రోమీయులు 9:1-33
9 క్రీస్తు శిష్యుడిగా నేను నిజమే చెప్తున్నాను; అబద్ధమాడట్లేదు, పవిత్రశక్తే నా మనస్సాక్షిని నిర్దేశిస్తోంది.
2 నా హృదయంలో నేను ఎంతో దుఃఖిస్తున్నాను, ఎంతో వేదనపడుతున్నాను.
3 క్రీస్తును అనుసరించని యూదులైన నా సోదరులకు సహాయం చేస్తుందంటే, వాళ్లకు విధించబడిన శిక్షను అనుభవించడానికి కూడా నేను సిద్ధమే.
4 దేవుడు తన కొడుకులుగా దత్తత తీసుకున్న ఇశ్రాయేలీయులు వాళ్లే. ఆయన వాళ్లను ఘనపర్చాడు, వాళ్లతో ఒప్పందాలు* చేశాడు, వాళ్లకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, పవిత్రసేవ చేసే గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు, వాళ్లకు వాగ్దానాలు చేశాడు.
5 అంతేకాదు, ఎవరి నుండైతే క్రీస్తు వచ్చాడో ఆ పూర్వీకుల వంశస్థులే వాళ్లంతా. అన్నిటిమీద అధికారమున్న దేవుడు నిరంతరం స్తుతించబడాలి. ఆమేన్.
6 అయితే, దేవుని వాక్యం విఫలమైందని కాదు. ఎందుకంటే ఇశ్రాయేలు వంశస్థులంతా నిజమైన ఇశ్రాయేలీయులు కాదు.
7 అబ్రాహాము వంశస్థులు* అయినంత మాత్రాన వాళ్లందరూ నిజంగా అబ్రాహాము పిల్లలు కాదు; కానీ, “ఇస్సాకు ద్వారా వచ్చేవాళ్లే నీ వంశస్థులు* అనబడతారు” అని లేఖనాల్లో రాసివుంది.
8 అంటే, అబ్రాహాము వంశంలో పుట్టినవాళ్లందరూ దేవుని పిల్లలు కాదు, కానీ వాగ్దానం ద్వారా పుట్టినవాళ్లే అబ్రాహాము నిజమైన వంశస్థులుగా* ఎంచబడతారు.
9 దేవుడు ఈ వాగ్దానం చేశాడు: “వచ్చే సంవత్సరం ఈ సమయానికి నేను వస్తాను, అప్పటికి శారాకు ఒక బాబు పుడతాడు.”
10 కేవలం శారా విషయంలోనే కాదు, మన పూర్వీకుడైన ఇస్సాకు ద్వారా రిబ్కా గర్భవతియై కడుపులో కవల పిల్లల్ని మోస్తున్నప్పుడు కూడా దేవుడు వాగ్దానం చేశాడు;
11 దేవుడు ఓ వ్యక్తిని ఎలా ఎంపిక చేసుకోవాలో ముందే సంకల్పించాడు. ఓ వ్యక్తి చేసే పనుల ఆధారంగా దేవుడు అతన్ని ఎంపిక చేసుకోడు, కానీ తాను కోరుకున్న వ్యక్తిని ఎంపిక చేసుకుంటాడు. కాబట్టి, ఆ కవల పిల్లలు పుట్టకముందే, వాళ్లింకా మంచి పనులు గానీ చెడు పనులు గానీ చేయకముందే
12 దేవుడు ఆమెకు ఇలా చెప్పాడు: “పెద్దవాడు చిన్నవాడికి దాసునిగా ఉంటాడు.”
13 లేఖనాల్లో ఇలా రాసివుంది: “నేను యాకోబును ప్రేమించాను, కానీ ఏశావును ద్వేషించాను.”
14 మరైతే ఏమనాలి? దేవుడు అన్యాయస్థుడా? కానేకాదు!
15 దేవుడు మోషేతో ఇలా అన్నాడు: “నేను కరుణ చూపించాలనుకున్న వాళ్లమీద కరుణ చూపిస్తాను; నేను కనికరం చూపించాలనుకున్న వాళ్లమీద కనికరం చూపిస్తాను.”
16 కాబట్టి ఓ వ్యక్తి కోరిక మీదో, అతని ప్రయత్నం మీదో అది ఆధారపడి ఉండదు కానీ కరుణగల దేవుడి మీద ఆధారపడి ఉంటుంది.
17 లేఖనంలో దేవుడు ఫరోతో ఇలా అన్నాడు: “నీ ద్వారా నా శక్తిని చూపించాలని, భూమంతటా నా పేరు ప్రకటించబడాలని నేను నిన్ను సజీవంగా ఉండనిచ్చాను.”
18 కాబట్టి, తాను కోరుకున్నవాళ్ల మీద ఆయన కరుణ చూపిస్తాడు; కానీ ఇతరుల్ని మొండివాళ్లుగా మారనిస్తాడు.
19 కాబట్టి మీరు నాతో ఇలా అంటారు: “అలాంటప్పుడు దేవుడు ఇంకా ఎందుకు తప్పులు పడుతున్నాడు? ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్లగలరు?”
20 కానీ ఓ మనిషీ, దేవునికి ఎదురుచెప్పడానికి నువ్వు ఎవరు? ఓ మట్టిపాత్ర తనను తయారుచేసిన వ్యక్తితో, “నువ్వు నన్ను ఎందుకిలా చేశావు?” అని అంటుందా?
21 ఒకే మట్టి ముద్ద నుండి ఒక మంచి పాత్రను, ఒక మామూలు పాత్రను తయారుచేసే అధికారం కుమ్మరికి ఉండదా?
22 దేవుడు తన ఆగ్రహాన్ని ప్రదర్శించి తన శక్తిని చాటాలనుకున్నా, నాశనానికి అర్హమైన ఆగ్రహ పాత్రల్ని ఓర్పుతో సహించాడు. మరి అదేమిటి?
23 మహిమ కోసం దేవుడు ముందే సిద్ధం చేసిన కరుణా పాత్రల మీద తన గొప్ప మహిమను చూపించడానికి ఆయన అలా చేసి ఉంటే, అప్పుడేమిటి?
24 ఆ పాత్రలం మనమే. యూదుల్లో నుండి మాత్రమే కాక అన్యుల్లో నుండి కూడా దేవుడు మనల్ని పిలిచాడు. మరి దాని విషయమేమిటి?
25 అది హోషేయ పుస్తకంలో ఆయన అన్న ఈ మాటలకు కూడా అనుగుణంగా ఉంది: “నా ప్రజలు కానివాళ్లను నేను ‘నా ప్రజలు’ అని పిలుస్తాను, నేను ప్రేమించని స్త్రీని ‘ప్రియురాలా’ అని పిలుస్తాను;
26 ‘మీరు నా ప్రజలు కాదు’ అని వాళ్లకు ఎక్కడైతే చెప్పబడిందో అక్కడే వాళ్లు ‘జీవంగల దేవుని కొడుకులు’ అని పిలవబడతారు.”
27 అంతేకాదు ఇశ్రాయేలు గురించి యెషయా ఇలా ప్రకటించాడు: “ఇశ్రాయేలు ప్రజల సంఖ్య సముద్రపు ఇసుక రేణువులంత ఉన్నా, కేవలం కొందరు మాత్రమే రక్షించబడతారు.
28 ఎందుకంటే భూమ్మీద జీవిస్తున్న వాళ్లకు యెహోవా* తీర్పుతీరుస్తాడు, పూర్తిస్థాయిలో తీర్పుతీరుస్తాడు, ఆ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయడు.”*
29 అంతేకాదు యెషయా ప్రవచించినట్టే, “సైన్యాలకు అధిపతైన యెహోవా* మన వంశస్థుల్లో* కొందరిని మిగిలి ఉండనివ్వకపోతే, సొదొమ గొమొర్రాలకు పట్టిన గతే మనకూ పట్టివుండేది.”
30 మరైతే ఏమనాలి? అన్యులు నీతిమంతులవ్వాలని ప్రయత్నించకపోయినా విశ్వాసం కారణంగా దేవుని దృష్టిలో నీతిమంతులు అయ్యారు;
31 కానీ ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రం ప్రకారం నీతిమంతులవ్వాలని ప్రయత్నించినా, ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించలేదు.
32 ఎందుకని? వాళ్లు విశ్వాసం ద్వారా కాకుండా తమ పనుల ద్వారా నీతిమంతులవ్వాలని ప్రయత్నించారు. వాళ్లు “అడ్డురాయి” వల్ల తడబడ్డారు;
33 లేఖనాల్లో కూడా ఇలా రాసివుంది: “ఇదిగో! నేను సీయోనులో అడ్డురాయిని, అడ్డుబండను పెడుతున్నాను. అయితే దానిమీద విశ్వాసం ఉంచేవాళ్లు నిరాశపడరు.”
అధస్సూచీలు
^ లేదా “నిబంధనలు.”
^ అక్ష., “విత్తనం.”
^ అక్ష., “విత్తనం.”
^ అక్ష., “విత్తనంగా.”
^ పదకోశం చూడండి.
^ లేదా “దాన్ని వేగంగా అమలు చేస్తాడు.”
^ పదకోశం చూడండి.
^ అక్ష., “విత్తనంలో.”