లూకా 7:1-50

  • ఒక సైనికాధికారి విశ్వాసం  (1-10)

  • యేసు నాయీనులో ఒక విధవరాలి కొడుకును పునరుత్థానం చేస్తాడు (11-17)

  • బాప్తిస్మమిచ్చే యోహానును పొగడడం  (18-30)

  • స్పందించని తరాన్ని ఖండించడం  (31-35)

  • పాపాత్మురాలైన ఒక స్త్రీ క్షమించబడింది  (36-50)

    • అప్పు తీసుకున్నవాళ్ల ఉదాహరణ  (41-43)

7  ప్రజలకు ఈ విషయాలు చెప్పడం పూర్తయిన తర్వాత ఆయన కపెర్నహూముకు వెళ్లాడు.  అప్పుడు ఒక సైనికాధికారికి ఎంతో ఇష్టమైన దాసుడు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ చావుబ్రతుకుల మధ్య ఉన్నాడు.  ఆ సైనికాధికారి యేసు గురించి విన్నప్పుడు, వచ్చి తన దాసున్ని బాగుచేయమని యేసును అడగడానికి యూదుల పెద్దల్లో కొందర్ని ఆయన దగ్గరికి పంపించాడు.  వాళ్లు యేసు దగ్గరికి వచ్చి ఆయన్ని ఇలా వేడుకోవడం మొదలుపెట్టారు: “నీ సహాయం పొందడానికి అతను అర్హుడు.  ఎందుకంటే, మన ప్రజలంటే అతనికి ప్రేమ. మన సభామందిరాన్ని కట్టించింది కూడా అతనే.”  కాబట్టి యేసు వాళ్లతో పాటు వెళ్లాడు. అయితే వాళ్లు ఆ ఇంటికి దగ్గర్లో ఉన్నప్పుడు, ఆ సైనికాధికారి తన స్నేహితుల్ని పంపి యేసుతో ఇలా చెప్పమన్నాడు: “అయ్యా, నా ఇంటికి రావడానికి కష్టపడొద్దు. ఎందుకంటే, నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను అర్హుణ్ణి కాను.  అందుకే, నీ దగ్గరికి వచ్చే అర్హత నాకుందని కూడా నేను అనుకోలేదు. నువ్వు ఒక్క మాట చెప్పు చాలు, నా సేవకుడు బాగైపోతాడు.  నేను కూడా అధికారం కింద ఉన్నవాడినే, నా కింద సైనికులు ఉన్నారు. నేను ఒకర్ని ‘వెళ్లు!’ అంటే అతను వెళ్తాడు. ఇంకొకర్ని ‘రా!’ అంటే అతను వస్తాడు. నా దాసునితో, ‘ఇది చేయి!’ అంటే చేస్తాడు.”  యేసు ఈ మాటలు విన్నప్పుడు అతని విషయంలో చాలా ఆశ్చర్యపోయి, తన వెనుక వస్తున్న జనం వైపు తిరిగి ఇలా అన్నాడు: “ఇశ్రాయేలులో కూడా ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదని మీతో చెప్తున్నాను.” 10  సైనికాధికారి పంపినవాళ్లు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఆ దాసుడు ఆరోగ్యంగా ఉండడం చూశారు. 11  ఆ తర్వాత ఆయన నాయీను అనే నగరానికి బయల్దేరాడు. ఆయన శిష్యులు, చాలామంది ప్రజలు ఆయనతో పాటు వెళ్తున్నారు. 12  ఆయన ఆ నగర ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు, ఇదిగో! చనిపోయిన ఒక వ్యక్తిని కొంతమంది మోసుకెళ్తున్నారు. వాళ్లమ్మకి అతను ఒక్కగానొక్క కొడుకు. పైగా ఆమె విధవరాలు. ఆ నగరంవాళ్లు చాలామంది ఆమెతోపాటు ఉన్నారు. 13  ప్రభువు ఆమెను చూసినప్పుడు, ఆయనకు ఆమె మీద జాలేసింది. ఆయన ఆమెతో, “ఏడవకు” అన్నాడు. 14  తర్వాత ఆయన పాడె దగ్గరికి వచ్చి దాన్ని ముట్టుకున్నాడు. దాంతో పాడెను మోస్తున్నవాళ్లు ఆగిపోయారు. అప్పుడు యేసు, “బాబూ, నేను చెప్తున్నాను, లే!” అన్నాడు. 15  దాంతో, చనిపోయిన వ్యక్తి లేచి కూర్చొని మాట్లాడడం మొదలుపెట్టాడు. యేసు అతన్ని వాళ్లమ్మకు అప్పగించాడు. 16  అప్పుడు వాళ్లందరికీ భయం పట్టుకుంది. వాళ్లు దేవుణ్ణి మహిమపరుస్తూ, “ఒక గొప్ప ప్రవక్త మన మధ్యకు వచ్చాడు” అని, “దేవుడు తన ప్రజల్ని గుర్తుచేసుకున్నాడు” అని అన్నారు. 17  యేసు గురించిన ఈ వార్త యూదయ అంతటికీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ వ్యాపించింది. 18  ఈ విషయాలన్నిటి గురించి యోహాను శిష్యులు అతనికి చెప్పారు. 19  కాబట్టి యోహాను తన శిష్యుల్లో ఇద్దర్ని పిలిపించి, “రాబోతున్న వాడివి నువ్వేనా? లేక ఇంకో వ్యక్తి కోసం మేము ఎదురుచూడాలా?” అని అడగడానికి వాళ్లను ప్రభువు దగ్గరికి పంపించాడు. 20  వాళ్లు యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఇలా అన్నారు: “‘రాబోతున్న వాడివి నువ్వేనా? లేక ఇంకో వ్యక్తి కోసం మేము ఎదురుచూడాలా?’ అని అడగమని బాప్తిస్మమిచ్చే యోహాను మమ్మల్ని నీ దగ్గరికి పంపించాడు.” 21  యేసు ఆ సమయంలో చిన్నాపెద్దా రోగాలతో బాధపడుతున్న వాళ్లను, చెడ్డదూతలు పట్టినవాళ్లను చాలామందిని బాగుచేశాడు. చాలామంది గుడ్డివాళ్లకు చూపు తెప్పించాడు. 22  అందుకే ఆయన యోహాను శిష్యులతో ఇలా అన్నాడు: “మీరు చూసినవాటి గురించి, విన్నవాటి గురించి వెళ్లి యోహానుకు చెప్పండి: గుడ్డివాళ్లు ఇప్పుడు చూస్తున్నారు, కుంటివాళ్లు నడుస్తున్నారు, కుష్ఠురోగులు శుద్ధులౌతున్నారు, చెవిటివాళ్లు వింటున్నారు, చనిపోయినవాళ్లు బ్రతికించబడుతున్నారు, పేదవాళ్లకు మంచివార్త చెప్పబడుతోంది. 23  ఏ సందేహం లేకుండా నా మీద నమ్మకం ఉంచే వ్యక్తి సంతోషంగా ఉంటాడు.” 24  యోహాను శిష్యులు వెళ్లిపోయిన తర్వాత, యేసు అక్కడున్న ప్రజలతో యోహాను గురించి ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు: “మీరు ఏం చూడడానికి అరణ్యంలోకి వెళ్లారు? గాలికి ఊగుతున్న రెల్లునా?* కాదు. 25  మరైతే మీరు ఏం చూడడానికి వెళ్లారు? ఖరీదైన వస్త్రాలు వేసుకున్న వ్యక్తినా? కాదు. ప్రశస్తమైన వస్త్రాలు వేసుకొని విలాసవంతంగా జీవించేవాళ్లు రాజభవనాల్లో ఉంటారు. 26  మరి అలాంటప్పుడు మీరు ఏం చూడడానికి వెళ్లారు? ఒక ప్రవక్తనా? అవును, నేను మీతో చెప్తున్నాను, అతను ప్రవక్త కన్నా చాలాచాలా గొప్పవాడు. 27  ‘ఇదిగో! నా సందేశకుణ్ణి నీకు* ముందుగా పంపిస్తున్నాను, అతను నీ ముందు నీ మార్గాన్ని సిద్ధం చేస్తాడు’ అని రాయబడింది అతని గురించే. 28  నేను మీతో చెప్తున్నాను, స్త్రీలకు పుట్టినవాళ్లలో యోహాను కన్నా గొప్పవాడు లేడు. అయితే దేవుని రాజ్యంలో తక్కువవాడు అతని కన్నా గొప్పవాడు.” 29  (ప్రజలందరూ, అలాగే పన్ను వసూలు చేసేవాళ్లు అది విన్నప్పుడు, దేవుడు నీతిమంతుడని అంగీకరించారు. ఎందుకంటే, వాళ్లు అప్పటికే బాప్తిస్మమిచ్చే యోహాను ప్రకటించిన బాప్తిస్మం తీసుకున్నారు. 30  అయితే పరిసయ్యులు, ధర్మశాస్త్రంలో ఆరితేరినవాళ్లు దేవుడు తమకు ఇస్తున్న నిర్దేశాన్ని లెక్కచేయలేదు. ఎందుకంటే, వాళ్లు యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకోలేదు.) 31  “కాబట్టి, ఈ తరం వాళ్లను నేను ఎవరితో పోల్చాలి? వాళ్లు ఎవరిలా ఉన్నారు? 32  వాళ్లు సంతలో కూర్చొని ఇలా కేకలు వేసుకునే చిన్నపిల్లల్లా ఉన్నారు: ‘మేము మీ కోసం పిల్లనగ్రోవి* ఊదాం, కానీ మీరు నాట్యం చేయలేదు; మేము ఏడ్పుపాట పాడాం, కానీ మీరు ఏడ్వలేదు.’ 33  అదేవిధంగా, బాప్తిస్మమిచ్చే యోహాను అందరిలా రొట్టె తింటూ, ద్రాక్షారసం తాగుతూ జీవించలేదు; అయినా మీరు, ‘అతనికి చెడ్డదూత పట్టాడు’ అంటున్నారు. 34  మానవ కుమారుడు అందరిలాగే తింటూ, తాగుతూ ఉన్నాడు; అయినా మీరు ఆయన్ని, ‘ఇదిగో! ఈయన తిండిబోతు, తాగుబోతు, పన్ను వసూలు చేసేవాళ్లకూ పాపులకూ స్నేహితుడు!’ అంటున్నారు. 35  కాబట్టి ఒక వ్యక్తి చేసే నీతి పనులే అతను తెలివైనవాడని చూపిస్తాయి.” 36  ఒక పరిసయ్యుడు, యేసును తన ఇంటికి వచ్చి భోజనం చేయమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఆ పరిసయ్యుడి ఇంటికి వెళ్లి, భోజనం బల్ల దగ్గర కూర్చున్నాడు. 37  అప్పుడు ఇదిగో! ఆ నగరంలో, పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు ఆ పరిసయ్యుడి ఇంట్లో భోంచేస్తున్నాడని తెలుసుకొని, పరిమళ తైలం ఉన్న పాలరాతి* బుడ్డి తీసుకొచ్చింది. 38  ఆమె ఆయన పాదాల దగ్గర మోకాళ్లూని, ఏడుస్తూ తన కన్నీళ్లతో ఆయన పాదాలు తడపడం మొదలుపెట్టింది. తర్వాత తన తల వెంట్రుకలతో వాటిని తుడిచింది. అంతేకాదు, ఆయన పాదాలను ముద్దు పెట్టుకొని వాటి మీద ఆ పరిమళ తైలం పోసింది. 39  అది చూసినప్పుడు, యేసును ఆహ్వానించిన పరిసయ్యుడు తనలోతాను ఇలా అనుకున్నాడు: “ఈయన నిజంగా ప్రవక్త అయితే, తనను ముట్టుకుంటున్న ఆ స్త్రీ ఎవరో, ఆమె ఎలాంటిదో ఈయనకు తెలిసుండాలి. ఆమె ఒక పాపాత్మురాలు.” 40  అయితే యేసు అతనితో, “సీమోనూ, నీకు ఒక విషయం చెప్పాలి” అన్నాడు. దానికి అతను, “బోధకుడా, అదేంటో చెప్పు!” అన్నాడు. 41  “అప్పు ఇచ్చే ఒక వ్యక్తి దగ్గర ఇద్దరు అప్పు తీసుకున్నారు. ఒకతను 500 దేనారాలు,* ఇంకొకతను 50 దేనారాలు అప్పు తీసుకున్నారు. 42  అతనికి తిరిగివ్వడానికి వాళ్ల దగ్గర ఏమీ లేనప్పుడు అతను వాళ్లిద్దర్నీ మనస్ఫూర్తిగా క్షమించాడు. కాబట్టి, వాళ్లలో ఎవరు అతన్ని ఎక్కువగా ప్రేమిస్తారు?” 43  అప్పుడు సీమోను, “ఎక్కువ మొత్తంలో బాకీ ఉన్న వ్యక్తే అనుకుంటున్నాను” అన్నాడు. దానికి యేసు, “నువ్వు సరిగ్గా చెప్పావు” అన్నాడు. 44  తర్వాత ఆయన ఆ స్త్రీ వైపు తిరిగి, సీమోనుతో ఇలా అన్నాడు: “నువ్వు ఈమెను చూస్తున్నావు కదా? నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు, నా పాదాలు కడుక్కోవడానికి నువ్వు నీళ్లు ఇవ్వలేదు. కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదాలు తడిపి, తన తలవెంట్రుకలతో వాటిని తుడిచింది. 45  నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ ఈమె నేను వచ్చినప్పటినుండి నా పాదాల్ని ముద్దు పెట్టుకోవడం ఆపలేదు. 46  నువ్వు నా తల మీద నూనె పోయలేదు, కానీ ఈమె నా పాదాల మీద పరిమళ తైలం పోసింది. 47  కాబట్టి, నేను నీకు చెప్తున్నాను, ఈమె చాలా పాపాలు చేసినా అవి క్షమించబడ్డాయి. అందుకే ఈమె ఎక్కువ ప్రేమ చూపిస్తోంది. అయితే కొన్ని పాపాలే క్షమించబడినవాళ్లు తక్కువ ప్రేమ చూపిస్తారు.” 48  తర్వాత ఆయన ఆమెతో, “నీ పాపాలు క్షమించబడ్డాయి” అన్నాడు. 49  ఆయనతోపాటు భోజనం బల్ల దగ్గర కూర్చున్నవాళ్లు, “పాపాలు కూడా క్షమిస్తున్నాడు, ఈయన ఎవరు?” అని వాళ్లలో వాళ్లు అనుకోవడం మొదలుపెట్టారు. 50  అయితే యేసు ఆ స్త్రీతో, “నీ విశ్వాసం నిన్ను రక్షించింది; మనశ్శాంతితో వెళ్లు” అన్నాడు.

అధస్సూచీలు

లేదా “గడ్డినా?”
అక్ష., “నీ ముఖానికి.”
అంటే, ఫ్లూటు.
అక్ష., “అలబాస్టర్‌.” పదకోశంలో “అలబాస్టర్‌” చూడండి.
పదకోశం చూడండి.