లూకా 1:1-80

  • థెయొఫిలాను సంబోధించడం  (1-4)

  • బాప్తిస్మమిచ్చే యోహాను పుట్టడం గురించి గబ్రియేలు ముందే చెప్తాడు  (5-25)

  • యేసు పుట్టడం గురించి గబ్రియేలు ముందే చెప్తాడు  (26-38)

  • మరియ ఎలీసబెతు దగ్గరికి వెళ్తుంది  (39-45)

  • మరియ యెహోవాను కీర్తిస్తుంది  (46-56)

  • యోహాను పుట్టడం, అతనికి పేరు పెట్టడం  (57-66)

  • జెకర్యా ప్రవచనం  (67-80)

1  జరిగిన విషయాలన్నిటినీ పరిశోధించడానికి, వాటిని రాయడానికి చాలామంది కృషిచేశారు. మనం కూడా ఎలాంటి సందేహం లేకుండా వాటిని నమ్ముతున్నాం.  వాళ్లు రాసిన విషయాలు, మనం మొదటినుండి ప్రత్యక్ష సాక్షుల దగ్గర, దేవుని సందేశాన్ని ప్రకటించేవాళ్ల దగ్గర విన్నవాటితో సరిపోతున్నాయి.  అత్యంత గౌరవనీయుడివైన థెయొఫిలా, నేను కూడా ఈ విషయాలన్నిటినీ పరిశీలించాను కాబట్టి అవి మొదటినుండి ఎలా జరిగాయో అలా నీకు రాయాలని నిశ్చయించుకున్నాను.  నువ్వు నేర్చుకున్న విషయాలు ఎంత నమ్మదగినవో నువ్వు తెలుసుకోవాలని నా ఉద్దేశం.  యూదయను హేరోదు* రాజు పరిపాలిస్తున్న రోజుల్లో అబీయా గుంపుకు* చెందిన జెకర్యా అనే యాజకుడు ఉండేవాడు. అతని భార్య అహరోను వంశస్థురాలు, ఆమె పేరు ఎలీసబెతు.  వాళ్లిద్దరు యెహోవా* ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ, ఆయన కోరినవన్నీ చేస్తూ, మచ్చలేకుండా నడుచుకుంటూ ఆయన దృష్టిలో నీతిమంతులుగా ఉండేవాళ్లు.  అయితే ఎలీసబెతు గొడ్రాలు కాబట్టి వాళ్లకు పిల్లలు లేరు. పైగా వాళ్లిద్దరూ చాలా ముసలివాళ్లు.  అయితే అబీయా గుంపు వంతు వచ్చినప్పుడు, జెకర్యా దేవుని ముందు యాజకునిగా సేవ చేస్తున్నాడు. అప్పుడు  యాజకుల ఆనవాయితీ ప్రకారం, యెహోవా* ఆలయంలో ధూపం వేసే వంతు అతనికి వచ్చింది. 10  ధూపం వేసే సమయంలో ప్రజలందరూ బయట ఉండి ప్రార్థనలు చేస్తున్నారు. 11  అప్పుడు యెహోవా* దూత అతనికి కనిపించాడు, ఆ దూత ధూపవేదిక కుడివైపున నిలబడి ఉన్నాడు. 12  జెకర్యా అది చూసి కంగారుపడి చాలా భయపడిపోయాడు. 13  అయితే ఆ దూత అతనితో ఇలా అన్నాడు: “జెకర్యా, భయపడకు. దేవుడు నీ అభ్యర్థనను విన్నాడు. నీ భార్య ఎలీసబెతు ఒక కొడుకును కంటుంది. నువ్వు అతనికి యోహాను అని పేరు పెట్టాలి. 14  నువ్వు ఆనందాన్ని, గొప్ప సంతోషాన్ని పొందుతావు. అతను పుట్టినందుకు చాలామంది సంతోషిస్తారు. 15  ఎందుకంటే, అతను యెహోవా* దృష్టిలో గొప్పవాడిగా ఉంటాడు. అయితే, అతను ద్రాక్షారసాన్ని గానీ మద్యాన్ని గానీ అస్సలు తాగకూడదు. అతను తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే దేవుడు అతనికి పవిత్రశక్తిని ఇస్తాడు. 16  అతను చాలామంది ఇశ్రాయేలీయుల్ని తమ దేవుడైన యెహోవా* వైపుకు తిప్పుతాడు. 17  అంతేకాదు, తండ్రుల హృదయాల్ని పిల్లల వైపుకు తిప్పేందుకు; తెలివిగా నడుచుకునేలా, సరైనది చేసేలా అవిధేయులకు సహాయం చేసేందుకు దేవుడు ఏలీయా లాంటి స్ఫూర్తితో, శక్తితో నీ కొడుకును తన ముందు పంపిస్తాడు. అలా అతను యెహోవా* కోసం ప్రజల్ని సిద్ధం చేస్తాడు.” 18  అప్పుడు జెకర్యా ఆ దూతతో ఇలా అన్నాడు: “నేను దీన్ని ఎలా నమ్మాలి? నేను ముసలివాడిని, నా భార్యకేమో వయసైపోయింది.” 19  దానికి దేవదూత ఇలా చెప్పాడు: “నేను దేవుని సన్నిధిలో సేవ చేసే గబ్రియేలును. నీతో మాట్లాడడానికి, ఈ శుభవార్త నీకు ప్రకటించడానికి దేవుడు నన్ను పంపించాడు. 20  నియమిత సమయం వచ్చినప్పుడు నా మాటలు నెరవేరతాయి. అయితే ఇదిగో! నువ్వు నా మాటలు నమ్మలేదు కాబట్టి ఇవి జరిగే రోజు వరకు నువ్వు మూగవాడిగా ఉంటావు.” 21  ఈలోగా ప్రజలు జెకర్యా కోసం బయట వేచి చూస్తూ, అతను ఆలయం లోపల ఎందుకు అంతసేపు ఉన్నాడా అని ఆశ్చర్యపోయారు. 22  అతను బయటికి వచ్చినప్పుడు వాళ్లతో మాట్లాడలేకపోయాడు. అతను ఆలయంలో ఏదో దర్శనం చూశాడని వాళ్లు గ్రహించారు. అతను మూగవాడయ్యాడు కాబట్టి వాళ్లకు సైగలు చేస్తూ ఉన్నాడు. 23  అతను పవిత్రసేవ చేసే రోజులు పూర్తయినప్పుడు తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. 24  కొన్ని రోజుల తర్వాత అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయింది, ఐదు నెలలపాటు ఆమె ఇంట్లోనే ఉండిపోయింది. ఆమె ఇలా అనుకుంది: 25  “యెహోవాయే* నా కోసం దీన్ని చేశాడు. మనుషుల్లో నాకున్న నిందను తీసేయడానికి ఆయన నన్ను గుర్తుచేసుకున్నాడు.” 26  ఆమెకు ఆరో నెల వచ్చినప్పుడు దేవుడు గబ్రియేలు దూతను గలిలయలోని నజరేతు అనే నగరానికి పంపించాడు. 27  దావీదు వంశంలో పుట్టిన యోసేపు అనే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైన ఒక కన్య దగ్గరకు దేవుడు ఆ దూతను పంపించాడు. ఆ కన్య పేరు మరియ. 28  ఆ దూత లోపలికి వచ్చి ఆమెతో ఇలా అన్నాడు: “దేవుని ఆశీర్వాదం పొందిన నీకు శుభాకాంక్షలు. యెహోవా* నీకు తోడుగా ఉన్నాడు.” 29  కానీ ఆమె చాలా కంగారుపడి, ఆ మాటలకు అర్థం ఏమైవుంటుందా అని ఆలోచించడం మొదలుపెట్టింది. 30  కాబట్టి దేవదూత ఆమెతో ఇలా అన్నాడు: “మరియా, భయపడకు. నువ్వు దేవుని ఆశీర్వాదం పొందావు. 31  ఇదిగో! నువ్వు గర్భవతివై కొడుకును కంటావు. ఆయనకు నువ్వు యేసు అని పేరు పెట్టాలి. 32  ఆయన గొప్పవాడిగా ఉంటాడు, సర్వోన్నతుని కుమారుడని పిలువబడతాడు. ఆయన తండ్రైన దావీదు సింహాసనాన్ని యెహోవా* దేవుడు ఆయనకు ఇస్తాడు. 33  ఆయన యాకోబు వంశస్థుల్ని ఎప్పటికీ రాజుగా పరిపాలిస్తాడు, ఆయన రాజ్యానికి అంతం ఉండదు.” 34  అయితే మరియ దేవదూతతో ఇలా అంది: “ఇదెలా సాధ్యం? నేనింకా కన్యనే కదా?” 35  అందుకు దేవదూత ఇలా అన్నాడు: “పవిత్రశక్తి నీ మీదికి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అందుకే, పుట్టబోయే బిడ్డ పవిత్రుడని, దేవుని కుమారుడని పిలవబడతాడు. 36  ఇదిగో! మీ బంధువు ఎలీసబెతు కూడా ముసలితనంలో గర్భవతి అయింది. గొడ్రాలని పిలవబడిన ఆమెకు ఇప్పుడు ఆరో నెల. 37  దేవునికి ఏదీ అసాధ్యం కాదు.” 38  అప్పుడు మరియ, “ఇదిగో! యెహోవా* దాసురాలిని! నువ్వు చెప్పినట్లే నాకు జరగాలి” అంది. దాంతో ఆ దేవదూత అక్కడి నుండి వెళ్లిపోయాడు. 39  కాబట్టి ఆ రోజుల్లో మరియ బయల్దేరి, పర్వత ప్రాంతంలో ఉన్న యూదయలోని ఒక నగరానికి త్వరత్వరగా వెళ్లింది. 40  ఆమె జెకర్యా ఇంట్లో అడుగుపెట్టి ఎలీసబెతుకు శుభాకాంక్షలు చెప్పింది. 41  మరియ చెప్పిన శుభాకాంక్షల్ని వినగానే ఎలీసబెతు గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశాడు. ఎలీసబెతు పవిత్రశక్తితో నిండిపోయి 42  బిగ్గరగా ఇలా అంది: “స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానివి. నీ గర్భఫలం దీవెన పొందింది! 43  నా ప్రభువు తల్లి వచ్చి నన్ను చూడడానికి నేను ఎంతటిదాన్ని? 44  ఇదిగో! నీ శుభాకాంక్షలు నా చెవిన పడగానే నా గర్భంలో ఉన్న శిశువు సంతోషంతో గంతులు వేశాడు. 45  నమ్మిన నువ్వు కూడా సంతోషంగా ఉంటావు. ఎందుకంటే, యెహోవా* నీకు చెప్పినవి పూర్తిగా నెరవేరతాయి.” 46  అప్పుడు మరియ ఇలా అంది: “నా ప్రాణం యెహోవాను* కీర్తిస్తోంది. 47  నా రక్షకుడైన దేవుణ్ణి బట్టి నా హృదయం సంతోషించకుండా ఉండలేకపోతోంది. 48  ఎందుకంటే, తన దాసురాలి దీనస్థితిని ఆయన గుర్తుచేసుకున్నాడు. ఇదిగో! ఇప్పటినుండి అన్ని తరాలవాళ్లు నన్ను ఆశీర్వదించబడినది అని అంటారు. 49  ఎందుకంటే, శక్తిమంతుడైన దేవుడు నా విషయంలో గొప్ప పనులు చేశాడు. ఆయన పేరు పవిత్రమైనది. 50  ఆయనకు భయపడే వాళ్లమీద ఆయన కరుణ తరతరాలు ఉంటుంది. 51  ఆయన తన బాహువుతో శక్తివంతమైన పనులు చేశాడు. గర్విష్ఠుల్ని ఆయన చెదరగొట్టాడు. 52  గొప్ప అధికారం ఉన్నవాళ్లను సింహాసనాల నుండి కిందికి దింపేసి, తక్కువ స్థాయిలో ఉన్నవాళ్లను ఘనపర్చాడు. 53  ఆకలిగా ఉన్నవాళ్లను మంచివాటితో పూర్తిగా తృప్తిపర్చాడు, ధనవంతుల్ని వట్టి చేతులతో పంపేశాడు. 54  ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేయడానికి వచ్చాడు. మన పూర్వీకులతో చెప్పినట్టే 55  అబ్రాహాము మీద, అతని వంశస్థుల* మీద ఎప్పటికీ కరుణ చూపించాడు.” 56  మరియ మూడు నెలలపాటు ఆమెతోనే ఉండి, తర్వాత ఇంటికి వెళ్లిపోయింది. 57  ఎలీసబెతు బిడ్డను కనే సమయం వచ్చింది, ఆమె మగబిడ్డను కన్నది. 58  యెహోవా* ఆమె మీద ఎంతో కరుణ చూపించాడని విని ఆ చుట్టుపక్కలవాళ్లు, బంధువులు ఆమెతో కలిసి సంతోషించారు. 59  ఎనిమిదో రోజున ఆ పసికందుకు సున్నతి చేయించేటప్పుడు వాళ్లు వచ్చారు. వాళ్ల నాన్న జెకర్యా పేరే అతనికి పెట్టబోయారు. 60  అయితే వాళ్ల అమ్మ, “వద్దు, అతనికి యోహాను అని పేరు పెట్టాలి” అంది. 61  అప్పుడు వాళ్లు ఆమెతో, “మీ బంధువుల్లో ఎవరికీ ఆ పేరు లేదే” అన్నారు. 62  తర్వాత వాళ్లు సైగలు చేస్తూ, అతనికి ఏ పేరు పెట్టాలని అనుకుంటున్నావని వాళ్ల నాన్నను అడిగారు. 63  కాబట్టి అతను ఒక పలకను తెమ్మని చెప్పి, దానిమీద “అతని పేరు యోహాను” అని రాశాడు. దాంతో వాళ్లంతా చాలా ఆశ్చర్యపోయారు. 64  వెంటనే అతని నోరు తెరుచుకుంది, అతని నాలుక కదిలింది; అతను దేవుణ్ణి స్తుతిస్తూ మాట్లాడడం మొదలుపెట్టాడు. 65  దానివల్ల, వాళ్ల చుట్టుపక్కల ఉంటున్న వాళ్లందరికీ భయం పట్టుకుంది. యూదయ పర్వత ప్రాంతమంతటా ప్రజలు ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. 66  విన్న వాళ్లందరూ ఈ విషయాల్ని తమ మనసుల్లో పెట్టుకొని, “ఈ బాబు పెద్దయ్యాక ఏమౌతాడో?” అని అనుకున్నారు. ఎందుకంటే, యెహోవా* చేయి నిజంగా అతనికి తోడుగా ఉంది. 67  అప్పుడు వాళ్ల నాన్న జెకర్యా పవిత్రశక్తితో నిండిపోయి ఇలా ప్రవచించాడు: 68  “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా* స్తుతించబడాలి. ఎందుకంటే, ఆయన తన ప్రజల మీద దృష్టిపెట్టాడు, వాళ్లకు విడుదల తీసుకొచ్చాడు. 69  ఆయన తన సేవకుడైన దావీదు ఇంట్లో మన కోసం ఒక బలమైన రక్షకుణ్ణి* పుట్టించాడు. 70  అలా, ప్రాచీన కాలం నుండి తన ప్రవక్తల నోటి ద్వారా ఆయన చెప్పినట్టే చేశాడు. 71  మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించే వాళ్లందరి నుండి రక్షిస్తానని ఆయన చెప్పాడు. 72  మన పూర్వీకులతో చెప్పిన మాటను ఆయన నెరవేరుస్తాడు, ప్రజల మీద కరుణ చూపిస్తాడు. తన పవిత్ర ఒప్పందాన్ని* గుర్తు చేసుకుంటాడు. 73  మన పూర్వీకుడైన అబ్రాహాముకు ఆయన ఒట్టేసి చేసిన ప్రమాణమే ఆ ఒప్పందం. 74  ఆ ప్రమాణం ప్రకారం, మనం శత్రువుల చేతుల్లో నుండి తప్పించబడిన తర్వాత, భయపడకుండా తనకు పవిత్రసేవ చేసే గొప్ప అవకాశాన్ని ఆయన మనకు ఇస్తాడు. 75  దానివల్ల మనం జీవితాంతం నమ్మకంగా ఉంటూ సరైనది చేయగలుగుతాం. 76  బాబూ, నువ్వు మాత్రం సర్వోన్నతుని ప్రవక్తవని పిలవబడతావు. ఎందుకంటే, తన దారులు సిద్ధం చేయడానికి యెహోవా* తనకు ముందు నిన్ను పంపిస్తాడు. 77  తమ పాపాలకు క్షమాపణ పొందడం ద్వారా రక్షణ పొందవచ్చనే సందేశాన్ని తన ప్రజలకు ప్రకటించడానికి అలా పంపిస్తాడు. 78  మన దేవుడు తన గొప్ప కనికరం వల్ల అలా చేస్తాడు. ఆ కనికరంతో ఆయన మనల్ని సూర్యోదయంలా ప్రకాశింపజేస్తాడు. 79  చీకట్లో, మరణ నీడలో కూర్చున్న వాళ్లకు వెలుగును ఇవ్వడానికి, మన పాదాలను శాంతి మార్గంలో నడిపించడానికి ఆయన అలా చేస్తాడు.” 80  ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు; ఆలోచనల్లో, వ్యక్తిత్వంలో బలపడ్డాడు. తనను తాను ఇశ్రాయేలీయులకు కనబర్చుకునేంత వరకు అతను ఎడారిలోనే జీవించాడు.

అధస్సూచీలు

పదకోశం చూడండి.
అంటే, అబీయా కుటుంబానికి చెందిన యాజకుల గుంపు.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
అక్ష., “విత్తనం.”
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
అక్ష., “కొమ్మును.”
లేదా “నిబంధనను.”
పదకోశం చూడండి.