లూకా 23:1-56

  • పిలాతు, హేరోదుల ముందు యేసు (1-25)

  • యేసు, ఇద్దరు నేరస్తులు మేకులతో కొయ్యకు దిగగొట్టబడతారు  (26-43)

    • “నువ్వు నాతోపాటు పరదైసులో ఉంటావు”  (43)

  • యేసు చనిపోతాడు  (44-49)

  • యేసును సమాధి చేస్తారు (50-56)

23  కాబట్టి వాళ్లందరూ లేచి యేసును పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు.  తర్వాత వాళ్లు, “ఇతను మా దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నాడు, కైసరుకు పన్ను చెల్లించకూడదని చెప్తున్నాడు, తనే క్రీస్తు అనే ఒక రాజునని చెప్పుకుంటున్నాడు” అని అంటూ ఆయన మీద నేరం మోపడం మొదలుపెట్టారు.  అప్పుడు పిలాతు, “నువ్వు యూదుల రాజువా?” అని అడిగాడు. అందుకాయన, “నువ్వే స్వయంగా ఆ మాట అంటున్నావు కదా” అన్నాడు.  తర్వాత పిలాతు ముఖ్య యాజకులతో, జనాలతో “ఇతనిలో నాకు ఏ తప్పూ కనిపించట్లేదు” అన్నాడు.  వాళ్లు మాత్రం పట్టువిడవకుండా, “ఇతను గలిలయ దగ్గర మొదలుపెట్టి ఇక్కడి వరకు, యూదయ అంతటా ప్రజలకు బోధిస్తూ వాళ్లను రెచ్చగొడుతున్నాడు” అని అంటూ ఉన్నారు.  పిలాతు అది విన్నప్పుడు, ఆయన గలిలయకు చెందినవాడేనా అని అడిగాడు.  ఆయన హేరోదు అధికారపరిధి కిందున్న ప్రాంతానికి చెందినవాడని తెలుసుకున్నాక పిలాతు ఆయన్ని హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు ఆ రోజుల్లో యెరూషలేములోనే ఉన్నాడు.  హేరోదు యేసును చూసి ఎంతో సంతోషించాడు. యేసు గురించి అతను చాలా విన్నాడు కాబట్టి కొంతకాలం నుండి ఆయన్ని చూడాలని కోరుకుంటున్నాడు; యేసు ఏదైనా అద్భుతం చేస్తే చూడాలని అతను ఎదురుచూస్తూ ఉన్నాడు.  కాబట్టి అతను చాలాసేపు యేసును ప్రశ్నించాడు, కానీ యేసు ఏ జవాబూ చెప్పలేదు. 10  అయితే ముఖ్య యాజకులు, శాస్త్రులు మధ్యమధ్యలో లేచి నిలబడి, చాలా కోపంగా ఆయన మీద నేరం మోపుతూ ఉన్నారు. 11  అయితే హేరోదు తన సైనికులతో కలిసి యేసును అవమానించి, ప్రశస్తమైన వస్త్రం తొడిగించి ఎగతాళి చేసి, మళ్లీ పిలాతు దగ్గరికి పంపించాడు. 12  అప్పటివరకు శత్రువులుగా ఉన్న హేరోదు, పిలాతు ఆ రోజే స్నేహితులయ్యారు. 13  తర్వాత పిలాతు ముఖ్య యాజకుల్ని, పరిపాలకుల్ని, ప్రజల్ని సమావేశపర్చి 14  వాళ్లతో ఇలా అన్నాడు: “ఇతను తిరుగుబాటు రేపుతున్నాడని అంటూ మీరు ఇతన్ని నా దగ్గరికి తీసుకొచ్చారు. ఇదిగో! నేను ఇతన్ని మీ ముందే విచారణ చేశాను. ఇతని మీద మీరు మోపుతున్న నేరాల విషయంలో నాకు ఏ ఆధారం కనిపించలేదు. 15  నిజానికి హేరోదుకు కూడా ఏ ఆధారం కనిపించలేదు, అందుకే ఇతన్ని మళ్లీ మా దగ్గరికి పంపించాడు. మరణశిక్ష వేసేంత తప్పేదీ ఇతను చేయలేదు. 16  కాబట్టి నేను ఇతన్ని శిక్షించి విడుదల చేస్తాను.” 17  *—— 18  కానీ ప్రజలందరూ, “ఇతన్ని చంపేయండి, మా కోసం బరబ్బను విడుదల చేయండి” అని గట్టిగా అరిచారు. 19  (బరబ్బ అనే అతను ఆ నగరంలో రాజద్రోహానికి, హత్యకు పాల్పడినందువల్ల చెరసాలలో వేయబడ్డాడు.) 20  పిలాతు యేసును విడుదల చేయాలని కోరుకున్నాడు కాబట్టి మళ్లీ ప్రజలతో మాట్లాడాడు. 21  అప్పుడు వాళ్లు, “అతనికి కొయ్యపై శిక్ష వేయండి! అతనికి కొయ్యపై శిక్ష వేయండి!” అని అరవడం మొదలుపెట్టారు. 22  మూడోసారి పిలాతు వాళ్లతో, “ఎందుకు? అతను ఏం తప్పు చేశాడు? మరణశిక్ష వేసేంత తప్పేదీ అతనిలో నాకు కనిపించలేదు. కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేస్తాను” అని అన్నాడు. 23  దాంతో వాళ్లు గట్టిగా అరుస్తూ, ఆయనకు కొయ్యపై శిక్ష వేయాలని పట్టుబట్టారు. చివరికి వాళ్ల అరుపులే నెగ్గాయి. 24  కాబట్టి పిలాతు వాళ్లు అడిగినట్లే చేయాలని నిర్ణయించాడు. 25  వాళ్లు అడుగుతున్న వ్యక్తిని, అంటే రాజద్రోహానికి, హత్యకు పాల్పడినందువల్ల చెరసాలలో వేయబడిన వ్యక్తిని పిలాతు విడుదల చేశాడు. కానీ యేసును మాత్రం, తమకు నచ్చినట్టు చేసుకోమని వాళ్లకు అప్పగించాడు. 26  వాళ్లు యేసును తీసుకెళ్తున్నప్పుడు, పల్లె ప్రాంతం నుండి వస్తున్న కురేనేవాడైన సీమోను అనే వ్యక్తిని పట్టుకొని అతని మీద ఆ హింసాకొయ్య* పెట్టి, దాన్ని మోసుకుంటూ యేసు వెనుక రమ్మని చెప్పారు. 27  యేసు వెనుక చాలామంది ప్రజలు వెళ్తున్నారు. వాళ్లలో స్త్రీలు కూడా ఉన్నారు, వాళ్లు దుఃఖంతో గుండెలు బాదుకుంటూ ఆయన గురించి బిగ్గరగా ఏడుస్తున్నారు. 28  యేసు ఆ స్త్రీల వైపు చూసి ఇలా అన్నాడు: “యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడ్వకండి. మీ కోసం, మీ పిల్లల కోసం ఏడ్వండి. 29  ఎందుకంటే, ఇదిగో! ‘గొడ్రాళ్లు, పిల్లల్ని కనని వాళ్లు, పాలివ్వని వాళ్లు సంతోషంగా ఉంటారు!’ అని ప్రజలు చెప్పే రోజులు రాబోతున్నాయి. 30  అప్పుడు ప్రజలు, ‘మా మీద పడండి!’ అని పర్వతాలతో, ‘మమ్మల్ని కప్పేయండి!’ అని కొండలతో అనడం మొదలుపెడతారు. 31  చెట్టు పచ్చగా ఉన్నప్పుడే వాళ్లు ఇలా చేస్తే, అది ఎండిపోయినప్పుడు ఇక పరిస్థితి ఎలా ఉంటుంది?” 32  ఆయనతో పాటు మరణశిక్ష వేయడానికి వాళ్లు ఇంకో ఇద్దరు నేరస్తుల్ని కూడా తీసుకెళ్తున్నారు. 33  వాళ్లు “కపాల స్థలం” అనే చోటికి వచ్చినప్పుడు, యేసును మేకులతో కొయ్యకు దిగగొట్టి ఆ ఇద్దరు నేరస్తుల మధ్య వేలాడదీశారు. ఒకతను యేసుకు కుడివైపున, ఇంకొకతను యేసుకు ఎడమవైపున ఉన్నాడు. 34  అప్పుడు యేసు, “తండ్రీ, వీళ్లను క్షమించు. వీళ్లు ఏంచేస్తున్నారో వీళ్లకు తెలీదు” అన్నాడు. అంతేకాదు, ఆయన వస్త్రాలు పంచుకోవడానికి వాళ్లు చీట్లు* వేశారు. 35  ప్రజలు చూస్తూ నిలబడ్డారు. పరిపాలకులు మాత్రం ఆయన్ని ఎగతాళి చేస్తూ, “ఇతను వేరేవాళ్లను రక్షించాడు; ఇతను దేవుని అభిషిక్తుడూ,* దేవుడు ఎంచుకున్నవాడూ అయితే తనను తాను రక్షించుకోవాలి” అన్నారు. 36  చివరికి సైనికులు కూడా ఆయన దగ్గరికి వచ్చి, పుల్లటి ద్రాక్షారసం ఇస్తూ ఇలా ఎగతాళి చేశారు: 37  “నువ్వు యూదుల రాజువైతే నిన్ను నువ్వు రక్షించుకో.” 38  ఆయన తలకు పైన, “ఇతను యూదుల రాజు” అనే మాటలు చెక్కబడిన ఒక పలక ఉంది. 39  అప్పుడు కొయ్యకు వేలాడుతున్న నేరస్తుల్లో ఒకతను యేసును దూషించడం మొదలుపెట్టి, “నువ్వు క్రీస్తువే కదా? నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు!” అన్నాడు. 40  అప్పుడు ఇంకో నేరస్తుడు అతన్ని ఇలా గద్దించాడు: “నువ్వు దేవునికి ఏమాత్రం భయపడవా? నీకూ అదే శిక్ష పడింది కదా? 41  మనకు ఈ శిక్ష పడడం న్యాయమే. ఎందుకంటే, మనం చేసిన వాటికి తగిన శిక్ష అనుభవిస్తున్నాం. కానీ ఈయన ఏ తప్పూ చేయలేదు.” 42  తర్వాత అతను, “యేసూ, నువ్వు రాజ్యాధికారం పొందినప్పుడు* నన్ను గుర్తుచేసుకో” అన్నాడు. 43  అప్పుడు యేసు అతనితో, “ఈ రోజు నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు నాతోపాటు పరదైసులో ఉంటావు” అన్నాడు. 44  అప్పుడు సమయం దాదాపు మధ్యాహ్నం 12 గంటలు.* అయినా, అప్పటినుండి మూడింటి* వరకు ఆ దేశమంతటా చీకటి కమ్ముకుంది. 45  ఎందుకంటే సూర్యకాంతి లేకుండా పోయింది. తర్వాత దేవాలయంలోని తెర* మధ్యకు చిరిగిపోయింది. 46  అప్పుడు యేసు బిగ్గరగా అరిచి ఇలా అన్నాడు: “తండ్రీ, నా ప్రాణాన్ని* నీ చేతికి అప్పగిస్తున్నాను.” ఆ మాట అని, ఆయన చనిపోయాడు.* 47  జరిగినదాన్ని చూసినప్పుడు అక్కడున్న సైనికాధికారి, “నిజంగా ఇతను నీతిమంతుడు” అని అంటూ దేవుణ్ణి మహిమపర్చడం మొదలుపెట్టాడు. 48  అక్కడికి వచ్చిన జనాలు జరిగినవాటిని చూసినప్పుడు, గుండెలు బాదుకుంటూ తమ ఇళ్లకు తిరిగివెళ్లారు. 49  అయితే యేసుతో పరిచయమున్న వాళ్లందరూ కాస్త దూరంలో నిలబడి ఉన్నారు. అంతేకాదు, గలిలయ నుండి యేసుతోపాటు వచ్చిన కొంతమంది స్త్రీలు కూడా అక్కడ నిలబడి వీటిని చూశారు. 50  యోసేపు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను మహాసభ సభ్యుడు, మంచివాడు, నీతిమంతుడు. 51  (అతను వాళ్ల కుట్రకు మద్దతివ్వలేదు, దాన్ని అమలు చేయడానికి సాయం చేయలేదు.) అతను యూదయలోని అరిమతయియ నగరానికి చెందినవాడు. అతను దేవుని రాజ్యం కోసం ఎదురుచూస్తూ ఉండేవాడు. 52  అతను పిలాతు దగ్గరికి వెళ్లి, యేసును సమాధి చేయడానికి అనుమతి ఇవ్వమని అడిగాడు. 53  తర్వాత అతను యేసు శరీరాన్ని కిందికి దించి, దాన్ని నాణ్యమైన నారవస్త్రంలో చుట్టి, తొలిచిన ఒక రాతి సమాధిలో* పెట్టాడు. ఆ సమాధిలో అప్పటివరకు ఎవర్నీ పెట్టలేదు. 54  అది సిద్ధపడే రోజు, కాసేపట్లో విశ్రాంతి రోజు మొదలవ్వబోతుంది. 55  యేసుతో పాటు గలిలయ నుండి వచ్చిన స్త్రీలు కూడా అక్కడికి వెళ్లి సమాధిని* చూశారు. అందులో యేసు శరీరాన్ని ఎలా పెట్టారో గమనించారు. 56  తర్వాత సుగంధ ద్రవ్యాలు, పరిమళ తైలాలు తయారుచేయడానికి తిరిగివెళ్లారు. అయితే వాళ్లు ధర్మశాస్త్రం ప్రకారం విశ్రాంతి రోజున ఏ పనీ చేయలేదు.

అధస్సూచీలు

మత్తయి 17:21కి ఉన్న పాదసూచిక చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
అక్ష., “క్రీస్తూ.”
అక్ష., “నువ్వు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు.”
అక్ష., “ఆరో గంట.”
అక్ష., “తొమ్మిదో గంట.”
ఇది పవిత్ర స్థలాన్ని, అతి పవిత్ర స్థలాన్ని వేరు చేసే తెర.
గ్రీకులో న్యూమా. పదకోశంలో “న్యూమా” చూడండి.
లేదా “తుదిశ్వాస విడిచాడు.”
లేదా “స్మారక సమాధిలో.”
లేదా “స్మారక సమాధిని.”