మంచిపనులు చేస్తూ ఉండండి, అప్పుడు మీరు పొగడ్తలు అందుకుంటారు;
4 మీ మంచి కోసం అధికారులు దేవుని సేవకులుగా పనిచేస్తున్నారు. అయితే మీరు చెడ్డ పనులు చేస్తుంటే భయపడండి. ఎందుకంటే వాళ్లు కారణం లేకుండా శిక్షించే అధికారాన్ని* వాడరు. వాళ్లు చెడ్డ పనులు చేసే వాళ్లను శిక్షించే* దేవుని సేవకులు.
5 కాబట్టి మీరు లోబడి ఉండడానికి బలమైన కారణమే ఉంది. మీరు కేవలం శిక్షను* బట్టి మాత్రమే కాకుండా మీ మనస్సాక్షిని బట్టి కూడా లోబడి ఉండాలి.
6 అందుకే కదా మీరు పన్ను కూడా కడుతున్నారు; వాళ్లు నిర్విరామంగా తమ విధులు నిర్వర్తిస్తూ ప్రజాసేవ చేసే దేవుని సేవకులు.
7 వాళ్లకు ఇవ్వాల్సినవన్నీ వాళ్లకు ఇచ్చేయండి. అంటే, పన్ను కట్టాల్సిన వాళ్లకు పన్ను కట్టండి; కప్పం చెల్లించాల్సిన వాళ్లకు కప్పం చెల్లించండి; భయపడాల్సిన వాళ్లకు భయపడండి; ఘనపర్చాల్సిన వాళ్లను ఘనపర్చండి.
8 ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకునే విషయంలో తప్ప ఇంకా ఏ విషయంలోనూ ఎవ్వరికీ రుణపడి ఉండకండి; సాటి మనిషిని ప్రేమించేవాళ్లు ధర్మశాస్త్రాన్ని పాటించినట్టే.
9 “మీరు వ్యభిచారం చేయకూడదు, హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, ఇతరులకు చెందినవాటిని ఆశించకూడదు,” అలా ధర్మశాస్త్రంలో ఉన్న వేరే ఏ ఆజ్ఞయినా ఈ ఒక్క ఆజ్ఞలో నిక్షిప్తమై ఉంది: “నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి.”
10 ప్రేమ ఉంటే సాటి మనిషికి హాని తలపెట్టం; కాబట్టి ప్రేమ చూపిస్తే ధర్మశాస్త్రాన్ని పాటించినట్టే.
11 మీరు ఇవన్నీ ఎందుకు పాటించాలంటే, మనం జీవిస్తున్న కాలం ఎలాంటిదో మీకు తెలుసు. మీరు నిద్ర నుండి మేలుకోవాల్సిన సమయం అయ్యింది. ఎందుకంటే మనం విశ్వాసులమైన దగ్గర నుండి తీసుకుంటే ఇప్పుడు రక్షణ మరింత దగ్గరగా ఉంది.
12 రాత్రి చాలావరకు గడిచిపోయింది; ఆ రోజు దగ్గరపడింది. కాబట్టి చీకటి సంబంధమైన పనుల్ని వదిలేసి వెలుగు సంబంధమైన ఆయుధాల్ని ధరించుకుందాం.
13 మనం పగటిపూట నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాం. విచ్చలవిడి విందులు,* తాగుబోతుతనం, అక్రమ సంబంధాలు, లెక్కలేనితనం,* గొడవలు, అసూయ వంటివాటికి దూరంగా ఉందాం.
14 ప్రభువైన యేసుక్రీస్తును అనుకరించండి,* శరీర కోరికలు ఎలా తీర్చుకోవాలా అని పథకాలు వేసుకోకండి.
అధస్సూచీలు
^ అక్ష., “కత్తిని.”
^ లేదా “వాళ్ల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసే.”
^ లేదా “ఆగ్రహాన్ని.”
^ లేదా “అల్లరి విందులు.”
^ లేదా “సిగ్గులేని ప్రవర్తన.” గ్రీకులో అసెల్జీయ. పదకోశం చూడండి.
^ అక్ష., “ధరించండి.”