2 కొరింథీయులు 7:1-16

  • కళంకం లేకుండా శుభ్రపర్చుకుందాం  (1)

  • కొరింథీయుల విషయంలో పౌలు ఆనందం  (2-4)

  • తీతు సంతోషకరమైన వార్త తెస్తాడు (5-7)

  • దేవుని ఇష్టానికి అనుగుణంగా ఉన్న దుఃఖం, పశ్చాత్తాపం  (8-16)

7  ప్రియ సోదరులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి మన శరీరానికి, మనసుకు* ఏ కళంకం లేకుండా మనల్ని మనం శుభ్రపర్చుకుందాం; దైవభయంతో ఇంకా ఎక్కువ పవిత్రులమౌదాం.  మీ హృదయాల్లో మాకు చోటివ్వండి. మేము ఎవ్వరికీ అన్యాయం చేయలేదు, ఎవ్వరినీ తప్పుదారి పట్టించలేదు, ఎవ్వరినీ మా స్వార్థానికి వాడుకోలేదు.  మీమీద నేరం మోపాలని నేనలా అనట్లేదు. ఎందుకంటే నేను ఇంతకుముందు మీతో అన్నట్టు మేము చనిపోయినా, బ్రతికున్నా మీరు మా హృదయాల్లోనే ఉంటారు.  నేను మీతో ఎంతో ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. మీ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను. నాకు ఎంతో ఊరట కలిగింది; మా బాధలన్నిట్లో నేను ఎంతో సంతోషిస్తున్నాను.  నిజానికి మేము మాసిదోనియకు వచ్చినప్పుడు మేము ఏ రకంగానూ ఉపశమనం పొందలేదు. బయట చాలా వ్యతిరేకత, లోపల భయం, ఇలా అన్నివైపుల నుండి కష్టాలు మమ్మల్ని చుట్టుముడుతూనే ఉన్నాయి.  కానీ, కృంగిపోయిన వాళ్లకు ఊరటనిచ్చే దేవుడు తీతు సందర్శనం ద్వారా మాకు ఊరటనిచ్చాడు;  అతను మాతో ఉన్నందుకే కాదు, మీ వల్ల అతను పొందిన ఊరటను బట్టి కూడా మేము ఊరట పొందాం. మీరు నన్ను చూడాలని ఎంతో కోరుకుంటున్నారని, మీరు చాలా దుఃఖపడుతున్నారని, మీకు నా మీద నిజమైన శ్రద్ధ ఉందని అతను తిరిగి వచ్చినప్పుడు మాకు చెప్పాడు; అది విని నేను ఇంకా ఎక్కువ సంతోషించాను.  ఒకవేళ నా ఉత్తరం మిమ్మల్ని దుఃఖపెట్టినా, దాని గురించి నేను బాధపడను. (నా ఉత్తరం వల్ల మీకు కొంతకాలంపాటు దుఃఖం కలిగిందని తెలిసి) నేను మొదట్లో కాస్త బాధపడినా,  ఇప్పుడైతే సంతోషిస్తున్నాను. మీకు దుఃఖం కలిగినందుకే కాదు, ఆ దుఃఖం మీలో పశ్చాత్తాపం కలిగించినందుకు సంతోషిస్తున్నాను. మీకు కలిగిన దుఃఖం దేవుని ఇష్టానికి తగ్గట్టు ఉంది. కాబట్టి, మా వల్ల మీకు ఏ నష్టం జరగలేదు. 10  దేవుని ఇష్టానికి తగ్గట్టుగా ఉన్న దుఃఖం పశ్చాత్తాపాన్ని కలిగించి రక్షణకు నడిపిస్తుంది, ఇక బాధపడాల్సిన అవసరమేమీ ఉండదు; కానీ లోక సంబంధమైన దుఃఖం మరణానికి నడిపిస్తుంది. 11  దేవుని ఇష్టానికి తగ్గట్టుగా ఉన్న దుఃఖం మీలో ఎంత పట్టుదలను కలిగించిందో చూడండి. ఆ దుఃఖం మీ మీద పడిన నిందను తీసేసుకోవడానికి మీకు సహాయం చేసింది; తప్పు విషయంలో ఆగ్రహాన్ని, దైవభయాన్ని, పశ్చాత్తాపపడాలనే బలమైన కోరికను కలిగించింది; తప్పు దిద్దే విషయంలో ఉత్సాహాన్ని నింపింది. ఈ విషయంలో మీరు అన్నివిధాలా స్వచ్ఛంగా* ఉన్నట్టు చూపించుకున్నారు. 12  నేను మీకు ఉత్తరం రాసిన మాట నిజమే. అయితే దాన్ని తప్పు చేసిన వ్యక్తి కోసమో, ఆ తప్పు వల్ల గాయపడిన వ్యక్తి కోసమో రాయలేదు. కానీ మా మాట వినడానికి మీరు ఎంత పట్టుదలగా ప్రయత్నిస్తున్నారో దేవుని ముందు స్పష్టమవ్వాలని రాశాను. 13  అందుకే మేము ఊరట పొందాం. అయితే మేము ఊరట పొందడమే కాదు, తీతు ఆనందాన్ని చూసి మేము ఇంకా ఎక్కువ సంతోషించాం. ఎందుకంటే మీరందరూ అతని మనసుకు* ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చారు. 14  నేను తీతు ముందు మీ గురించి గొప్పలు చెప్పినా, దానివల్ల నేను సిగ్గుపడాల్సిన పరిస్థితి రాలేదు; అయితే, మేము మీకు చెప్పినవన్నీ ఎంత నిజమో, తీతు ముందు మీ గురించి గొప్పగా మాట్లాడినవి కూడా అంతే నిజం. 15  అంతేకాదు, మీరందరు ఎలా విధేయత చూపించారో, తనను ఎంత గౌరవంతో చేర్చుకున్నారో గుర్తుచేసుకుంటున్నప్పుడు అతనికి మీమీద ఉన్న ప్రేమ ఇంకా పెరుగుతోంది. 16  అన్ని విషయాల్లో మీమీద నమ్మకం పెట్టుకోవచ్చని* నేను సంతోషిస్తున్నాను.

అధస్సూచీలు

గ్రీకులో న్యూమా. పదకోశంలో “న్యూమా” చూడండి.
లేదా “పవిత్రంగా; నిర్దోషంగా.”
గ్రీకులో న్యూమా. పదకోశంలో “న్యూమా” చూడండి.
లేదా “మీ వల్ల నేను మంచి ధైర్యంతో ఉండవచ్చని” అయ్యుంటుంది.