ఆదికాండం 32:1-32
32 యాకోబు తన ప్రయాణం కొనసాగించాడు, దారిలో అతనికి దేవదూతలు ఎదురయ్యారు.
2 అతను వాళ్లను చూసిన వెంటనే, “ఇది దేవుని శిబిరం!” అంటూ ఆ చోటుకు మహనయీము* అని పేరు పెట్టాడు.
3 యాకోబు ఆ తర్వాత శేయీరు దేశంలో,+ అంటే ఎదోము+ ప్రాంతంలో ఉంటున్న తన అన్న ఏశావు దగ్గరికి సందేశకుల్ని పంపాడు.
4 అతను వాళ్లకు ఇలా ఆజ్ఞాపించాడు: “నా ప్రభువైన ఏశావుతో మీరు ఏమనాలంటే, ‘నీ సేవకుడైన యాకోబు ఇలా చెప్తున్నాడు: “నేను ఇప్పటివరకు లాబాను దగ్గర చాలాకాలం నివసించాను.*+
5 నేను ఎద్దుల్ని, గాడిదల్ని, గొర్రెల్ని, సేవకుల్ని, సేవకురాళ్లను సంపాదించుకున్నాను.+ నీ దృష్టిలో అనుగ్రహం పొందేలా, నేను వస్తున్నానని నా ప్రభువుకు చెప్పడానికి ఈ సందేశాన్ని పంపిస్తున్నాను.” ’ ”
6 కొన్ని రోజులకు ఆ సందేశకులు తిరిగొచ్చి యాకోబుకు ఇలా చెప్పారు: “మేము మీ అన్న ఏశావును కలిశాం. ఇదిగో, అతను నిన్ను కలవడానికి వస్తున్నాడు, అతనితో పాటు 400 మంది మనుషులు ఉన్నారు.”+
7 అది విన్నప్పుడు యాకోబు చాలా భయపడ్డాడు, ఆందోళన చెందాడు.+ కాబట్టి అతను తనతో ఉన్నవాళ్లను, మందల్ని, పశువుల్ని, ఒంటెల్ని రెండు గుంపులుగా విడగొట్టాడు.
8 యాకోబు ఇలా అన్నాడు: “ఒకవేళ ఏశావు మొదటి గుంపు మీద దాడిచేస్తే, రెండో గుంపు తప్పించుకోవచ్చు.”
9 ఆ తర్వాత యాకోబు ఇలా అన్నాడు: “నా పూర్వీకుడైన అబ్రాహాముకు దేవా, నా తండ్రైన ఇస్సాకుకు దేవా, యెహోవా, ‘నీ దేశానికి, నీ బంధువుల దగ్గరికి తిరిగెళ్లు, నేను నీకు మేలు చేస్తాను’+ అని నాతో చెప్తున్న దేవా,
10 నువ్వు నీ సేవకుని మీద చూపిస్తున్న విశ్వసనీయ ప్రేమను, నమ్మకత్వాన్ని పొందడానికి నేను అర్హుణ్ణి కాదు.+ నేను ఈ యొర్దాను నది దాటినప్పుడు, నా దగ్గర చేతికర్ర మాత్రమే ఉంది, కానీ ఇప్పుడు రెండు గుంపులు చేయగలిగేంత పెద్ద కుటుంబం నాకుంది.+
11 నా అన్న ఏశావు చేతిలో నుండి నన్ను కాపాడమని నీకు ప్రార్థిస్తున్నాను.+ అతను వచ్చి నా మీద, ఈ తల్లుల మీద, వాళ్ల పిల్లల మీద దాడి చేస్తాడేమోనని+ భయంగా ఉంది.
12 నువ్వు నాతో ఇలా అన్నావు: ‘నేను నీకు ఖచ్చితంగా మేలు చేస్తాను, నీ సంతానాన్ని* సముద్రపు ఇసుక రేణువుల్లా లెక్కపెట్టలేనంత మంది అయ్యేలా చేస్తాను.’ ”+
13 అతను ఆ రాత్రి అక్కడే బస చేశాడు. తర్వాత అతను తన దగ్గరున్న వాటిలో కొన్నిటిని తన అన్న ఏశావుకు బహుమతిగా ఇవ్వడానికి పక్కకు తీసిపెట్టాడు.+
14 అవేమిటంటే: 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్లు,
15 అలాగే 30 ఆడ ఒంటెలు, వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఎద్దులు, 20 ఆడ గాడిదలు, పూర్తిగా ఎదిగిన 10 మగ గాడిదలు.+
16 అతను వాటిని తన సేవకులకు అప్పగించి, ఒక మంద తర్వాత ఇంకో మంద పంపిస్తూ తన సేవకులతో ఇలా అన్నాడు: “మీరు నాకన్నా ముందు వాగు దాటండి. మందకీ మందకీ మధ్య కాస్త దూరం ఉండేలా చూసుకోండి.”
17 అతను మొదటి సేవకునితో ఇలా అన్నాడు: “ఒకవేళ మా అన్న ఏశావు నిన్ను కలిసి, ‘నువ్వు ఎవరి మనిషివి, ఎక్కడికి వెళ్తున్నావు, నీ ముందు వెళ్తున్న ఈ మంద ఎవరిది?’ అని అడిగితే,
18 నువ్వు ఇలా చెప్పాలి: ‘నేను నీ సేవకుడైన యాకోబు మనిషిని. ఇవి నా ప్రభువైన ఏశావుకు అతను పంపించిన బహుమతి.+ అతను కూడా మా వెనక వస్తున్నాడు.’ ”
19 అతను రెండో సేవకునికి, మూడో సేవకునికి, అలాగే ఆ మందల వెనక నడుస్తున్న వాళ్లందరికీ ఇలా చెప్పాడు: “ఏశావును కలిసినప్పుడు మీరు కూడా ఇలాగే చెప్పాలి.
20 అంతేకాదు, ‘నీ సేవకుడైన యాకోబు మా వెనక వస్తున్నాడు’ అని చెప్పాలి.” ఎందుకంటే ‘నా కన్నా ముందు ఒక బహుమతి పంపించి నేను అతన్ని శాంతింపజేస్తే,+ తర్వాత నేను అతన్ని కలిసినప్పుడు, నన్ను దయతో చేర్చుకుంటాడు’ అని యాకోబు అనుకున్నాడు.
21 కాబట్టి, బహుమతి తీసుకెళ్లినవాళ్లు అతని కన్నా ముందు వాగు దాటారు, అతను మాత్రం ఆ రాత్రి శిబిరంలోనే ఉండిపోయాడు.
22 రాత్రిపూట అతను లేచి తన ఇద్దరు భార్యల్ని,+ తన ఇద్దరు సేవకురాళ్లను,+ చిన్న పిల్లలైన తన 11 మంది కుమారుల్ని తీసుకొని యబ్బోకు+ రేవు* దాటాడు.
23 అతను వాళ్లను తీసుకొని ఆ వాగు దాటించాడు, ఆ తర్వాత తనకున్న ప్రతీ వస్తువును తీసుకొచ్చాడు.
24 చివరికి యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. అప్పుడు ఒక వ్యక్తి* వచ్చి తెల్లారేవరకు యాకోబుతో కుస్తీ పడుతూ ఉన్నాడు.+
25 అతను యాకోబు మీద గెలవలేదని గమనించినప్పుడు, అతను యాకోబు తుంటి గూటిని ముట్టుకున్నాడు; యాకోబు అతనితో కుస్తీ పడుతున్నప్పుడు యాకోబు తుంటి గూడు పక్కకు జరిగింది.+
26 తర్వాత అతను యాకోబుతో, “తెల్లవారుతోంది, నన్ను వెళ్లనివ్వు” అన్నాడు. అందుకు యాకోబు, “నువ్వు నన్ను దీవించే వరకు నిన్ను వెళ్లనివ్వను” అన్నాడు.+
27 అప్పుడు అతను యాకోబును, “నీ పేరేంటి?” అని అడిగాడు. అందుకు అతను “యాకోబు” అని చెప్పాడు.
28 అప్పుడు అతను యాకోబుతో, “ఇకమీదట నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు.*+ ఎందుకంటే నువ్వు దేవునితో, మనుషులతో పోరాడావు,+ చివరికి గెలిచావు” అన్నాడు.
29 అప్పుడు యాకోబు అతన్ని, “దయచేసి, నీ పేరేంటో చెప్పు” అని అడిగాడు. కానీ అతను, “నువ్వు నా పేరు ఎందుకు తెలుసుకోవాలని అనుకుంటున్నావు?”+ అన్నాడు. ఆ తర్వాత అక్కడ యాకోబును దీవించాడు.
30 కాబట్టి యాకోబు, “నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూశాను, అయినా నేను ప్రాణాలతో బయటపడ్డాను”+ అంటూ ఆ చోటుకు పెనీయేలు*+ అని పేరు పెట్టాడు.
31 యాకోబు పెనూయేలు* దాటిన వెంటనే సూర్యోదయం అయ్యింది. అయితే, తుంటికి తగిలిన దెబ్బవల్ల అతను కుంటుకుంటూ నడిచాడు.+
32 అందుకే, నేటివరకు ఇశ్రాయేలీయులు తుంటి గూటి మీద ఉన్న తొడ నరాన్ని తినరు. ఎందుకంటే ఆ వ్యక్తి యాకోబు తుంటి గూటి మీద ఉన్న తొడ నరాన్ని ముట్టుకున్నాడు.
అధస్సూచీలు
^ “రెండు శిబిరాలు” అని అర్థం.
^ లేదా “పరదేశిగా నివసించాను.”
^ అక్ష., “విత్తనాన్ని.”
^ అంటే, నదిని నడుస్తూ దాటగలిగేలా లోతు తక్కువ ఉన్న ప్రదేశం.
^ మానవ శరీరం ధరించిన దేవదూతను సూచిస్తోంది.
^ “దేవునితో పోరాడేవాడు (పట్టువదలనివాడు)” లేదా “దేవుడు పోరాడతాడు” అని అర్థం.
^ “దేవుని ముఖం” అని అర్థం.
^ లేదా “పెనీయేలు.”