అపొస్తలుల కార్యాలు 26:1-32

  • అగ్రిప్ప ముందు పౌలు వాదన (1-11)

  • తాను ఎలా విశ్వాసిగా మారాడో పౌలు వివరించడం (12-23)

  • ఫేస్తు, అగ్రిప్పల స్పందన (24-32)

26  అగ్రిప్ప+ పౌలుతో, “నువ్వు నీ వాదన వినిపించవచ్చు” అన్నాడు. అప్పుడు పౌలు తన చెయ్యి చాపి, తన వాదన వినిపించడం మొదలుపెట్టాడు:  “అగ్రిప్ప రాజా, యూదులు ఏ విషయాల గురించి నా మీద ఆరోపణలు చేస్తున్నారో+ వాటి గురించి ఈ రోజు నీ ముందు నా వాదన వినిపించడం నాకు సంతోషంగా ఉంది.  ముఖ్యంగా, యూదుల ఆచారాల గురించి, వాళ్ల మధ్య ఉన్న వివాదాల గురించి నీకు బాగా తెలుసు కాబట్టి నీ ముందు మాట్లాడడం నాకు సంతోషంగా ఉంది. నా వాదనను ఓపిగ్గా వినమని నిన్ను వేడుకుంటున్నాను.  “నిజానికి చిన్నప్పటి నుండి నా ప్రజల మధ్య ఉన్నప్పుడు, అలాగే యెరూషలేములో ఉన్నప్పుడు నా జీవితం ఎలా ఉండేదో యూదులందరికీ బాగా తెలుసు.+  కాబట్టి నేను చాలాకాలం నుండి వాళ్లకు తెలుసు. వాళ్లు కావాలనుకుంటే, నేను పరిసయ్యుల తెగకు చెందినవాణ్ణని+ నీ ముందు సాక్ష్యం చెప్పగలరు. మిగతా యూదుల కన్నా ఈ తెగవాళ్లు చాలా నిష్ఠగా ఉంటారని+ నీకు తెలుసు.  అయితే, దేవుడు మన పూర్వీకులకు చేసిన వాగ్దానం నెరవేరడం కోసం నేను ఎదురుచూస్తున్నాను,+ అందుకే ఇప్పుడు నాకు విచారణ జరుగుతోంది.  మన 12 గోత్రాలవాళ్లు ఎంతో ఉత్సాహంగా రాత్రింబగళ్లు పవిత్రసేవ చేస్తూ ఆ వాగ్దానం నెరవేరడం కోసమే ఎదురుచూస్తున్నారు. రాజా, నేను దానికోసం ఎదురుచూస్తున్నాను కాబట్టే యూదులు నా మీద ఆరోపణలు చేస్తున్నారు.+  “దేవుడు చనిపోయినవాళ్లను బ్రతికిస్తాడనే విషయం నమ్మశక్యం కాదని మీలో కొంతమందికి ఎందుకు అనిపిస్తోంది?  ఒకప్పుడు నేను కూడా నజరేయుడైన యేసు పేరుకు వ్యతిరేకంగా చాలా పనులు చేయాలని గట్టిగా నమ్మాను. 10  యెరూషలేములో నేను సరిగ్గా అదే చేశాను. ముఖ్య యాజకుల దగ్గర పొందిన అధికారంతో+ పవిత్రుల్లో చాలామందిని చెరసాలల్లో వేశాను.+ వాళ్లను చంపడానికి మద్దతు తెలిపాను. 11  అన్ని సమాజమందిరాల్లో, వాళ్లను అదేపనిగా శిక్షిస్తూ తమ విశ్వాసం విడిచిపెట్టేలా వాళ్లను బలవంతం చేయడానికి ప్రయత్నించాను. వాళ్ల మీద నాకు చాలా కోపం ఉండేది కాబట్టి వాళ్లను హింసించడానికి వేరే నగరాలకు కూడా వెళ్లాను. 12  “అలా ఒక సందర్భంలో, ముఖ్య యాజకులు ఇచ్చిన అధికారంతో, వాళ్ల ఆజ్ఞమేరకు నేను దమస్కుకు ప్రయాణిస్తున్నాను. 13  రాజా, మధ్యాహ్నం అప్పుడు దారిలో సూర్యకాంతి కన్నా గొప్ప వెలుగు ఆకాశం నుండి నా చుట్టూ, నాతో ప్రయాణిస్తున్న వాళ్ల చుట్టూ ప్రకాశించడం చూశాను.+ 14  దాంతో మేమంతా నేల మీద పడిపోయాం. అప్పుడు ఒక స్వరం హీబ్రూ భాషలో, ‘సౌలా, సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు? ముల్లుకర్రకు* ఎదురుతన్నడం వల్ల నీకే హాని జరుగుతుంది’ అని నాతో చెప్పడం విన్నాను. 15  అప్పుడు నేను, ‘ప్రభువా, నువ్వెవరు?’ అని అడిగాను. దానికి ప్రభువు ఇలా అన్నాడు: ‘నేను నువ్వు హింసిస్తున్న యేసును. 16  ఇప్పుడు నువ్వు లేచి నిలబడు. నువ్వు చూసిన విషయాలకూ నేను నీకు చూపించబోయే విషయాలకూ నిన్ను సాక్షిగా, సేవకుడిగా ఎంచుకోవడానికే నేను నీకు కనిపించాను.+ 17  ఈ ప్రజల నుండి, అలాగే నేను నిన్ను ఎక్కడికైతే పంపించబోతున్నానో ఆ దేశాల ప్రజల+ నుండి నేను నిన్ను కాపాడతాను. 18  వాళ్ల కళ్లు తెరవడానికి,+ వాళ్లను చీకట్లో+ నుండి వెలుగు+ వైపుకు, సాతాను అధికారం+ నుండి దేవుని అధికారం వైపుకు తిప్పడానికి నిన్ను వాళ్ల దగ్గరికి పంపిస్తున్నాను. దానివల్ల వాళ్లు పాపక్షమాపణను,+ అలాగే నా మీదున్న విశ్వాసం వల్ల పవిత్రపర్చబడిన వాళ్లమధ్య స్వాస్థ్యాన్ని పొందగలుగుతారు.’ 19  “కాబట్టి అగ్రిప్ప రాజా, పరలోకం నుండి వచ్చిన ఆ దర్శనానికి నేను అవిధేయత చూపించలేదు. 20  అయితే ముందుగా దమస్కులోని+ వాళ్లకు, తర్వాత యెరూషలేములో,+ అలాగే యూదయ దేశమంతటా ఉన్నవాళ్లకు, అన్యజనులకు, ‘పశ్చాత్తాపపడండి, పశ్చాత్తాపానికి తగిన పనులు చేస్తూ+ దేవుని వైపుకు తిరగండి’ అనే సందేశాన్ని ప్రకటిస్తూ వచ్చాను. 21  అందుకే యూదులు ఆలయంలో నన్ను పట్టుకొని చంపడానికి ప్రయత్నించారు.+ 22  అయితే దేవుడిచ్చిన సహాయంతో ఈ రోజు వరకు నేను సామాన్యులకు, గొప్పవాళ్లకు ప్రకటిస్తున్నాను. ప్రవక్తలు, మోషే ఏమేం జరగబోతున్నాయని రాశారో వాటిని మాత్రమే నేను ప్రకటిస్తున్నాను.+ 23  క్రీస్తు బాధలు పడతాడని,+ చనిపోయినవాళ్లలో నుండి మొదట బ్రతికించబడిన* వ్యక్తిగా+ ఈ ప్రజలకు, అలాగే అన్యజనులకు వెలుగును ప్రకటిస్తాడని+ వాళ్లు రాశారు.” 24  పౌలు ఇలా తన వాదన వినిపిస్తున్నప్పుడు ఫేస్తు బిగ్గరగా, “పౌలూ! నీకు మతిపోయింది. అతిగా చదువుకోవడం వల్ల నీకు పిచ్చి పట్టింది!” అన్నాడు. 25  కానీ పౌలు ఇలా అన్నాడు: “గౌరవనీయుడివైన ఫేస్తూ, నాకు పిచ్చి పట్టలేదు. నేను సత్యమే చెప్తున్నాను, మంచి వివేచనతో మాట్లాడుతున్నాను. 26  నిజానికి, నేను ఎవరితోనైతే ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నానో ఆ రాజుకు ఈ విషయాల గురించి బాగా తెలుసు. వీటిలో ఏ ఒక్కటీ అతనికి తెలియనిది కాదని నా నమ్మకం. ఎందుకంటే వీటిలో ఏదీ రహస్యంగా జరగలేదు.+ 27  అగ్రిప్ప రాజా, నువ్వు ప్రవక్తల్ని నమ్ముతావా? నమ్ముతావని నాకు తెలుసు.” 28  అయితే అగ్రిప్ప పౌలుతో, “త్వరలోనే నువ్వు నన్ను క్రైస్తవుడిగా మార్చేస్తావు” అన్నాడు. 29  దానికి పౌలు, “త్వరగానైనా ఆలస్యంగానైనా నువ్వే కాదు, ఈ రోజు నా మాటలు వింటున్న వాళ్లందరూ నాలాగే అవ్వాలని, కానీ ఈ సంకెళ్లు మాత్రం ఉండకూడదని దేవునికి ప్రార్థిస్తున్నాను” అన్నాడు. 30  అప్పుడు రాజు లేచి నిలబడ్డాడు. అలాగే అధిపతి, బెర్నీకే, వాళ్లతోపాటు కూర్చొని ఉన్నవాళ్లు కూడా లేచి నిలబడ్డారు. 31  అయితే, వాళ్లు వెళ్లిపోతూ ఒకరితో ఒకరు, “ఇతను మరణశిక్ష వేసేంత, చెరసాలలో వేసేంత తప్పేదీ చేయట్లేదు”+ అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. 32  తర్వాత అగ్రిప్ప ఫేస్తుతో ఇలా అన్నాడు: “ఇతను కైసరుకు విన్నవించుకుంటానని+ అనకపోయుంటే ఇతన్ని విడుదల చేయగలిగేవాళ్లం.”

అధస్సూచీలు

పదకోశం చూడండి.
లేదా “పునరుత్థానం చేయబడిన.”