లూకా 2:1-52

  • యేసు పుట్టడం  (1-7)

  • గొర్రెల కాపరులకు దేవదూతలు కనిపిస్తారు (8-20)

  • సున్నతి, శుద్ధీకరణ  (21-24)

  • సుమెయోను క్రీస్తును చూస్తాడు (25-35)

  • బిడ్డ గురించి అన్న మాట్లాడుతుంది  (36-38)

  • నజరేతుకు తిరిగివెళ్తారు (39, 40)

  • ఆలయంలో పన్నెండేళ్ల యేసు (41-52)

2  ఆ రోజుల్లో కైసరు ఔగుస్తు భూమంతటా ఉన్న ప్రజలు తమ పేర్లు నమోదు చేయించుకోవాలని ఆజ్ఞ జారీచేశాడు.  (ఇలా పేర్లు నమోదు చేయించడం ఇదే మొదటిసారి. ఇది కురేనియు సిరియాకు అధిపతిగా ఉన్నప్పుడు జరిగింది.)  కాబట్టి ప్రజలందరూ పేర్లు నమోదు చేయించుకోవడానికి తమ సొంత ఊళ్లకు వెళ్లారు.  యోసేపు కూడా గలిలయలోని నజరేతు నుండి బయల్దేరి యూదయలో ఉన్న దావీదు నగరానికి అంటే బేత్లెహేముకు వెళ్లాడు. ఎందుకంటే అతను దావీదు వంశస్థుడు.  అతను తాను పెళ్లిచేసుకున్న మరియను తీసుకొని పేరు నమోదు చేయించుకోవడానికి వెళ్లాడు. ఇప్పుడు ఆమె నిండు గర్భిణి.  వాళ్లు అక్కడ ఉన్నప్పుడు, ఆమె బిడ్డను కనే సమయం వచ్చింది.  ఆమె తన కొడుకును, అంటే మొట్టమొదటి బిడ్డను కన్నది. ఆమె ఆ బిడ్డను పొత్తిగుడ్డలతో చుట్టి, తాము ఉండడానికి ఎక్కడా స్థలం లేకపోవడంతో ఆ బిడ్డను పశువులు మేతమేసే తొట్టిలో పడుకోబెట్టింది.  అదే ప్రాంతంలో కొంతమంది గొర్రెల కాపరులు ఆరుబయట ఉండి రాత్రిపూట తమ మందల్ని కాస్తూ ఉన్నారు.  అప్పుడు హఠాత్తుగా యెహోవా* దూత వాళ్ల ముందు నిలబడ్డాడు. యెహోవా* మహిమ వాళ్ల చుట్టూ ప్రకాశించింది. దాంతో వాళ్లు చాలా భయపడిపోయారు. 10  అయితే ఆ దేవదూత వాళ్లతో ఇలా అన్నాడు: “భయపడకండి. ఇదిగో! ప్రజలందరికీ గొప్ప సంతోషాన్ని తీసుకొచ్చే శుభవార్తను నేను మీకు ప్రకటిస్తున్నాను. 11  ఈ రోజు దావీదు నగరంలో మీ కోసం ఒక రక్షకుడు పుట్టాడు, ఆయనే ప్రభువైన క్రీస్తు. 12  ఆయన్ని మీరెలా గుర్తుపట్టవచ్చంటే, ఒక బిడ్డ పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువులు మేతమేసే తొట్టిలో పడుకొని ఉంటాడు.” 13  ఉన్నట్టుండి, పరలోక సైన్యంలోని చాలామంది దేవదూతలు ఆ దేవదూతతో పాటు కనిపించి దేవుణ్ణి ఇలా స్తుతిస్తూ ఉన్నారు: 14  “పరలోకంలో దేవునికి మహిమ కలగాలి. భూమ్మీద దేవుడు ఆమోదించే మనుషులకు శాంతి కలగాలి.” 15  ఆ దూతలు తమ దగ్గరనుండి పరలోకానికి వెళ్లిపోగానే గొర్రెల కాపరులు, “ఎలాగైనా సరే మనం బేత్లెహేముకు వెళ్లి, యెహోవా* మనకు తెలియజేసినదాన్ని చూసి వద్దాం” అని ఒకరితో ఒకరు అనుకున్నారు. 16  వాళ్లు త్వరగా వెళ్లి మరియను, యోసేపును, పశువుల తొట్టిలో పడుకొని ఉన్న పసికందును కనుగొన్నారు. 17  వాళ్లు ఆ బిడ్డను చూసినప్పుడు, ఆ బిడ్డ గురించి దేవదూత తమతో చెప్పిన మాటల్ని తెలియజేశారు. 18  ఆ గొర్రెల కాపరులు చెప్పింది విన్న వాళ్లంతా చాలా ఆశ్చర్యపోయారు. 19  అయితే మరియ ఆ మాటలన్నిటినీ మనసులో దాచుకొని, వాటి గురించి ధ్యానించడం మొదలుపెట్టింది. 20  గొర్రెల కాపరులు తాము చూసినవన్నీ, విన్నవన్నీ దేవుడు తమకు తెలియజేసినట్టే ఉండడంతో దేవుణ్ణి మహిమపరుస్తూ, ఘనపరుస్తూ తిరిగి వెళ్లిపోయారు. 21  ఎనిమిది రోజుల తర్వాత ఆ బిడ్డకు సున్నతి చేయించే సమయం వచ్చినప్పుడు ఆయనకు యేసు అని పేరు పెట్టారు. మరియ గర్భవతి కాకముందు దేవదూత చెప్పిన పేరు అదే. 22  అంతేకాదు, మోషే ధర్మశాస్త్రం ప్రకారం వాళ్లు శుద్ధి చేసుకునే సమయం వచ్చినప్పుడు, యోసేపు మరియలు ఆయన్ని యెహోవాకు* చూపించడానికి యెరూషలేముకు తీసుకొచ్చారు. 23  ఎందుకంటే, “మొట్టమొదట పుట్టిన ప్రతీ మగబిడ్డ యెహోవాకు* చెందాలి” అని యెహోవా* ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. 24  అంతేకాదు, “ఒక జత గువ్వల్ని గానీ రెండు చిన్న పావురాల్ని గానీ అర్పించాలి” అని యెహోవా* ధర్మశాస్త్రంలో చెప్పబడినట్టే వాళ్లు బలి అర్పించారు. 25  ఇదిగో! యెరూషలేములో సుమెయోను అనే వ్యక్తి ఉండేవాడు. అతను నీతిమంతుడు, దైవభక్తి గలవాడు. దేవుడు ఇశ్రాయేలీయుల్ని రక్షించే సమయం కోసం అతను ఎదురుచూస్తూ ఉండేవాడు. పవిత్రశక్తి అతని మీద ఉండేది. 26  అంతేకాదు, యెహోవా* అభిషేకించిన వ్యక్తిని* చూసేవరకు అతను చనిపోడని పవిత్రశక్తి ద్వారా అతనికి అద్భుతరీతిలో వెల్లడిచేయబడింది. 27  పవిత్రశక్తి నిర్దేశంతో ఇప్పుడతను ఆలయం లోపలికి వచ్చాడు. ధర్మశాస్త్రం కోరినట్లు చేయడానికి యేసు తల్లిదండ్రులు పసివాడైన యేసును ఆలయంలోకి తీసుకొచ్చినప్పుడు 28  అతను ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకొని, దేవుణ్ణి ఇలా స్తుతించాడు: 29  “సర్వోన్నత ప్రభువా, ఇప్పుడు నువ్వు నీ మాట ప్రకారం నీ దాసున్ని మనశ్శాంతితో చనిపోనిస్తున్నావు. 30  ఎందుకంటే నా కళ్లు నీ రక్షణ మార్గాన్ని చూశాయి. 31  ఆ మార్గాన్ని అన్నిదేశాల ప్రజల కళ్లముందు నువ్వు సిద్ధం చేశావు. 32  ఆయన, దేశాల మీదున్న ముసుగును తీసేసే వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగా ఉన్నాడు.” 33  ఆ బిడ్డ గురించి సుమెయోను చెప్తున్న మాటల్ని విని యేసు తల్లిదండ్రులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. 34  అంతేకాదు, సుమెయోను వాళ్లను దీవించి, ఆ బిడ్డ తల్లి మరియతో ఇలా అన్నాడు: “ఇదిగో! ఈయన వల్ల కొంతమంది ఇశ్రాయేలీయులు పడిపోతారు, ఇంకొంతమంది లేస్తారు. తాను ఈయనకు తోడుగా ఉన్నానని దేవుడు గుర్తులు చూపించినా, చాలామంది ఈయనకు వ్యతిరేకంగా మాట్లాడతారు. 35  దానివల్ల చాలామంది హృదయాల్లోని ఆలోచనలు బయటపడతాయి. ఇక నీ విషయానికొస్తే, నీలో నుండి ఒక పొడవాటి ఖడ్గం దూసుకుపోతుంది.” 36  అన్న అనే ఒక ప్రవక్త్రి ఉండేది. ఆమె ఆషేరు గోత్రానికి చెందిన పనూయేలు కూతురు. ఆమె చాలా వృద్ధురాలు. పెళ్లయి ఏడు సంవత్సరాలు భర్తతో కాపురం చేసిన తర్వాత, 37  ఆమె విధవరాలైంది. ఇప్పుడు ఆమెకు 84 ఏళ్లు. ఆమె మానకుండా ఆలయానికి వెళ్తూ, ఉపవాసం ఉంటూ, పట్టుదలతో ప్రార్థిస్తూ రాత్రింబగళ్లు పవిత్రసేవ చేస్తూ ఉండేది. 38  ఆ సమయంలోనే ఆమె వాళ్ల దగ్గరికి వచ్చి దేవునికి కృతజ్ఞతలు చెప్పడం, అలాగే యెరూషలేము విడుదల కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరితో ఆ బిడ్డ గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. 39  యెహోవా* ధర్మశాస్త్రం ప్రకారం అన్నీ చేసిన తర్వాత వాళ్లు గలిలయలో ఉన్న తమ సొంతూరు నజరేతుకు తిరిగి వెళ్లారు. 40  ఆ చిన్న బిడ్డ ఎదుగుతూ బలంగా, తెలివైనవాడిగా తయారౌతున్నాడు; దేవుని అనుగ్రహం ఆయన మీద అలాగే కొనసాగింది. 41  ఆయన తల్లిదండ్రులు పస్కా పండుగ కోసం ప్రతీ సంవత్సరం యెరూషలేముకు వెళ్లేవాళ్లు. 42  ఆయనకు 12 ఏళ్లు ఉన్నప్పుడు, వాళ్లు ఎప్పటిలాగే పండుగకు వెళ్లారు. 43  పండుగ రోజులు పూర్తయి వాళ్లు తిరిగి వెళ్తున్నప్పుడు, బాలుడైన యేసు యెరూషలేములోనే ఉండిపోయాడు, అయితే ఆయన తల్లిదండ్రులు ఆ విషయం గమనించుకోలేదు. 44  ఆయన తమతో కలిసి ప్రయాణిస్తున్న గుంపులోనే ఉన్నాడని అనుకుంటూ వాళ్లు ఒక రోజంతా ప్రయాణం చేశారు. తర్వాత తమ బంధువుల్లో, తెలిసినవాళ్లలో ఆయన కోసం వెతకడం మొదలుపెట్టారు. 45  ఆయన కనిపించకపోయే సరికి వాళ్లు మళ్లీ యెరూషలేముకు వచ్చి ఆయన కోసం అన్నిచోట్లా వెతికారు. 46  మూడు రోజుల తర్వాత ఆయన వాళ్లకు ఆలయంలో కనిపించాడు. అక్కడ ఆయన బోధకుల మధ్య కూర్చొని వాళ్లు చెప్పేది వింటూ, వాళ్లను ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. 47  ఆయన మాటలు వింటున్న వాళ్లందరూ ఆయన అవగాహనను, ఆయన చెప్తున్న జవాబుల్ని చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారు. 48  ఆయన తల్లిదండ్రులు ఆయన్ని చూసినప్పుడు అవాక్కయ్యారు. అప్పుడు వాళ్ల అమ్మ ఆయనతో, “బాబూ, నువ్వెందుకు ఇలా చేశావు? ఇదిగో నేను, మీ నాన్న ఎంతో ఆందోళనతో నీ కోసం వెతుకుతూ ఉన్నాం” అంది. 49  అయితే ఆయన వాళ్లతో, “మీరెందుకు నా కోసం వెతుకుతున్నారు? నేను నా తండ్రి ఇంట్లో ఉండాలని మీకు తెలీదా?” అన్నాడు. 50  కానీ ఆయన ఏమంటున్నాడో వాళ్లకు అర్థంకాలేదు. 51  తర్వాత ఆయన వాళ్లతో పాటు నజరేతుకు వెళ్లి, అన్నివేళలా వాళ్లకు లోబడి ఉన్నాడు. అంతేకాదు, వాళ్లమ్మ ఈ మాటలన్నిటినీ జాగ్రత్తగా తన హృదయంలో దాచుకుంది. 52  యేసు పెరిగి పెద్దవాడౌతూ, ఇంకా తెలివైనవాడిగా తయారౌతున్నాడు; అంతకంతకూ దేవుని అనుగ్రహాన్ని, మనుషుల అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాడు.

అధస్సూచీలు

పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
అక్ష., “క్రీస్తును.”
పదకోశం చూడండి.