లూకా 18:1-43

  • పట్టువిడవని విధవరాలి ఉదాహరణ  (1-8)

  • పరిసయ్యుడు, పన్ను వసూలు చేసే వ్యక్తి  (9-14)

  • యేసు, పిల్లలు (15-17)

  • ధనవంతుడైన పరిపాలకుడి ప్రశ్న (18-30)

  • యేసు చనిపోవడం గురించి మరోసారి ముందే చెప్పబడింది  (31-34)

  • చూపులేని అడుక్కునేవాడికి చూపు వస్తుంది  (35-43)

18  ఎప్పుడూ ప్రార్థించడం, పట్టువిడవకుండా ఉండడం ఎందుకు అవసరమో చూపించడానికి తర్వాత యేసు వాళ్లకు ఈ ఉదాహరణ చెప్పాడు:  “ఒకానొక నగరంలో, దేవుడంటే భయం గానీ మనుషులంటే గౌరవం గానీ లేని ఒక న్యాయమూర్తి ఉండేవాడు.  అదే నగరంలో ఒక విధవరాలు కూడా ఉండేది. ఆమె ఆ న్యాయమూర్తి దగ్గరికి వెళ్లి, ‘నా ప్రతివాదితో నాకున్న గొడవ పరిష్కరించి నాకు న్యాయం జరిగేలా చూడండి’ అని అడుగుతూ ఉండేది.  కొంతకాలం పాటు అతను ఆమెను పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత ఇలా అనుకున్నాడు: ‘నాకు దేవుడంటే భయం గానీ మనుషులంటే గౌరవం గానీ లేకపోయినా,  ఈ విధవరాలు నన్ను అదేపనిగా విసిగిస్తోంది కాబట్టి ఆమెకు న్యాయం జరిగేలా చూస్తాను. అప్పుడిక ఆమె ఇలా నా దగ్గరికి వస్తూ తన గొడవతో నా ప్రాణం తోడేయకుండా ఉంటుంది.’”  తర్వాత ప్రభువు ఇలా చెప్పాడు: “అన్యాయస్థుడే అయినా ఆ న్యాయమూర్తి ఏమన్నాడో గమనించండి!  కాబట్టి తాను ఎంచుకున్నవాళ్లు రాత్రింబగళ్లు వేడుకుంటూ ఉంటే, దేవుడు తప్పకుండా వాళ్లకు న్యాయం జరిగేలా చేయడా? అంతేకాదు, వాళ్ల విషయంలో ఆయన ఓర్పు కూడా చూపిస్తాడు.  నేను మీతో చెప్తున్నాను, ఆయన వాళ్లకు త్వరగా న్యాయం జరిగేలా చేస్తాడు. అయినా మానవ కుమారుడు వచ్చినప్పుడు, ఆయనకు భూమ్మీద నిజంగా ఇలాంటి విశ్వాసం కనిపిస్తుందా?”  అంతేకాదు, తమ సొంత నీతిని నమ్ముకుంటూ, ఇతరుల్ని చిన్నచూపు చూసే కొంతమందికి ఆయన ఈ ఉదాహరణ చెప్పాడు: 10  “ఇద్దరు వ్యక్తులు ప్రార్థించడానికి ఆలయంలోకి వెళ్లారు. వాళ్లలో ఒకతను పరిసయ్యుడు, ఇంకొకతను పన్ను వసూలు చేసే వ్యక్తి. 11  ఆ పరిసయ్యుడు నిలబడి, మనసులో ఇలా ప్రార్థించడం మొదలుపెట్టాడు: ‘దేవా, నేను మిగతావాళ్లలా లేనందుకు, అంటే దోచుకునేవాళ్లలా, అనీతిమంతుల్లా, వ్యభిచారుల్లా, చివరికి ఈ పన్ను వసూలు చేసేవాడిలా కూడా లేనందుకు నీకు కృతజ్ఞతలు. 12  నేను వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను; నాకు వచ్చే ప్రతీదానిలో పదోవంతు చెల్లిస్తున్నాను.’ 13  అయితే పన్ను వసూలు చేసే వ్యక్తి కాస్త దూరంలోనే నిలబడి, ఆకాశంవైపు కళ్లెత్తి చూడడానికి కూడా ధైర్యం చేయలేక, గుండెలు బాదుకుంటూ ‘దేవా, నన్ను కరుణించు, నేను పాపిని’ అన్నాడు. 14  నేను మీతో చెప్తున్నాను, ఆ పరిసయ్యుడి కన్నా ఇతను ఎక్కువ నీతిమంతుడిగా ఇంటికి వెళ్లాడు. ఎందుకంటే, తనను తాను గొప్ప చేసుకునే ప్రతీ వ్యక్తి తగ్గించబడతాడు; కానీ తనను తాను తగ్గించుకునే ప్రతీ వ్యక్తి గొప్ప చేయబడతాడు.” 15  యేసు తమ పిల్లల మీద చేతులు ఉంచాలని ప్రజలు తమ పసిపిల్లల్ని ఆయన దగ్గరికి తీసుకొస్తూ ఉన్నారు. కానీ శిష్యులు అది చూసినప్పుడు వాళ్లను గద్దించడం మొదలుపెట్టారు. 16  అయితే యేసు ఆ పసిపిల్లల్ని తన దగ్గరికి పిలుస్తూ ఇలా అన్నాడు: “చిన్నపిల్లల్ని నా దగ్గరికి రానివ్వండి, వాళ్లను ఆపాలని చూడకండి, ఎందుకంటే దేవుని రాజ్యం ఇలాంటివాళ్లదే. 17  నేను నిజంగా మీతో చెప్తున్నాను, చిన్నపిల్లల్లా దేవుని రాజ్యాన్ని స్వీకరించనివాళ్లు అందులోకి అస్సలు ప్రవేశించరు.” 18  యూదుల నాయకుడు ఒకతను యేసును ఇలా అడిగాడు: “మంచి బోధకుడా, శాశ్వత జీవితాన్ని పొందాలంటే* నేను ఏమి చేయాలి?” 19  యేసు అతనితో ఇలా అన్నాడు: “నన్ను మంచివాడని ఎందుకు అంటున్నావు? దేవుడు తప్ప మంచివాళ్లెవరూ లేరు. 20  నీకు ఈ ఆజ్ఞలు తెలుసు కదా: ‘వ్యభిచారం చేయకూడదు, హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు, మీ అమ్మానాన్నల్ని గౌరవించాలి.’” 21  అప్పుడతను, “చిన్నప్పటినుండి నేను ఇవన్నీ పాటిస్తున్నాను” అని చెప్పాడు. 22  ఆ మాట విన్నాక యేసు అతనితో ఇలా అన్నాడు: “నువ్వు చేయాల్సింది ఇంకొకటి ఉంది: నీ దగ్గర ఉన్నవన్నీ అమ్మేసి, వచ్చిన డబ్బును పేదవాళ్లకు పంచిపెట్టు. అప్పుడు పరలోకంలో నీకు ఐశ్వర్యం కలుగుతుంది. ఆ తర్వాత వచ్చి నా శిష్యుడివి అవ్వు.” 23  ఆ మాట విని అతను ఎంతో దుఃఖపడ్డాడు. ఎందుకంటే అతనికి చాలా ఆస్తి ఉంది. 24  యేసు అతనివైపు చూసి ఇలా అన్నాడు: “డబ్బున్న వాళ్లు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం ఎంత కష్టం! 25  నిజానికి, ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం కన్నా సూది రంధ్రం గుండా ఒంటె దూరడం తేలిక.” 26  ఆ మాట విన్నవాళ్లు, “అసలు రక్షణ పొందడం ఎవరికైనా సాధ్యమేనా?” అని ఆయన్ని అడిగారు. 27  అప్పుడు యేసు, “మనుషులకు సాధ్యంకానివి దేవునికి సాధ్యమే” అని చెప్పాడు. 28  అయితే పేతురు ఇలా అన్నాడు: “ఇదిగో! మేము మాకు ఉన్నవన్నీ విడిచిపెట్టి నిన్ను అనుసరించాం.” 29  దానికి యేసు వాళ్లకు ఇలా చెప్పాడు: “నేను నిజంగా మీతో చెప్తున్నాను, దేవుని రాజ్యం కోసం ఇంటినైనా, భార్యనైనా, అన్నదమ్ములనైనా, అమ్మానాన్నలనైనా, పిల్లలనైనా విడిచిపెట్టే ప్రతీ వ్యక్తి 30  ఇప్పటి కాలంలో ఎన్నోరెట్లు ఎక్కువ పొందుతాడు, అలాగే రానున్న వ్యవస్థలో* శాశ్వత జీవితం పొందుతాడు.” 31  తర్వాత ఆయన ఆ పన్నెండుమందిని పక్కకు తీసుకెళ్లి వాళ్లకు ఇలా చెప్పాడు: “ఇదిగో! మనం యెరూషలేముకు వెళ్తున్నాం. మానవ కుమారుడి గురించి ప్రవక్తల ద్వారా రాయబడినవన్నీ జరగబోతున్నాయి. 32  ఉదాహరణకు, ఆయన అన్యుల చేతికి అప్పగించబడతాడు. వాళ్లు ఆయన్ని ఎగతాళి చేస్తారు, ఆయనతో క్రూరంగా వ్యవహరిస్తారు, ఆయన మీద ఉమ్మేస్తారు. 33  ఆయన్ని కొరడాలతో కొట్టి, చంపేస్తారు; కానీ మూడో రోజున ఆయన మళ్లీ బ్రతుకుతాడు.” 34  అయితే, అపొస్తలులకు వాటిలో ఏదీ అర్థంకాలేదు. ఎందుకంటే అవి వాళ్లకు అర్థంకాకుండా దాచబడ్డాయి. 35  యేసు యెరికో దగ్గరికి వస్తున్నప్పుడు, ఒక గుడ్డివాడు దారి పక్కన కూర్చొని అడుక్కుంటున్నాడు. 36  ఒక గుంపు అటుగా వెళ్తున్న శబ్దం వినిపించడంతో అతను ఏం జరుగుతోందని అడగడం మొదలుపెట్టాడు. 37  వాళ్లు, “నజరేయుడైన యేసు ఇటువైపు నుండి వెళ్తున్నాడు!” అని అతనికి చెప్పారు. 38  దాంతో అతను, “యేసూ, దావీదు కుమారుడా, నన్ను కరుణించు!” అని కేకలు వేశాడు. 39  అప్పుడు ముందున్న వాళ్లు, నిశ్శబ్దంగా ఉండమని అతన్ని గద్దించడం మొదలుపెట్టారు. కానీ అతను ఇంకా ఎక్కువగా, “దావీదు కుమారుడా, నన్ను కరుణించు!” అని కేకలు వేస్తూ ఉన్నాడు. 40  అప్పుడు యేసు ఆగి, అతన్ని తన దగ్గరికి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. అతను దగ్గరికి వచ్చాక, యేసు అతన్ని ఇలా అడిగాడు: 41  “నీ కోసం నన్ను ఏం చేయమంటావు?” దానికి అతను, “ప్రభువా, నాకు చూపు తెప్పించు” అన్నాడు. 42  కాబట్టి యేసు అతనితో, “చూపు పొందు; నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది” అన్నాడు. 43  ఆ క్షణమే అతనికి చూపు వచ్చింది; దాంతో అతను దేవుణ్ణి మహిమపరుస్తూ యేసును అనుసరించడం మొదలుపెట్టాడు. అంతేకాదు, అది చూసినప్పుడు ప్రజలందరూ దేవుణ్ణి స్తుతించారు.

అధస్సూచీలు

అక్ష., “వారసత్వంగా పొందాలంటే.”
లేదా “యుగంలో.” పదకోశం చూడండి.