లూకా 17:1-37

  • పాపంలో పడడం, క్షమాపణ, విశ్వాసం  (1-6)

  • ఎందుకూ పనికిరాని దాసులు (7-10)

  • పదిమంది కుష్ఠురోగులు బాగవ్వడం  (11-19)

  • దేవుని రాజ్యం రావడం  (20-37)

    • దేవుని రాజ్యం “మీ మధ్యే ఉంది” (21)

    • “లోతు భార్యను గుర్తుచేసుకోండి” (32)

17  తర్వాత ఆయన తన శిష్యులకు ఇలా చెప్పాడు: “ఒక వ్యక్తిని పాపంలో పడేసేవి ఎప్పుడూ ఉంటాయి. కానీ ఎవరైతే ఒక మనిషిని పాపంలో పడేస్తారో అతనికి శ్రమ!  ఈ చిన్నవాళ్లలో ఒకరు పాపం చేయడానికి కారణమవ్వడం కన్నా, మెడకు ఓ పెద్ద తిరుగలి రాయి కట్టబడి సముద్రంలో పడేయబడడమే ఒక వ్యక్తికి మంచిది.  జాగ్రత్త! నీ సోదరుడు పాపం చేస్తే అతన్ని గద్దించు; పశ్చాత్తాపపడితే క్షమించు.  అతను రోజుకు ఏడుసార్లు నీ విషయంలో పాపం చేసినా, ఏడుసార్లు నీ దగ్గరికి వచ్చి ‘నన్ను క్షమించు’ అని అడిగితే, నువ్వు అతన్ని క్షమించాలి.”  అప్పుడు అపొస్తలులు, “ఇంకా బలమైన విశ్వాసం కలిగివుండేలా మాకు సాయం చేయి” అని ప్రభువును అడిగారు.  అప్పుడు ప్రభువు ఇలా అన్నాడు: “మీకు ఆవగింజంత విశ్వాసం ఉండి, ఈ కంబళి* చెట్టుతో ‘ఇక్కడి నుండి లేచి సముద్రంలో పడు!’ అని చెప్తే, అది లేచి సముద్రంలో పడుతుంది.  “మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉన్నాడనుకోండి. అతను పొలం దున్ని లేదా మందను కాసి వస్తే యజమాని అతనితో, ‘వెంటనే వచ్చి ఇక్కడ భోజనానికి కూర్చో’ అని అంటాడా?  లేదు. యజమాని అతనితో, ‘నువ్వు బట్టలు మార్చుకొని, నేను తినడానికి ఏదోకటి సిద్ధం చేయి. నేను తిని తాగే వరకు పక్కనే ఉండి సేవలు చేయి. తర్వాత నువ్వు తిని తాగుదువుగానీ’ అంటాడు.  ఇచ్చిన పని చేసినందుకు యజమాని ఆ దాసునికి కృతజ్ఞతలు చెప్తాడా? చెప్పడు కదా. 10  అలాగే, మీరు కూడా మీకు ఇచ్చిన పనులన్నీ చేసిన తర్వాత ఇలా అనండి: ‘మేము ఎందుకూ పనికిరాని దాసులం. మేము చేయాల్సిన వాటినే చేశాం.’” 11  యేసు యెరూషలేముకు ప్రయాణిస్తూ సమరయ, గలిలయ పొలిమేరల మీదుగా వెళ్తున్నాడు. 12  ఆయన ఒక గ్రామంలో అడుగుపెడుతుండగా, పదిమంది కుష్ఠురోగులు ఆయనకు ఎదురొచ్చారు. వాళ్లు కాస్త దూరంలోనే నిలబడి, 13  “యేసూ, బోధకుడా, మమ్మల్ని కరుణించు!” అని బిగ్గరగా కేకలు వేశారు. 14  యేసు వాళ్లను చూసినప్పుడు వాళ్లతో, “వెళ్లి యాజకులకు కనిపించండి” అని అన్నాడు. వాళ్లు అలా వెళ్తూ ఉండగా శుద్ధులయ్యారు. 15  వాళ్లలో ఒకతను తాను బాగయ్యానని చూసుకున్నప్పుడు, దేవుణ్ణి బిగ్గరగా మహిమపరుస్తూ వెనక్కి తిరిగొచ్చాడు. 16  అతను యేసు పాదాల దగ్గర బోర్లపడి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు. అతనొక సమరయుడు. 17  అప్పుడు యేసు ఇలా అడిగాడు: “పదిమందీ శుద్ధులయ్యారు కదా? మరి మిగతా తొమ్మిదిమంది ఎక్కడ? 18  వేరే జాతికి చెందిన ఇతను తప్ప దేవుణ్ణి మహిమపర్చడానికి ఇంకెవ్వరూ తిరిగి రాలేదా?” 19  తర్వాత యేసు అతనితో ఇలా అన్నాడు: “లేచి నీ దారిన వెళ్లు, నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది.” 20  దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని పరిసయ్యులు అడిగినప్పుడు యేసు వాళ్లకు ఇలా చెప్పాడు: “దేవుని రాజ్యం అందరికీ కనిపించేలా రాదు. 21  అలాగే ప్రజలు, ‘ఇదిగో ఇక్కడుంది!’ ‘అదిగో అక్కడుంది!’ అని అనరు. ఎందుకంటే, ఇదిగో! దేవుని రాజ్యం మీ మధ్యే ఉంది.” 22  తర్వాత ఆయన శిష్యులతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడి రోజుల్లో ఒకదాన్ని చూడాలని మీరు కోరుకునే సమయం రాబోతుంది; కానీ మీరు దాన్ని చూడరు. 23  ప్రజలు మీతో, ‘అదిగో అక్కడ!’ ‘ఇదిగో ఇక్కడ!’ అని అంటారు. అప్పుడు మీరు వెళ్లకండి, వాళ్ల వెనుక పరుగెత్తకండి. 24  మెరుపు ఆకాశంలో ఒక చోట మొదలై ఆకాశంలో ఇంకో చోటి వరకు మెరుస్తుంది; మానవ కుమారుడి రోజుల్లో కూడా అలాగే ఉంటుంది. 25  అయితే ముందుగా ఆయన చాలా బాధలు పడి, ఈ తరంవాళ్ల చేత తిరస్కరించబడాలి. 26  అంతేకాదు, నోవహు రోజుల్లో జరిగినట్టే మానవ కుమారుడి రోజుల్లో కూడా ఉంటుంది: 27  నోవహు ఓడలోకి వెళ్లే రోజు వరకు ప్రజలు తింటూ, తాగుతూ, పెళ్లిళ్లు చేసుకుంటూ ఉన్నారు. తర్వాత జలప్రళయం వచ్చి వాళ్లందర్నీ నాశనం చేసింది. 28  అలాగే అప్పుడు పరిస్థితి లోతు రోజుల్లో ఉన్నట్టే ఉంటుంది: ప్రజలు తింటూ, తాగుతూ, కొంటూ, అమ్ముతూ, నాటుతూ, ఇళ్లు కట్టుకుంటూ ఉన్నారు. 29  కానీ లోతు సొదొమ నుండి బయటికి వచ్చిన రోజున ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురిసి వాళ్లందర్నీ నాశనం చేశాయి. 30  మానవ కుమారుడు వెల్లడయ్యే రోజున పరిస్థితి అలాగే ఉంటుంది. 31  “ఆ రోజున, డాబా మీదున్న వ్యక్తి ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకోవడానికి కిందికి దిగకూడదు. అలాగే, పొలంలో ఉన్న వ్యక్తి తన వస్తువులు తీసుకోవడానికి ఇంటికి తిరిగి రాకూడదు. 32  లోతు భార్యను గుర్తుచేసుకోండి. 33  తన ప్రాణాన్ని కాపాడుకోవాలని ప్రయత్నించే వ్యక్తి దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ దాన్ని పోగొట్టుకునే వ్యక్తి దాన్ని కాపాడుకుంటాడు. 34  నేను మీతో చెప్తున్నాను, ఆ రాత్రి ఇద్దరు ఒక మంచంలో పడుకొని ఉంటారు; వాళ్లలో ఒకరు తీసుకుపోబడతారు, ఇంకొకరు వదిలేయబడతారు. 35  ఇద్దరు స్త్రీలు ఒకే తిరుగలి విసురుతూ ఉంటారు; వాళ్లలో ఒకామె తీసుకుపోబడుతుంది, ఇంకొకామె వదిలేయబడుతుంది.” 36  *—— 37  అప్పుడు వాళ్లు యేసును “ఇది ఎక్కడ జరుగుతుంది ప్రభువా?” అని అడిగారు. ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “శవం ఎక్కడ ఉంటే గద్దలు అక్కడ పోగౌతాయి.”

అధస్సూచీలు

లేదా “మల్బెరీ.”
మత్తయి 17:21కి ఉన్న పాదసూచిక చూడండి.