లూకా 24:1-53

  • యేసు పునరుత్థానం చేయబడ్డాడు (1-12)

  • ఎమ్మాయుకు వెళ్లే దారిలో (13-35)

  • యేసు తన శిష్యులకు కనిపిస్తాడు (36-49)

  • యేసు పరలోకానికి ఎక్కివెళ్తాడు (50-53)

24  వారం మొదటి రోజున* వాళ్లు తాము తయారుచేసిన సుగంధ ద్రవ్యాలు తీసుకొని పొద్దుపొద్దున్నే సమాధి* దగ్గరికి వచ్చారు.  అయితే అప్పటికే, సమాధికి* అడ్డంగా ఉన్న రాయి పక్కకు దొర్లించి ఉంది.  వాళ్లు సమాధిలోకి అడుగుపెట్టినప్పుడు, ప్రభువైన యేసు శరీరం అక్కడ కనిపించలేదు.  వాళ్లు దాని గురించి కంగారుపడుతుండగా, ఇదిగో! మెరిసే వస్త్రాలు వేసుకొని ఉన్న ఇద్దరు మనుషులు వాళ్ల పక్కన నిలబడ్డారు.  ఆ స్త్రీలు భయపడిపోయి, తమ తలలు వంచుకున్నారు. అప్పుడు ఆ మనుషులు వాళ్లతో ఇలా అన్నారు: “మీరు బ్రతికున్న వ్యక్తి కోసం, చనిపోయినవాళ్ల మధ్య ఎందుకు వెతుకుతున్నారు?  ఆయన ఇక్కడ లేడు, బ్రతికించబడ్డాడు. ఆయన ఇంకా గలిలయలోనే ఉన్నప్పుడు మీతో ఏమన్నాడో గుర్తుచేసుకోండి.  మానవ కుమారుడు పాపుల చేతికి అప్పగించబడి, కొయ్య మీద చంపబడి, మూడో రోజున తిరిగి బ్రతకాలని ఆయన చెప్పలేదా?”  అప్పుడు వాళ్లు ఆయన మాటలు గుర్తుచేసుకొని,  సమాధి* దగ్గర నుండి తిరిగివెళ్లి ఈ విషయాలన్నిటి గురించి ఆ పదకొండుమందికి, మిగతావాళ్లందరికీ చెప్పారు. 10  ఆ స్త్రీలు ఎవరంటే: మగ్దలేనే మరియ, యోహన్న, యాకోబు తల్లి మరియ. అంతేకాదు, వాళ్లతోపాటు ఉన్న మిగతా స్త్రీలు ఈ విషయాల్ని అపొస్తలులకు చెప్తున్నారు. 11  అయితే వాళ్లకు అవి అర్థంపర్థంలేని మాటల్లా అనిపించాయి, కాబట్టి ఆ స్త్రీలు చెప్పినదాన్ని వాళ్లు నమ్మలేదు. 12  అయితే పేతురు లేచి, పరుగెత్తుకుంటూ సమాధి* దగ్గరికి వెళ్లి, లోపలికి వంగి చూశాడు. అక్కడ నారబట్టలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి అతను ఏం జరిగిందా అని ఆలోచిస్తూ అక్కడినుండి వెళ్లిపోయాడు. 13  కానీ ఇదిగో! అదే రోజున ఇద్దరు శిష్యులు ఎమ్మాయు అనే గ్రామానికి వెళ్తున్నారు; ఇది యెరూషలేముకు దాదాపు ఏడు మైళ్ల* దూరంలో ఉంది. 14  వాళ్లు జరిగిన ఈ విషయాలన్నిటి గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. 15  వాళ్లు ఈ విషయాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, యేసే వాళ్ల దగ్గరికి వచ్చి వాళ్లతోపాటు నడవడం మొదలుపెట్టాడు. 16  కానీ వాళ్లు ఆయన్ని గుర్తుపట్టలేకపోయారు. 17  ఆయన వాళ్లను, “మీరు దేని గురించి తీవ్రంగా వాదించుకుంటున్నారు?” అని అడిగాడు. అప్పుడు వాళ్లు ఆగిపోయారు, వాళ్ల ముఖాలు బాధగా ఉన్నాయి. 18  ఆయన అడిగినదానికి క్లెయొపా అనే అతను ఇలా జవాబిచ్చాడు: “ఈమధ్యే యెరూషలేములో జరిగిన విషయాల గురించి తెలియకపోవడానికి నువ్వేమైనా విదేశీయుడివా? అక్కడ ఒంటరిగా జీవిస్తున్నావా?”* 19  అప్పుడాయన, “ఏ విషయాలు?” అని అడిగాడు. వాళ్లు ఇలా చెప్పారు: “నజరేయుడైన యేసు గురించిన విషయాలు. ఆయనొక ప్రవక్త. దేవుని ముందు, మనుషుల ముందు ఆయన చాలా ఆశ్చర్యకరమైన పనులు చేశాడు; ఆయన మాటలు కూడా ఎంతో శక్తివంతంగా ఉండేవి. 20  మన ముఖ్య యాజకులు, పరిపాలకులు మరణశిక్ష వేయడం కోసం ఆయన్ని అప్పగించారు. వాళ్లు ఆయన్ని మేకులతో కొయ్యకు దిగగొట్టారు. 21  ఇశ్రాయేలుకు విడుదల తీసుకురాబోయే వ్యక్తి ఆయనే అని మేము ఆశతో ఎదురుచూశాం. ఇవన్నీ కాక, ఈ విషయాలు జరిగి ఇప్పటికి ఇది మూడో రోజు. 22  అంతేకాదు, కొంతమంది స్త్రీలు చెప్పిన మాటలు కూడా మమ్మల్ని ఆశ్చర్యపర్చాయి. వాళ్లు పొద్దున్నే సమాధి* దగ్గరికి వెళ్లారు; 23  అక్కడ ఆయన శరీరం కనిపించకపోయేసరికి, వాళ్లకు దేవదూతలు కనిపించి యేసు బ్రతికే ఉన్నాడని చెప్పారని వచ్చి మాకు చెప్పారు. 24  అప్పుడు మాతోపాటు ఉన్న కొంతమంది సమాధి* దగ్గరికి వెళ్లి చూశారు. అక్కడంతా ఆ స్త్రీలు చెప్పినట్టే ఉంది, కానీ వాళ్లు ఆయన్ని చూడలేదు.” 25  కాబట్టి ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “తెలివితక్కువ మనుషులారా, ప్రవక్తలు చెప్పిన విషయాల్ని మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? 26  క్రీస్తు తన మహిమలో ప్రవేశించాలంటే, వీటిని అనుభవించడం తప్పనిసరి కదా?” 27  తర్వాత ఆయన మోషే, ప్రవక్తలందరూ రాసిన వాటితో మొదలుపెట్టి లేఖనాలన్నిటిలో తన గురించి రాయబడిన వాటిని వాళ్లకు వివరించాడు. 28  చివరికి వాళ్లు తాము వెళ్లాల్సిన గ్రామం దగ్గరికి వచ్చారు, ఆయన మాత్రం ఇంకా ముందుకు వెళ్తున్నట్టు కనిపించాడు. 29  కానీ వాళ్లు ఆయన్ని ఉండిపొమ్మని బ్రతిమాలుతూ, “సాయంత్రం కావస్తోంది కాబట్టి మాతోనే ఉండిపో” అన్నారు. దాంతో ఆయన వాళ్లతోపాటు ఉండడానికి వాళ్లింటికి వెళ్లాడు. 30  ఆయన వాళ్లతో పాటు భోజనం బల్ల దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఒక రొట్టె తీసుకొని, దాన్ని దీవించి, విరిచి వాళ్లకు ఇవ్వడం మొదలుపెట్టాడు. 31  దాంతో ఆయన ఎవరో వాళ్లకు అర్థమైంది, వాళ్లు ఆయన్ని గుర్తుపట్టారు. కానీ ఆయన వాళ్లకు కనిపించకుండా మాయమైపోయాడు. 32  అప్పుడు వాళ్లు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకున్నారు: “దారిలో ఆయన మనతో మాట్లాడుతూ, లేఖనాల అర్థాన్ని విడమర్చి చెప్తున్నప్పుడు మన హృదయాలు మండుతున్నట్టు మనకు అనిపించలేదా?” 33  వెంటనే వాళ్లు లేచి యెరూషలేముకు తిరిగివెళ్లారు. అక్కడ ఆ పదకొండుమంది, అలాగే ఇతర శిష్యులు ఒకచోట సమావేశమై ఉన్నారు. 34  అక్కడున్న వాళ్లు, “నిజంగానే ప్రభువు మళ్లీ బ్రతికించబడ్డాడు, ఆయన సీమోనుకు కనిపించాడు!” అన్నారు. 35  అప్పుడు వాళ్లిద్దరు దారిలో జరిగిన విషయాల గురించి, ఆయన రొట్టె విరిచినప్పుడు తాము ఆయన్ని ఎలా గుర్తుపట్టారనే దాని గురించి వాళ్లకు చెప్పారు. 36  వాళ్లు ఈ విషయాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, యేసు వాళ్ల మధ్య నిలబడి, “మీకు శాంతి కలగాలి” అన్నాడు. 37  కానీ వాళ్లు తాము దేవదూతను చూస్తున్నామని అనుకుంటూ భయంతో వణికిపోయారు. 38  కాబట్టి ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “మీరెందుకు కంగారుపడుతున్నారు? మీ హృదయాల్లో సందేహాలు ఎందుకు వస్తున్నాయి? 39  నా చేతులు, పాదాలు చూసి నేనే అని తెలుసుకోండి. నన్ను ముట్టుకొని చూడండి. మీరు చూస్తున్నారు కదా, నాకు ఉన్నట్టుగా దేవదూతకు మాంసం, ఎముకలు ఉండవు.” 40  ఆయన అలా అంటూ తన చేతులు, పాదాలు వాళ్లకు చూపించాడు. 41  కానీ వాళ్లు సంతోషంలో, ఆశ్చర్యంలో మునిగిపోయి ఇంకా నమ్మలేకపోతున్నారు. కాబట్టి ఆయన, “మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా?” అని అడిగాడు. 42  వాళ్లు ఆయనకు కాల్చిన చేప ముక్కను ఇచ్చారు. 43  ఆయన దాన్ని తీసుకొని, వాళ్ల కళ్లముందే తిన్నాడు. 44  తర్వాత ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “నేను ఇంకా మీతోనే ఉన్నప్పుడు, నా గురించి మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల పుస్తకాల్లో, కీర్తనల పుస్తకంలో రాసినవన్నీ నెరవేరాలని మీతో చెప్పాను కదా.” 45  తర్వాత, వాళ్లు లేఖనాల అర్థాన్ని పూర్తిగా గ్రహించేలా ఆయన వాళ్ల మనసుల్ని తెరిచి 46  వాళ్లతో ఇలా అన్నాడు: “లేఖనాలు ఇలా చెప్తున్నాయి: క్రీస్తు బాధలుపడి, మూడో రోజున మృతుల్లో నుండి మళ్లీ బ్రతుకుతాడు; 47  ప్రజలు పశ్చాత్తాపపడి పాపక్షమాపణ పొందాలనే సందేశం యెరూషలేముతో మొదలుపెట్టి అన్ని దేశాలకు ఆయన పేరున ప్రకటించబడుతుంది. 48  మీరు వీటికి సాక్షులుగా ఉండాలి. 49  ఇదిగో! నా తండ్రి వాగ్దానం చేసిన దాన్ని మీ మీదికి పంపిస్తున్నాను. మీరు మాత్రం, పైనుండి శక్తిని పొందేవరకు ఈ నగరంలోనే ఉండండి.” 50  తర్వాత ఆయన వాళ్లను బేతనియ వరకు తీసుకెళ్లి, తన చేతులెత్తి వాళ్లను దీవించాడు. 51  అలా దీవిస్తూ ఆయన వాళ్లను విడిచి పరలోకానికి వెళ్లిపోయాడు. 52  వాళ్లు ఆయనకు సాష్టాంగ* నమస్కారం చేసి, చాలా సంతోషంగా యెరూషలేముకు తిరిగివెళ్లారు. 53  వాళ్లు ప్రతీరోజు ఆలయానికి వెళ్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు.

అధస్సూచీలు

మత్తయి 28:1కి ఉన్న పాదసూచిక చూడండి.
లేదా “స్మారక సమాధి.
లేదా “స్మారక సమాధికి.”
లేదా “స్మారక సమాధి.
లేదా “స్మారక సమాధి.”
దాదాపు 11 కిలోమీటర్లు. అక్ష., “60 స్టేడియా.” ఒక స్టేడియం 185 మీటర్లతో (606.95 అడుగులతో) సమానం. పదకోశంలో “మైలు” చూడండి.
లేదా “విషయాల గురించి తెలియని సందర్శకుడివి నువ్వు ఒక్కడివేనా?” అయ్యుంటుంది.
లేదా “స్మారక సమాధి.”
లేదా “స్మారక సమాధి.”
లేదా “వంగి.”