లూకా 4:1-44

  • అపవాది యేసును ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తాడు (1-13)

  • యేసు గలిలయలో ప్రకటించడం మొదలుపెడతాడు  (14, 15)

  • నజరేతులోని వాళ్లు యేసును తిరస్కరిస్తారు (16-30)

  • కపెర్నహూములోని సభామందిరంలో (31-37)

  • సీమోను అత్త, ఇతరులు బాగవుతారు (38-41)

  • ఎవరూలేని చోట ప్రజలు యేసును కనుగొంటారు (42-44)

4  తర్వాత యేసు యొర్దాను నది దగ్గర నుండి వెళ్లిపోయాడు. దేవుడు ఇచ్చిన పవిత్రశక్తి ఆయన్ని అరణ్యంలోకి నడిపించింది.  అరణ్యంలో ఆయన 40 రోజులు ఉన్నాడు. అక్కడ అపవాది ఆయన్ని ప్రలోభపెట్టడానికి ప్రయత్నించాడు. ఆ రోజుల్లో ఆయన ఏమీ తినలేదు కాబట్టి ఆ 40 రోజులు పూర్తయ్యాక ఆయనకు బాగా ఆకలి వేసింది.  అప్పుడు అపవాది ఆయనతో, “నువ్వు దేవుని కుమారుడివైతే, ఈ రాయిని రొట్టెగా మారమని ఆజ్ఞాపించు” అన్నాడు.  అయితే యేసు అతనితో, “‘మనిషి రొట్టె వల్ల మాత్రమే జీవించడు’ అని రాయబడివుంది” అన్నాడు.  కాబట్టి అపవాది ఆయన్ని ఒక ఎత్తైన చోటికి తీసుకెళ్లి, భూలోక రాజ్యాలన్నిటినీ ఒక్క క్షణంలో ఆయనకు చూపించి  ఆయనతో ఇలా అన్నాడు: “ఈ అధికారం అంతటినీ, వాటి మహిమను నేను నీకు ఇస్తాను. ఎందుకంటే, అది నాకు అప్పగించబడింది. నేను దాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్లకు ఇస్తాను.  కాబట్టి నువ్వు ఒక్కసారి నన్ను ఆరాధిస్తే, ఇక ఇవన్నీ నీవే.”  దానికి యేసు అతనితో, “‘నీ దేవుడైన యెహోవాను* నువ్వు ఆరాధించాలి. ఆయనకు మాత్రమే పవిత్రసేవ చేయాలి’ అని రాయబడివుంది” అన్నాడు.  తర్వాత అపవాది ఆయన్ని యెరూషలేముకు తీసుకెళ్లి, దేవాలయ గోడ మీద* నిలబెట్టి ఆయనతో ఇలా అన్నాడు: “నువ్వు దేవుని కుమారుడివైతే, ఇక్కడి నుండి కిందికి దూకు. 10  ఎందుకంటే, ‘నిన్ను కాపాడమని ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు’ అని రాయబడివుంది. 11  అంతేకాదు, ‘నీ పాదం రాయికి తగలకుండా వాళ్లు తమ చేతులమీద నిన్ను మోస్తారు.’” 12  దానికి యేసు అతనితో, “‘నువ్వు నీ దేవుడైన యెహోవాను* పరీక్షించకూడదు’ అని చెప్పబడింది” అన్నాడు. 13  ఆయన్ని ప్రలోభపెట్టడానికి ప్రయత్నించడం పూర్తయ్యాక అపవాది ఇంకో మంచి అవకాశం దొరికే వరకు ఆయన్ని విడిచి వెళ్లిపోయాడు. 14  అప్పుడు యేసు పవిత్రశక్తి బలంతో గలిలయకు తిరిగి వెళ్లాడు. ఆయన గురించిన మంచి నివేదికలు అక్కడున్న గ్రామాలన్నిటిలో వ్యాపించాయి. 15  అంతేకాదు, ఆయన వాళ్ల సభామందిరాల్లో బోధించడం మొదలుపెట్టాడు, అందరూ ఆయన గురించి గొప్పగా మాట్లాడుకున్నారు. 16  తర్వాత ఆయన తాను పెరిగి పెద్దయిన నజరేతుకు వచ్చి, తన అలవాటు ప్రకారం విశ్రాంతి రోజున సభామందిరానికి వెళ్లి లేఖనాలు చదవడానికి నిలబడ్డాడు. 17  అప్పుడు ఆయనకు యెషయా ప్రవక్త గ్రంథపు చుట్ట ఇవ్వబడింది. ఆయన దాన్ని తెరిచి, ఇలా రాయబడివున్న చోటును కనుగొన్నాడు: 18  “యెహోవా* పవిత్రశక్తి నా మీద ఉంది. ఎందుకంటే, పేదవాళ్లకు మంచివార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. బందీలకు విడుదల కలుగుతుందని, గుడ్డివాళ్లకు చూపు వస్తుందని ప్రకటించడానికి; అణచివేయబడిన వాళ్లను విడిపించడానికి ఆయన నన్ను పంపించాడు. 19  అంతేకాదు, యెహోవా* అనుగ్రహం సంపాదించుకునే సమయం గురించి ప్రకటించడానికి కూడా ఆయన నన్ను పంపించాడు.” 20  తర్వాత ఆయన ఆ గ్రంథపు చుట్టను చుట్టేసి, దాన్ని అక్కడున్న సేవకుడికి తిరిగిచ్చి కూర్చున్నాడు. అప్పుడు ఆ సభామందిరంలో ఉన్నవాళ్లందరూ రెప్పవాల్చకుండా ఆయన వైపే చూస్తూ ఉన్నారు. 21  తర్వాత ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “ఇప్పుడు మీరు విన్న లేఖనం ఈ రోజు నెరవేరింది.” 22  దాంతో వాళ్లందరూ ఆయన గురించి మంచిగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వాళ్లు ఆయన నోటి నుండి వస్తున్న మనోహరమైన మాటలకు ఆశ్చర్యపోతూ, “ఈయన యోసేపు కొడుకే కదా?” అని ఒకరితో ఒకరు అనుకున్నారు. 23  అప్పుడాయన వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు, ‘వైద్యుడా నిన్ను నువ్వు బాగుచేసుకో’ అనే సామెత చెప్పి, దాన్ని తప్పకుండా నాకు అన్వయిస్తారు. ‘కపెర్నహూములో ఏమేం జరిగాయని మేము విన్నామో వాటిని ఇక్కడ నీ సొంత ఊరిలో కూడా చెయ్యి’ అని నాతో అంటారు.” 24  తర్వాత ఆయన ఇలా అన్నాడు: “నేను నిజంగా మీతో చెప్తున్నాను, ఏ ప్రవక్తకూ సొంత ఊరిలో గౌరవం ఉండదు. 25  నేను చెప్పేది నమ్మండి: ఏలీయా రోజుల్లో మూడు సంవత్సరాల ఆరు నెలలపాటు వర్షాలు లేక దేశమంతటా గొప్ప కరువు వచ్చినప్పుడు ఇశ్రాయేలులో చాలామంది విధవరాళ్లు ఉన్నారు. 26  అయినా ఏలీయా వాళ్లలో ఏ ఒక్కరి దగ్గరికీ పంపబడలేదు, సీదోను దేశంలోని సారెపతులో ఉన్న ఒక విధవరాలి దగ్గరికే పంపించబడ్డాడు. 27  అంతేకాదు, ఎలీషా ప్రవక్త రోజుల్లో ఇశ్రాయేలులో చాలామంది కుష్ఠురోగులు ఉన్నారు. అయినా వాళ్లలో ఏ ఒక్కరూ బాగుచేయబడలేదు, సిరియా దేశస్థుడైన నయమాను మాత్రమే బాగుచేయబడ్డాడు.” 28  సభామందిరంలో ఈ విషయాలు వింటున్న వాళ్లందరూ కోపంతో ఊగిపోయారు. 29  కాబట్టి వాళ్లు లేచి ఆయన్ని నగరం బయటికి తరిమి, తమ నగరం ఏ కొండ మీదైతే కట్టబడిందో ఆ కొండ శిఖరానికి ఆయన్ని తీసుకుపోయారు. అక్కడి నుండి ఆయన్ని తలక్రిందులుగా కిందికి తోసేద్దామని అనుకున్నారు. 30  కానీ ఆయన వాళ్ల మధ్య నుండి తప్పించుకొని తన దారిన వెళ్లిపోయాడు. 31  తర్వాత ఆయన గలిలయలో ఉన్న కపెర్నహూము నగరానికి వెళ్లి, విశ్రాంతి రోజున వాళ్లకు బోధిస్తున్నాడు. 32  ఆయన బోధించే తీరు చూసి వాళ్లు ఎంతో ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ఆయన అధికారంతో మాట్లాడాడు. 33  ఆ సమయంలో, అపవిత్ర దూత* పట్టిన ఒకతను ఆ సభామందిరంలో ఉన్నాడు. అతను ఇలా అరిచాడు: 34  “నజరేయుడివైన యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నువ్వు ఎవరో నాకు బాగా తెలుసు, నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చిన పవిత్రుడివి!” 35  అయితే యేసు ఆ అపవిత్ర దూతను గద్దిస్తూ, “మాట్లాడకు, అతనిలో నుండి బయటికి రా!” అన్నాడు. దాంతో ఆ అపవిత్ర దూత అతన్ని వాళ్ల మధ్య కింద పడేసి, అతనికి ఏ హానీ చేయకుండా అతనిలో నుండి బయటికి వచ్చాడు. 36  దాంతో వాళ్లంతా అవాక్కయి, “ఈయన మాటలు చూడండి! ఈయన అధికారంతో, శక్తితో అపవిత్ర దూతల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. వాళ్లు బయటికి వచ్చేస్తున్నారు!” అని ఒకరితో ఒకరు చెప్పుకోవడం మొదలుపెట్టారు. 37  కాబట్టి ఆయన గురించిన వార్త ఆ చుట్టుపక్కల గ్రామాల్లో నలుమూలలా వ్యాపిస్తూ ఉంది. 38  సభామందిరం నుండి వచ్చేశాక ఆయన సీమోను ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో, సీమోనువాళ్ల అత్త తీవ్రమైన జ్వరంతో బాధపడుతోంది. దాంతో వాళ్లు, ఆమెకు సహాయం చేయమని ఆయన్ని అడిగారు. 39  కాబట్టి ఆయన ఆమె దగ్గర నిలబడి, వంగి ఆ జ్వరాన్ని గద్దించాడు; వెంటనే ఆ జ్వరం పోయింది. ఆ క్షణమే ఆమె లేచి వాళ్లకు సేవలు చేయడం మొదలుపెట్టింది. 40  అయితే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు, ప్రజలందరూ తమ ఇళ్లలో రకరకాల రోగాలతో బాధపడుతున్న వాళ్లను ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన వాళ్లలో ఒక్కొక్కరి మీద చేతులు ఉంచి వాళ్లను బాగుచేశాడు. 41  అంతేకాదు, చాలామందిలో నుండి చెడ్డదూతలు బయటికి వచ్చారు. వాళ్లు, “నువ్వు దేవుని కుమారుడివి” అంటూ బయటికి వచ్చారు. కానీ ఆయన ఆ చెడ్డదూతల్ని గద్దించి మాట్లాడనివ్వలేదు. ఎందుకంటే, ఆయనే క్రీస్తు అని ఆ చెడ్డదూతలకు తెలుసు. 42  అయితే తెల్లవారినప్పుడు ఆయన అక్కడి నుండి బయల్దేరి, ఎవరూలేని చోటికి వెళ్లాడు. అయితే ప్రజలు గుంపులుగుంపులుగా ఆయన కోసం వెతుక్కుంటూ ఆయన ఉన్న చోటికి వచ్చారు. వాళ్లు ఆయన్ని తమ దగ్గర నుండి వెళ్లిపోకుండా ఆపడానికి ప్రయత్నించారు. 43  కానీ ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “నేను మిగతా నగరాల్లో కూడా దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించాలి. ఇందుకోసమే దేవుడు నన్ను పంపించాడు.” 44  కాబట్టి ఆయన యూదయలో ఉన్న సభామందిరాల్లో ప్రకటిస్తూ వెళ్లాడు.

అధస్సూచీలు

పదకోశం చూడండి.
లేదా “ఎత్తైన చోట.”
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశంలో “చెడ్డదూతలు” చూడండి.