అపొస్తలుల కార్యాలు 15:1-41

  • సున్నతి గురించి అంతియొకయలో వివాదం (1, 2)

  • సమస్యను యెరూషలేముకు తీసుకెళ్లడం (3-5)

  • పెద్దలు, అపొస్తలులు సమావేశమవ్వడం (6-21)

  • పరిపాలక సభ ఉత్తరం (22-29)

    • రక్తానికి దూరంగా ఉండండి (28, 29)

  • ఉత్తరం వల్ల సంఘాలు ప్రోత్సాహం పొందడం (30-35)

  • పౌలు, బర్నబాలు ఎవరి దారిన వాళ్లు వెళ్లడం (36-41)

15  యూదయ నుండి కొంతమంది అంతియొకయకు వచ్చి, “మీరు మోషే ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి చేయించుకుంటేనే+ రక్షించబడతారు” అని సహోదరులకు బోధించడం మొదలుపెట్టారు.  వాళ్లకు, పౌలు బర్నబాలకు మధ్య చాలాసేపు తీవ్రమైన వాద ప్రతివాదాలు జరిగాయి. అప్పుడు సహోదరులు ఈ వివాదం గురించి యెరూషలేములో ఉన్న అపొస్తలులతో, పెద్దలతో మాట్లాడడానికి పౌలును, బర్నబాను, ఇంకొంతమందిని పంపాలని నిర్ణయించారు.+  సంఘం వాళ్లను సాగనంపింది. వాళ్లు ఫేనీకే, సమరయ గుండా ప్రయాణిస్తూ, అన్యజనులు దేవుని వైపుకు తిరగడం గురించి అక్కడి సహోదరులకు వివరంగా చెప్తూ వాళ్లకు ఎంతో సంతోషం కలిగించారు.  వాళ్లు యెరూషలేముకు వచ్చినప్పుడు అక్కడి సంఘంలోని వాళ్లు, అపొస్తలులు, పెద్దలు వాళ్లను సాదరంగా ఆహ్వానించారు. పౌలు, బర్నబాలు దేవుడు తమ ద్వారా చేసిన వాటన్నిటి గురించి వాళ్లకు చెప్పారు.  అయితే, అంతకుముందు పరిసయ్యుల బోధల్ని అనుసరించి,* ఆ తర్వాత విశ్వాసులుగా మారిన కొంతమంది లేచి నిలబడి, “విశ్వాసులుగా మారిన అన్యజనులు సున్నతి చేయించుకోవాలి; మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలని వాళ్లకు ఆజ్ఞాపించాలి” అని అన్నారు.+  కాబట్టి ఈ విషయం గురించి మాట్లాడడానికి అపొస్తలులు, పెద్దలు సమావేశమయ్యారు.  చాలాసేపు తీవ్రంగా చర్చించుకున్న తర్వాత పేతురు లేచి నిలబడి ఇలా అన్నాడు: “సహోదరులారా, అన్యజనులు మొదట నా ద్వారా మంచివార్త విని విశ్వాసం ఉంచాలని దేవుడు మీలో నుండి నన్ను ఎంచుకున్నాడని మీకు బాగా తెలుసు.+  అయితే, దేవునికి హృదయాలు తెలుసు;+ ఆయన మనకు ఇచ్చినట్టే వాళ్లకు కూడా పవిత్రశక్తిని ఇచ్చి,+ తాను వాళ్లను ఆమోదించానని సాక్ష్యమిచ్చాడు.  వాళ్లకున్న విశ్వాసాన్ని బట్టి వాళ్ల హృదయాల్ని పవిత్రపర్చడం ద్వారా+ దేవుడు మనల్ని, అన్యజనుల్ని ఒకేలా చూస్తున్నానని తెలియజేశాడు.+ 10  అలాంటిది, మన పూర్వీకులు గానీ మనం గానీ మోయలేని+ బరువును*+ శిష్యుల మీద పెడుతూ మీరెందుకు ఇప్పుడు దేవుణ్ణి పరీక్షిస్తున్నారు? 11  యూదులమైన మనం ప్రభువైన యేసు అపారదయ ద్వారా రక్షణ పొందుతామని నమ్ముతున్నాం,+ శిష్యులుగా మారిన అన్యజనులు కూడా అదే నమ్ముతున్నారు.”+ 12  దాంతో వాళ్లంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. పౌలు, బర్నబాలు దేవుడు తమ ద్వారా అన్యజనుల మధ్య చేసిన ఎన్నెన్నో సూచనల గురించి, అద్భుతాల గురించి చెప్తుంటే వాళ్లు వినడం మొదలుపెట్టారు. 13  వాళ్లు మాట్లాడడం పూర్తయ్యాక యాకోబు ఇలా అన్నాడు: “సహోదరులారా, నేను చెప్పేది వినండి. 14  దేవుడు తన పేరు కోసం అన్యజనుల్లో నుండి కూడా ప్రజల్ని ఎంచుకోవడానికి,+ ఇప్పుడు వాళ్లను అంగీకరిస్తున్నాడని ఇంతకుముందే సుమెయోను*+ వివరంగా చెప్పాడు. 15  ఇది ప్రవక్తలు రాసిన ఈ మాటలకు అనుగుణంగా ఉంది: 16  ‘ఆ తర్వాత నేను తిరిగొచ్చి, పడిపోయిన దావీదు ఇంటిని* నిలబెడతాను. దాని శిథిలాల్ని బాగుచేసి దాన్ని మళ్లీ ముందున్న స్థితికి తీసుకొస్తాను. 17  అప్పుడు మిగిలినవాళ్లు, నా పేరుతో పిలవబడే అన్నిదేశాల ప్రజలతో కలిసి పట్టుదలగా యెహోవాను* వెతుకుతారని వీటిని చేస్తున్న యెహోవా* చెప్తున్నాడు.+ 18  వీటిని ఆయన ఎంతోకాలం ముందే నిర్ణయించాడు.’+ 19  కాబట్టి, దేవుని వైపు తిరుగుతున్న అన్యజనుల్ని ఇబ్బందిపెట్టడం మంచిదికాదని నా అభిప్రాయం.*+ 20  అయితే విగ్రహపూజ వల్ల కలుషితమైనవాటికి,+ లైంగిక పాపానికి,*+ గొంతు పిసికి* చంపినవాటికి, రక్తానికి దూరంగా ఉండమని+ వాళ్లకు రాసి పంపాలన్నదే నా అభిప్రాయం. 21  మోషే పుస్తకాల్లోని ఈ ఆజ్ఞల్ని ప్రకటించేవాళ్లు ప్రాచీనకాలాల నుండి అన్ని నగరాల్లో ఉన్నారు. ఎందుకంటే, ప్రతీ విశ్రాంతి రోజున ఆ పుస్తకాల్లో ఉన్నవాటిని సమాజమందిరాల్లో బయటికి చదివి వినిపిస్తున్నారు.”+ 22  అప్పుడు అపొస్తలులు, పెద్దలు సంఘమంతటితో కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్లు తమలో నుండి ఎంచుకోబడినవాళ్లను పౌలు, బర్నబాలతో పాటు అంతియొకయకు పంపాలని అనుకున్నారు. కాబట్టి వాళ్లు సహోదరుల మధ్య నాయకత్వం వహిస్తున్న ఇద్దర్ని అంటే బర్సబ్బా అని పిలవబడిన యూదాను, సీలను+ పంపించారు. 23  అపొస్తలులు, పెద్దలు ఈ మాటలు రాసి వాళ్లతో పంపించారు: “అంతియొకయలో,+ సిరియాలో, కిలికియలో ఉన్న యూదులుకాని* సహోదరులకు మీ సహోదరులైన అపొస్తలులు, పెద్దలు రాస్తున్న ఉత్తరం: మీకు శుభాకాంక్షలు! 24  మేము ఎలాంటి నిర్దేశాలు ఇవ్వకపోయినా, ఇక్కడి నుండి కొంతమంది మీ దగ్గరికి వచ్చి మీ నమ్మకాల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ తమ మాటలతో మిమ్మల్ని ఇబ్బందిపెట్టారని మాకు తెలిసింది. 25  కాబట్టి ఇద్దరు సహోదరుల్ని ఎంపికచేసి వాళ్లను మా ప్రియ సహోదరులైన బర్నబాతో, పౌలుతో పాటు మీ దగ్గరికి పంపాలని మేమంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. 26  వాళ్లు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కోసం తమ జీవితాల్ని అంకితం చేశారు.+ 27  ఈ ఉత్తరంలో ఉన్న విషయాల్నే స్వయంగా మీకు వివరించడానికి మేము యూదాను, సీలను కూడా పంపిస్తున్నాం.+ 28  అవసరమైన ఈ విషయాలు తప్ప అదనంగా ఏ భారం మీ మీద పెట్టకూడదని పవిత్రశక్తి సహాయంతో+ మేము ఒక ముగింపుకు వచ్చాం, అవేమిటంటే: 29  విగ్రహాలకు బలి ఇచ్చినవాటికి,+ రక్తానికి,+ గొంతు పిసికి* చంపినవాటికి,+ లైంగిక పాపానికి*+ ఎప్పుడూ దూరంగా ఉండండి. మీరు జాగ్రత్తగా వీటికి దూరంగా ఉంటే మీకు మంచి జరుగుతుంది. మీరు క్షేమంగా ఉండాలి!”* 30  వీళ్లు బయల్దేరి అంతియొకయకు వచ్చారు. అక్కడ శిష్యులందర్నీ ఒక చోట సమావేశపర్చి ఆ ఉత్తరం వాళ్ల చేతికి ఇచ్చారు. 31  వాళ్లు ఉత్తరం చదివాక, అందులో ఉన్న ప్రోత్సహించే మాటల్ని బట్టి ఎంతో సంతోషించారు. 32  అయితే యూదా, సీల ప్రవక్తలు కాబట్టి వాళ్లు చాలా ప్రసంగాలిచ్చి సహోదరుల్ని ప్రోత్సహించారు, బలపర్చారు.+ 33  వాళ్లు అక్కడ కొన్ని రోజులు ఉన్నాక, సహోదరులు వాళ్లకు వీడ్కోలు చెప్పారు. తర్వాత వాళ్లు యెరూషలేముకు తిరిగెళ్లారు. 34  *— — 35  అయితే పౌలు, బర్నబా చాలామంది సహోదరులతో కలిసి యెహోవా* వాక్యం గురించిన మంచివార్తను బోధిస్తూ, ప్రకటిస్తూ అంతియొకయలో ఉండిపోయారు. 36  కొన్ని రోజుల తర్వాత పౌలు బర్నబాతో, “మనం ఏయే నగరాల్లో యెహోవా* వాక్యాన్ని ప్రకటించామో ఆ నగరాలన్నిటికీ ఇప్పుడు* తిరిగెళ్లి, అక్కడున్న సహోదరుల్ని కలుద్దాం. వాళ్ల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం”+ అన్నాడు. 37  అప్పుడు బర్నబా, మార్కు అని పిలవబడే యోహానును+ తమతో తీసుకెళ్లాలని పట్టుబట్టాడు. 38  కానీ అతన్ని తమతో పాటు తీసుకెళ్లడం పౌలుకు ఇష్టంలేదు. ఎందుకంటే అతను వాళ్లతో పాటు పనిచేయకుండా, పంఫూలియలో వాళ్లను వదిలేసి వెళ్లిపోయాడు.+ 39  కాబట్టి వాళ్లిద్దరు చాలా కోపంతో గొడవపడి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. బర్నబా+ మార్కును వెంటబెట్టుకొని ఓడలో కుప్రకు బయల్దేరాడు. 40  పౌలు సీలను ఎంచుకున్నాడు. పౌలు మీద యెహోవా* తన అపారదయ చూపించాలని+ సహోదరులు ప్రార్థించిన తర్వాత అతను బయల్దేరాడు. 41  అతను సిరియా, కిలికియ గుండా ప్రయాణిస్తూ సంఘాల్ని బలపరుస్తూ ఉన్నాడు.

అధస్సూచీలు

అక్ష., “పరిసయ్యుల తెగకు చెందిన.”
లేదా “కాడిని.”
అంటే, పేతురు.
లేదా “డేరాను; పర్ణశాలను.”
అనుబంధం A5 చూడండి.
అనుబంధం A5 చూడండి.
లేదా “నిర్ణయం.”
లేదా “రక్తం ఒలికించకుండా.”
గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.
లేదా “అన్యజనుల్లో నుండి వచ్చిన.”
లేదా “రక్తం ఒలికించకుండా.”
లేదా “వీడ్కోలు.”
గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.
అనుబంధం A3 చూడండి.
అనుబంధం A5 చూడండి.
అనుబంధం A5 చూడండి.
లేదా “ఏదేమైనా” అయ్యుంటుంది.
అనుబంధం A5 చూడండి.