అపొస్తలుల కార్యాలు 17:1-34

  • థెస్సలొనీకలో పౌలు, సీల (1-9)

  • బెరయలో పౌలు, సీల (10-15)

  • ఏథెన్సులో పౌలు (16-22ఎ)

  • అరేయొపగులో పౌలు ప్రసంగం (22బి-34)

17  తర్వాత వాళ్లు అంఫిపొలి, అపొల్లోనియ గుండా ప్రయాణించి థెస్సలొనీకకు వచ్చారు.+ అక్కడ యూదుల సమాజమందిరం ఉంది.  కాబట్టి పౌలు తన అలవాటు ప్రకారం+ దానిలోకి వెళ్లాడు. పౌలు మూడు వారాలపాటు ప్రతీ విశ్రాంతి రోజున, లేఖనాలు అర్థంచేసుకునేలా అక్కడి వాళ్లకు సహాయం చేయడానికి ప్రయత్నించాడు.+  క్రీస్తు బాధలు పడడం,+ మృతుల్లో నుండి బ్రతకడం+ అవసరమని పౌలు వివరిస్తూ, లేఖనాల ద్వారా రుజువు చేస్తూ ఉన్నాడు. “నేను మీకు ప్రకటిస్తున్న ఈ యేసే క్రీస్తు” అని అతను వాళ్లకు చెప్పాడు.  దానివల్ల వాళ్లలో కొంతమంది విశ్వాసులయ్యారు; వాళ్లు పౌలుతో, సీలతో సహవసించారు.+ అంతేకాదు దైవభక్తి ఉన్న చాలామంది గ్రీకువాళ్లు, ఎంతోమంది ప్రముఖులైన స్త్రీలు కూడా విశ్వాసులై వాళ్లతో సహవసించారు.  కానీ యూదులు అసూయతో నిండిపోయి,+ పనీపాటా లేకుండా సంతలో తిరిగే కొంతమంది చెడ్డవాళ్లను పోగుచేశారు; ఆ యూదులు ఒక అల్లరిమూకను తయారుచేసి, నగరంలో అలజడి రేపడం మొదలుపెట్టారు. వాళ్లు యాసోను ఇంటి మీద దాడి చేశారు. పౌలును, సీలను ఆ అల్లరిమూక ముందుకు తీసుకురావాలని అనుకున్నారు.  పౌలు, సీల కనిపించకపోయేసరికి వాళ్లు యాసోనును, కొంతమంది సహోదరుల్ని నగర పాలకుల దగ్గరికి ఈడ్చుకెళ్లి ఇలా అరిచారు: “లోకాన్ని తలకిందులు చేసిన ఈ మనుషులు ఇక్కడికి కూడా వచ్చారు.+  యాసోను వాళ్లను తన ఇంట్లో అతిథులుగా ఉంచుకున్నాడు. యేసు అనే ఇంకో రాజు ఉన్నాడని చెప్తూ వీళ్లందరూ కైసరు ఆజ్ఞలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు.”+  ఈ మాటలు విన్నప్పుడు ఆ గుంపు, అలాగే నగర పాలకులు ఆందోళనపడ్డారు.  వాళ్లు యాసోను దగ్గర, మిగతావాళ్ల దగ్గర జామీను తీసుకొని వాళ్లను వెళ్లనిచ్చారు. 10  చీకటి పడగానే సహోదరులు పౌలును, సీలను బెరయకు పంపించారు. వాళ్లు అక్కడికి చేరుకున్న తర్వాత, యూదుల సమాజమందిరంలోకి వెళ్లారు. 11  థెస్సలొనీకలోని వాళ్లకన్నా బెరయలో ఉన్న యూదులు నేర్చుకోవడానికి ఎక్కువ ఇష్టం చూపించారు. అందుకే వాళ్లు ఎంతో ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు. తాము విన్న విషయాలు నిజమో కాదో తెలుసుకోవడానికి వాళ్లు ప్రతీరోజు లేఖనాల్ని జాగ్రత్తగా పరిశోధిస్తూ వచ్చారు. 12  కాబట్టి వాళ్లలో చాలామంది విశ్వాసులయ్యారు. గ్రీకువాళ్లలో చాలామంది ప్రముఖ స్త్రీలు, అలాగే కొంతమంది పురుషులు కూడా విశ్వాసులయ్యారు. 13  అయితే, పౌలు బెరయలో కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడని థెస్సలొనీకలో ఉన్న యూదులకు తెలిసినప్పుడు, బెరయలో ఉన్న ప్రజల్ని రెచ్చగొట్టి అలజడి రేపడానికి వాళ్లు అక్కడికి వచ్చారు.+ 14  అప్పుడు సహోదరులు వెంటనే పౌలును సముద్రతీరం వరకు పంపించారు.+ సీల, తిమోతి మాత్రం అక్కడే ఉండిపోయారు. 15  అయితే, పౌలుతో పాటు ఉన్నవాళ్లు అతన్ని ఏథెన్సు వరకు తీసుకెళ్లారు. కానీ వీలైనంత త్వరగా సీలను, తిమోతిని+ తన దగ్గరికి రమ్మని చెప్పమంటూ పౌలు వాళ్లకు నిర్దేశాలు ఇచ్చాడు. దాంతో అతని వెంట వచ్చినవాళ్లు బయల్దేరి వెళ్లిపోయారు. 16  పౌలు వాళ్ల కోసం ఏథెన్సులో వేచి ఉన్నప్పుడు, ఆ నగరం విగ్రహాలతో నిండి ఉండడం చూసి అతని హృదయం రగిలిపోయింది. 17  అప్పుడతను లేఖనాల్ని అర్థంచేసుకునేలా సమాజమందిరంలో యూదులకు, దైవభక్తిగల ఇతరులకు, అలాగే ప్రతీరోజు సంతలో కలిసేవాళ్లకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. 18  అయితే ఎపికూరీయుల, స్తోయికుల తత్త్వవేత్తలు కొంతమంది పౌలుతో వాదించడం మొదలుపెట్టారు. కొంతమంది, “ఈ వదరుబోతు ఏం చెప్పాలని అనుకుంటున్నాడు?” అన్నారు. ఇంకొంతమంది, “ఇతను విదేశీ దేవుళ్ల గురించి ప్రకటిస్తున్నట్టున్నాడు” అన్నారు. ఎందుకంటే పౌలు యేసు గురించిన, చనిపోయినవాళ్లు తిరిగి బ్రతకడం* గురించిన మంచివార్త ప్రకటిస్తున్నాడు.+ 19  కాబట్టి వాళ్లు అతన్ని అరేయొపగుకు* తీసుకెళ్లి ఇలా అన్నారు: “నువ్వు నేర్పిస్తున్న ఈ కొత్త బోధ ఏమిటో మేము తెలుసుకోవచ్చా? 20  ఎందుకంటే మేము ఇప్పటివరకు వినని విషయాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. మేము వాటి అర్థాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నాం.” 21  నిజానికి ఏథెన్సు ప్రజలందరూ, అలాగే అక్కడ నివసించే* విదేశీయులు ఖాళీ సమయమంతా ఏదైనా కొత్త విషయం గురించి చెప్తూనో, వింటూనో గడిపేస్తుంటారు. 22  అప్పుడు పౌలు అరేయొపగు+ మధ్యలో నిలబడి ఇలా అన్నాడు: “ఏథెన్సు ప్రజలారా, ఇతరులతో పోలిస్తే అన్ని విషయాల్లో మీకు దైవభక్తి ఎక్కువని నేను గమనించాను.+ 23  ఉదాహరణకు, నేను నగరంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, మీరు పూజించే* విగ్రహాల్ని జాగ్రత్తగా గమనించాను. నాకు ఒక బలిపీఠం కూడా కనిపించింది. దానిమీద, ‘తెలియని దేవునికి’ అని చెక్కి ఉంది. కాబట్టి మీరు తెలియక పూజిస్తున్న ఆ దేవుని గురించే నేను మీకు ప్రకటిస్తున్నాను. 24  లోకాన్ని, అందులో ఉన్న వాటన్నిటినీ చేసిన దేవుడు ఆకాశానికి, భూమికి ప్రభువు+ కాబట్టి చేతులతో చేసిన ఆలయాల్లో నివసించడు.+ 25  అంతేకాదు, తనకేదో అవసరం ఉన్నట్టు ఆయన మనుషుల సహాయం కోసం ఎదురుచూడడు.+ ఎందుకంటే ఆయనే అందరికీ ప్రాణాన్ని, ఊపిరిని,+ అన్నిటినీ ఇస్తున్నాడు. 26  భూమంతటి మీద జీవించడానికి+ ఆయన ఒకే ఒక్క మనిషి+ నుండి అన్నిదేశాల మనుషుల్ని చేశాడు. చాలా విషయాలకు ఆయన సమయాన్ని నిర్ణయించాడు, మనుషులు ఎక్కడ నివసించాలో ఆ సరిహద్దుల్ని కూడా నిర్ణయించాడు.+ 27  ఎందుకంటే ప్రజలు తన కోసం వెతికి, తడవులాడి, తనను కనుక్కోవాలని దేవుడు కోరుకుంటున్నాడు.+ నిజానికి, ఆయన మనలో ఏ ఒక్కరికీ దూరంగా లేడు. 28  ఆయన వల్లే మనకు జీవం వచ్చింది, ఆయన వల్లే మనం కదులుతున్నాం, ఇక్కడున్నాం. చివరికి, మీ కవులలో కొంతమంది చెప్పినట్టు, ‘మనం కూడా ఆయన పిల్లలమే.’* 29  “మనం దేవుని పిల్లలం*+ కాబట్టి, దేవుడు బంగారంతోనో, వెండితోనో, రాయితోనో చేయబడిన వాటిలా, మనుషుల ఆలోచనల ప్రకారం చేతులతో చేసిన వాటిలా ఉంటాడని అనుకోకూడదు.+ 30  నిజమే, ప్రజలకు తన గురించి తెలియని ఆ కాలాల్ని దేవుడు చూసీచూడనట్టు వదిలేశాడు.+ ఇప్పుడైతే, అన్నిచోట్ల ఉన్న ప్రజలందరూ పశ్చాత్తాపపడాలని ఆయన ప్రకటిస్తున్నాడు. 31  ఎందుకంటే, తాను నియమించిన మనిషి ద్వారా ప్రపంచానికి న్యాయంగా తీర్పు తీర్చే ఒక రోజును ఆయన నిర్ణయించాడు.+ దేవుడు ఆ మనిషిని మృతుల్లో నుండి తిరిగి బ్రతికించడం+ ద్వారా, ఆ తీర్పు రోజు తప్పకుండా వస్తుందని హామీ ఇచ్చాడు.” 32  చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతకడం* గురించిన బోధను వాళ్లు విన్నప్పుడు, కొంతమంది ఎగతాళి చేశారు.+ అయితే ఇంకొంతమంది, “దీని గురించి నువ్వు చెప్పేది మేము ఇంకో సమయంలో వింటాం” అన్నారు. 33  కాబట్టి పౌలు అక్కడి నుండి వెళ్లిపోయాడు. 34  అయితే కొంతమంది పౌలుతో చేరి విశ్వాసులయ్యారు. వాళ్లలో అరేయొపగు న్యాయస్థాన న్యాయమూర్తి దియొనూసి, దమరి అనే స్త్రీ, ఇంకొంతమంది ఉన్నారు.

అధస్సూచీలు

లేదా “పునరుత్థానం.”
పదకోశం చూడండి.
లేదా “దాన్ని సందర్శించే.”
లేదా “భక్తి చూపించే.”
లేదా “సంతానమే.”
లేదా “సంతానం.”
లేదా “మృతుల పునరుత్థానం.”