రోమీయులు 5:1-21

  • క్రీస్తు ద్వారా దేవునితో శాంతియుత సంబంధం  (1-11)

  • ఆదాము ద్వారా మరణం, క్రీస్తు ద్వారా జీవం  (12-21)

    • పాపం, మరణం అందరికీ వ్యాపించాయి (12)

    • ఒక్క నీతి కార్యం  (18)

5  విశ్వాసం వల్ల మనం నీతిమంతులుగా తీర్పుతీర్చబడ్డాం కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో శాంతియుత సంబంధాన్ని ఆస్వాదిద్దాం.*  మనం యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం వల్ల దేవుని అపారదయను పొందడానికి మనకు మార్గం తెరుచుకుంది, ఆ అపారదయను మనం ఇప్పుడు పొందుతున్నాం. అలాగే దేవుని మహిమను పొందే నిరీక్షణ మనకు ఉంది కాబట్టి మనం సంతోషిద్దాం.*  అంతేకాదు, శ్రమలు వచ్చినప్పుడు కూడా మనం సంతోషిద్దాం.* ఎందుకంటే శ్రమలు సహనాన్ని పుట్టిస్తాయని,  సహనం దేవుని అనుగ్రహాన్ని తెస్తుందని, దేవుని అనుగ్రహం నిరీక్షణను కలిగిస్తుందని మనకు తెలుసు.  ఆ నిరీక్షణ మనల్ని నిరాశపర్చదని కూడా మనకు తెలుసు; ఎందుకంటే మనకు ఇవ్వబడిన పవిత్రశక్తి ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో నింపబడింది.  నిజానికి, మనం ఇంకా బలహీనులుగా ఉన్నప్పుడే, నియమిత సమయంలో క్రీస్తు పాపుల కోసం చనిపోయాడు.  నీతిమంతుడి కోసం ఒకరు చనిపోవడం అరుదు; బహుశా మంచివాడి కోసమైతే ఎవరైనా చనిపోవడానికి సిద్ధపడతారేమో.  అయితే దేవుడు మనపట్ల తన ప్రేమను చూపిస్తున్నాడు. ఎలాగంటే మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మనకోసం చనిపోయాడు.  ఇప్పుడు మనం ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్పుతీర్చబడ్డాం కాబట్టి ఆయన ద్వారా మనం దేవుని ఆగ్రహాన్ని తప్పించుకుంటామని మరింత బలంగా నమ్మవచ్చు. 10  మనం శత్రువులుగా ఉన్నప్పుడే తన కుమారుడి మరణం ద్వారా దేవునితో శాంతియుత సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకున్నాం. క్రీస్తు సజీవంగా ఉన్నాడు కాబట్టి దేవునితో శాంతియుత సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకున్న మనం రక్షణ పొందుతామని మరింత బలంగా నమ్మవచ్చు. 11  అంతేకాదు, ఇప్పుడు మనం ఎవరి ద్వారానైతే దేవునితో శాంతియుత సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకున్నామో ఆ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని విషయంలో కూడా సంతోషిస్తున్నాం. 12  ఒక మనిషి ద్వారా పాపం, పాపం ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించాయి. అదే విధంగా, అందరూ పాపం చేశారు కాబట్టి మరణం అందరికీ వ్యాపించింది. 13  ధర్మశాస్త్రం రాకముందే పాపం లోకంలో ఉంది, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు ఎవ్వరి మీదా పాపం మోపబడదు. 14  అయినా, ఆదాము దగ్గర నుండి మోషే వరకు పాపం రాజుగా ఏలింది. ఆదాములా పాపం చేయనివాళ్ల మీద కూడా అలాగే ఏలింది. ఆదాము కొన్ని విషయాల్లో రాబోయే వ్యక్తిలా ఉన్నాడు. 15  అయితే దేవుని బహుమానం వల్ల వచ్చే ఫలితం ఆ పాపంవల్ల వచ్చిన ఫలితంలా లేదు. ఒక్క మనిషి చేసిన పాపంవల్ల అనేకమంది చనిపోయారు. కానీ దేవుడు ఇచ్చే బహుమానం వల్ల, ఆయన చూపించే అపారదయవల్ల, యేసుక్రీస్తు అపారదయవల్ల చాలామంది ఎంతో ప్రయోజనం పొందుతారు. 16  అంతేకాదు, ఉచిత బహుమానం వల్ల వచ్చిన ప్రయోజనాలు ఒక్క మనిషి చేసిన పాపంవల్ల వచ్చిన పర్యవసానాల్లా లేవు. ఎందుకంటే ఒక్క పాపం తర్వాత వచ్చిన తీర్పువల్ల మనుషులు దోషులు అయ్యారు, కానీ ఎన్నో పాపాల తర్వాత వచ్చిన బహుమానం వల్ల మనుషులు నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డారు. 17  ఒక్క మనిషి చేసిన పాపంవల్ల మరణం రాజుగా ఏలింది. కాబట్టి, ఒక్క వ్యక్తి వల్ల అంటే యేసుక్రీస్తు వల్ల ప్రజలు జీవిస్తారు, రాజులుగా ఏలుతారు అనే నమ్మకాన్ని మనం కలిగివుండవచ్చు. ఎందుకంటే వాళ్లు దేవుని అపారదయ నుండి, తమను నీతిమంతులుగా చేసే బహుమానం నుండి ప్రయోజనం పొందుతారు. 18  కాబట్టి, ఎలాగైతే ఒక్క పాపంవల్ల అన్నిరకాల ప్రజలకు శిక్ష వచ్చిందో, అలాగే ఒక్క వ్యక్తి చేసిన నీతికార్యం వల్ల అన్నిరకాల ప్రజలు జీవం పొందేలా నీతిమంతులుగా తీర్పు తీర్చబడుతున్నారు. 19  ఒక్క మనిషి అవిధేయత ద్వారా అనేకులు పాపులైనట్టే, ఒక్క వ్యక్తి విధేయత ద్వారా అనేకులు నీతిమంతులౌతారు. 20  ప్రజలు తాము చాలాచాలా పాపాలు చేస్తున్నామని గుర్తించాలని దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అయితే ప్రజలు ఎన్నో పాపాలు చేసినప్పుడు దేవుడు వాళ్లపట్ల తన అపారదయను ఇంకా ఎక్కువగా చూపించాడు. 21  ఎందుకోసం? పాపం మరణంతో కలిసి రాజుగా ఏలినట్టే, నీతి ద్వారా అపారదయ రాజుగా ఏలాలని దేవుడు అలా చేశాడు; ప్రజలు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా శాశ్వత జీవితం పొందాలన్నది దేవుని ఉద్దేశం.

అధస్సూచీలు

లేదా “దేవునితో మనకు శాంతియుత సంబంధం ఉంది” అయ్యుంటుంది.
లేదా “సంతోషిస్తున్నాం” అయ్యుంటుంది.
లేదా “సంతోషిస్తున్నాం” అయ్యుంటుంది.