లూకా 22:1-71

  • యేసును చంపడానికి యాజకుల కుట్ర  (1-6)

  • చివరి పస్కా పండుగ కోసం సిద్ధపాట్లు (7-13)

  • ప్రభువు రాత్రి భోజనాన్ని స్థాపించడం  (14-20)

  • ‘నన్ను అప్పగించే వ్యక్తి నాతోపాటు ఈ బల్ల’ దగ్గర ఉన్నాడు (21-23)

  • ఎవరు గొప్ప అనే విషయం గురించి పెద్ద గొడవ  (24-27)

  • రాజ్యం గురించి యేసు ఒప్పందం  (28-30)

  • యేసు తెలీదని పేతురు అంటాడని ముందే చెప్పబడింది  (31-34)

  • సిద్ధంగా ఉండాల్సిన అవసరం; రెండు కత్తులు (35-38)

  • ఒలీవల కొండ మీద యేసు ప్రార్థన  (39-46)

  • యేసును బంధిస్తారు (47-53)

  • యేసు తెలీదని పేతురు అంటాడు (54-62)

  • యేసును ఎగతాళి చేస్తారు (63-65)

  • మహాసభ ముందు విచారణ  (66-71)

22  పస్కా అని పిలిచే పులవని రొట్టెల పండుగ దగ్గరపడుతోంది.  ముఖ్య యాజకులు, శాస్త్రులు యేసును చంపడానికి అనువైన మార్గం కోసం చూస్తున్నారు. ఎందుకంటే వాళ్లు ప్రజలకు భయపడ్డారు.  అప్పుడు పన్నెండుమందిలో ఒకడైన ఇస్కరియోతు యూదాలోకి సాతాను ప్రవేశించాడు.  కాబట్టి అతను వెళ్లిపోయి, యేసును వాళ్లకు ఎలా అప్పగించాలనే విషయం గురించి ముఖ్య యాజకులతో, ఆలయ అధికారులతో మాట్లాడాడు.  వాళ్లు సంతోషించి, అతనికి వెండి నాణేలు ఇస్తామని చెప్పారు.  దానికి అతను ఒప్పుకొని, చుట్టూ జనం లేనప్పుడు యేసును వాళ్లకు అప్పగించడానికి మంచి అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు.  పులవని రొట్టెల పండుగ మొదటి రోజు వచ్చేసింది, అది పస్కా బలి అర్పించాల్సిన రోజు.  కాబట్టి యేసు పేతురును, యోహానును పంపిస్తూ “మీరు వెళ్లి, మనం తినడానికి పస్కా భోజనం సిద్ధం చేయండి” అని చెప్పాడు.  అప్పుడు వాళ్లు, “మమ్మల్ని ఎక్కడ సిద్ధం చేయమంటావు?” అని ఆయన్ని అడిగారు. 10  ఆయన వాళ్లకిలా చెప్పాడు: “మీరు నగరంలో అడుగుపెట్టినప్పుడు, నీళ్లకుండ మోసుకువెళ్తున్న ఒకతను మీకు ఎదురౌతాడు. అతను వెళ్లే ఇంటికి మీరూ అతని వెనక వెళ్లండి. 11  వెళ్లాక, ఆ ఇంటి యజమానితో ఇలా అనండి: ‘“నేను నా శిష్యులతో కలిసి పస్కా భోజనం చేయడానికి గది ఎక్కడుంది?” అని బోధకుడు నిన్ను అడుగుతున్నాడు.’ 12  అప్పుడతను కావాల్సిన వస్తువులన్నీ ఉన్న పెద్ద మేడగది చూపిస్తాడు. అక్కడ సిద్ధం చేయండి.” 13  వాళ్లు వెళ్లినప్పుడు, అంతా ఆయన చెప్పినట్టే జరగడం చూశారు; వాళ్లు అక్కడ పస్కా కోసం ఏర్పాట్లు చేశారు. 14  పస్కా భోజనం చేసే సమయం వచ్చినప్పుడు యేసు తన అపొస్తలులతో పాటు భోజనం బల్ల దగ్గర కూర్చున్నాడు. 15  ఆయన వాళ్లకు ఇలా చెప్పాడు: “నేను బాధలు పడకముందు మీతో కలిసి ఈ పస్కా భోజనం చేయాలని ఎంతో కోరుకున్నాను; 16  ఎందుకంటే, దేవుని రాజ్యంలో ఇది నెరవేరేవరకు ఇక నేను మళ్లీ దీన్ని తినను అని మీతో చెప్తున్నాను.” 17  తర్వాత ఆయన గిన్నె తీసుకొని, దేవునికి కృతజ్ఞతలు చెప్పి ఇలా అన్నాడు: “దీన్ని తీసుకొని, మీరు ఒకరి తర్వాత ఒకరు దీనిలోది తాగండి. 18  ఎందుకంటే, ఇప్పటినుండి దేవుని రాజ్యం వచ్చేవరకు ఇక నేను మళ్లీ ద్రాక్షారసం తాగనని మీతో చెప్తున్నాను.” 19  అంతేకాదు, ఆయన రొట్టె కూడా తీసుకొని, దేవునికి కృతజ్ఞతలు చెప్పి, దాన్ని విరిచి వాళ్లకు ఇస్తూ ఇలా అన్నాడు: “ఇది మీ కోసం నేను అర్పించబోతున్న నా శరీరాన్ని సూచిస్తోంది. నన్ను గుర్తుచేసుకోవడానికి దీన్ని చేస్తూ ఉండండి.” 20  వాళ్లు భోజనం చేసిన తర్వాత, ఆయన ద్రాక్షారసం గిన్నె కూడా తీసుకొని ఇలా అన్నాడు: “ఈ గిన్నె, మీ కోసం నేను చిందించబోతున్న నా రక్తం ఆధారంగా ఏర్పడే కొత్త ఒప్పందాన్ని* సూచిస్తోంది. 21  “అయితే ఇదిగో! నన్ను అప్పగించే వ్యక్తి చేయి నాతోపాటు ఈ బల్ల మీద ఉంది. 22  నిజానికి, మానవ కుమారుడు ముందే చెప్పబడిన విధంగా వెళ్లిపోతున్నాడు; అయితే ఎవరి ద్వారా ఆయన అప్పగించబడతాడో ఆ వ్యక్తికి శ్రమ!” 23  కాబట్టి తమలో ఎవరు నిజంగా అలా చేయబోతున్నారో అని వాళ్లలో వాళ్లు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. 24  అయితే, తమలో ఎవరు అందరికన్నా గొప్ప అనే విషయం గురించి వాళ్లలో పెద్ద గొడవ మొదలైంది. 25  కానీ ఆయన వాళ్లకు ఇలా చెప్పాడు: “దేశాల్ని పాలించే రాజులు ప్రజల మీద అధికారం చెలాయిస్తారు, అధికారం ఉన్నవాళ్లు ప్రజా సేవకులు* అని పిలవబడతారు. 26  అయితే మీరు అలా ఉండకూడదు. మీలో అందరికన్నా గొప్పవాడు అందరికన్నా చిన్నవాడిలా ఉండాలి; ముందుండి నడిపించే వ్యక్తి సేవకుడిలా ఉండాలి. 27  భోజనానికి కూర్చున్న వ్యక్తి గొప్పవాడా? అతనికి వడ్డించే సేవకుడు గొప్పవాడా? భోజనానికి కూర్చున్న వ్యక్తే కదా? కానీ నేను మీ మధ్య ఒక సేవకుడిలా ఉన్నాను. 28  “అయితే నా పరీక్షల్లో నన్ను అంటిపెట్టుకొని ఉన్నవాళ్లు మీరే; 29  నా తండ్రి నాతో ఒప్పందం చేసినట్టే నేను కూడా రాజ్యం గురించి మీతో ఒప్పందం చేస్తున్నాను. 30  దీనివల్ల మీరు నా రాజ్యంలో నాతో కలిసి నా బల్ల దగ్గర తింటారు, తాగుతారు; సింహాసనాల మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రాలవాళ్లకు తీర్పుతీరుస్తారు. 31  “సీమోనూ, సీమోనూ, ఇదిగో! మీ అందర్నీ గోధుమల్లా తూర్పారబట్టి జల్లించడానికి, తనకు మీరు కావాలని సాతాను అడిగాడు. 32  అయితే నీ విశ్వాసం బలహీనపడకుండా ఉండాలని నేను పట్టుదలగా నీ కోసం ప్రార్థించాను; నువ్వు పశ్చాత్తాపపడి తిరిగొచ్చిన తర్వాత నీ సోదరుల్ని బలపర్చు.” 33  అప్పుడు సీమోను యేసుతో ఇలా అన్నాడు: “ప్రభువా, నీతోపాటు చెరసాలకు వెళ్లడానికైనా, నీతో కలిసి చనిపోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను.” 34  కానీ యేసు ఇలా అన్నాడు: “పేతురూ, నేను ఎవరో తెలీదని నువ్వు మూడుసార్లు చెప్పేవరకు ఈ రోజు కోడి కూయదని నేను నీతో చెప్తున్నాను.” 35  అంతేకాదు ఆయన వాళ్లను ఇలా అడిగాడు: “డబ్బు సంచి గానీ, ఆహారం మూట గానీ, చెప్పులు గానీ తీసుకోకుండా వెళ్లినప్పుడు మీకేమైనా తక్కువైందా?” దానికి వాళ్లు “లేదు!” అన్నారు. 36  తర్వాత ఆయన వాళ్లకు ఇలా చెప్పాడు: “ఇప్పుడైతే, డబ్బు సంచి గానీ ఆహారం మూట గానీ ఉన్న వ్యక్తి దాన్ని తీసుకెళ్లాలి; ఎవరి దగ్గరైనా కత్తి లేకపోతే అతను తన పైవస్త్రాన్ని అమ్మి ఒక కత్తి కొనుక్కోవాలి. 37  ఎందుకంటే, నేను మీతో చెప్తున్నాను, ‘ఆయన అపరాధుల్లో ఒకడిగా లెక్కించబడ్డాడు’ అని రాయబడిన మాటలు నా విషయంలో నెరవేరాలి. ఇప్పుడు అవి నా విషయంలో నెరవేరుతున్నాయి.” 38  తర్వాత వాళ్లు ఆయనతో, “ప్రభువా, ఇదిగో! ఇక్కడ రెండు కత్తులు ఉన్నాయి” అని చెప్పారు. దానికి ఆయన, “అవి సరిపోతాయి” అన్నాడు. 39  అక్కడి నుండి బయటికి వచ్చాక, ఆయన తన అలవాటు ప్రకారం ఒలీవల కొండకు వెళ్లాడు. శిష్యులు కూడా ఆయన వెనకే వెళ్లారు. 40  ఆ చోటుకు చేరుకున్నాక ఆయన వాళ్లకు ఇలా చెప్పాడు: “మీరు ప్రలోభానికి లొంగిపోకుండా ఉండేలా ప్రార్థిస్తూ ఉండండి.” 41  తర్వాత ఆయన కాస్త ముందుకు* వెళ్లి, మోకాళ్లూని ఇలా ప్రార్థించడం మొదలుపెట్టాడు: 42  “తండ్రీ, నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తీసేయి. అయినా, నా ఇష్టప్రకారం కాదు, నీ ఇష్టప్రకారమే జరగాలి.” 43  అప్పుడు పరలోకం నుండి వచ్చిన ఒక దేవదూత ఆయనకు కనిపించి, ఆయన్ని బలపర్చాడు. 44  కానీ ఆయన ఎంతో ఆవేదనతో ఇంకా తీవ్రంగా ప్రార్థిస్తూ ఉన్నాడు; ఆయన చెమట రక్తపు చుక్కల్లా నేల మీద పడుతోంది. 45  ఆయన ప్రార్థించిన తర్వాత లేచి తన శిష్యుల దగ్గరికి వచ్చాడు; వాళ్లు దుఃఖం వల్ల అలసిపోయి నిద్రపోతున్నారు. 46  అప్పుడాయన వాళ్లతో, “మీరెందుకు నిద్రపోతున్నారు? లేవండి. ప్రలోభానికి లొంగిపోకుండా ఉండేలా ప్రార్థిస్తూ ఉండండి” అన్నాడు. 47  ఆయనింకా మాట్లాడుతుండగానే, ఇదిగో! చాలామంది ప్రజలు అక్కడికి వచ్చారు. పన్నెండుమందిలో ఒకడైన యూదా వాళ్లను అక్కడికి తీసుకొచ్చాడు. యేసును ముద్దుపెట్టుకోవడం కోసం అతను ఆయన దగ్గరికి వచ్చాడు. 48  అయితే యేసు అతనితో, “యూదా, ఒక ముద్దుతో మానవ కుమారుడిని అప్పగిస్తున్నావా?” అన్నాడు. 49  ఆయన చుట్టూ ఉన్నవాళ్లు ఏం జరగబోతుందో గ్రహించి, “ప్రభువా, కత్తితో వాళ్లను నరకమంటావా?” అని అడిగారు. 50  వాళ్లలో ఒకతను కత్తి దూసి ప్రధానయాజకుని దాసుడి కుడిచెవిని తెగనరికాడు. 51  కానీ యేసు అతనితో “అలా చేయొద్దు” అని చెప్పి, ఆ దాసుడి చెవిని ముట్టుకొని అతన్ని బాగుచేశాడు. 52  తర్వాత తన దగ్గరికి వచ్చిన ముఖ్య యాజకులతో, ఆలయ అధికారులతో, పెద్దలతో యేసు ఇలా అన్నాడు: “మీరు ఒక బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతో, కర్రలతో నా మీదికి వచ్చారా? 53  నేను రోజూ ఆలయంలో బోధిస్తూ మీతోనే ఉన్నా మీరు నన్ను పట్టుకోలేదు. అయితే ఇది మీ సమయం, చీకటి రాజ్యమేలే సమయం.” 54  తర్వాత వాళ్లు ఆయన్ని బంధించి, ప్రధానయాజకుని ఇంటి లోపలికి తీసుకెళ్లారు. పేతురు కాస్త దూరంగా ఉండి ఆయన్ని అనుసరిస్తున్నాడు. 55  ఆ ఇంటి ప్రాంగణం మధ్యలో కొంతమంది మంట వేసి, అందరూ ఒకచోట కూర్చొని చలి కాచుకుంటున్నారు. పేతురు కూడా వాళ్లతో పాటు కూర్చున్నాడు. 56  పేతురు మంట ముందు కూర్చొని చలి కాచుకోవడం గమనించిన ఒక పనమ్మాయి అతన్ని పరిశీలనగా చూసి, “ఇతను కూడా ఆయనతో పాటు ఉండేవాడు” అంది. 57  కానీ పేతురు ఒప్పుకోలేదు, “ఆయన ఎవరో నాకు తెలీదు” అన్నాడు. 58  కాసేపటికి ఇంకొకతను పేతురును చూసి, “నువ్వు కూడా వాళ్లలో ఒకడివే” అన్నాడు. కానీ పేతురు “లేదు, నేను కాదు” అన్నాడు. 59  సుమారు ఒక గంట తర్వాత ఇంకొకతను అదేపనిగా ఇలా అనడం మొదలుపెట్టాడు: “ఖచ్చితంగా ఇతను కూడా ఆయనతో ఉండేవాడు. ఎందుకంటే, ఇతను గలిలయవాడు!” 60  కానీ పేతురు, “నువ్వు ఏమంటున్నావో నాకు అర్థంకావట్లేదు” అని అన్నాడు. పేతురు ఇంకా మాట్లాడుతుండగానే, వెంటనే కోడి కూసింది. 61  అప్పుడు ప్రభువు పక్కకు తిరిగి సూటిగా పేతురు వైపు చూశాడు. దాంతో, “ఈ రోజు కోడి కూయక ముందే, నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు అంటావు” అని ప్రభువు తనతో చెప్పిన మాటలు పేతురుకు గుర్తుకొచ్చాయి. 62  కాబట్టి పేతురు బయటికి వెళ్లిపోయి, కుమిలికుమిలి ఏడ్చాడు. 63  యేసును కాపలా కాస్తున్న భటులు ఆయన్ని ఎగతాళి చేయడం, కొట్టడం మొదలుపెట్టారు. 64  వాళ్లు ఆయన ముఖం మీద ముసుగు వేసి, “నువ్వు ప్రవక్తవైతే, నిన్ను కొట్టింది ఎవరో చెప్పు!” అని అడుగుతూ ఉన్నారు. 65  అంతేకాదు వాళ్లు ఆయన్ని దూషిస్తూ ఇంకా ఎన్నో మాటలు అన్నారు. 66  తెల్లవారినప్పుడు ప్రజల పెద్దలు అంటే ముఖ్య యాజకులు, శాస్త్రులు ఒకచోట సమావేశమై ఆయన్ని మహాసభకు తీసుకొచ్చి ఇలా అడిగారు: 67  “నువ్వు క్రీస్తువైతే మాతో చెప్పు.” కానీ ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “నేను మీతో చెప్పినా మీరు అస్సలు నమ్మరు. 68  అంతేకాదు ఒకవేళ నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే, మీరు జవాబు చెప్పరు. 69  అయితే ఇప్పటినుండి మానవ కుమారుడు దేవుని శక్తివంతమైన కుడిచేయి దగ్గర కూర్చొని ఉంటాడు.” 70  దాంతో వాళ్లంతా, “అయితే నువ్వు దేవుని కుమారుడివా?” అని అడిగారు. దానికి ఆయన, “నేను దేవుని కుమారుణ్ణని మీరే అంటున్నారు కదా” అన్నాడు. 71  అప్పుడు వాళ్లు, “ఇతనే స్వయంగా తన నోటితో చెప్పడం మనం విన్నాం కదా. మనకు ఇంతకన్నా సాక్ష్యం కావాలా?” అన్నారు.

అధస్సూచీలు

లేదా “నిబంధనను.”
అక్ష., “ఉపకారులు.”
లేదా “రాయి విసిరేసినంత దూరం.”