ఆదికాండం 28:1-22

  • ఇస్సాకు యాకోబును పద్దనరాముకు పంపడం (1-9)

  • బేతేలు దగ్గర యాకోబు కల (10-22)

    • దేవుని వాగ్దానం యాకోబుతో ఖరారు (13-15)

28  కాబట్టి ఇస్సాకు యాకోబును పిలిచి, అతన్ని దీవించి, ఇలా ఆజ్ఞాపించాడు: “నువ్వు కనానీయుల కూతుళ్లలో ఎవర్నీ పెళ్లి చేసుకోకూడదు.+  నువ్వు పద్దనరాములో ఉన్న మీ తాత* బెతూయేలు ఇంటికి వెళ్లి, అక్కడ మీ మేనమామ లాబాను కూతుళ్లలో+ ఒకర్ని పెళ్లి చేసుకో.  సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను దీవిస్తాడు; నువ్వు పిల్లల్ని కని, ఎక్కువమంది అయ్యేలా చేస్తాడు; నువ్వు ఖచ్చితంగా ఎన్నో గోత్రాలున్న పెద్ద సమూహం అవుతావు.+  ఆయన అబ్రాహాముకు వాగ్దానం చేసిన దీవెనల్ని+ నీకు, నీతోపాటు నీ సంతానానికి* ఇస్తాడు. దానివల్ల, నువ్వు ఎక్కడైతే పరదేశిగా జీవిస్తూ ఉన్నావో, దేవుడు అబ్రాహాముకు ఏ దేశాన్నైతే ఇస్తానని వాగ్దానం చేశాడో+ ఆ దేశాన్ని సొంతం చేసుకుంటావు.”  ఇస్సాకు యాకోబును పంపించేశాడు. అతను పద్దనరాములో ఉన్న అరామీయుడైన బెతూయేలు కుమారుడు లాబాను+ దగ్గరికి ప్రయాణమయ్యాడు. ఈ లాబాను ఏశావు, యాకోబుల తల్లియైన రిబ్కాకు సహోదరుడు.+  ఇస్సాకు యాకోబును దీవించి, పద్దనరాముకు చెందిన ఒకామెను పెళ్లి చేసుకోమని చెప్పి అతన్ని అక్కడికి పంపించాడనీ; అతన్ని దీవిస్తున్నప్పుడు, “కనానీయుల కూతుళ్లలో ఎవర్నీ పెళ్లి చేసుకోకూడదు”+ అని ఆజ్ఞాపించాడనీ ఏశావు గమనించాడు.  యాకోబు తన అమ్మానాన్నల మాట విని పద్దనరాముకు బయల్దేరాడని+ కూడా ఏశావు గమనించాడు.  కనానీయుల కూతుళ్లంటే తన తండ్రి ఇస్సాకుకు ఇష్టంలేదని+ ఏశావుకు అప్పుడు అర్థమైంది.  కాబట్టి ఏశావు తనకు అప్పటికే భార్యలు ఉన్నా, ఇష్మాయేలు దగ్గరికి వెళ్లి, మాహలతును పెళ్లి చేసుకున్నాడు; ఈమె అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలుకు కూతురు, నెబాయోతుకు సహోదరి.+ 10  యాకోబు బెయేర్షెబా నుండి బయల్దేరి హారాను వైపుగా వెళ్తూ ఉన్నాడు.+ 11  అలా వెళ్తూవెళ్తూ అతను ఒక చోటికి చేరుకున్నాడు. అప్పటికే సూర్యాస్తమయం కావడంతో ఆ రాత్రి అక్కడే గడపడానికి సిద్ధమయ్యాడు. కాబట్టి అతను అక్కడున్న ఒక రాయి తీసుకొని, దానిమీద తల వాల్చి పడుకున్నాడు.+ 12  అప్పుడు అతనికి ఒక కల వచ్చింది. ఇదిగో! భూమ్మీద ఒక నిచ్చెన* వేసి ఉంది, దాని పైకొన పరలోకం వరకు ఉంది; దేవదూతలు దానిమీద పైకి ఎక్కుతూ, కిందికి దిగుతూ ఉన్నారు.+ 13  అప్పుడు ఇదిగో! యెహోవా దానికి పైన కూర్చొని ఉన్నాడు, ఆయన ఇలా అన్నాడు: “నేను యెహోవాను, నీ పూర్వీకుడైన అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాకుకు దేవుణ్ణి.+ నువ్వు ఇప్పుడు పడుకున్న ఈ దేశాన్ని నేను నీకు, నీ సంతానానికి* ఇవ్వబోతున్నాను.+ 14  నీ సంతానం* ఖచ్చితంగా భూమ్మీది ధూళి కణాలంతమంది అవుతారు.+ నువ్వు ఈ దేశంలో పడమటి వైపు, తూర్పు వైపు, ఉత్తరం వైపు, దక్షిణం వైపు విస్తరిస్తావు. నీ ద్వారా, నీ సంతానం* ద్వారా భూమ్మీద ఉన్న కుటుంబాలన్నీ ఖచ్చితంగా దీవించబడతాయి.*+ 15  నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు వెళ్లే ప్రతీచోట నిన్ను సంరక్షిస్తాను, నిన్ను మళ్లీ ఈ దేశానికి రప్పిస్తాను.+ నేను నీకు చేసిన వాగ్దానం నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను.”+ 16  అప్పుడు యాకోబు నిద్ర లేచి, “నిజంగా, ఈ స్థలంలో యెహోవా ఉన్నాడు. కానీ నాకు ఆ విషయం తెలియలేదు” అన్నాడు. 17  అతను భయపడిపోయి, ఇంకా ఇలా అన్నాడు: “ఇది సంభ్రమాశ్చర్యాలు పుట్టించే చోటు! ఇది దేవుని ఇల్లే అయ్యుండాలి,+ ఇది పరలోక ద్వారం.”+ 18  కాబట్టి యాకోబు తెల్లవారుజామునే లేచి, తాను తల వాల్చి పడుకున్న రాయిని తీసుకొని, దాన్ని స్మారక చిహ్నంగా పాతి, దానిమీద తైలం పోశాడు.+ 19  అతను ఆ స్థలానికి బేతేలు* అని పేరు పెట్టాడు, అంతకుముందు ఆ నగరం పేరు లూజు.+ 20  తర్వాత యాకోబు ఇలా ప్రమాణం చేశాడు: “దేవుడు ఇలాగే నాకు తోడుగా ఉండి, నా ప్రయాణంలో నన్ను కాపాడి, నేను తినడానికి రొట్టెను, వేసుకోవడానికి బట్టల్ని ఇచ్చి, 21  నేను క్షేమంగా నా తండ్రి ఇంటికి తిరిగొస్తే, ఖచ్చితంగా యెహోవాయే నా దేవుడని నాకు రుజువౌతుంది. 22  అలాగే, నేను ఇక్కడ స్మారక చిహ్నంగా పాతిన ఈ రాయి దేవుని ఇల్లు అవుతుంది.+ నువ్వు నాకు ఇచ్చే ప్రతీదానిలో నేను నీకు ఖచ్చితంగా పదోవంతును ఇస్తాను.”

అధస్సూచీలు

అక్ష., “అమ్మవాళ్ల నాన్న.”
అక్ష., “విత్తనానికి.”
లేదా “మెట్ల వరుస.”
అక్ష., “విత్తనానికి.”
లేదా “దీవెన సంపాదించుకుంటాయి.” దానికోసం కష్టపడాల్సి ఉంటుందని ఇది సూచిస్తుండవచ్చు.
అక్ష., “విత్తనం.”
అక్ష., “విత్తనం.”
“దేవుని ఇల్లు” అని అర్థం.