లూకా 11:1-54

  • ఎలా ప్రార్థించాలి  (1-13)

    • మాదిరి ప్రార్థన  (2-4)

  • దేవుని వేలితో చెడ్డదూతల్ని వెళ్లగొట్టడం  (14-23)

  • అపవిత్ర దూత తిరిగొస్తాడు (24-26)

  • నిజమైన సంతోషం  (27, 28)

  • యోనాకు సంబంధించిన సూచన  (29-32)

  • శరీరానికి దీపం  (33-36)

  • మత వేషధారులకు శ్రమలు (37-54)

11  యేసు ఒక చోట ఉండి ప్రార్థిస్తున్నాడు; ప్రార్థించడం అయిపోయినప్పుడు ఆయన శిష్యుల్లో ఒకరు ఇలా అడిగారు: “ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పించినట్టే, ఎలా ప్రార్థించాలో నువ్వు కూడా మాకు నేర్పించు.”  కాబట్టి ఆయన వాళ్లకు ఇలా చెప్పాడు: “మీరు ఎప్పుడు ప్రార్థించినా, ఇలా అనండి: ‘తండ్రీ, నీ పేరు పవిత్రపర్చబడాలి.* నీ రాజ్యం రావాలి.  ప్రతీరోజు మా అవసరాలకు తగినట్టు మాకు ఆహారం ఇవ్వు.  మా పాపాలు క్షమించు. ఎందుకంటే, మేము కూడా మాకు అప్పుపడిన ప్రతీ ఒక్కర్ని క్షమిస్తున్నాం. మమ్మల్ని ప్రలోభాలకు లొంగిపోనివ్వకు.’”  తర్వాత ఆయన వాళ్లకు ఇలా చెప్పాడు: “మీలో ఒకరికి ఒక స్నేహితుడు ఉన్నాడనుకోండి. మీరు అర్ధరాత్రి పూట అతని ఇంటికి వెళ్లి ఇలా అడిగారు: ‘స్నేహితుడా, నాకు మూడు రొట్టెలు ఇవ్వు.  నా స్నేహితుడు ఒకతను ప్రయాణిస్తూ ఇప్పుడే మా ఇంటికి వచ్చాడు. అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు.’  కానీ అతను లోపలి నుండి ఇలా అన్నాడు: ‘నన్ను విసిగించకు. తలుపు ఇప్పటికే తాళం వేసి ఉంది. నా చిన్నపిల్లలు నాతోపాటు మంచం మీద పడుకొని ఉన్నారు. ఇప్పుడు నేను లేచి నీకు ఏమీ ఇవ్వలేను.’  నేను మీతో చెప్తున్నాను, మీరు తన స్నేహితుడు అయినందుకు అతను మీకు ఏమీ ఇవ్వకపోయినా, మీరు పట్టుదలతో పదేపదే అడిగినందుకు అతను లేచి మీకు కావాల్సినవన్నీ ఇస్తాడు.  కాబట్టి నేను మీతో చెప్తున్నాను: అడుగుతూ ఉండండి, మీకు ఇవ్వబడుతుంది; వెతుకుతూ ఉండండి, మీకు దొరుకుతుంది; తడుతూ ఉండండి, మీ కోసం తెరవబడుతుంది. 10  ఎందుకంటే అడిగే ప్రతీ వ్యక్తి పొందుతాడు, వెతికే ప్రతీ వ్యక్తికి దొరుకుతుంది, తట్టే ప్రతీ వ్యక్తి కోసం తెరవబడుతుంది. 11  నిజానికి, ఏ తండ్రైనా తన కొడుకు చేపను అడిగితే పామును ఇస్తాడా? 12  లేదా గుడ్డును అడిగితే తేలును ఇస్తాడా? 13  మీరు చెడ్డవాళ్లయినా, మీ పిల్లలకు మంచి బహుమతుల్ని ఎలా ఇవ్వాలో మీకు తెలుసు. అలాంటిది, పరలోకంలో ఉన్న తండ్రి తనను అడిగేవాళ్లకు ఇంకెంతగా పవిత్రశక్తిని ఇస్తాడో కదా!” 14  తర్వాత, చెడ్డదూత పట్టడంవల్ల మూగవాడైన ఒక వ్యక్తిలో నుండి యేసు ఆ చెడ్డదూతను వెళ్లగొట్టాడు. ఆ చెడ్డదూత బయటికి వచ్చాక ఆ మూగవాడు మాట్లాడాడు. దాంతో జనాలు ఎంతో ఆశ్చర్యపోయారు. 15  అయితే వాళ్లలో కొంతమంది ఇలా అన్నారు: “చెడ్డదూతల నాయకుడైన బయెల్జెబూలు* వల్లే ఇతను చెడ్డదూతల్ని వెళ్లగొడుతున్నాడు.” 16  ఇంకొంతమంది ఆయన్ని పరీక్షించడం కోసం, పరలోకం నుండి ఒక సూచన చూపించమని ఆయన్ని అడగడం మొదలుపెట్టారు. 17  యేసుకు వాళ్ల ఆలోచనలు తెలుసు కాబట్టి వాళ్లతో ఇలా అన్నాడు: “ఒక రాజ్యం దానిమీద అదే తిరగబడి చీలిపోతే, ఆ రాజ్యం నాశనమౌతుంది. అలాగే, ఒక ఇంట్లోవాళ్లే ఒకరిమీద ఒకరు తిరగబడి విడిపోతే, ఆ ఇల్లు నిలవదు. 18  అదేవిధంగా, సాతాను కూడా తన మీద తానే తిరగబడి విడిపోతే, అతని రాజ్యం ఎలా నిలుస్తుంది? నేను బయెల్జెబూలు వల్ల చెడ్డదూతల్ని వెళ్లగొడుతున్నానని మీరు అంటున్నారు. 19  ఒకవేళ నేను బయెల్జెబూలు వల్ల చెడ్డదూతల్ని వెళ్లగొడుతుంటే, మీవాళ్లు ఎవరి వల్ల వెళ్లగొడుతున్నారు? అందుకే వాళ్లే మీకు న్యాయమూర్తులుగా ఉంటారు. 20  కానీ నేను దేవుని వేలితో* చెడ్డదూతల్ని వెళ్లగొడుతుంటే గనుక, దేవుని రాజ్యం నిజంగా మిమ్మల్ని దాటి వెళ్లినట్లే. 21  ఆయుధాలు ధరించిన ఒక బలమైన వ్యక్తి తన ఇంటిని కాపలా కాస్తున్నప్పుడు, ఎవ్వరూ అతని వస్తువుల్ని దొంగిలించలేరు. 22  కానీ అంతకన్నా బలమైన వ్యక్తి అతని మీదికి వచ్చి అతన్ని ఓడిస్తే, ఏ ఆయుధాల మీదైతే అతను నమ్మకం పెట్టుకున్నాడో వాటన్నిటినీ తీసుకెళ్లిపోయి ఇతరులకు పంచిపెడతాడు. 23  నావైపు ఉండనివాడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడు, నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొడుతున్నాడు. 24  “అపవిత్ర దూత ఒక మనిషిలో నుండి బయటికి వచ్చినప్పుడు, విశ్రాంతి స్థలం కోసం నీళ్లులేని ప్రదేశాల గుండా తిరుగుతాడు; కానీ ఒక్కటి కూడా దొరకనప్పుడు, ‘నేను విడిచిపెట్టి వచ్చిన ఇంటికే మళ్లీ వెళ్తాను’ అనుకుంటాడు. 25  ఆ అపవిత్ర దూత తిరిగొచ్చినప్పుడు, ఆ ఇల్లు శుభ్రంగా ఊడ్వబడి, అలంకరించబడి ఉండడం చూసి 26  వెళ్లి, తనకన్నా చెడ్డవాళ్లయిన ఇంకో ఏడు దూతల్ని తీసుకొస్తాడు. వాళ్లు ఆ మనిషిలోకి వెళ్లి అక్కడే నివసిస్తారు; అప్పుడు ఆ మనిషి చివరి పరిస్థితి మొదటి పరిస్థితికన్నా ఘోరంగా తయారౌతుంది.” 27  ఆయన ఈ విషయాలు చెప్తున్నప్పుడు ఆ గుంపులో ఉన్న ఒకామె బిగ్గరగా ఇలా అంది: “నిన్ను కని, పాలిచ్చిన స్త్రీ సంతోషంగా ఉంటుంది!” 28  కానీ ఆయన ఇలా అన్నాడు: “దేవుని వాక్యాన్ని విని, పాటించేవాళ్లు ఇంకా సంతోషంగా ఉంటారు!” 29  చాలామంది ప్రజలు గుమికూడుతున్నప్పుడు ఆయనిలా చెప్పడం మొదలుపెట్టాడు: “ఈ తరం చెడ్డ తరం. వీళ్లు సూచన కోసం చూస్తారు. అయితే యోనాకు సంబంధించిన సూచన తప్ప వేరే ఏ సూచనా వీళ్లకు ఇవ్వబడదు. 30  యోనా నీనెవె ప్రజలకు సూచనగా ఉన్నట్టే, మానవ కుమారుడు ఈ తరంవాళ్లకు సూచనగా ఉంటాడు. 31  తీర్పు సమయంలో దక్షిణ దేశపు రాణి ఈ తరంవాళ్లతో పాటు లేచి వీళ్లమీద నేరం మోపుతుంది. ఎందుకంటే సొలొమోను మాట్లాడిన తెలివైన మాటల్ని వినడానికి ఆమె చాలాదూరం నుండి వచ్చింది. అయితే ఇదిగో! సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. 32  తీర్పు సమయంలో నీనెవె ప్రజలు ఈ తరంవాళ్లతో పాటు లేచి, వీళ్లమీద నేరం మోపుతారు. ఎందుకంటే యోనా ప్రకటించినప్పుడు నీనెవె ప్రజలు పశ్చాత్తాపపడ్డారు. అయితే ఇదిగో! యోనా కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. 33  దీపాన్ని వెలిగించిన తర్వాత దాన్ని దాచిపెట్టరు లేదా గంప* కింద పెట్టరు కానీ దీపస్తంభం మీదే పెడతారు. అప్పుడు లోపలికి వచ్చేవాళ్లు ఆ వెలుగును చూడగలుగుతారు. 34  శరీరానికి దీపం నీ కన్నే కాబట్టి, నీ కన్ను ఒకేదానిపై దృష్టి నిలిపితే* నీ శరీరమంతా ప్రకాశవంతంగా* ఉంటుంది. అయితే నీ కన్ను అసూయతో నిండిపోతే* నీ శరీరం చీకటిగా ఉంటుంది. 35  కాబట్టి అప్రమత్తంగా ఉండండి, మీలో ఉన్న వెలుగు చీకటి కావచ్చు. 36  మీ శరీరమంతా వెలుగుమయమై దానిలోని ఏ భాగమూ చీకటిగా లేకపోతే, ఆ వెలుగు ఒక దీపం తన కిరణాలతో ఇచ్చే వెలుగంత ప్రకాశవంతంగా ఉంటుంది.” 37  యేసు ఈ మాట చెప్పిన తర్వాత, ఒక పరిసయ్యుడు ఆయన్ని భోజనానికి ఆహ్వానించాడు. కాబట్టి యేసు అతని ఇంట్లోకి వెళ్లి భోజనం బల్ల దగ్గర కూర్చున్నాడు. 38  అయితే భోజనానికి ముందు యేసు చేతులు కడుక్కోకపోవడం* చూసి ఆ పరిసయ్యుడు ఆశ్చర్యపోయాడు. 39  అప్పుడు ప్రభువు అతనితో ఇలా అన్నాడు: “పరిసయ్యులారా, మీరు బయటికి శుభ్రంగా కనిపించి లోపల మురికిగా ఉన్న గిన్నెల్లాంటివాళ్లు. లోపల మీరు అత్యాశతో, దుష్టత్వంతో నిండివున్నారు. 40  అవివేకులారా! బయటి వైపును చేసిన దేవుడే లోపలి వైపును కూడా చేశాడు కదా? 41  లోపల ఉన్నవాటిని దానధర్మాలుగా* ఇవ్వండి. అప్పుడు మీకు సంబంధించిన ప్రతీది శుభ్రంగా ఉంటుంది. 42  పరిసయ్యులారా మీకు శ్రమ, ఎందుకంటే మీరు పుదీనలో, సదాపలో, కూరమొక్కల్లో ప్రతీదానిలో పదోవంతు ఇస్తారు కానీ న్యాయాన్ని, దేవుని ప్రేమను పట్టించుకోరు! నిజమే పదోవంతు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అలాగని న్యాయాన్ని, దేవుని ప్రేమను మీరు అశ్రద్ధ చేయకూడదు. 43  పరిసయ్యులారా మీకు శ్రమ! ఎందుకంటే సభామందిరాల్లో ముందువరుసలో* కూర్చోవడం, సంతల్లో నమస్కారాలు పెట్టించుకోవడం మీకు చాలా ఇష్టం. 44  మీకు శ్రమ! ఎందుకంటే, మీరు స్పష్టంగా కనిపించని* సమాధుల* లాంటివాళ్లు. మనుషులు వాటి మీద నడుస్తారు కానీ అవి ఉన్న సంగతే వాళ్లకు తెలీదు.” 45  అప్పుడు ధర్మశాస్త్రంలో ఆరితేరిన ఒక వ్యక్తి యేసుతో ఇలా అన్నాడు: “బోధకుడా, ఇలా అంటూ నువ్వు మమ్మల్ని కూడా అవమానిస్తున్నావు.” 46  అందుకు యేసు ఇలా అన్నాడు: “ధర్మశాస్త్రంలో ఆరితేరిన మీకు కూడా శ్రమ! ఎందుకంటే మీరు మోయలేని బరువులు పెట్టి మనుషుల్ని కృంగదీస్తారు. మీరు మాత్రం మీ వేలితో కూడా ఆ బరువుల్ని ముట్టుకోరు! 47  “మీకు శ్రమ! ఎందుకంటే మీరు ప్రవక్తల సమాధులు* కట్టిస్తారు. కానీ మీ పూర్వీకులే వాళ్లను చంపారు. 48  మీ పూర్వీకులు చేసినవాటి గురించి మీకు ఖచ్చితంగా తెలుసు, అయినా మీరు వాళ్లకు మద్దతిస్తున్నారు. వాళ్లు ప్రవక్తల్ని చంపితే, మీరేమో ఆ ప్రవక్తలకు సమాధులు కట్టిస్తున్నారు. 49  అందుకే దేవుడు కూడా తన తెలివితో ఇలా చెప్పాడు: ‘నేను వాళ్ల దగ్గరికి ప్రవక్తల్ని, అపొస్తలుల్ని పంపిస్తాను; వీళ్లలో కొంతమందిని వాళ్లు చంపుతారు, ఇంకొంతమందిని హింసిస్తారు. 50  కాబట్టి ప్రపంచం పుట్టిన* దగ్గర నుండి ఎంతమంది ప్రవక్తల రక్తం చిందించబడిందో వాళ్లందరి రక్తం విషయంలో ఈ తరంవాళ్లు లెక్క అప్పగించాలి. 51  హేబెలు రక్తంతో మొదలుపెట్టి బలిపీఠానికీ ఆలయానికీ మధ్య చంపబడిన జెకర్యా రక్తం వరకు అందరి రక్తం విషయంలో వాళ్లు లెక్క అప్పగించాలి.’ అవును, నేను మీతో చెప్తున్నాను, ఈ తరంవాళ్లు దాని విషయంలో లెక్క అప్పగించాలి. 52  “ధర్మశాస్త్రంలో ఆరితేరిన మీకు శ్రమ! ఎందుకంటే, మీరు జ్ఞానపు తాళంచెవిని తీసుకెళ్లిపోయారు. మీరు లోపలికి వెళ్లలేదు, వెళ్లేవాళ్లను కూడా మీరు ఆపుతున్నారు!” 53  కాబట్టి ఆయన అక్కడి నుండి బయటికి వెళ్లినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు ఆయన మీదికి తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ఆయన మీద ప్రశ్నల వర్షం కురిపించారు. 54  ఆయన నోటి నుండి వచ్చే ఏదోక మాటను బట్టి ఆయన్ని పట్టుకుందామని వాళ్లు ఎదురుచూశారు.

అధస్సూచీలు

లేదా “పవిత్రంగా ఎంచబడాలి; పవిత్రంగా చూడబడాలి.”
సాతానుకు ఉన్న ఓ బిరుదు.
లేదా “పవిత్రశక్తితో.”
లేదా “కుంచం.”
లేదా “నీ కన్ను స్పష్టంగా ఉంటే.” అక్ష., “సరళంగా ఉంటే.”
లేదా “వెలుగుమయంగా.”
అక్ష., “చెడ్డదైతే; దుష్టమైనదైతే.”
అంటే, ఆచార ప్రకారం శుభ్రపర్చుకోకపోవడం.
పదకోశం చూడండి.
లేదా “శ్రేష్ఠమైన స్థానాల్లో.”
లేదా “గుర్తులు వేయబడని.”
లేదా “స్మారక సమాధుల.”
లేదా “స్మారక సమాధులు.”
అక్ష., “(విత్తనం) పడిన,” అంటే ఆదాము హవ్వలకు పిల్లలు పుట్టిన.